ఆంధ్రా కరేడులో ఏమి జరుగుతున్నది? కాంతి నల్లూరి గ్రౌండ్ రిపోర్టు
“ఇండో సోల్ ఇచ్చే 13వేల ఉద్యోగాలెవరికి కావాలి. మావూర్లో సేద్యం నమ్ముకుని 20 వేల మంది బ్రతుకుతున్నాం.”;
అమరావతి, సోంపేట, పోలవరం తర్వాత ఇపుడు కరేడు భూములను కాపాడుకునేందుకు ఉద్యమం చేస్తున్నది. ఇండోసోల్ (Indosol Solar) అనే కంపెనీకి 8400 ఎకరాలు భూమిని అప్పజెప్పడం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలోని ఎన్ డిఎ ప్రభుత్వం నిర్ణయించింది.ఇక భూములు ఇచ్చేయండి అంటూ కరేడు రైతులకు నోటీసులు ఇచ్చింది. దీనితో కరేడు భగ్గున మండింది. కరేడు చుట్టూర ఉన్ 18 జనావాసాలు ప్రజలు తిరుగుబాటు చేశారు. ప్రభుత్వ ప్రజాభిప్రాయ సేకరణ ను తిప్పికొట్టారు. నచ్చెచెప్పాలనుకుంటున్నఅధికారులను వెనక్కి పంపించారు. దీనితో కరేడు పెద్ద వార్త అయికూర్చుంది. అసలు కరేడులోఎంజరుగుతున్నది. కరేడు భూముల్లో ఏముంది. ఆ భూముల మీద ఇండోసోల్ కంపెనీ ఎందుకు కన్నేసింది. ఎవరీ ఇండోసోల్ కంపెనీ, ఈ కంపెనీ వస్తే 13వేల ఉద్యోగాలొస్తాయని ప్రభుత్వం చెబుతున్నది. కంపెనీలేకుండా,ఈ పచ్చని పొలాలు, ఈ సారవంతమయిన నేల 20 వేల మందికి ఉపాధి నిస్తా ఉంది. ఏది కావాలి. అందుకే ఇండోసోల్ వద్దు, మాభూములే మాకు ముద్దుఅంటున్నారు రైతులు, ప్రజలు. కరేడులో రేగిన అలజడి గమనించేందుకు వెళ్లిన ఒక మిత్రబృందంలో నేను ఉన్నాను. అక్కడ ఏమి జరగుతున్నదో కళ్లారా చూశాక, ప్రజలు ఏమంటున్నారో విన్నాక నా అనుభవాలను ప్రజలతో పంచుకునేందుకు ప్రయత్నిస్తున్నాను.
ఇండోసోల్ కంపెనీ అంటే ఏమిటి?
షిరిడి సాయి ఎలక్ట్రికల్ కంపెనీ నర్రెడ్డి విశ్వేశ్వర్ రెడ్డిది. మెయిన్ బ్రాంచ్ కడపలో ఉంటుంది. ప్రధానంగా ఎలక్ట్రికల్స్ మీటర్ల, మోటార్ల రిపేరు సంస్థగా ప్రారంభమైంది. జగన్ ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో స్మార్ట్ మీటర్లు బిగించే ఒప్పందం దగ్గర్నుంచి అన్ని, షిరిడి సాయి ఎలక్ట్రికల్ కంపెనీకి అప్పగించబడ్డాయి. దీనికి అనుబంధంగా ఫిబ్రవరి 3/ 22న ఇండోసోల్ ఏర్పాటు చేశారు. ఇండోసోల్ కు విశ్వేశ్వరరెడ్డి తో పాటు కొల్ల శరత్ చంద్ర, కటూరు రవికుమార్ రెడ్డి అనే మరో ఇద్దరు కూడా డైరెక్టర్లుగా ఉన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే వీరి ముగ్గురిది కూడా కాదు. ఇండిసోల్, హిందూస్తాన్ పేరు ఏదైతేనేమి? భవిష్యత్తులో ప్రకాశం నెల్లూరు జిల్లాలలో ఉన్న తీర ప్రాంతం అదానిదే అని గ్రామస్తులు చెబుతున్నారు మేము భూములు ఇస్తే ఈ తీర ప్రాంతమంతా కనుమరుగైపోతుందని కూడా అంటున్నారు.
కరేడు మీద ఎందుకు కన్నేశారు...
కరేడు ప్రాంతాన్ని ఎంచుకోవడంలోనే చాలా లోతైన వ్యూహం ఉందని అక్కడికి వెళ్లితే మనకు అర్థమవుతుంది. కరేడు రాకపోకలకు చాలా అనుకూలం. రవాణాకు, ఎక్స్పోర్టింగ్ కు రోడ్డు మార్గము, రైలు మార్గము, సముద్రమార్గము కరేడు సమీపంలో ఉన్నాయి. ఒంగోలుకు ఉత్తరంగా కొరిసపాడు దగ్గర 25-30 కిలోమీటర్ల దూరంలో , ఒంగోలుకు దక్షిణంగా 25-30 కిలోమీటర్ల దూరంలో సింగరాయకొండకు దగ్గరగా నేషనల్ హైవే 16 పై హెలికాప్టర్లు, విమానాలు లాండింగ్ అయ్యే ఏర్పాట్లు ఉన్నాయి.
కరేడు పచ్చదనానకి పర్యాయపదం... ఎటు చూసిన పచ్చనిపోలాలే...
క
పుష్కలంగా మంచి నీరు ఉంది. విస్తారమైన చెరువులు, ప్రభుత్వ భూములు, పట్టా భూములు ఉన్నాయి. కార్పొరేట్ కంపెనీల అంతులేని భూదాహానికి, ఆదాహం తీర్చేందుకు ఇవ్వడానికి భూములు కనిపించాయి. పెద్ద పెద్ద పత్రికలు, మీడియాలలో ఈ వార్తలు ప్రచారం కావు. కారణం నేను చెప్పాల్సిన పనిలేదు. యూట్యూబ్లో, చిన్న చిన్న న్యూస్ చానల్స్ లో ఈ వార్తలన్నీ విస్తృతంగా ప్రచారం అవుతున్నాయి. అసలు ఇది 69- 70 కోట్ల వ్యాపారం కాదు. రెండు మూడు వేల కోట్ల వ్యాపారo, వేల ఎకరాల ఆక్రమణ అని మేధావులు అంటున్నారు. ఇంత పెట్టుబడి పెట్టే శక్తి షిర్డిసాయి విశ్వేశ్వరరెడ్డికి లేదు అని, భూముల ఆక్రమణ వెనక కంపెనీల, పెట్టుబడిదారుల, రాజకీయ నాయకుల సుదీర్ఘమైన ప్రణాళిక ఉంది అని విశ్లేషకులు చెబుతున్నారు.
అసలు కరేడు ఎక్కడుంది?
కరేడు గురించి ఇప్పటిదాకా బయట వారికి ఎవరికి పెద్దగా తెలియదు. ఈ ఊరు నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గంలో ఉంది. విజయవాడ నుంచి చెన్నై వైపు రోడ్డు, రైలు మార్గంలో వెళుతూ సింగరాయకొండ దాటిన తర్వాత (మాగుంట వారి "పెరల్స్ డిస్టిల్లరీ కంపెనీ" ఎదురు రోడ్లో) ఎడమ వైపు కు చూస్తే బంగాళా ఖాతం దాకా కనిపిస్తుంది. కలకత్తా చెన్నై జాతీయ రహదారి 16కు, దాని పక్కనే ఉన్న రైల్వే ట్రాక్ కు ఎడమవైపుగా ఐదు కిలోమీటర్ల దూరంలో సింగరాయకొండ, ఉలవపాడు మండలాల మధ్య బంగాళాఖాతంకు పడమరగా మూడు కిలోమీటర్ల దూరంలో, మధ్యలో మన్నేరు నదికి ఇరువైపులా విస్తరించి ఉంది. (కలకత్తా, హైదరాబాద్, విజయవాడ వైపు నుండి చెన్నై బెంగళూరు కేరళ రాష్ట్రాలకు వెళ్లడానికి ప్రధాన రైల్వే మార్గం ఇది)
కరేడు ప్రత్యేకత ఏమిటి?
సామాన్యంగా సముద్రపు ఒడ్డులు, ఉప్పు బారిపోయి, ఉప్పు నీటితో పంటలు పండక, ఉప్పు గాలులతో జిగటబారి, ఇసుక నేలలు ఉంటాయి. కాని కరేడు ప్రశాంతమైన వాతావరణంలో పచ్చని వరిచేలు, వేరుసెనగ, శ్యామ, నర్సరీ, కొబ్బరి, మామిడి, జామాయిల్, చౌకు, పూల తోటలతో, ఆకుకూరల మడులతో, కొబ్బరి ,అరటి, సపోటా మామిడి తోటల తో కడియం అందాలను, కోనసీమ చల్లదనాన్ని, కేరళ పచ్చదనాన్ని చుట్టపు చూపుగా కాకుండా పర్మినెంట్గా తెచ్చుకున్నట్లు ఉంటుంది.
ఉలవపాడు తూర్పు వైపుగా మొదలుపెట్టి ట్రాక్ దాటి ఆకుతోట సంఘం, పల్లె పాలాలు పట్టపుపాలెలు మీదగా కరేడు వస్తుంటే కుడివైపున చౌకు తోటలతో దోబూసులాడుతూ అలలతో ఢీకొడుతున్న సముద్రం. సముద్రం మీదకు వాలుతున్న నీలిమేఘాలు. సంగీతంలా వినిపించే సముద్రపు హోరు, మధ్యమధ్య హేసరీస్ తో ఉంటే, ఎడమవైపున కనుచూపుమేరా అదృశ్యంగా ఎవరో భూమి నుండి నీళ్లు చిమ్ముతున్న స్ప్రింక్లర్లు. ముదురాకుపచ్చటి విచిత్రమైన వేరుశనగ పొలాలు (విచిత్రమైన అని ఎందుకు అన్నానంటే పువ్వులు నుండి వచ్చే కాయలన్ని భూమి పైనే ఉంటాయి. దుంపలు మాత్రమే భూమి లోపల ఉంటాయి. వేరుశెనగకు పువ్వులు మొక్కలపైన కాయలు భూమి లోపల ఉంటాయి. ఇది చాలా విచిత్రంగా ఉంటుంది) అక్కడోకటి ఇక్కడొకటి పసుపు పచ్చటి పూలతో, మధ్యమధ్య నర్సరీలు. ఏ ఆకాశదేవతో సమంగా కత్తిరించినట్లు అందంగా ఉన్న శ్యామ దుంపల, ఆకుకూర మడులు.
ఇంకొంచెం ముందుకు రాగానే గాలి సంగీతానికి మైమరిచి నాట్యం చేస్తున్న వరిచేలు. వాస్తవంగా ఇది వేసవి కాలం కింద లెక్క. పడమటి గాలులు. మిగతా చోట్ల పైర్లు వేసే కాలం కాదు. రోడ్డు మధ్యలో కారులో పయనిస్తూ మేం. కరేడులో ఏంజరుగుతున్నదో తెలుసుకోవాలని వెళ్తున్నాం. మాకు పాటలు వినిపిస్తున్న నాంచార్లు. అద్భుత లోకంలో విహరిస్తున్నట్లుగా ఉంది.
“అన్నా! పసుపు పండిద్దా,” అన్నాను.
“వెయ్యరమ్మ. వేస్తే పండిద్ది. మా దగ్గర పండని పంటే లేదు. 19 రకాల పంటలు పండుతాయి,” అన్నారు. “నాకు ఇక్కడ నుంచి రాబుద్ధి కావడం లేదు,” అన్నాను.
“ఆరఎకరం పొలం కొనుక్కుని గుడిసె వేసుకొని పంట పండించుకో,” అన్నారు.
మరొకరు, “మనందరం (22 మంది టీం) అన్ని మానివేసి హోల్ టైమర్స్ గా ఇక్కడ ప్రజలతో కలిసి పని చేస్తే ఈ భూములు నిలుస్తాయేమో,” అన్నారు.
ఎందుకంటే, “ఇంటికి పోగానే ఎవరి బాధ్యతలలో వాళ్ళు మునిగిపోతాం,” అన్నాను.
కరేడు అంటే 18 జనావాసాలు
కరేడు అంటే కరేడు ఒక్కటే కాదు. కరేడు చుట్టుపక్కల ఉప్పరపాలెం, రామకృష్ణాపురం, పోట్టేనుకుంట సంఘం, ఆకుతోట సంఘం, ధర్మారెడ్డి సంఘం, మర్రిచెట్టు సంఘం, బాలకోటయ్య సంఘం, వాకా, పాత, కొత్త రెడ్డిపాలేలు, అలాగాయపాలెం, మాదిగపల్లి, మాలపల్లి, పల్లె పాలేలు, పట్టపు పాలేలు మొత్తం 18 గ్రామాలు. 16 వార్డులతో, 17 వార్డులతో ఉన్న ఉలవపాడు అంత ఉంటుంది. మేజర్ పంచాయతీ. ఈ 18 గ్రామాలలో పంటరెడ్లు, ఊరపంట రెడ్లు, యాదవులు, కమ్మర, కుమ్మర, కంసాలి, ఎరుకల, యానాది, సాలీలు, మాల, మాదిగ, బ్రాహ్మణ, వైశ్య, ముస్లిం, పల్లెకారులు, పట్టపు వాళ్ళుఉన్నారు. పల్లె, పట్టపు వాళ్లకు ప్రధాన వృత్తి సముద్రం మీద చేపలవేట. కాని పల్లె, పట్టపు వాళ్ళు ఇక్కడ వేటతోపాటు కొంతమంది భూములను కొనుక్కొని వ్యవసాయం కూడా చేస్తున్నారు. పల్లెకారులంటే తెలుగు భాష మాతృభాషగా మాట్లాడేవారు. పట్టపువాళకి తమిళం మాతృభాష. శతాబ్దాలనాడు తమిళనాడు నుండి వేట కోసం బంగాళాఖాతం తీరాన మైగ్రేట్ అయ్యి స్థిరపడిన వాళ్లు. నేను చూసిన పట్టపు, పల్లె పాలేల కన్నా బాగా అభివృద్ధి చెందినవి. ఎక్కడా పూరిగుడిస, పాక, రేకులఇళ్ళు కనిపించలేదు. రెండు అంతస్థులతో కొన్ని కొత్త కొత్తగా కనిపిస్తున్నాయి. పూల మొక్కలు, ఆకుమళ్ళ మధ్య అద్భుతంగా ఉన్నాయి. అన్ని కులాల వాళ్ళు ఉన్నారట.
కమ్మవాళ్ళు నాలుగైదు కుటుంబాలు మాత్రమే ఉన్నాయట. ఇన్ని కులాలు ఉన్నప్పటికీ కులఘర్షణలు లేవట. మత ఘర్షణలు అసలే లేవు. అందరూ కలిసిమెలిసి బ్రతుకుతున్నారు. బర్రెలు గొర్రెలు మేకలు కోళ్లు ఆవులు జీవనాధారంగా బ్రతుకుతున్నవారు చాలమంది ఉన్నారట. ఎకర, అరఎకర ఉంటే చాలు నాలుగు బర్రెలను పెట్టుకుని పాలు, ఆకుకూరలు, పూలు అమ్ముకుంటూ బ్రతికేస్తాం అంటున్నారు గ్రామ ప్రజలు. భూములు లేని వారు లేదా కొద్దికొద్దిగా ఉన్నవారు మొద్దులు తవ్వడానికి, వ్యవసాయ పనులకు, మామిడికాయల కోతకు, మామిడి తోటల పనులకు వెళతారు.
కరేడులో వ్యవసాయం ‘పండగ’
కరేడులో నూటికి 80 మంది వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారు. 365 రోజులు పోవాలే గాని ఏదో ఒకపని దొరికిద్ది అన్నారు. దాదాపు అన్ని కులాల మహిళలు పశువుల పాడితోపాటు, ఆకుకూరలు పండించడమే కాక ఉలవపాడు, సింగరాయకొండ, కందుకూరు, టంగుటూరు ఆ చుట్టుపక్కల గ్రామాలకు వెళ్లి అమ్మకోస్తారట. వరి అయితే రెండు పంటలు, వేరుశెనగ, పెసర, పిలిపిస్తర్లాంటివి మూడు పంటలు పండుతాయి. వేరుశనగకు అనుకూలమైన భూమి వాతావరణం. భూమి ఎప్పుడు పచ్చగానే ఉంటది. ఇక్కడ జీవనానికి ఏ డోకాలేదని అన్ని గ్రామాల ప్రజలు ఏకగ్రీవంగా చెప్పారు.
రెండేళ్లు వర్షం పడకపోయినా మాకు దిగుల్లేదు. 15 అడుగుల లోపల కొబ్బరి నీళ్ల లాంటి నీళ్లు పడతాయి. డ్రిప్ వ్యవసాయం చేస్తాం. వర్షాకాలంలో అయితే మూరెడు లోతులో చెయ్యి పెట్టి తీసుకోవచ్చు. రాజమండ్రి నుండి పాండిచ్చేరి వరకు సముద్రపు ఒడ్డున ఇంత ఫ్రెష్ వాటర్ లేదని అన్ని గ్రామాల ప్రజలు ఏకగ్రీవంగా చెప్పారు. మా నీళ్ల ముందు మినరల్ వాటర్ ఎందుకు పనికిరావు అన్నారు. ఓ పూట కూడు లేకపోయినా చెంబు నీళ్లు తాగి, ఈ గాలి పీల్చుకుంటూ బ్రతికేస్తాం అన్నారు.
వ్యవసాయమేకాక 10 హ్యాచరీలు ఉన్నాయి. ఒక్కొక్క హ్యాచరీలో 20 నుండి 30 మంది పనిచేస్తారు. మాగుంట, బొమ్మిడాలవారి కంపెనీలు ఉన్నాయి. SBI బ్రాంచి, రెండు ఏటీఎంలు 40 గుళ్ళు, 30 చర్చిలు, గ్రామ దేవతలు, పాల కేంద్రాలు, 20 ట్రాక్టర్లు, పెట్రోలు. అన్ని రకాల షాపులున్నాయి. లైవ్ ఫిష్, రొయ్యలు, పీతలు అన్ని దొరుకుతాయి. మా ఊర్లో దొరకందంటూ లేదు.
కరేడు అంటే సమృద్ధి
మా ఊళ్ళో దొరకడమే కాదు, మా ఊరు నుంచి ఆకుకూరలు, పువ్వులు, అరటి, మామిడి, కొబ్బరి, వేరుసెనగ, వేరుశనగ ఆకు, వరిగడ్డి, శ్యామ, పత్తి, పచ్చి, ఎండు చేపలు, రొయ్యలు, పీతలు, నర్సరీలలో మొక్కలు, జామాయిల్, సౌకలు, వెదురునారు, పాలు, పెసర, పిల్లి పిసర, మినుము, బంతి, మొగలి, పెద్దపల్లి పాలెం వాళ్లు పండించిన ఉప్పు మొదలైనవన్నీ ఎక్స్పోర్ట్ అవుతాయి. “మా గోంగూర మద్రాస్ పోయిద్ది. మా నర్సరీ నుండి మొక్కలు బెంగళూరు ఒరిస్సా దాకా పోతున్నాయి. ఉలవపాడు మామిడిపళ్ళ తీపి మా దగ్గర ఉంది,” అని గ్రామ ప్రజలు గర్వంగా చెప్పారు.
“100 మంది దాకా విదేశాల్లో ఉన్నారు. పెద్దపెద్ద చదువులు చదివిన వాళ్లు, ఉద్యోగాలు చేస్తున్న వాళ్లు ఉన్నారు. మా ఊరి శివాలయానికి 600 సంవత్సరాల చరిత్ర ఉంది. విశాలమైన రాజేశ్వరి అమ్మవారి గుడి ఉంది. మా ఊరి గుళ్లో ఉన్న శివలింగం కాళహస్తి శివలింగమంతా పవిత్రమైంది. ఏ కాలమైనా పనులు చేస్తాం. తింటాం. నలుగురిమీ కూర్చొని కబుర్లు చెప్పుకుంటాం. ఒకళ్ళకొకళ్ళo తోడుంటాం. ప్రశాంతంగా బ్రతుకుతున్నాం. ఇంతకన్నా అభివృద్ధి ఏం కావాలి. మేము ప్రభుత్వాన్ని అది కావాలి ఇది కావాలి అని అడిగేమా? మా భూములలో వ్యవసాయం చేసుకుంటూ, గొర్రె పిల్ల, మేక పిల్లను పెంచుకుంటూ మేము అభివృద్ధి చెందాo. ఒక ప్రాంతంలో ఒక రకమైన పంట ఉంటుంది కానీ, ఇక్కడ అన్ని రకాల పంటలు ఉన్నాయి. అన్ని ఇక్కడ ప్రజలే డెవలప్ చేసుకున్నారు. ఇలాంటి ఊరిని నాశనం చేసి మా భూముల్ని ఇండోసోల్ కిచ్చి ఇంకేం అభివృద్ద్ధి చేస్తారు. తరతరాల నుండి కష్టపడిన ఈ ప్రజలను తరిమేసి ప్రభుత్వం, దాని వెనక ఉన్నవాళ్లు ఇన్ని వందల ఎకరాలు తీసుకోవడం అన్యాయం కాదా!? ఇండోసోలే కాదు ఏ కంపెనీ వచ్చినా అరంగళం కూడా తీసుకోలేరు మా ప్రాణాలు తీసి కూడా,” అని గ్రామస్థులు కరాఖండిగా చెబుతున్నారు.
కరెేడు తిరగబడ్డ జనం
“ఇండోసోల్ వస్తే 13, 000 మందికి ఉద్యోగాలు వస్తాయంటున్నారు. మాకేం ఉద్యోగాలు వస్తాయి. వేలిముద్ర లేదా చిన్న చిన్న చదువులు చదివిన వాళ్ళకి, పదో తరగతి దాక చదివిన వాళ్ళకి. అయినా ఆ ఉద్యోగాలతో వాళ్ళ కింద ఊడిగిం చేయాల స్వేచ్ఛగా బతికే మేము. వాడిచ్చే 13వేల ఉద్యోగాల కన్నా ఎక్కువగా, ఈ గ్రామాల్లో 20 వేల మంది బ్రతుకుతున్నాం. మాతోపాటు గొడ్డు, మేక గొర్రె, పక్షులు, వన్యప్రాణులు బ్రతుకుతున్నాయి. వీటన్నిటికీ ఏం ఆహారం ఇస్తారు. వీటన్నిటిని నాశనం చేసి 13000 మందికి ఇస్తారా? ప్రతి ఒక్కరి నుంచి ఈ ప్రశ్నలు ఎదురయ్యాయి. నూటికి తొంభై మంది గుండెలు అక్రోషంగా ప్రశ్నిస్తున్నాయి.
కరెేడు పిడుగుపాటు
ఇలా పచ్చగా కలకలలాడుతున్న ప్రశంతమయిన కరేడులోభూసేకరణకు మార్చి 25వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం 43వ జీవోను విడుదల చేసింది. కరేడు పంచాయతీ దగ్గర రైతులతో ఓ మీటింగు జరిగింది. ఏప్రిల్ 14న గ్రామ కార్యదర్శి గ్రామసభ ఏర్పాటు చేశాడు. అప్పుడు ఈ భూములు తీసుకోరాదని కార్యదర్శి కి అర్జీలు ఇచ్చారు. టిడిపి వైసిపి వాళ్ళు మీ కాలంలో వచ్చిందంటే మీ కాలంలో వచ్చిందని గొడవపడ్డారు. దాంతో తీర్మానం చేయకుండానే గ్రామసభ ముగిసింది. జూన్ 12న భూమిని సేకరిస్తున్నట్లు ఒకటి, జూన్ 21న ఇకపై తమ భూముల్ని ఇతరులకు అమ్మడం కొనడం చేయకూడదనే నోటిఫికేషన్ మరొకటి కూటమి ప్రభుత్వం విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (ఏపీఐఐడిసి) డెవలప్మెంట్ కార్పొరేషన్ భూములను తీసుకుంటున్నట్లు పబ్లిక్ ప్రకటన ఇచ్చి వార్తాపత్రికల్లో ప్రకటిoచేసింది. 2013 భూ సేకరణ చట్టంలో రైతులకు కూలీలకు చట్టప్రకారం పొందే పునరావాస హక్కు కూడా వర్తించదని నోటిఫికేషన్లో ప్రకటించారు. నివాస స్థలాలు సేకరించడం లేదు కాబట్టి పునరావాస హక్కులు, సామాజిక ప్రభావ అంచనా ఈ కంపెనీ వర్తించదని కూడా నోటిఫికేషన్ లో ప్రకటి ప్రకటించారు. ఇది అత్యంత దుర్మార్గమని కరేడు విస్తు పోయింది.
20వేల గ్రామ ప్రజలకు జీవనాధారానికి ముప్పు
కరేడులో ఉన్న భూముల్ని చెరువుల్ని కంపెనీకి కట్టబేడితే, జీవన విధ్వంసాన్ని మరుగుపరచడమే. జీవనాధారాలు లేకుండా గ్రామం ఒక అస్తిపంజరంగా మిగిలిపోతుంది. కూలీల బతుకులు గాలిలో దీపంలా మారిపోతాయి. చివరికి గ్రామాలకు గ్రామాలే ఆనవాళ్లు లేకుండా అంతరించిపోతాయి అంటూన్నారు. మా భూములను ఇవ్వమంటూ నినదిస్తున్నారు.
తీవ్రమౌతున్నభూపోరాటం
ప్రకటనల అనంతరము మూడు దశలుగా గ్రామ ప్రజలకు నోటీసులు ఇవ్వాలనాకున్నారు. మొదటి దశలో మూడు గ్రామాలలో కొంతమందికి నోటీసులిచ్చారు. గ్రామల ప్రజలు మీటింగులు పెట్టి తమ డిమాండ్లను తెలియజేయడంతో మిరియం శ్రీను మరి కొంతమందిని అరెస్టు చేశారు. దీనికి ముందుగానే 50 మంది రైతులు మహేశ్వరరావు గారి నాయకత్వంలో విజయవాడలో వడ్డే శోభనాదీశ్వరరావుగారిని మొదలైన వ్యక్తుల్ని కలిశారు. కలెక్టర్, ఎమ్మార్వో, ఆర్డీవోలకు భూముల్ని ఇవ్వము అంటూ అర్జీలు ఇచ్చారు. రెండవ దశ నోటీసులు రావడం మొదలైంది ఉద్యమం ఊపందుకుంది జూన్ 29న జాతీయ రహదారి ఎన్ హెచ్ పి 16 ను దిగ్భంధం చేశారు. 350 అంది పోలీసులతో రోడ్డు ఎక్కకుండా చేశారు. అయినా అన్ని అడ్డంకులు, అడ్డుకట్టలు,రైల్వే ట్రాక్ దాటుకుంటూ నాలుగువేలమంది రైతులు, కూలీలు, మహిళలు 5 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చి జాతీయ రహదారిని (NHP)16 ను దిగ్భంధనం చేశారు. "ఇండోసోల్ కంపెనీ వద్దు--మా పచ్చటి పొలాలే ముద్దు" "భూముల్ని వదలబోం గ్రామాన్ని కాపాడుకుంటాం" "ఇండిసోల్ గో బ్యాక్ గో బ్యాక్" అంటూ నీనదించారు. బీసీవై పార్టీ నాయకుడు రామచంద్ర యాదవ్ భూములు పోకుండా అండగ ఉంటానన్నాడు. రైతు,కూలీ మహిళల ఉద్యమాలకు దిగివచ్చిన ఆర్డీవో ,అధికారులు భూసేకరణ తాత్కాలికంగా నిలిపివేస్తామని హామీ ఇచ్చారు. నాలుగో తారీఖున కర్రేడులో గ్రామసభ ఏర్పాటు చేస్తామని చెప్పారు.
భూములు ఇచ్చేది లేదన్న గ్రామసభ
కరేడులో నాలుగో తేదీన సబ్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ, భూ సేకరణ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాజశేఖర్, ఎమ్మెల్సీ తుమాటి మాధవరావు గ్రామసభ ఏర్పాటు చేయగా మూడు పంటలు పండే భూమి ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. భూములు ఇవ్వమని 600 మంది రైతులు అర్జీలు ఇచ్చారు. గ్రామం మొత్తం భూమి ఇవ్వటానికి సిద్ధంగా లేదు అని ఏక వాక్య తీర్మానం చేయించారు. అభివృద్ధి అంటే ఏమిటి అని మహిళలు అధికారులను నిలదీశారు. తాత్కాలికంగా నిలుపుతున్నాము అన్నారే కానీ పూర్తిగా భూసేకరణ ఆపివేస్తామని ప్రభుత్వ అధికారులు ఎలాంటి ప్రకటన చేయలేదు.
ఇండోసోల్ కు నెల్లూరు జిల్లా కావలి దగ్గర రామాయపట్నం పోర్టు సమీపంలో 8348 ఎకరాల భూమి జగన్ కాలంలో కేటాయింపులు జరిగాయి.ఈ భూముల్లో 69 వేల కోట్ల పెట్టుబడితో 13 వేల మందికి ఉపాధి కల్పిస్తామన్నారు. వేల కోట్ల పెట్టుబడితో వెట్టికల్లి ఇంటిగ్రేటెడ్ సోలార్ ఫోటో ఓల్టాయిక్ పానల్ తయారీ పరిశ్రమను ఇండోసోల్ సంస్థ ఏర్పాటు చేసింది. అయితే ఈ భూములను కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత హిందుస్థాన్ పెట్రోలియం సంస్థకు భారీ రిఫైనరీల కోసం ఇచ్చింది. జగన్ టైంలోనే రామాయపట్నం పోర్టుకు దారి కోసం అంటూ చేవూరు దగ్గర నూటపది(110) ఎకరాల భూమిని కేటాయించింది (రైతులు ఇవ్వలలేదు సామ దాన భేద కుల రాజకీయ దండోపాయములతో రైతుల నుండి గుంజుకున్నారు. ఓ రైతు ఆత్మహత్య చేసుకుంటూ, ఇక్కడ ఒక పెద్ద మాపియా ఉన్నది అని చెప్పాడట). భూ సేకరణ పూర్తిస్థాయిలో జరగకుండానే ప్రభుత్వం మారితే ఎమవుతుందో అనే హడావుడిలో ఈ 110 ఎకరాల భూమిలో 30 ఎకరాల స్థలంలో షెడ్లు వేసి 500 గిగావాట్ల తయారీ సామర్థ్యం ఉన్న యూనిట్ ని ఉత్పత్తిలోకి తెచ్చినట్లు ఇండోసోల్ ప్రకటించింది. భూ కేటాయింపులు పూర్తిగా జరగకుండానే ఇండోసోల్ కంపెనీ సోలార్ పలకల తయారీని మొదలుపెట్టింది. అయితే ఈ భూమి రామాయపట్నం పోర్టుకిచ్చి, ఇండోసోల్ సోలార్ పలకలతో పాటు, మూడు రకాల విద్యుత్ ఉత్పత్తులు (సోలార్, పవన, జల విద్యుత్) కోసం ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని సింగరాయకొండ ఉలవపాడు మండలాల లో ఉన్న బింగినిపల్లి నుండి కరేడు, దానిచుట్టూ ఉన్న గ్రామాలలో 8348 ఎకరాలు కేటాయించింది. కరేడు (దాని చుట్టుపక్కల) రెవిన్యూ పరిధిలో మొత్తం 12, 630 ఎకరాలు భూమి ఉంది. ప్రకాశం నెల్లూరు జిల్లాలలో 18 లీజుల కోసం ఇండోసోల్ సంస్థ దరఖాస్తు చేసింది. వాటిలో 10 అటవీ భూములు కాగా మిగిలిన ఎనిమిది లీజులు ప్రభుత్వ భూములు. ప్రభుత్వం ఇండోసోల్ కు జూన్ 21న భూసేకరణ కోసం ప్రకటించిన దానిలో 7023 ఎకరాలు పట్టాభూమి, 1191 ఎకరాలు ప్రభుత్వ భూమిగా చెప్పింది.
భూములే కాక ఇంకా ఇండోసోల్ కంపెనీ ఉత్పత్తి చేసే జల విద్యుత్ కోసం, నీటి అవసరాల కోసం, కనిగిరి జలాశయం, సంగం బ్యారేజీ ,సోమశిల నుంచి 115 ఎం ఎల్ డి ల నీటిని పరిశ్రమ కోసం అందించాలని, 1200 ఎకరాల విస్తీర్ణం గల కరేడు చెరువు, రావూరు చెరువు, చేవూరు చెరువు, చెన్నాయ పాలెం చెరువు లలో నీటిని నిల్వ చేసుకోవడానికి అవకాశం కల్పించాలని జలవనరుల శాఖను ప్రభుత్వం ఆదేశించింది.
వందల ఎకరాల విస్తీర్ణం ఉన్న మూడు చెరువులను ఇండోసోల్ నీటి అవసరాలకు కేటాయించేలా ప్రభుత్వం వ్యవహరిస్తుందని గ్రామస్తులు వివరిస్తున్నారు. సముద్రపు నీటిని మంచినీరుగా మార్చే ప్రయత్నం కూడా ఉంది. ఈ ఫ్యాక్టరీ నుంచి వచ్చే వ్యర్ధాలను మన్నేరు ద్వారా సముద్రంలోకి పంపించాలనే ఆలోచన ఇండోసోల్ కు ఉందట.
అంతేకాక పావలా కోడికి ముప్పావల మసాలా అన్నట్లు షిరిడీసాయి ఎలక్ట్రికల్స్ అనుబంధ సంస్థ ఇండోసోల్ సోలార్ కార్పొరేషన్ కు రాష్ట్ర ప్రభుత్వం భారీ ప్రోత్సాహాలు ఇస్తుంది. ఉదాహరణకు రెండు మూడు అంశాలు మాత్రం చెప్తా. రు. 69 వేల కోట్ల పెట్టుబడితో, 13వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తామన్న ఇండోసోల్ కంపెనీకి (పి ఎల్ ఐ) ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహ పథకం కింద 50 వేల కోట్ల రాయితీని ప్రకటించింది. ఈ రాయితీలో గనుల లీజు ప్రాతిపదికగా కాకుండా, నేరుగా రిజిస్ట్రేషన్ లకు అనుమతినిచ్చిందని గ్రామస్తులంటున్నారు.
భూముల రిజిస్ట్రేషన్ శాఖ నిబంధనల ప్రకారం సుమారు 1200 కోట్లు అవుతుందని అంచనా. దీనిపై చెల్లించాల్సిన స్టాంప్ డ్యూటీ7.5% ప్రభుత్వం మినహాయించింది. ఇండోసోల్ సంస్థ వినియోగించబోయే విద్యుత్తుకు రాబోయే 15 ఏళ్ల పాటు సుమారు 47,809 కోట్ల రాయితీని ప్రభుత్వమే భరిస్తుంది. ఇండోసోల్ కు విద్యుత్ సరఫరా చేసేందుకు 220 కె. వి సబ్ స్టేషన్ల ఏర్పాటుకు 70 కోట్లు, 30 కిలోమీటర్ల లైన్ల ఏర్పాటుకు 30 కోట్లు భారాన్ని ఇండోసోల్ పై వేయకుండా ట్రాన్స్కో భరించాలంటూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. భవనాల నిర్మాణానికి అవసరమైన గ్రావెల్ మట్టి, ఇసుక, రోడ్ మెటల్ ఇతర ఖనిజాల కు రాయల్టీ రుసుము మినహాయింపు వల్ల 50 కోట్ల లబ్ధి ఉంటుందని అంచనా. ఇవి కాకుండా కేంద్ర ప్రభుత్వం 58 శాతం ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలను ప్రకటించింది.
భూములన్నీ ఇక వాళ్లేకేనా...
అమ్మో! రామాయపట్నం పోర్టుకు ఓ ఎనిమిది వేల ఎకరాలు, హిందుస్థాన్ పెట్రోలియం కు ఓ ఎనిమిది వేల ఎకరాలు, ఇండోసోల్ కు ఓ ఎనిమిది వేల ఎకరాలు. ఇంకా ముందు ముందు ఇంకెన్నీ కంపెనీలు ఇంకా ఎన్నివేల ఎకరాలు తీసుకుంటోయో తెలియదు. ఈ లెక్కలు చూస్తుంటేనే భయం వేస్తుంది.
సముద్రంలో పోటు వచ్చినప్పుడు నేషనల్ హైవే 16 దాకా మన్నేరు నదికి వాటర్ వస్తుంది. ఈ మన్నేరు నదిని అభివృద్ధి చేసి జలాశయాలలో నీటిని నింపడమే కాకుండా, అక్కడ జరిగే ఉత్పత్తులను పడవలపై రామాయపట్నం వరకు పంపించాలని ఓ ప్రణాళిక ఉందని గ్రామస్తులు గగ్గోలు పెడుతున్నారు. (ఇంకా ఉంది)
(18 గ్రామాల ప్రజలు ఏమంటున్నారు, ఉద్యమం తీరుతెన్నులు రెండవ భాగంలో తెలుసుకుందా)