మధుర ఆలయాల అందం అంతా పేరుకేనా..!
తిరుపతి నుంచి మా ఢిల్లీ యాత్ర-6;
దక్షిణాది ఆలయాలంత గొప్పగా లేని మథుర ఆలయాలు. మేం చూడలేపోయిన ఫతేపూర్ సిక్రీ. దాబాలో సీతాపతి చపాతీలు. నవ్వుల పువ్వులు పూయించిన తాళాలు. మా ఢిల్లీ యాత్రలో కొన్ని పదనిసలు.
తాజ్ మహల్, ఆగ్రా కోట చూశాం. అప్పటికే శనివారం సాయంత్రం నాలుగున్నరైంది. అక్కడి నుంచి ఫతేపూర్ సిక్రీ వెళ్ళడానికి కనీసం గంటన్నర పడుతుంది. ఫతేపూర్ సిక్రీ లో నాలుగున్నరకే ప్రవేశాన్ని నిలిపివేస్తారని మా డ్రైవర్ కిషన్ చెప్పాడు. ఫతేపూర్ సిక్రీ చూడలేక పోయామని బాధ మాత్రం మా నలుగురిలో మిగిలిపోయింది.
ఎంత రాత్రి అయినా మథుర చూడవచ్చన్నాడు కిషన్. ఫతేపూర్ సిక్రీ పైన ఉన్న ఆసక్తి మథుర పైన పెద్దగా లేదు. అప్పుడే ఢిల్లీకి వెళ్ళి ఏం చేస్తాం, పడుకోడమే కదా! మథుర పోదామన్నారు వాకా ప్రసాద్. మా కారు మథుర వైపు పరుగులు తీస్తోంది. మథురకొచ్చేసరికి చీకటి పడబోతోంది. మథురలో 'పోత్రా కుండ్' అనే పురాతనమైన కోనేరు కనిపించింది. శ్రీ కృష్ణుడు జన్మించినప్పుడు దేవకీ వసుదేవులు ఈ పోత్రా కుండ్ లోనే బట్టలను ఉతికారని భక్తుల విశ్వాసం.
మథుర లో పోత్రా కుండ్ పురాతన కోనేరు
మథుర ఆలయంలోకి వెళ్ళాం. శ్రీ కృష్ణుడు జన్మించిన జైలుగా భక్తులు భావిస్తున్న చోట నిర్మించిన ఆలయాన్ని చూశాం. అక్కడి నుంచే ఆ ఆలయ ప్రాంగణాన్ని ఆనుకున్న మసీదును చూశాం. చాలా కాలంగా ఉన్న మథుర-మసీదు వివాదం కేంద్రంలో బీజేపీ అదికారంలోకి వచ్చాక మళ్ళీ ముదిరి కూర్చుంది. మథుర ఆలయ ప్రాంగణంలో చిన్న చిన్న ఆలయాలు చాలా ఉన్నాయి. అన్ని ఆలయాలను చూట్టానికి గంట పడుతుంది! దక్షిణాది ఆలయాలకు పూర్తి భిన్నమైన రీతిలో ఇక్కడి ఆలయాలను నిర్మించారు.
అక్కడి నుంచి బృందావనానికి వెళ్ళాలనుకున్నాం. కారులో బృందావనానికి వెళ్ళడం సాధ్యం కాదని, నలుగురం ఈ రిక్షాని ఎక్కాం. రోడ్డు బాగున్నప్పుడు ఈ రిక్షాలో వెళితే పరవాలేదు కానీ, రోడ్డు గతుకులుగా ఉన్నప్పుడు అదిరిపోతుంది. వారాంతం కావడంతో దారి పొడవునా ఇసుక వేస్తే రాలనంతగా యాత్రికులు. ఈ రిక్షా దిగి బృందావనం వేపు నడుచుకుంటూ వెళుతున్నాం.
దారిలో భజన చేసే తాళాలు అమ్ముతున్న వ్యక్తి మా వెంట పడ్డాడు. వందకు రెండిస్తానన్నాడు. వద్దన్నాం. వెంటపడ్డాడు. వందకు మూడిస్తానన్నాడు. వద్దన్నాం. వందకు నాలుగే కాదు, అయిదు ఇస్తానన్నాడు. అయినా వద్దన్నాం. తాళాలు మాకెందుకు? అతన్ని దాటి వచ్చేస్తుంటే, అతను చూసే జాలి చూపులకు బాధేసింది. యాత్రికుల వెంటపడి అమ్మితే కానీ అతనికి గడవదు. ‘‘పోతే పోయింది వంద రూపాయలు, పాపం అతని కోసమైనా మనం తాళాలు కొంటే బాగుండేది’’ అన్నారు వాకా ప్రసాద్. ‘‘నిజమే’’ అన్నాన్నేను. కానీ అప్పటికే వచ్చేశాం.
భజన చేసే తాళాలు
అతని దగ్గర తాళాలు కొన్నా బాగుండేదన్నారు వాకా ప్రసాద్. ఏం చేసుకుంటామన్నాను. ‘‘తిరుపతిలో జరిగే సాహిత్య సమావేశాల్లో ఒకరినొకరు పొగుడుకుంటున్నప్పుడు మనం తాళాలు మోగిస్తే సరిపోతుంది.’’ అన్నారు. ఆ మాటలకు నాతోపాటు, పరమేశ్వరరావు, హరీష్ కూడా నవ్వేశారు. వాకా కూడా నవ్వు ఆపుకోలేకపోయారు. ఇంతలో హరీష్ నెట్ లో తాళాల వీడియోని డౌన్ లోడ్ చేసి చూపించారు.
వందకు అయిదు జతల తాళాలు కొననందుకు అందరం బాధపడిపోయాం. మా అందరికంటే అది వాకా ప్రసాద్ ను ఎక్కువ బాధించింది. సోమవారం తిరుగు ప్రయాణ మవుతున్నప్పుడు వాకా ప్రసాద్ ఒక షాపులోకెళ్ళి కంచుతో తయారు చేసిన తాళాలు బేరం చేస్తున్నారు. తాళాల జత అయిదు వందలకు తక్కువ ఇవ్వనన్నాడు. బృందావనం దగ్గర వంద రూపాయలకు అయిదు జతల తాళాలిస్తానంటే వద్దని, అయిదు వందలకు ఒకే ఒక్క జత తాళాలు కొన్నారు. తిరుగు ప్రయాణంలో దారిపొడవునా ఆ తాళాలతో వినోదమే.
మా కారు ఢిల్లీ వైపు పరుగులు పెడుతోంది. రాత్రి తొమ్మిది దాటింది. ఆకలేస్తోంది. దారి పొడవునా దాబాలే. తినడానికి ఏ దాబాలోకి వెళదాం? అన్నాను. ఏ దాబాలో జనం ఎక్కువుంటారో, దాంట్లోకి వెళదాం అన్నారు పరమేశ్వర రావు. జనం ఎక్కువ ఉన్నారని, బాగుంటుందని శివ దాబాలోకెళ్ళి కూర్చున్నాం. మద్యాహ్నం హోటల్ లో రోటీ తిని నోరు చచ్చిపోయింది. ఆ హోటల్ మెనూలో ఇడ్లి, వడ కూడా ఉన్నాయి.
శివ దాబా లో పరమేశ్వర రావు, రాఘవ , వాకా ప్రసాద్, హరీష్
ఇడ్లీ వడ తెమ్మన్నాము. నలుగురికీ ఇడ్లీ వడ తెచ్చిపెట్టాడు. నిజానికి రోమ్ కెళితే రోమన్ లా ఉండాలి. కానీ, మేం అలా లేం. ఉత్తర భారత దేశానికి వచ్చినా, దక్షిణాది ఇడ్లీ, వడ, సాంబార్ అడిగాం. అతని తప్పు లేకుండా తెచ్చిచ్చాడు. ఇడ్లీలు సీతాపతి చపాతీల్లా ఉన్నాయి. వడ కూడా రాయిలా ఉంది.
‘‘అసలు సీతాపతి చపాతి అంటే ఏమిటి?’’ అడిగారు హరీష్, వాకా ప్రసాద్. ‘‘చాలాకాలం క్రితం నాటి మాట. ‘సీతాపతి సంసారం’ సినిమా లో సీతాపతిగా కి, అతని భార్యకు మధ్య పోటీ ఏర్పడుతుంది. నేను ఉద్యోగం చేయలేనా అని ఆమె అంటే, నేను వంట చేసి పిల్లల్ని సాకలేనా అంటాడు సీతాపతి. సీతాపతి చేసిన చపాతీలు గట్టిగా ఉంటాయి. తుంచినా తునగవు. విసుగెత్తి చెపాతీని విసిరి కొడతాడు. అది కాస్తా విష్ణు చక్రంలా తిరుగుతూ కూజాకున్న తలను తెగ్గొడుతుంది. దాంతో ‘సీతాపతి చపాతి’ పాపులర్ అయ్యింది.
ఇడ్లీవడ తినేశాక వాకా ప్రసాద్ వెయిటర్ ని పిలిచి ‘‘ఈ ఇడ్లీలు వారం క్రితానివా భయ్యా..?’’ అని అడిగారు. ‘‘వారం క్రితానివి కాదు సార్.. పదిహేను రోజుల క్రితానివి’’ అని సీరయస్ గా చెప్పేసి వెళ్ళిపోయాడు. ఆకలి మీద తినేశాం కానీ, వాంతికొచ్చినంత పనైంది. ‘‘అలా బాధపడితే ఎలా? అమెరికాలో ఇది మామూలే’’ అన్నారెవరో! కాసేపు నవ్వుకున్నాం.
మళ్ళీ మా కారు ఢిల్లీ వైపు పరుగులు తీస్తోంది. రాత్రి పది దాటినా హైవేలో ఎంత ట్రాఫిక్! ఆ ట్రాఫిక్ లో ఢిల్లీ వెళ్ళే సరికి రాత్రి పదకొండు దాటింది. ఢిల్లీ శివార్లలోని బహదూర్ గఢ్ లో ఒక హోటల్ లో మా బస. మాకు బస ఏర్పాటుచేసిన చంద్ర ఓబుల్ రెడ్డి మమ్మల్ని కలవడానికి వచ్చారు. ముప్ఫై ఏళ్ళ క్రితం ఢిల్లీలో స్థిరపడిన చంద్రఓబుల్ రెడ్డి, కిజికా కల్పలత దంపతులు వాకా ప్రసాద్ కు పాలిటెక్నిక్ లో సహ విద్యార్థులు. ఆళ్ళగడ్డకు చెందిన చంద్రఓబుల్ రెడ్డి ఒక కంపెనీలో జనరల్ మేనేజర్ గా చేస్తున్నారు. చిత్తూరుకు చెందిన కిజియా కల్పలత ఒక స్కూల్లో టీచర్ గా చేస్తున్నారు. వారిది ఒక సినిమా కథను తలపించే మతాంతర ప్రేమ వివాహం. వాళ్ళ గురించి చాలా ఆసక్తికర విషయాలు మరొక భాగంలో ముచ్చటించుకుందాం.
శుక్రవారం పగలు, రాత్రి ప్రయాణం, శనివారమంతా ఆగ్రా, మథురలో తిరుగాడుతో అలసిపోయాం. మర్నాడు ఆదివారం ఉగాది. న్యూఢిల్లీలోని గాలిబ్ హాల్ లో మానవ హక్కుల జాతీయ సదస్సుకు హాజరవ్వాలి. ఆవులింతలొచ్చేస్తున్నాయి. పడుకోగానే నిద్రలోకి జారిపోయాం. పొద్దున్నే లేచి తయారవగానే అదే హోటల్ లో కాంప్లిమెంటరీ టిఫిన్. వేడి వేడి పూరీలు, బటాణీలు, పన్నీర్ వేసిన కర్రి, పరోటాలు, ఆమ్లెట్ ఎంత బాగున్నాయో! గతానుభవాలతో ఇడ్లీ, వడ, దోశ ఊహించవలదు!
చంద్ర ఓబుల్ రెడ్డి, కిజియా కల్పల త ఇంట్లో ఉండేది వారిద్దరే. వారికి చెరొక కారు ఉంది. డ్రైవర్ సహా ఒక కారును మా కోసం కేటాయించారు. ఫోన్ లో మాటి మాటికీ చంద్ర ఓబుల్ రెడ్డి మా ఆనుపానులు తెలుసుకుంటూనే ఉన్నారు. చంద్ర ఓబుల్ రెడ్డి ఎప్పుడు ఫోన్ చేసినా హిందీలో మాట్లాడుతున్నారు. ‘‘ఏయ్ రెడ్డి.. మేమిక్కడ ఉన్నంత సేపూ తెలుగులోనే మాట్లాడు.’’ అన్నారు వాకా ఆదేశిస్తూ. ‘‘ఓకే ఒకే’’ అన్నారు చంద్ర ఓబుల్ రెడ్డి.
పాపం చంద్ర ఓబుల్ రెడ్డి తెలుగు ప్రాంతానికి ముప్ఫై ఏళ్ళుగా దూరంగా ఉంటూ, హిందీకి అలవాటుపడిపోయారు. వారి ఆఫీసులో హిందీలోనే, భార్యతోనూ హిందీ లోనే, కొడుకు కోడలితోనూ హిందీలోనే. తెలుగులో తేలిగ్గా మాట్లాడలేకపోతున్నారు. కారు రాగానే ఢిల్లీ నగరంలోకి బయలు దేరాం. బహదూర్ గఢ్ నుంచి రైతులు ఆందోళన చేసిన టిక్రీ బార్డర్ చాలా దగ్గర. రాజధాని నగరంలోకి వెళ్ళే రోడ్డు చాలా దారుణంగా ఉంది. రోడ్డంతా దుమ్ము, ధూళి రేగుతోంది.
ఢిల్లీ నగరాన్ని వీక్షిస్తూ గాలిబ్ ఇనిస్టిట్యూట్ హాల్ వద్దకు వచ్చేసరికి పదగొండు గంటలైంది. అప్పటికే ప్రతినిధుల సదస్సు మొదలైపోయింది. మధ్యాహ్నం భోజనాల తరువాత జాతీయ మానవహక్కుల సదస్సు ప్రారంభమైంది. సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తులు జస్టిస్ శ్రీ కృష్ణ, జస్టిస్ ఏ.కె.పట్నాయక్ వంటి వారే కాకుండా, ప్రశాంత్ భూషణ్ వంటి సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాదులు, పరంజయ గుహ వంటి సీనియర్ జర్నలిస్టుల ప్రసంగాలు చాలా బాగున్నాయి. అవి ఇప్పటికే ఫెడరల్ తెలంగాణా లో వచ్చాయి.
జాతీయ మానవ హక్కుల సదస్సు లో తిరుపతి ప్రతినిధులు.
ఢిల్లీ బీబీసీ తెలుగు విభాగంలో పనిచేస్తున్న నిమ్మగడ్డ శ్రీనివాస్ సదస్సు పూర్తయ్యే సమయానికి వచ్చి మమ్మల్ని కలిశారు. వార్త లో నా సహ ఉద్యోగి శ్రీనివాస్ దాదాపు రెండేళ్ళుగా ఢిల్లీ నివాసులైపోయారు. అక్కడి జీవితానికి సంబంధించిన అనేక విషయాలు మామధ్య చర్చకు వచ్చాయి.
ఢిల్లీలో జీవితం ఎలా ఉంటుంది? అక్కడి వాతావరణ ఎలా ఉంటుంది?ధరలు, మానవ సంబంధాలు ఎలా ఉన్నాయి? అన్నిటినీ తరువాయి భాగంలో చర్చిం చు కుం దామా!
(ఇంకా ఉంది)