మన మూలాలేవో శోధించడం గొప్ప అనుభవం...

మూడు రోజుల తెలంగాణ గ్రామ జీవితం? జగిత్యాల జిల్లా కొండగట్టు నుంచి మల్యాల దాకా గ్రామీణ విజ్ఞానయాత్ర. పార్ట్:2;

Update: 2025-07-15 07:59 GMT

ఎంటెక్ చేసిన శ్రీకాంత్ కొంత కాలం కరీంనగర్ లోని ఒక ఇంజనీరింగ్ కాలేజీలోఅధ్యాపకుడిగా పని చేశాడు. కానీ ఆ ఉద్యోగం అతనికి సంతృప్తినివ్వలేదు. అతనికి సినిమా రంగం పట్ల ఆసక్తి వుంది. నెమ్మదిగా వాళ్ళ వూరిని చూపిస్తూ వీడియోలు చేసేవాడట. తన స్నేహితులను కూడా కలుపుకొని My Village అనే యూట్యూబ్ ఛానెల్ స్టూడియోను ఏర్పాటు చేశాడు. వాళ్ళ ప్రోత్సాహంతో వచ్చిన సినిమా యాక్టర్ గంగవ్వ. నెమ్మదిగా నటులను కూడా తయారు చేసుకొని గ్రామసమస్యలకు కొంత హాస్యాన్ని జతచేసి వాళ్ళు చేస్తున్న వీడియోలు చాలా విజయవంతమయ్యాయి. గ్రామ జీవన సంస్కృతులను ప్రపంచానికి చాతింటున్నారు. వాళ్ళ ఛానల్ కు ఇప్పుడు మూడు మిలియన్ల వీక్షకులున్నారట. నాగార్జున, రాణా లాంటి పెద్ద నటులు కూడా ఇపుడు వాళ్ళను సంప్రదిస్తున్నారు. ఉద్యోగం సాకుతో వున్న ఊరిని, దేశాన్ని వదిలి పోతున్న ఈ రోజుల్లో ఈ మిత్ర త్రయం ( శ్రీకాంత్, రాజు, చందు ) ఉన్నత విద్యావంతులై కూడా సొంత ఊరిలోనే వుంటూ విజయ పథం వైపుగా దూసుకుపోతూ తమ గ్రామానికి పేరు తేవడం చాలా అభినందించదగ్గ విషయం.

రెండేళ్ళ కింద పల్లెసృజన నిర్వహించిన చిన్నశోధ యాత్రను షూట్ చేయడానికి వెళ్ళిన రాజు, శ్రీకాంత్ లు ఆ కార్యక్రమానికి ముగ్ధులై యాత్రలో వాళ్ళు కూడా పాల్గొన్నారు. వాళ్ళ ప్రాంతపు స్థానిక గ్రామ ప్రజలకు ఆ అవసరాన్ని గుర్తించి ప్రస్తుత యాత్రను వాళ్ళు ఏర్పాటు చేసారు. మూడురోజులు వాళ్ళు ఏర్పాటు వేసిన వసతి, భోజనాదులు, అల్పాహారం, రెండుపూటలా టీ, అందించిన సహాకారం మరువలేనిది.

రెండో రోజు లంబాడీ పల్లెలో బయలుదేరి దోమకుంట,ఆరెల్లి, సుద్ద పల్లె, మైదంపల్లె గ్రామాల ప్రజలతో మాట్లాడుతూ మానాల గ్రామానికి చేరుకున్నాము. ఆరెల్లి వాస్తవ్యురాలైన రాజేశ్వరి ఊరూరు తిరిగి గాజులు

అమ్ముతుంది. సాదాగాజులు ₹ 20 లకు, పూల గాజులు ₹ 30లకు డజన్ లెక్కన అమ్ముతుందట. సరుకు జగిత్యాలనుంచి తీసుకువస్తుంది. పండగరోజులలో ఎక్కువ, మామూలు రోజులలో తక్కువ గిరాకీ ఉంటుంది.

ముఖ్యంగా తెలంగాణా ఆడపిల్లల పండుగ బతుకమ్మ దినాలలో చాలా గిరాకీ వుంటుందని సంతోషంగా చెప్పింది. ప్రతిసారి గ్రామప్రజలతో లేదంటే తోటి యాత్రికులతో మాట్లాడుతూ నడిచేవాళ్ళం. అయితే రెండోరోజు రాత్రి సుమారు అరగంట మౌనంగా పరిసరాలను పరిశీలిస్తూ నడవడం చాలా బాగుంది. మసక వెన్నెల, నక్షత్రాలు, కీచురాళ్ళ వింత సంగీతం, దూరంగా కొండలు, మబ్బులు, మా నడక వల్ల వచ్చే వింత శబ్దం. చుట్టూ ఎంతమంది వున్నా మనలోనికి మనం ప్రయాణించడం అంటే ఇదే కాబోలు. ఈ రోజు కూడా మేము దాదాపు16 కి.మీ పైనే నడిచాము.

ఈ యాత్రలో కలిసిన వాళ్ళలో ప్రత్యేకంగా చెప్పుకోదగిన వాళ్ళు నలుగురు. ఇన్నోవేటర్స్ ప్రవీణ్, గోనె కిషన్, ఫిలిం ఆర్టిస్టు గంగవ్వ. గంగవ్వ చాలాసేపు తమ వూరి విశేషాలు, తాను ఫిలిం ఆర్టిస్టుగా ఎదిగి వచ్చిన క్రమం, తన కుటుంబం మొదలైన విషయాలు పంచుకుంది. ఆమె ఏమీ చదువుకోక పోయినా అంతర్లీనంగా ఆమెలో దాగివున్న నటనా కౌశలం అవకాశం రావడం వల్ల ప్రజలకు తెలిసింది. ఆమె ఆర్టిస్టుగా ఎదిగినా తన మూలాలు గ్రామంలోనే వున్నాయని గర్వంగా చెప్పుకుంది. ఆమెలోని అమాయకత్వం, నిరాడంబరత ప్రస్ఫుటంగా కనిపించాయి.

సినీ ఆర్టిస్టు గంగవ్వతో..

మరో వ్యక్తి ప్రవీణ్ ఆవిష్కర్త. చదువుకున్నది ఏడో తరగతి. చిన్నప్పటినుంచీ సైన్సు పట్ల వున్న ఆసక్తికి ఎన్నో ప్రయోగాలు చేస్తూ పదును పెట్టుకున్నాడు. పడిన ప్రతిసారి మరింత కసిగా పైకి లేచి ఈనాడు అంతర్జాతీయ స్థాయిలో నిలబడ్డాడు. మల్బరీ సాగులో అత్యంత కష్టమైన పని ఆ చెట్లను కత్తిరించడం. అవి చాలా దృఢంగా వుంటాయి. ఎంతో బలంగా కత్తిరించవలసివుంటుందట. ఒకరోజు ఆ పని చస్తే రెండురోజులు చేతుల నొప్పితో చెయ్యలేని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ప్రవీణ్ కనిపెట్టిన మల్బరీ కట్టర్ ఆ పంటల సాగు రైతుకు పనిని సులభం చేసింది. ప్రస్తుతం మనదేశంలో కొన్నిచోట్ల వాడుతున్నారు. ఈ క్రమంలో ప్రవీణ్ ఆవిష్కరణకు ముగ్ధులైన సెంట్రల్ సిల్క్ బోర్డు ప్రవీణ్ ను మోసగించి తప్పుడు సంతకాలు చేయించుకుందట. ఆ విషయం తెలిసి పల్లెసృజనను ఆశ్రయించిన ప్రవీణ్ కు బ్రిగేడియర్ గణేశం గారు ముందుండి న్యాయం చేయడమే కాక, థాయిలాండ్ ప్రభుత్వంతో టైయప్ చేసి అతని ఆవిష్కరణకు అంతర్జాతీయ స్థాయి కల్పించారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండనున్నట్లు ప్రవీణ్ లోని అమాయకుడు నాకు స్పష్టంగా కనిపించాడు.

తన ఆవిష్కరణ గురించి వివరిస్తున్న ఇన్నోవేటర్ ప్రవీణ్

మరో ఇన్నోవేటర్ రాము. వరి గడ్డితో మల్చింగ్ ( పంట ఎండి పోకుండా ఎక్కువ రోజులు తడిగా వుంచడం ) చేసే విధానాన్ని కని పెట్టాడు. దీనితో పంట ఏపుగా పరిగి దిగుబడి అధికంగా వచ్చే అవకాశం వుంటుంది. తన ఆవిష్కరణను ( ప్రజలకు ) రైతులకు అందుబాటులోకి తేవడానికి బ్రిగేడియర్ గణేశం గారి సహకారం కొరకు వచ్చాడు. ఈ విషయంలో గణేశం గారు చేస్తున్న కృషి ఎంతో విలువైంది.

బ్రిగేడియర్ గణేష0 గారితో ఇన్నోవేటర్ రాము.

గోనె కిషన్ వాళ్ళది సుద్దపల్లె గ్రామం. ప్రస్తుతం ఊరిలోనే వ్యవసాయం చేస్తున్నాడు. ఆ ఊరిలో ఆరేడు మంది మాత్రమే ఉద్యోగం చేస్తున్నారట. సివిల్స్ కూడా రాశాడట. తాను ఎంతో కష్టపడి డిగ్రీ పూర్తి చేశాడు. సివిల్స్ కూడా రాశాడట. కానీ పలుకారణాల వల్ల దానిని సాధించలేక పోయాడు .బతుకుతెరువు కోసం దుబాయ్ వెళ్ళాడు. కానీ మూడు నెలలకంటే ఎక్కువ కాలం అక్కడ ఉండలేకపోయాడు. అంత చిన్న దేశం అంత గొప్ప అభివృద్ధిని ఎలా సాధించగలిగింది? ఇదే అతణ్ని వెంటాడిన ప్రశ్న. ఉన్నది మూడు నెలలే కానీ చాలా పరిశీలనాత్మకంగా అక్కడి అభివృద్ధిని గమనించాడు." సమయాన్ని సద్వినియోగం చేసుకోవడమే అభివృద్ధి " అంటూ అభివృద్ధికి కిషన్ ఇచ్చిన నిర్వచనంలో వాస్తవం వుంది. పరిశీలనతోపాటు పఠనాసక్తి కూడా వున్న కిషన్ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ తన జీవితాన్ని కొన సాగిస్తున్నాడు.

బడి పిల్లలు

వడ్లు ఎండకు ఆరబోసి, బయటకు వెళ్ళి వచ్చేసరికి వర్షం పడి తడిసిపోయాయి. ఆ బాధలోనుంచే తన ఆవిష్కరణ వచ్చిందని చెప్పాడు. ఒక రోజు తన భార్య తలస్నానం చేసి, హెయిర్ డ్రయర్ తో జుట్టు ఆరబెట్టుకోవడం చూసి, ధాన్యాన్ని బయట ఆరబోయకుండా యంత్రం ద్వారా ఆరబెట్టిగలిగితే.. ఆలోచన వచ్చింది మొదలు తన ప్రయోగం మొదలు పెట్టాడట. పలుసార్లు ప్రయత్నించగా ధాన్యం ఆరబెట్టే యంత్రాన్ని ఆవిష్కరించ గలిగాడు. దాని ద్వారా ఒకేసారి 25 కిలోల ధాన్యం ఆరబెట్టవచ్చు. ఆర్థిక సహాయం అందిస్తే దానిని మరింత అప్డేట్ చేస్తానన్నాడు. మారుమూల గ్రామంలో వున్న తన ఆవిష్కరణ ప్రపంచానికి తెలిసి, అందరికీ అందుబాటులోకి రావాలంటే బ్రిగేడియర్ గణేశ0 గారి చేయూత అవసరం.

రెండోరోజు రాత్రి మేము మానాల గ్రామంలోని జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో బసచేసాము. దాదాపు 10 కి.మీ నడిచి నూకపల్లి మీదుగా సాయంత్రానికి మల్యాల క్రాస్ రోడ్ చేరుకున్నాం. ఈ రోజు ప్రముఖ వ్యవసాయవేత్త చిన్నికృష్ణుడు గారు మాతో వున్నారు. ఆయన వయసు 76 యేళ్లు. వరి వంగడాలలో పలు ప్రయోగాలు చేసారు. ఐదు రంగుల వరి విత్తనాలు ఆయన దగ్గరున్నాయట. ఆయన చేస్తున్నది సేంద్రీయ వ్యవసాయం. పలు ఆసక్తికరమైన విషయాలను ఆయన తెలియజేసారు. వడ్లు మొలకెత్తినలాయని తెలుసు కానీ బియ్యం కూడా మొలకెత్తుతాయని మొదటిసారి ఆయన ద్వారా తెలుసుకున్నాను. ఈ ప్రయోగం నేనూ చేసి చూడాలని అనుకుంటున్నాను. వండే అవసరం లేకుండా నీళ్ళలో నాన బెడితే అనం తయారయ్యే బియ్యం కూడా ఆయన వద్ద వున్నాయని చెప్పాడు. వీలైతే ఎప్పుడైనా ఆయన దగ్గరికి వెళ్ళి బియ్యాన్ని ప్రత్యక్షంగా చూడాలనుకున్నాను.

తమ అనుభవాలు పంచుకుంటున్నవ్యవసాయవేత్త చిన్ని కృష్ణుడు గారు

మా నడకలో భాగంగా నేను గమనించింది ముఖ్యంగా రైతులు ప్రస్తుతం జీలుగు సాగు చేస్తున్నారు. దానితో పరిసరాలన్నీ పచ్చగా ఆహ్లాదకరంగా ఉన్నాయి. దాని వివరాలు రైతులను అడిగి తీసుకున్నాను. ఆ పంట మూడడుగుల ఎత్తు పెరిగాక దున్నేస్తారట. దాని వలన భూమి సారవంతమై తరువాత వేసిన పంట దిగుబడి అధికంగా వస్తుందట. ఇక అలాంటి రసాయన ఎరువులు వాడనవసరం లేదట. ఒక రకంగా ఇది కూడా సేంద్రీయ వ్యవసాయమేనన్న మాట.


ఈ సందర్భంలో ప్రాథమిక పాఠశాల, ఉన్నత పాఠశాలను సందర్శించాము. TV సహాయంతో గ్రామీణుల ఆవిష్కరణలను పల్లెసృజన వాలంటీర్ అఖిల అద్భుతంగా వివరించారు. పిల్లల్లో కనుమరుగవుతున్న సైన్సు టెంపర్సెంటును పెంచడానికి ఇది దోహదం చేస్తుంది. నేటి బాలలే రేపటి పౌరులు కదా వాళ్ళు శాస్త్రీయంగా ఆలోచించడం దేశ భవిష్యత్తుకు అవసరం. పిల్లల్లో మహిళల్లో సృజనాత్మకత ఎక్కువగా వుంటుందని నా అభిప్రాయం. వుమెన్ ఇనోవేటర్స్ లేకపోవడం నాకు కొంచం వెలితిగా అని పరించింది. అయినా మన పితృస్వామ్య వ్యవస్థలో పురుషులే ముందుకు వస్తారు. మహిళలు మరుగున పడతారు. ఈసారి చిన్న శోధ యాత్రకు వెళితే ఖచ్చితంగా మహిళా ఇన్నోవేటర్స్ మీద దృష్టి పెట్టాలని నిర్ణయించు కున్నాను.

53 వ పల్లెసృజన చిన్నశోధ యాత్రలో పాల్గొన్న మహిళా బృందం

భాను సాంకేతిక పరిజ్ఞానంతో Al సహాయంతో ఎప్పటికైనా

( తెలుగు సాహిత్యం ప్రక్రియలలో ఒకటైన ) అవధానం చేయాలనుకుంది. పూజిత సివిల్స్ రాయడానికి ప్రిపేరవుతుందట. ప్రభుత్వ పథకాలు గ్రామీణ ప్రజలకు నిజాయితీగా అందజేయాలని, వాళ్ళ అభివృద్ధి కొరకు పని చేయాలని పూజిత జీవితాశయం. వాళ్ళిద్దరి ఆశలు నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

పల్లె అందాలు

ప్రతిరోజు ఉదయం ఆయా గ్రామ ప్రజలను సమావేశ పరిచి, వాళ్ళకు అదివరకే ఆవిష్కరించిడిన ఆవిష్కరణల గురించి బ్రిగేడియర్ గణేశం గారు వివరించేవారు. వాటిని ప్రదర్శించేవారు. ఎలా ఉప యోగించాలో చేసి చూపేవారు. నాట్లు వేయడం, విత్తనాలు విత్తనం సాధారణంగా వంగి చేస్తారు. ఆ అవసరం లేకుండా నిలబడి ఆ పనులను సునాయాసంగా చేసే ఆవిష్కరణలను ప్రయోగాత్మకంగా చూపించారు. కరంట్ స్తంభాలపైకి సునాయాసంగా ఎక్కే షూస్ ఇప్పుడు పలు ప్రాంతాల్లో వాడుతున్నారు. వాటి సహాయంతో నాలుగో తరగతి చదువుతున్న శ్రీకాంత్ గబ గబా కరెంటు స్తంభం పైకి ఎక్కాడు. కనీసం రోజుకు మూడుసార్లు బృంద సభ్యుల సమావేశంలో బ్రిగేడియర్ మాట్లాడిన తీరు వారి జ్ఞాన సంపదకు నిదర్శనం. వారి నిరాడంబరత,ఆత్మీయత అపురూపమైంది. ప్రపంచీకరణ వల్ల, కార్పొరేటీకరుణ వల్ల పల్లె ప్రజలకు జరుగుతున్న నష్టం పట్ల వారు వేసిన చెణుకులు ఆలోచనాత్మకమైనవి.


పల్లెసృజన కార్యక్రమంలో వాలంటీర్స్ గా పనిచేసిన నాగ మోహన్, ముని రాజు, అంజిరెడ్డి గారల గురించి స్థలాభావం చేత రాయలేక పోతున్నాను. ఒకరకంగా ఈ యాత్ర నా బాల్యాన్ని స్ఫురణకు తెచ్చింది. నా చిన్నప్పుడు ఎడ్లబండి సౌకర్యం వున్నా మేం పిల్లలం సరదాగా బంధువుల గ్రామాలకు కాలినడకనే పోయేవాళ్ళం. గ్రామాల్లో ఇప్పుడు అభివృద్ధి కనిపించింది. అంటే చాలావరకు డాబా యిళ్లు వున్నాయి. పెంకుటిళ్ళు, పాకలు చాలా తక్కువగా కనిపించాయి. కానీ గ్రామీణుల ఆత్మీయతలో లోటు ఏ మాత్రం లేదు. పంట పొలాలతో పాటు భూమి సారవంతం కొరకు సాగుచేస్తున్న జిలుగు సాగుతో పరిసరాలన్నీ పచ్చగా అందంగా వున్నాయి. చెట్ల మీది జామకాయలు, దోరగా పండిన చింతకాయ కోసుకొని తింటూ నడుస్తూ వుంటే అలసట అన్నదే తెలియలేదు. నాకు ఇదొక ప్రత్యేకమైన అనుభవం. భిన్నమైన ప్రయాణం.

Tags:    

Similar News