'జ్వాలాశిఖ విశ్వమోహన్' పుస్తకావిష్కరణ సభ !

‘జ్వాలాశిఖ విశ్వమోహన్’ ఎవరో తెలుసా?;

Update: 2025-04-10 14:05 GMT

-జనసాహితి, విజయవాడ


ఆవగింజంత కృషికి తాటికాయంత ప్రచారం చేసుకునే రోజులలో సుమారు 20 దాకా నవలలు రాసి , తానొక రచయితనని ప్రచారం చేసుకోవడం పట్ల ఏమాత్రం ఆసక్తి లేని వ్యక్తి ఆయన. ఆ వ్యక్తికి కీర్తి ప్రతిష్టలతో పాటు, ధనార్ధన చేయటానికి సినిమా రంగంలో అవకాశం వచ్చినా అంగీకరించలేదు. అతనికి బడుగు జీవులతో కలిసిమెలిసి జీవించడమే ప్రాణ సమాన కార్యకలాపం. అలాంటి వ్యక్తి ప్రజా ఉద్యమకారుడు కూడా అయితే, అందుకు అతను పొందిన పురస్కారం 'ఎన్కౌంటర్ హత్య'!
అవును సరిగా పాతిక సంవత్సరాల క్రితం మన గుంటూరు జిల్లాలోనే అలా జరిగింది. ఆయనే కొమ్మిరెడ్డి విశ్వమోహన రెడ్డి!! విశ్వమోహన్ చివరి ఎనిమిది సంవత్సరాలు జనసాహితి సభ్యుడు కూడా.

తన తొలి రచనా కాలంలో పుంఖాను పుంఖాలుగా డిటెక్టివ్ నవలలు రాశాడు. "ఈ సమాజంలో జరిగే కుళ్లూ కుతంత్రాలు, మాయలు మోసాలు , వాటిని ఎదిరించే వారిని గురించి కూడా తెలపాలి! ఎట్టి వాస్తవ రహిత, ఆధార రహిత అభూత కల్పనలూ నేను రాయబోనని నా పాఠకులకు తెలుపుకుంటున్నాను" అనే నిర్ణయానికి తన 30 ఏళ్ల వయసులో 1980 నాటికి వచ్చాడు. చివరి కంటా అందుకు కట్టుబడి నిలబడ్డాడు.

సాహసోపేత జీవితాన్ని గడిపిన రచయితగా విశ్వ మోహన్ని జాక్ లండన్ తోనూ, అత్యంత వేగంగా రాసే అలవాటుకి ఆoటన్ చెకోవుతోను, ఆయన కార్యకలాపాలను రాబిన్ హుడ్ తోను పోల్చిన వారున్నారు.

మధ్యతరగతి మర్యాదస్తులు ఎరగని జీవితపు ఎగుడు దిగుడులను ఎన్నో చవిచూసిన విశ్వమోహన్ తాను గమనిoచిన జీవితపు బహుముఖ కోణాలను, కఠినాతి కఠిన చేదు తీపి అనుభవాలను నవలా సాహిత్యంగా అక్షరబద్ధం చేశాడు.



ఆయన 'మానవ హోమం' నవల 'భోగిమంటలు' సినిమాగా విడుదలైంది. ఇంకా 'క్షణికం' 'బొంగరం' 'ప్రేమ' 'దొంగలు' 'జైలు' 'దాడి' 'రిగ్గింగ్' తదితర పేర్లతో నవలలను రాశాడు. జైళ్ళల్లో ఖైదీల పట్ల పోలీసు అధికారుల ప్రవర్తనల తీరు రూపంలో కొనసాగుతున్న వలస పాలనా వ్యవస్థ లక్షణాలను పాఠకుల కళ్ళకు కట్టించాడు. తన వైవాహిక జీవితాన్ని కూడా అశ్రుతర్పణం అనే నవలగా ఆయన రాశాడు.


పుస్తకావిష్కరణ కార్యక్రమం

11 ఏప్రిల్ 2025 సాయంత్రం 5 గం!!

సీనియర్ సిటిజన్స్ సేవా కేంద్రం

5వ లైన్, బృందావన్ గార్డెన్స్, గుంటూరు


కడప జిల్లాలో ధనిక రైతు స్థాయి కుటుంబంలో పుట్టిన విశ్వమోహన రెడ్డి జీవితానుభవాలు చాలా ప్రత్యేకమైనవి. హోటల్ నడిపాడు, సినిమాలు తీసే ప్రయత్నం చేశాడు. పాలేరుగా మారాడు. రిక్షా తొక్కి, కార్మిక సంఘం నిర్మించాడు. అప్పటికి అతను విశ్వసించిన పార్టీ నిర్ణయంపై ప్రభుత్వ బ్యాంకును కొల్లగొట్టాలని చూసాడు. పోలీసు చిత్రహింసలను భరించాడు. వైద్యం చేశాడు. పత్రికలు నడిపాడు. నాటకాలు ఆడాడు , ఆడించాడు. కడప జిల్లాను వదిలిన తర్వాత 1980వ దశకంలో అద్దంకి, ఇంకొల్లు ప్రాంతం నుండి నరసరావుపేట మీదుగా పిడుగురాళ్లకు చేరుకున్నాడు. అతివాద రాజకీయాలను వదిలి ప్రజా ఉద్యమ కార్యకలాపాలలోకి నడిచి పిడుగురాళ్లలో సున్నపురాయి కార్మికులను సంఘటిత పరిచాడు. రైతు కూలీ సంఘాలు నిర్మించాడు. రాజుపాలెం నుండి త్రిపురాంతకం దాకా రైతు కూలీలను ఉద్యమoగా ఉవ్వెత్తున కదిలించాడు. పిడుగురాళ్ల దగ్గర కార్మిలకు ఇళ్ల స్థలాలు వేయించి 'లెనిన్ నగర్' నూ, కొండమోడులో నిరుపేదలకు 'తరిమెల నాగిరెడ్డి నగర్' నూ నిర్మించాడు. అనేకసార్లు హత్యా ప్రయత్నాల నుండి తప్పుకున్నాడు. తననే ఒక హత్యా నేరం కింద అరెస్టు చేస్తే పోలీసు పహరాలను ఛేదించుకుని పారిపోయాడు. బడా కుబేర బందిపోటులను, ప్రజాస్వామ్యం పేర సాగిస్తున్న దొంగ ఎన్నికలను తమవిగా స్వీకరించి తోడ్పడగలిగిన రాజ్యం, విశ్వ మోహన్ రెడ్డిని సహించ లేకపోయింది. నూరేళ్ల క్రితం కోటప్పకొండ వీరుడు చిన్నపరెడ్డిని బ్రిటిష్ ప్రభుత్వం ఉరితీసినట్లు, కనీస విచారణ కూడా లేకుండానే ఒక కట్టుకథల ఎన్కౌంటర్ తో నేటి పాలకులు ఆయన్ని హత్య చేశారు. విశ్వ మోహన్ మరణం పై అమెరికాలో జీవించే కొందరు తెలుగువారు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆనాడు నేరుగా ప్రశ్నించారు. ప్రజల కోసం నిస్వార్ధంగా అంకితభావంతో కృషి చేసే వారిని తిన్నగా బతకనివ్వకపోవడం దోపిడీ పీడనల రాజ్యం లక్షణంగా ఉంది.
అతని మరణ వార్తను కొన్ని పత్రికలు 'కరడుగట్టిన విప్లవవాదిగా, చేయి తిరిగిన సాహితీవేత్తగా' ప్రకటించాయి.
ఉద్యమకారుడుగా ప్రజల హృదయాలలోనూ, సాహిత్యకారునిగా పాఠకుల మనసులలోను జీవిస్తున్న కామ్రేడ్ విశ్వ మోహన రెడ్డిని, ఆయన నిబద్ధ ఆశయ స్ఫూర్తిని నూతనతరాలకు అందిద్దాం!


Tags:    

Similar News