ఇక ఏ సీజన్‌లోనైనా సీతాఫలం! ఎలాగ అంటే?

మామూలుగా సీతాఫలాలు సెప్టెంబర్‌ నుండి నవంబరు వరకే దొరుకుతాయి. కొంత మహిళలు వైవిధ్యంగా ముందుడగు వేయడంతో అది ఆల్ సీజన్ పండు అయింది.

Update: 2024-11-20 06:08 GMT

బుట్టలు బుట్టలుగా పండ్లు. దారికిరువైపులా రాసుల్లా పోసి అమ్మే పండ్లు. వనవాసంలో సీతమ్మ ఆకలి తీర్చాయని చెప్పుకునే పండ్లు. సీతమ్మ పేరుతో పాపులర్‌ అయిన పండ్లు. అడవిలో పుట్టి, అక్కడే పండిన పండ్లు సీతాఫలాలు. అవే ఇపుడు వందలాది మహిళలకు ఆర్ధిక చేయూత నిస్తున్నాయి. అరుదైన తీయదనాన్ని ప్రపంచమంతా చాటుతున్నాయి.

 

మామూలుగా సీతాఫలాలు (Annona squamosa) సెప్టెంబర్‌ నుండి నవంబరు వరకు దొరుకుతాయి. కొన్ని మహిళా గ్రూప్‌లు వైవిధ్యంగా ముందుడగు వేయడంతో, ఇపుడు అన్ని సీజన్లలో సీతాఫలాలను దేశమంతా రుచి చూసే అవకాశం కలిగింది.

అదెలా అంటే...?

‘‘దాదాపు పది కిలో మీటర్లు గుట్టలు మీద అడవిలో సేకరించిన సీతాఫలాలను, ఏదో ఒక ధరకు అమ్మేసి నష్టపోయే వాళ్లం. ఒక్కో సారి బస్తా పండ్లుకు 30 రూపాయలు కూడా వచ్చేవి కాదు.. ఇలా కాదని, ఏడాది క్రితం రైతులమంతా కలిసి ‘నారాయణపేట ఫార్మర్స్‌ ప్రొడ్యూసర్స్‌ ఆర్గనైజేషన్‌’ గా ఏర్పడ్డాం. జిల్లాలోని 64 చిన్న సంఘాలు కలిపి 969 మంది సభ్యులున్నారు. ఇపుడు మేం సేకరించిన పండ్లకు గిట్టుబాటు ధరను ప్రభుత్వమే చెల్లిస్తోంది. మా గ్రామాల్లో కలెక్షన్‌ సెంటర్లు పెట్టి కొంటున్నారు. దూరప్రాంతాలకు మోసుకుంటూ పోయి అమ్ముకునే శ్రమ తప్పింది... గతంలో రోజుకు 100 నుండి 150 రూపాయలు కూడా వచ్చేది కాదు. ఇపుడు 200 నుండి 400 వరకు సంపాదిస్తున్నాం. దీనికి తోడు పండ్ల ను ప్రాసెస్‌ చేయడం వల్ల అదనపు ఆదాయం కూడా అందరం పంచుకుంటున్నాం ’’ అంటారు, నారాయణపేట ఫార్మర్స్‌ ప్రొడ్యూసర్స్‌ ఆర్గనైజేషన్‌ ఛైర్మన్‌ రేణుక.

 

ఆమె తన తోటి మహిళలతో సమీప అడవులకు వెళ్లి ఫలాలను సేకరించేది. తమ వద్ద వ్యాపారులు తక్కువ ధరకు కొనుగోలు చేసి, ఇతర ప్రాంతాల్లో ఎక్కువకు అమ్ముకోవడం వల్ల తమ శ్రమకు తగిన కూలీ గిట్టుబాటు కాని పరిస్థితిని గమనించింది. దీంతో అందరినీ కలుపుకొని, రైతు ఉత్పత్తిదారుల సంఘాలు ఏర్పాటు చేసింది. రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌) వారికి అండగా ఉండి వారి వద్దకే వచ్చి ఫలాలను తగిన ధర చెల్లించి కొంటున్నారు. వాటిని దామరగిద్దలో ప్రాసెసింగ్‌ యూనిట్‌కు తరలించి మరిన్ని లాభాలు పొందుతున్నారు.

 

పండ్ల నుండి పల్ప్‌ వరకు...

మహిళల నుండి గిట్టుబాటు ధరకు సీతాఫలాలను కొనటం, వాటిని ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ద్వారా విలువ ఆధారిత ఉత్పత్తులుగా మార్చడం సెర్ఫ్‌ సంస్ధ చేస్తుంది. మహిళలు సేకరించిన ఫలాలను వారి గ్రామాలలోనే రోజూ సెర్ఫ్‌ సంస్ధ సేకరిస్తోంది.వారానికి ఒక సారి వారికి ధర చెల్లిస్తోంది.

పండ్ల నాణ్యతను, సైజును బట్టి 3 గ్రేడ్‌లుగా విభజిస్తారు. ముద్దూరు, దామరగిద్ద లోని ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ కి తరలించి, రెండు రోజులు మాగబెట్టి పండ్లుగా మారాక పల్ప్‌ తయారీ పై శిక్షణ పొందిన పొదుపు సంఘాల మహిళలతో పండ్ల నుంచి తొక్కను, గుజ్జును వేరుచేస్తారు. గుజ్జులోంచి గింజలను వేరు చేస్తారు. ఆరు కిలోల పండ్ల నుండి కిలో గుజ్జు వస్తుంది. చేతితో తీసిన గుజ్జును కిలో 225, యంత్రాల ద్వారా తీసిన గుజ్జును కిలో 180కి విక్రయిస్తున్నారు.

 

అన్ని సీజన్లు సీతాఫలం

ప్రాసెసింగ్‌ సెంటర్‌లో తీసిన నాణ్యమైన గుజ్జుకు తగినంత చక్కెర కలిపి ప్యాకెట్లలో కిలో చొప్పున ప్యాక్‌ చేస్తారు. ప్యాకెట్‌ లోపల గాలి లేకుండా తీసివేసి... మైనస్‌ 22 డిగ్రీల సెల్సియస్‌ వద్ద శీతలీకరించడంతో, గుజ్జు ఘనపదార్ధంలా తయారవుతుంది. అవసరమైనపుడు నీటిలో వేస్తే మెత్తగా మారుతుంది. ఏడాది వరకు నిలువ ఉంటుంది.

ఈ పల్ప్‌ ఏడాదికి పైగా నిలువ ఉంటుంది. రుచి తాజాగా ఉంటుంది.

ఐస్‌క్రీమ్‌గా, జ్యూస్‌గా చేసుకొని తాగ వచ్చు.

 

వ్యర్దాలతో ఎరువు

‘‘ఆహార శుద్ధి కేంద్రంలో పండ్ల నుండి తీసేసిన తొక్క, చెడిపోయిన పళ్లను వర్మీకంపోస్ట్‌ ఎరువుల తయారీకి, విత్తనాలను భద్రపరచి విక్రయిస్తున్నారు. సీతాఫలం తొక్క, గుజ్జు, విత్తనం మూడిరటి ద్వారా మహిళలు ఆదాయం పొందుతున్నారు.’’ అని దామరగిద్ద యూనిట్‌ పని చేస్తున్న మహిళలు అన్నారు.

 

వందలాది మందికి ఉపాధి

ఈ సారి 300 మంది రైతుల నుంచి 17,506 కిలోల సీతాఫలాలు సేకరించారు. వాటి నుంచి 2,320 కిలోల గుజ్జును తయారు చేసి, హైదరాబాద్‌ లో ఐస్‌క్రీం తయారీ కంపెనీలకు విక్రయిస్తారు. రవాణా, కూలీలు, ఇతర ఖర్చులన్నీ పోను వచ్చిన లాభాలు మహిళా రైతు ఉత్పత్తిదారుల సంస్ధకు పంచుతారు.

సీతాఫలాల ప్రాసెసింగ్‌ ద్వారా 200 మంది స్వయం సహాయక సంఘాల మహిళలు, మరో 260 మంది కూలీలు ఉపాధి పొందారు. 64 సంఘాలకు చెందిన 960 మంది మహిళలకు గిట్టుబాటు ధరతో పాటు లాభాలను పంచుతారు.

సీతాఫల్‌ ఐస్‌ క్రీమ్‌. దేశమంతా హల్‌ చల్

‘‘ సహజంగా అడవుల్లో సేకరించిన పండ్లతో తయారు చేసిన ఐస్‌ క్రీమ్‌కి చాలా డిమాండ్‌: ఉంది. ఒక్క సారి రుచి చూసి, మళ్లీ కావాలని ఆర్డర్‌ చేస్తున్నారు. నారాయణ పేట సెర్ఫ్‌ ద్వారా కొని గత రెండేళ్లు గా ఐస్‌ క్రీమ్‌ తయారు చేస్తున్నాం. ఏడాదంతా సీతాఫలం తిన్నంత ఫీలింగ్‌ కలుగుతుందని వినియోగ దారులు అంటున్నారు. బయట దొరికే హైబ్రిడ్‌సీతా ఫలాల కంటే అడవిలో పండ్లు మధురంగా ఉంటాయి. ’’ అన్నారు, హైదరాబాద్‌కి చెందిన స్కూప్‌ ఐస్‌ క్రీమ్‌ కంపెనీ ప్రతినిధి రాజ్‌పాల్‌.

ఆహారశుద్ధి కేంద్రాల్లో తయారైన సీతాఫలాల పల్ప్‌ ను ఐస్‌ క్రీం మిల్క్‌ షెక్‌ తయారీకి ఉపయోగిస్తారు. సెర్ప్‌( Society for Elimination of Rural Poverty ) సంస్ధతో ముందుగానే అవగాహన ఒప్పందం చేసుకున్న ఐస్‌ క్రీం కంపెనీలకు నేరుగా విక్రయిస్తోంది.

తొలి ప్రధానికి ప్రియమైనవి...

‘‘పాలమూరు సీతాఫలాలకు దేశవ్యావ్తంగా డిమాండ్‌ ఉంది. ఢల్లీితో సహా దేశంలోని వివిధ ప్రాంతాలకు ఇప్పటికీ ఎగుమతి అవుతున్నాయి. ఒకపుడు 3కిలోల బరువున్న కాయలు కూడా కాసేవి. వాటిని విమానాల్లో పంపేవారు. తొలి ప్రధాని పండిట్‌ నెహ్రూ మొదలు అనేక మంది భారత ప్రధానులు, ప్రముఖులు ఇక్కడి సీతాఫలాల రుచిని చూశారని మా పూర్వీకులు అంటుండేవారు.’’ అంటారు స్ధానిక పండ్ల వ్యాపారులు..

Tags:    

Similar News