‘మా తోట’తో మారిన గిరిజనుల బతుకు బాట..
ఒకప్పుడు అంతా ఇసుక నేలలు. వానలు పడితేనే పండే పంటలు. కానీ ఇప్పుడు ‘మా తోట’ అంతా పచ్చని పైర్లు.;
‘ ఒకపుడు ఇక్కడ తునికి, ఇప్ప చెట్లు తప్ప వేరే చెట్లు పెరిగేవి కాదు.
అంతా ఇసుకనేలులు. బొబ్బర్లు, మినుములు పండేంచే టోళ్లం . అవి కూడా వానలు పడితేనే ... లేకపోతే పండేవికాదు. ఇలాంటి పరిస్ధితుల్లో ఇక్కడ 5 ఏండ్ల క్రితం మాతోట ప్రాజెక్టు మోదలైంది. ఇపుడు ఎందుకు పనికి రావనుకున్న మా భూముల్లో నే మామిడి ,ఉసిరి పండుతున్నాయి... కూలీ పనులు కోసం ఎదురు చూడకుండా మా భూముల్లోనే పనిచేసుకుంటున్నాం...ఏడాదికి దాదాపు రూ. 80,000 నుండి 1 లక్ష 20 వేల రూపాయల వరకు ఆదాయం పొందుతున్నాం’ అన్నారు, నార్లపూర్, తాడ్వాయి మండలంలో మామిడి చెట్ల కింద పాదులు తీస్తున్న దారవత్ దేవ్‌సింగ్ ఆయన భార్య లలిత,
మాతోట అంటే ఏమిటి?
కొండ, కోనల మధ్య జీవిస్తున్న గిరిజనులు ఆర్థికంగా, సామాజికంగా ఎదగడానికి దేశవ్యాప్తంగా నాబార్ట్ అమలు చేసిన ప్రాజెక్ట్ ‘మాతోట’ . ఆదివాసీ ప్రాంతాల్లోని బీడు భూములను సారవంతంగా మార్చి గిరిజన రైతుల బతుకులు పచ్చగా ఎదగడానికి నాబార్డు Tribal Development Fund (TDF) ద్వారా ఈ కార్యక్రమం అమలు చేసింది.
ఎక్కడ ?
తెలంగాణలోని ములుగు జిల్లా, తాడ్వాయి, గోవిందరావుపేట మండలాల్లో అన్నీ బీడు భూములే. వర్షాధారం మీద రైతులు సేద్యం చేసేవారు. చాలా తక్కువ ఆదాయం వచ్చేది.
మాతోటకు మంజూరు అయిన బోర్ వెల్‌తో రైతులు
అది చాలక గిరిజనులు అటవీ ఉత్పత్తుల మీద, కూలీపనుల మీద ఆధారపడి జీవించేవారు. నీటి వసతి లేక కొన్ని భూములను ఖాళీగా వదిలేసేవారు.
ఎలా?
ఈ పనిస్ధితిని మార్చడానికి నాబార్డు సహకారంతో ‘వనసమాఖ్య ఎన్జీఓ మాతోట ప్రాజెక్ట్ అమలు చేశారు. 500 మంది లబ్దిదారులను గుర్తించి, కుటుంబానికి ఎకరా చొప్పున 450 ఎకరాల్లో పండ్లతోటల వేసి అభివృద్ధి చేశారు, దీనితో పాటు 50 నిరుపేద కుటుంబాలకు జీవనోపాధులు కల్పించారు.
తోటలకు పైపుల ద్వారా నీటిని సరఫరా చేస్తున్న రైతులు
గోవిందరావుపేట, తాడ్వాయి మండలాల్లో గిరిజనుల జీవనాధారం అడవి. ఇక్కడి 14 గ్రామాలలో బీడు భూములను అభివృద్ధి చేసుకునే అవకాశం నాబార్డు కల్పించింది. ఒకపుడు సంచార జాతులైన వీరు ఇప్పుడిపుడే సుస్థిర జీవనం వైపు అడుగులు వేస్తున్నారు. వీరి సామాజిక, ఆర్థిక వెనుకబాటు తనాన్ని గుర్తించి వారికి సుస్థిరమైన జీవనోపాధులు కల్పించాలనే సంకల్పంతో నాబార్డ్ వీరి బంజరు భూములను అభివృద్ధిచేసి పండ్లతోటలు పెంచేలా కృషిచేస్తుంది.
450 ఎకరాల్లో మాతోట కార్యక్రమం ఏప్రిల్ 2020 లో మొదలైంది. నాబార్డు టిడిఎఫ్ కార్యక్రమం ద్వారా మాతోట ప్రాజెక్ట్‌ని ‘వనసమాఖ్య’ సంస్థ అమలు చేస్తుంది.
మాతోట ప్రాజెక్ట్‌లో భాగంగా మహిళల ఉపాధి కోసం జీవనోపాధుల మెరుగుదల కార్యక్రమంలో తేనెటీగల పెంపకం చేపట్టిన చీలా సింధు, పోలేబోయిన అనురాధ, ఒడ్డుగూడెం.
మాతోట అభివృద్ధి కమిటీ
మాతోట అమలుకు ఎంపిక చేసిన గ్రామాలలో ప్రతి రైతు ఒక ఎకరా భూమిలో మాత్రమే పండ్ల తోటలు పెంచడానికి నాబార్డ్ ` వనసమాఖ్య ద్వారా సాయం పొందడానికి అర్హులు.
నీటి నిలువ తొట్టెలు ఏర్పాటు చేసుకొని పండ్లతోటల సాగు
ప్రతి గ్రామంలో 10 నుండి 12 మంది రైతులు కలిసి ‘‘నాబార్డ్ ` మాతోట’’ గ్రూప్‌లుగా ఏర్పడి, మిగతా మాతోట గ్రూపులతో కలిసి గ్రామాభివృద్ధి కమిటీగా (వి.డి.సి.) ఏర్పడి పండ్లతోటలను సాగుచేస్తూ, గ్రామాభివృద్ధి, మహిళాభివృద్ధి కొరకు కృషిచేస్తున్నారు. ఈ గ్రామాభివృద్ధి కమిటీలన్నీ కలిసి మండల స్థాయిలో ‘‘తాడ్వాయి, గోవిందరావుపేట మాతోట అభివృద్ధి కమిటీ’’ గా ఏర్పడి మాతోటల వల్ల వచ్చిన ఫలసాయం అధిక లాభానికి అమ్ముకోవడం, గిరిజన రైతులకు బ్యాంకుల ద్వారా ఋణాలు పొందడంలో కృషి చేస్తున్నారు.
నీటి సదుపాయం లేనపుడు వేసంగిలో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా
అంతర పంటలతో ఆదాయం
‘ నాబార్డ్, వనసమాఖ్య వారి సలహాలు పాటిస్తూ పండ్ల తోటలు సాగుచేశాం. ఇపుడు మా భూములన్నీ పండ్లు, అంతరపంటలతో పచ్చగా కళకళలాడుతున్నాయి. మాకు మామిడి, సపోటా ద్వారా రూ.50,000 నుండి రూ.80,000 వరకు, అంతర పంటల ద్వారా రూ.15,000 వరకు ఆదాయం వస్తోంది.
తన తోటలో పండిన మామిడి పండ్లు చూపుతున్న గోవిందరావు పేట రైతు
ఈ ప్రాజెక్ట్ అమలులో మాకు ఎకరానికి నాబార్డ్ రూ.52,000/- ఖర్చు చేసింది. ఫలితంగా ఏడాదికి పంట దిగుబడి పై సుమారు రూ.80,000 నుండి రూ.1,00,000 వరకు ఆదాయం పొందుతున్నారు. పండిన పంటను ఎఫ్‌పిఓ ద్వారా మార్కెటింగ్ చేస్తున్నారు. దీనివల్ల మా కష్టానికి తగిన గిట్టుబాటు ధర వస్తుంది. రైతులంతా హ్యాపీగా ఉన్నారు.మాతోట ప్రాజెక్ట్ మా బంజరు భూములను బంగారంలా మార్చింది.’ అంటారు , బాలాజీనగర్, గోవిందరావు పేట మండలంకు చెందిన భూక్యా మీటు నాయక్.
మాతోట మా జీవితాన్ని మార్చింది అంటున్న బాలాజీనగర్ లోని తన తోటలో విరగకాసిన మామిడి చెట్లను చూపుతున్న భూక్యా మీటు నాయక్.
రంగాపూర్ కి చెందిన మోడెం కృష్ణవేణి మాట్లాడుతూ, గత పన్నెండేళ్లుగా మా భూములు బీడుగా పడిఉన్నాయి. మాతోట కార్యక్రమం వల్ల పండ్ల తోటలుగా మారాయి. పండ్లతోటలతో పాటు, అంతర పంటలు వేశాం. సేంద్రియ ఎరువులు వాడుతున్నాం. మరో సంవత్సరంలో పంట చేతికి వస్తుంది. 50 వేలకు పైగా ఆదాయం వస్తుందని ఆశిస్తున్నాం’ అంటారు మరో రైతు ఊకే భూపతి.
మామిడి తోట వల్ల కుటుంబం గడవడానికి ఆదాయం వస్తుంది అంటున్నారు రాంగాపూర్‌కి చెందిన కొటెం మంగమ్మ,
‘మా ఎకరం భూమిలో పత్తి పండిరచేవాళ్లం. దిగుబడి సరిగా వచ్చేది కాదు. ఆ సమయంలో నాబార్డు వారు మా ఊరిలో మాతోట ప్రాజెక్ట్ అమలు చేస్తున్నారని తెలిసింది. నేను మాతోట కమిటీలో చేరి పండ్ల మొక్కలు పెంచాలి అనుకున్నాను. వనసమాఖ్యవారు 3 రకాల పండ్ల మొక్కలు, బోర్డర్‌లో టేక్ మొక్కలు ఇచ్చారు. తోటలు ఎలా పెంచాలో గ్రామ సభలు పెట్టి వివరించారు. తెగుళ్లు వస్తే ఎలాంటి మందులు వాడాలో చెప్పారు, రసాయనాలు వాడకుండా తోటలు, కూరగాయలు పెంచుతున్నాం. ఇంటి పెరట్లో పెంచుకోవడానికి కూడా రైతులందరికీ మొక్కలను ఇచ్చారు. కూరగాయల కోసం బయట మార్కెట్‌కి వెళ్లాల్సిన పనిలేదు. ఇప్పటికే మామిడి పండ్లు కాపుకు వచ్చాయి. 50 వేల వరకు ఆదాయం వచ్చింది. మరో ఏడాదికి పూర్తి స్ధాయిలో కాపు వస్తుంది. మరింత దిగుబడి పెరుగుతుంది. తోటల మధ్య అంతర పంటలు వేసి కొంత ఆదాయం పొందుతున్నాం. మాతోట వల్ల మా జీవితాలు ఆనందంగా ఉన్నాయి.’ అంటారు.
సోలారు ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తున్న రైతు
సమ్మక్క సారక్క రైతు సంఘం
మా గ్రామంలో 30 కుటుంబాలకు ఒక్కొక్కరికి ఎకరం చొప్పున పండ్లతోటలు పెంచుకోవడానికి సహకరించారు. మాకు మొక్కల పెంపకంలో సూచనలు ఇవ్వగా మామిడి, సపోటా, యాపిల్‌బేర్ నాటి సంరక్షిస్తున్నాం.
రాబోయే కాలంలో ఎక్కువ దిగుబడి వస్తుందని, సరిహద్దు మొక్కలుగా టేకు మొక్కలు నాటాం. ప్రతీ ఇంటికి కూడా పెరటి మొక్కలు ఇచ్చారు. జామ, సీతాఫలం, కాయగూరలు పెంచుకుంటూ ఇంటిల్లిపాది తిని, మిగిలినవి అమ్ముకుంటున్నాం. ఇపుడు తోటలు ఎదిగి ఫలసాయం వస్తున్నది. ఎకరానికి లక్షకు పైగా ప్రతీ రైతు ఆదాయం పొందుతున్నారు. సమ్మక్క సారక్క ఎఫ్‌పిఓ ద్వారా మార్కెట్ చేసుకొని గిట్టుబాటు ధర పొందుతున్నాం.
ఇతర ప్రాంతాల మాతోట లబ్దిదారులు కూడా ఎక్స్‌ఫోజర్ విజిట్‌కి మా గ్రామానికి మా సాగు విధానాలు నేర్చుకొని వెళ్తుంటారు. ఇది మాకు గర్వకారణంగా ఉంది. అంతే కాదు వనసమాఖ్య సహకారంతో మాకు గోడౌన్ కూడా నిర్మించి ఇచ్చారు. దీనివల్ల పండ్లను అక్కడ నిలువ ఉంచుకునే అవకాశం కలిగింది. అలాగే ఎరువుల షాపును కూడా ఏర్పాటుచేశారు. దీనివల్ల మాకు మార్కెటింగ్ సుళువు అయింది. ఈ కార్యక్రమం మా ఆదివాసీల జీవితంలో కొత్త మార్పు తెచ్చింది.’అన్నాడు, ఫ్రూట్‌ఫారం గ్రామానికి
చెందిన ఎఫ్‌పిఓ సభ్యుడు,ó తాటి హనుమంతరావు.
పండ్లతోట మధ్య అంతర పంటలుగా కూరగాయలు పండిస్తున్న రైతు జంట
గిరిజన తెగల సమగ్ర అభివృద్ధి నాబార్డు లక్ష్యం
‘ తెలంగాణాలో కొల్లాం, చెంచు, కొండారెడ్డి, తోటి, కోయ, గోండ్, ప్రధాన్, నాయక్ పోడ్, లంబాడ వంటి 32 ఆదివాసి సమూహాలున్నాయి. రాష్ట్ర జనాభాలో 9.34 శాతం ప్రజలు ఈ సమూహాలే. సామాజిక, ఆర్థిక, మౌలిక సదుపాయాల లేమి వల్ల వీరు ఎక్కువగా అటవీ ఉత్పత్తులు సేకరణ, పోడు వ్యవసాయం, పశుపోషణ పై ఆధారపడి జీవిస్తున్నారు. అయితే, అటవీ వనరుల తగ్గుదల, పాతవ్యవసాయ పద్ధతుల ద్వారా ఈ గిరిజన కుటుంబాల ఆదాయం తగ్గిపోవడమే కాక, వలసలు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో గిరిజనుల జీవనోపాధిని మెరుగుపరచడానికి తోటల పెంపకం ద్వారా గిరిజన తెగల సమగ్ర అభివృద్ధికి నాబార్డు ప్రత్యేకంగా గిరిజన అభివృద్ధి నిధి (ుణఖీ) ని ఏర్పాటు చేసింది.
ఈ నిధి ద్వారా ‘మాతోట’ ప్రాజెక్ట్ అమలు చేసి, పండ్ల తోటలుతో జీవనోపాధిని మెరుగుపరచే కార్యాచరణను చేపట్టింది. మాతోట కార్యక్రమ రూపకల్పనలో పండ్లతోటల ఏర్పాటు, అంతర పంటల సాగు, నీటి పారుదల, సామర్థ్యవృద్ధి, శిక్షణలు మరియు పంటల అనంతరం ప్రాసెసింగ్ వంటి అంశాలు ఉన్నాయి. స్థానిక నైపుణ్యాలు మరియు గిరిజన కళల ఆధారంగా జీవనోపాధి కార్యక్రమాలకు ఇందులో ప్రాధాన్యం ఇచ్చారు.
నాబార్డ్ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 44 టీడీఎఫ్ ప్రాజెక్టులు అమలు చేస్తున్నారు. వాటిలో ఒకటి ములుగు జిల్లాలోని గోవిందరావుపేట మరియు తాడ్వాయి మండలాలలో 14 గ్రామాల్లో అమలైన మాతోట ప్రాజెక్టు. ఈ ప్రాజెక్ట్ ద్వారా 500 గిరిజన కుటుంబాలకు లబ్ధి చేకూరింది. ఆదివాసీల అభివృద్ధికి దోహదపడుతున్న ప్రభుత్వాలూ, ప్రభుత్వేతర సంస్థలూ, వ్యక్తులు, వంటి వారికి ఒక స్ఫూర్తి వంతమైన ప్రేరణ ‘మాతోట’ అని అన్నారు
నాబార్డ్, తెలంగాణ ప్రాంతీయ కార్యాలయం, చీఫ్ జనరల్ మేనేజర్ బి. ఉదయభాస్కర్
మాతోట ప్రాజెక్ట్ ని అమలు చేయడంలో కీలక పాత్ర వహించిన నాబార్డు సిజిఎం ఉదయ భాస్కర్‌తో ఫెడరల్ తెలంగాణ ప్రతినిధి.
ప్రాజెక్ట్ ఫలితం..
బోరువెల్స్, మోనో బ్లాక్ మోటారు పైప్ లైన్ ద్వారా సాగునీటి సౌకర్యం కలిగింది. మామిడి, సపోట తోటల మధ్య అంతరపంటలుగా కూరగాయలు, మినుములు, పెసర్లు, ఉలవలు, బొబ్బర్లు పండిస్తున్నారు. కూలీ పనుల కోసం ఎదురు చూడకుండా వారి పొలాలలోనే పనిచేస్తున్నారు. మాతోట ప్రాజెక్ట్ అమలైన తరువాత, ప్రతీ కుటుంబం ఏడాదికి దాదాపు రూ. 80 నుండి 1 లక్ష 20 వేల రూపాయల వరకు ఆదాయం పొందుతున్నారు.
ఖర్చు ఎంత? ఫలితం ఏమిటి?
5 ఏళ్లలో ఈ ప్రాజెక్ట్ ద్వారా నాబార్డు ఒక్కో కుటుంబానికి రూ.52,000 ఖర్చు చేయగా నేడు పండ్లు, అంతర పంటల ద్వారా ప్రతీ రైతు రూ. 80 వేల నుండి రూ. 1,20,000 వరకు సంపాదిస్తున్నారు.