సుప్రీం సంచలన తీర్పులో సెప్టిక్ ట్యాంక్ క్లీనర్ రీసెర్చ్ ప్రస్తావన

రవిచంద్రన్ బాత్రన్... అతనొక పీహెచ్డీ హోల్డర్. తన ఉద్యోగాన్ని వదిలేసి సెప్టిక్ ట్యాంక్స్ క్లీన్ చేస్తున్నాడు. ఇది నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయం.

By :  Vanaja
Update: 2024-08-04 11:30 GMT

రవిచంద్రన్ బాత్రన్... అతనొక పీహెచ్డీ హోల్డర్. తన ఉద్యోగాన్ని వదిలేసి సెప్టిక్ ట్యాంక్స్ క్లీన్ చేస్తున్నాడు. ఇది నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయం. అంతేకాదు, తన పేరు కూడా మొహమ్మద్ గా మార్చుకున్నాడు. ఇప్పుడు అతను రాసిన రీసెర్చ్ పేపర్ సంచలనాత్మక తీర్పులో ప్రస్తావించబడింది. దీంతో అతని గురించి ఇప్పుడు ఆసక్తికర చర్చ మొదలైంది. మనం కూడా బాత్రన్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం.

షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు రిజర్వేషన్లను ఉప-వర్గీకరణ చేస్తూ ఆగస్టు 1న సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఈ నిర్ణయాన్ని కొందరు స్వాగతించగా, మరికొందరు విమర్శించారు. అయితే తీర్పు ఫుట్‌నోట్‌లలో ఒక పేరు దాగి ఉంది. అతనే మనం మాట్లాడుకుంటున్న రవిచంద్రన్ బాత్రన్. షెడ్యూల్డ్ కులాల మధ్య వివక్షపై బాత్రన్ ఒక పరిశోధనా పత్రాన్ని రాశారు. ఈ పరిశోధన పత్రాన్ని సుప్రీంకోర్టు తీర్పులో కూడా ప్రస్తావించారు. 'ఒక కాన్సెప్ట్ లో అనేక లోపాలు: షెడ్యూల్ క్యాస్ట్‌ లలో వివక్ష' ("The many omissions of a concept: Discrimination amongst Scheduled Castes) అనే అంశంపై బాత్రన్ రాసిన పరిశోధనా పత్రాన్ని భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్, జస్టిస్ మనోజ్ మిశ్రా రాసిన తీర్పులోని సెక్షన్ డిలో ప్రస్తావించారు.

సెప్టిక్ ట్యాంక్ భాయ్ గా బాత్రన్

బాత్రన్ ప్రస్తుతం తమిళనాడులోని నీలగిరి జిల్లాలోని కోటగిరి పట్టణంలో నివసిస్తున్నారు. ఇక్కడ తెలిసిన వారంతా తను చేస్తోన్న పనితోపాటు, తన మతాన్ని బట్టి 'సెప్టిక్ ట్యాంక్ భాయ్' అని పిలుస్తున్నారు. బాత్రన్ 2022లో ఇస్లాం మతాన్ని స్వీకరించారు. అప్పుడు తన పేరును రయీస్ మొహమ్మద్ గా మార్చుకున్నారు. “డా. బి.ఆర్. అంబేద్కర్ బౌద్ధమతాన్ని స్వీకరించినట్టు నేను కూడా ఇస్లాంను స్వీకరించాను" అని బాత్రన్ చెబుతుంటారు.

బాత్రన్, దక్షిణాఫ్రికాలోని సౌతాంప్టన్ యూనివర్సిటీలో పోస్ట్-డాక్టోరల్ ఫెలో. అలాగే హైదరాబాద్ లో ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ (EFLU) నుండి 'లాంగ్వేజ్, క్యాస్ట్ అండ్ టెర్రిటరీ: లాంగ్వేజెస్ స్పోకెన్ బై స్కావెంజింగ్ క్యాస్ట్స్ ఇన్ సౌత్ ఇండియా' అనే అంశంపై PhD చేస్తున్నారు. జీవనోపాధి కోసం మూడేళ్ళుగా సెప్టిక్ ట్యాంక్స్ క్లీనింగ్ సర్వీసెస్ చేస్తున్నారు. బాత్రన్ కుల వ్యవస్థ ఆధారంగా టాయిలెట్లను శుభ్రపరిచే అరుంథతియార్ కమ్యూనిటీ నుండి వచ్చారు.

కులవృత్తికి గౌరవం తెచ్చేందుకు కంపెనీ...

అరుంథతియార్లను పనిలో పెట్టుకుని వారి కష్టార్జితంతో డబ్బు సంపాదించే వారు కూడా ఉన్నారని ఆయన చెబుతున్నారు. అందుకే తానే ఒక సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ సర్వీసెస్ కంపెనీని ఎందుకు ప్రారంభించకూడదు అని ఆలోచించారు. అనుకున్నదే తడవుగా... 2021లో కోటగిరి సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌ను ప్రారంభించిన బాత్రన్, కార్మికులు సెప్టిక్ ట్యాంక్‌ లలోకి వెళ్లకుండా నిరోధించడానికి క్లీనింగ్ ప్రక్రియను మెకనైజ్ చేయాలని మొదట అనుకున్నట్లు చెప్పారు. కానీ మాన్యువల్ సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్‌ ను భర్తీ చేయగల ఆవిష్కరణలలో ఎక్కువ పెట్టుబడి పెట్టాల్సి ఉంటుందని గ్రహించారు. అంత స్థోమత లేక ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. ఎవరైనా ట్యాంక్‌ లోకి దిగి శుభ్రం చేయాల్సి వస్తే, తన ఉద్యోగులను అలా చేయనివ్వకుండా ఆయనే ట్యాంక్‌ లోకి దిగి శుభ్రం చేస్తారట.

బాత్రన్ అలియాస్ మహ్మద్ తన కంపెనీలో పని చేసే క్లీనర్లకు రూ.30 వేలు, డ్రైవర్లకు రూ.40 వేలు నెలకు చెల్లిస్తున్నారు. అంతేకాదు, వారందరికీ గ్రూప్ మెడికల్ ఇన్సూరెన్స్ కూడా కల్పించారు. దీని ప్రీమియం సంవత్సరానికి రూ. 15,000. బాత్రన్ తాపత్రయమంతా సెప్టిక్ ట్యాంక్ శుభ్రపరిచే వారి జీవితాలు కూడా గౌరవప్రదంగా ఉండాలన్నదేనట.

అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగం వదిలి...

ముహమ్మద్ సెప్టిక్ ట్యాంక్‌లను శుభ్రం చేసే ముందు మద్రాసు యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేశారు. దళిత్ కెమెరా పేరుతో యూట్యూబ్ ఛానెల్‌ని కూడా నడిపాడు. తన తల్లి అరుకని, తండ్రి బత్తరన్‌ ఇద్దరూ స్వీపర్‌గా పనిచేశారని, తన పనులన్నింటిలో తనకు తోడ్పాటునందించారని చెప్పారు. ఆయన భార్య కర్పగం అల్లిముత్తు కోటగిరి పట్టణ పంచాయతీ కౌన్సిలర్‌. అయితే అసిస్టెంట్ ప్రొఫెసర్ వృత్తిని వదులుకోవడంపై ముహమ్మద్ ఇలా స్పందించారు.. “ఒక ఉపాధ్యాయుని పని నాకు సంతృప్తికరంగా లేదు. నా కమ్యూనిటీకి ఏదైనా చేయాలనుకుంటున్నాను. అరుంథతియార్లకు గౌరవం కల్పించడం చాలా ముఖ్యమని అనిపించింది. అరుంథతియార్లకు సంఘం నాయకుల అవసరం ఉంది" అని అన్నారు బాత్రన్.

కుల వ్యవస్థ మూలం టాయిలెట్ నుండి ఉద్భవించింది అని బాత్రన్ నమ్ముతున్నారు. "స్లోవేనియన్ తత్వవేత్త స్లావోజ్ జిజెక్ చెప్పినట్లుగా, టాయిలెట్ నిర్మాణం ఒక ప్రదేశానికి సంబంధించిన సంస్కృతిని తెలియజేస్తుంది. భారతదేశంలో ఒకప్పుడు టాయిలెట్లను ఇళ్ల బయట ఉంచేవారు. టాయిలెట్లు ఎప్పుడూ అంటరానివారు, బహిష్కృత వ్యక్తులతో సంబంధం కలిగి ఉంటాయి" అని చెబుతున్నారు.

సుప్రీం తీర్పుతో అరుంథతియార్లకు ప్రయోజనం..

రిజర్వేషన్ల ప్రయోజనం కోసం షెడ్యూల్డ్ కులాలను ఉప-వర్గీకరణ చేయడం వల్ల ఇతర షెడ్యూల్డ్ కులాల వర్గాల చేతిలో కూడా వివక్ష, హింసను ఎదుర్కొన్న తమిళనాడులోని అత్యంత వెనుకబడిన వర్గాలలో ఒకటైన అరుంథతియార్లకు ప్రయోజనం చేకూరుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సుప్రీం కోర్టు తీర్పు ఫుట్ నోట్స్‌లో ప్రస్తావించబడిన రీసెర్చ్ పేపర్‌లో, షెడ్యూల్డ్ కులాలను సజాతీయ సమూహంగా వర్గీకరించడాన్ని వ్యతిరేకిస్తూ ముహమ్మద్ వాదించారు. షెడ్యూల్ కులాలలో అంతర్గత వివక్ష ఎలా ఉంటుందో ఒక ఉదాహరణను ఆయన రీసెర్చ్ పేపర్ లో ప్రస్తావించారు. "తమిళనాడులో ఒక అరుంథతియార్ యువకుడు, పరైయర్ యువతి ఇంటి నుంచి పారిపోయారు. ప్రతీకారంగా యువతి కుటుంబ సభ్యులు యువకుడి కుటుంబానికి చెందిన మహిళలపై అత్యాచారానికి పాల్పడ్డారు" అని రీసెర్చ్ పేపర్ లో పేర్కొన్నారు.

"సుప్రీం తీర్పు ఒక మైలురాయి తీర్పు. ఎందుకంటే ఇది కుల వ్యవస్థలో అత్యంత అంటరాని కులాలపై జరిగే అఘాయిత్యాలపై చర్చను ప్రారంభిస్తుందని నేను నమ్ముతున్నాను" అని ముహమ్మద్ చెప్పారు. ప్రస్తుతం షెడ్యూల్డ్ కులాల్లోని ఉన్నత కులాలు.. వారి కంటే తక్కువ వారిపై దౌర్జన్యాలకు పాల్పడుతున్నప్పుడు, SC/ST (అట్రాసిటీల నిరోధక) చట్టం, 1989 వర్తించదు. అరుంథతియార్లు ఇప్పుడు వారిపై జరుగుతున్న వివక్షని ఎత్తిచూపే అవకాశం ఉంటుందన్నారు. కులాంతర అఘాయిత్యాలను అరికట్టొచ్చని ఆయన భావిస్తున్నారు. షెడ్యూల్డ్ కులాల ఉప-వర్గీకరణ తమిళనాడులోనే కాకుండా ఇక్కడి షెడ్యూల్ కమ్మూనిటీ అభ్యర్థులు ఇతర రాష్ట్రాల్లో పెద్దఎత్తున SC కోటాలో రిజర్వేషన్‌ పొందేందుకు ఉపయోగపడుతుంది అని ముహమ్మద్ చెప్పారు.

Tags:    

Similar News