తిరుపతి నుంచి మా ఢిల్లీ యాత్ర-2

కేరళ ఎక్స్ ప్రెస్: రేపటిని కలగంటున్న టీనేజర్లు;

Update: 2025-04-05 05:56 GMT

మా రైలు వేగంగా దూసుకు పోతోంది..! తాగినట్టు ఊగిపోతోంది..! రాష్ట్రాలను దాటిపోతోంది..ఎక్కే వాళ్ళు, దిగే వాళ్ళు.. భిన్న ప్రాంతాలు, భిన్న స్వరాలు. బతుకులో రాజీ పడే మధ్యతరగతి జీవులు. భవిష్యత్తును కలగంటూ, ఆత్మాభిమానాన్ని ప్రకటించే టీనేజర్లు!

కేరళా ఎక్స్ ప్రెస్ విజయవాడ రైల్వే స్టేషన్ లోకొచ్చి ఆగింది. ఎంతో పరిచయం ఉన్న మనుషుల్లా మనసు విప్పి మాట్లాడిన ఆర్మీలో పనిచేసి రిటైరైన జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్, అతని కూతురు విజయవాడలో దిగేశారు. ఆ స్థానంలో మా ఎదురుగా మరో వ్యక్తి వచ్చి కూర్చున్నాడు.

‘‘ఎక్కడి నుంచి వస్తున్నారు? ఏం చేస్తుంటారు?’’ అంటూ వాకా ప్రసాద్ అతనితో మాటలు కలిపారు. ‘‘జర్నలిస్ట్ ని’’ అన్నాడతను. ‘‘ఓహ్.. మీ ఫీల్డే’’ అన్నారు పరమేశ్వరరావు నా కేసి చూస్తూ. నా కేసి నవ్వారు హరీష్. ‘‘మీ పేరేంటి?’’ అడిగాను మా ఎదురుగా కూర్చున్న వ్యక్తిని. ‘‘సుధాకర్ రావు’’ అని చెప్పాడు. ‘‘మేం కూడా తిరుపతి నుంచే వస్తున్నాం. నాకు సీట్ కన్ఫర్మ్ కాలేదు. మా అమ్మకు మాత్రం కన్ఫర్మ్ అయ్యింది. టీసీకి ఏదో ఇచ్చి సీటు సంపాదించాను లెండి’’ అన్నాడు విజయగర్వంతో సుధాకర్ రావు.

‘‘ఏ పత్రికలో చేస్తుంటారు’’ అడిగాను.‘‘రామగుండం స్ట్రింగర్ గా నమస్తే తెలంగాణాలో చేస్తుంటాను. దీనిపైనే బతకలేం కదా ! వ్యాపారం కూడా చేస్తుంటాను’’ అన్నాడు. నన్ను కూడా అడిగాడు. పదకొండేళ్ళ క్రితం పత్రికల నుంచి రిటైరయ్యానని చెప్పాను. ‘‘ఇప్పుడెలా ఉంది పత్రికల్లో జీవితం?’’ అడిగాను. ‘‘ఆ.. మీకు తెలియందేముంది! జర్నలిజంలో విలువలు పడిపోయాయి. మీరు పనిచేస్తున్నప్పుడు ఇంత దారుణంగా లేదనుకుంటా!’’ అన్నాడు సుధాకర్ రావు. నిజమేనన్నట్టు తల ఊపాను.

తాగినవాడిలా ఊగుతూ..

రైలు వేగం పుంజుకుంది. పరుగులు తీస్తోంది. కనీసం వెళ్ళేటప్పుడైనా, సాధ్యమైనంత మటుకు రైల్లో దొరికే తిండి తినకూడదని, ఇంటి దగ్గరే పులిహోర చేయించి తీసుకొచ్చాను. చేతులు కడుక్కుందామని షింక్ దగ్గరకు వెళ్ళానో లేదో, తలుపు దగ్గరకు వచ్చేసరికి ఊగుతున్నాను. బ్యాలెన్స్ తప్పుతోంది. నా పైన నాకే అనుమానం వచ్చింది. ‘నేను తాగలేదు కదా! ఈ ఊగుడేంటి!? అసలు తాగనే తాగను కదా! ఈ ఊగుడేంటి!?’ అనుకుంటూ తలుపును పట్టుకుని తమాయించుకున్నాను. ‘నేను ఊగడం కాదు రైలే ఊగుతోంది. రైలు బాగా తాగినదానిలా ఊగుతోంది.’

నలుగురం పులిహోర తిన్నాం, చివరికి పెరుగు వేసుకుని. ‘‘బహుత్ అచ్చాహై’’ అన్నారు పరమేశ్వరరావు. ‘‘యస్ సార్’’ అన్నారు హరీష్. వాకా తలూపారు. పరమేశ్వరరావు చిరుతిళ్ళు తీయబోతే పొట్టలో ఇక చోటులేదన్నాం. ‘‘రామగుండం ఎలా ఉంటుంది?’’ అడిగాను సుధాకర్ రావును. ‘‘ఎండలు ఎక్కువే. యాభై డిగ్రీలు మామూలే. యాభై రెండుకు కూడా వెళ్ళిపోతుంది.’’ అన్నాడు. ‘‘అయితే రామగుండం అగ్నిగుండమే అన్నమాట’’ అన్నాను. సుధాకర్ రావు రామ‘గుండం’లోనే దిగిపోయారు.

ఆంధ్రభూమికి స్టాఫ్ రిపోర్టర్ గా నేను ఏలూరులో పనిచేస్తున్న రోజులవి. అది 1994 ప్రాంతం. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని ప్రాంతానికి వచ్చేసరికి పాత విషయాలన్నీ కళ్ళ ముందు కదలాడాయి. సింగరేణి కాలరీస్ ఎండిగా చేస్తున్న ఐఏఎస్ అధికారి విలియమ్స్ వచ్చి, ఏలూరులో నిర్వహించిన ఒకసదస్సులో మాట్లాడుతున్నారు. ‘‘మన కసలు బొగ్గు కొరతే లేదు. బొగ్గును కోటాప్రకారం పరిశ్రమలకు ఇస్తాం. సిరామిక్ వంటి పరిశ్రమలకు బొగ్గు చాలా అవసరం. అగరత్తుల వంటి పరిశ్రమలకు చాలా తక్కువ అవసరం. కొందరు ఎక్కువ కోటా తీసుకుని, బ్లాక్ లో అమ్ముకుంటారు. బ్లాక్ లో అమ్మడమే సమస్య తప్ప, అసలు బొగ్గు కొరతే లేదు’’ అన్నారు.

విలియమ్స్ ఎండిగా ఉన్నంత కాలం సింగరేణి కాలరీస్ లో కార్మికుల సమ్మె జరగ లేదు. ఎందుకంటే, ఆయన రాగానే కార్మికులతో మాట్లాడి, తన పరిధిలో ఉన్న వారి ప్రాథమిక సమస్యలు పరిష్కరించేశారు. వారి కోరికల్లో ప్రధానమైనవి భద్రతకు సంబంధించినవే.

అన్నట్టు చెప్పటం మర్చిపోయా. నాకూ వాకా ప్రసాద్ కు బీ2లో సీట్లు దొరికితే, పరమేశ్వరరావు, హరీష్ లకు బీ3లో సీట్లు దొరికాయి. బోగీ లోపలి నుంచే కనుక, బోర్ కొట్టినప్పుడల్లా వాళ్ళిద్దరూ మా దగ్గరకు వస్తున్నారు. ‘‘మా బోగీలో స్కూల్ పిల్లలు ఉన్నారు. వాళ్ళతో భలే సరదాగా ఉంది’’ అన్నారు పరమేశ్వరరావు నవ్వుతూ. పరమేశ్వరరావు కూడా చాలా సరదా మనిషి. ఎప్పుడూ నవ్వుతూ ఉంటారు. మనం కూడా వెళ్ళి చూసొద్దామని బీ3కి వెళ్ళాం నేను, వాకా.

రైల్లో నవోదయ పాఠశాల విద్యార్థినులు

సైడ్ లోయర్ బెర్త్ లో అయిదారుగురు మగ పిల్లలు వరుసగా కూర్చుని, అంతా కలిపి ఒకే దుప్పటి కప్పుకున్నారు. అలా కూర్చుంటే ఎంత ముచ్చటగా ఉందో ! అలా కూర్చుని ఎన్ని కబుర్లు చెప్పుకుంటున్నారో! ఎన్ని రహస్యాలు విప్పు కుంటున్నారో! అంతా టీనేజర్లు. పెద్దగా అల్లరి చేయడం లేదు. దాని పక్కబేలో అదే వయసున్న ఆడపిల్లలు ఎనిమిది మంది అలాగే కూర్చుని, కొందరు నిలుచుని అరుపులు, నవ్వులు, పాటలు, తుళ్ళింతలతో రైలు ప్రయాణ జీవితాన్ని ఆనందిస్తున్నారు, అనుభవిస్తున్నారు. పరమేశ్వరరావుకు హిందీ బాగా వచ్చు. వాకాకు పరవాలేదు. హిందీ అంత బాగా రాకపోయినా వచ్చీరాని హిందీతో నేను వ్యవహారం నడిపంచగలుగుతున్నాను.

ఉత్తరప్రదేశ్, హర్యానాకు చెందిన ఈ పిల్లలంతా నవోదయపాఠశాల విద్యార్థులు. ఉత్తర భారత దేశానికి చెందిన నవోదయ విద్యార్థులు దక్షిణ భారతదేశంలో, దక్షిణ భారత దేశంలో విద్యార్థులు ఉత్తర భారతదేశంలో ఒక ఏడాది పాటు చదువుకోవాలి. ఈ 23 మంది పిల్లలు త్రివేండ్రంలోని నవోదయలో 9వ తరగతి పూర్తి చేసుకుని తిరిగి వెళ్ళిపోతున్నారు. ఏడాది తర్వాత స్వంత ప్రాంతాలకు వెళుతుంటే వారిలో ఎంత ఆనందం ! ఒక్క ఏడాదిలో మళయాళం కూడా నేర్చేసుకున్నారు.

పరమేశ్వరరావు మా ఇద్దరినీ వాళ్ళకు పరిచయం చేశారు. నన్ను జర్నలిస్టని పరిచయం చేసే సరికి వాళ్ళలో ఆసక్తి పెరిగింది. ట్రెక్కర్ అని చెప్పేసరికి మరింత ఆసక్తి పెరిగింది. పరమేశ్వరరావు నా దూకుడు వీడియోలు చూపించే సరికి, కళ్ళు పెద్దవి చేసి ‘వావ్.. వావ్.. ’ అని అరిచారు. ఒక్కొక్కరూ తమని తాము పరిచయం చేసుకుని, ఎన్ని ప్రశ్నలు వేశారో! నన్ను తెలుగులో ఒకటి, రెండ్లు చెప్పమన్నారు. నేను తెలుగు అంకెలు చెపుతుంటే, మళయాళంలో ఉన్న అంకెలను వాళ్ళు కూడా చెప్పడం మొదలు పెట్టారు నవ్వుతూ. రెండు భాషల అంకెలు దాదాపు ఒకే రకంగా ఉంటాయని వాళ్ళకు తెలిసినట్టు అప్పటివరకు నాకు తెలియదు సుమా.

మా నాన్న రైతు అంటూ గర్వంగా ప్రకటించిన విద్యార్థిని

వాళ్ళలో సన్నగా, తెల్లగా, కాస్త పొడుగ్గా ఉన్న ఒక అమ్మాయి తెల్లటి టవల్ ని తలపాగాలా చుట్టుకుని వివేకానందుడిలాగా చేతులు కట్టుకుని నిలుచుంది. కాసేపు కాదు, మేం అక్కడ ఉన్నంత సేపూ తలపాగా తీయలేదు. రైల్లో ప్రయాణం చేస్తున్నంత సేపూ తల పాగా అలాగే చుట్టుకుందట! ‘‘ఏ కైకో రఖ్ఖా’’ అని అడిగాను. ‘‘మేరా బాపూ ఖేతీకా కామ్ కరతాహై’’ అంది. ఆ మాట ఎంత గర్వంగా చెప్పిందో! తండ్రి వ్యవసాయం చేస్తున్నాడంటే అంత గౌరవం ఆమెకు! మా నాన్న దేశానికి తిండి పెట్టేవాడు అన్నట్టుగా సగర్వంగా ఉన్నాయి ఆ అమ్మాయి మాటలు. ఆ మాటలు వింటుంటే చాలా ముచ్చటేసింది.

తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తున్నారని చెప్పుకోవడానికి మన దగ్గర పిల్లల్లో చాలా మంది సిగ్గుపడతారు. మానాన్న ‘బిజినెస్’ అని చెపుతారు. ‘‘ఏం బిజినెస్’’ అంటే ఏం చెప్పాలో తెలియక, ‘‘మనీ బిజినెస్’’ అనేస్తారు. కొందరు ‘రియల్ ఎస్టేట్’ అని చెపుతారు. మనీ బిజినెస్ అంటే మొదట్లో నాకూ అర్థమై చచ్చేది కాదు. తరువాత అర్థమైంది వడ్డీవ్యాపరమని. మన బ్యాంకులు చేసేది కూడా అదే కదా! బ్యాంకులు ఆర్గనైజ్ డ్ పాన్ బ్రోకర్లేగా!

జలగల్లా వడ్డీలు వసూలు చేస్తే గౌరవం! దేశానికి తిండి పెట్టడానికి నేలదున్నే రైతంటే అగౌరవం! రైతుల నుంచి వ్యవసాయ భూముల్ని కారు చౌకగా కొనేసి, లేదా కొట్టేసి ప్లాట్లు వేసి అమ్మేస్తే గౌరవం! వ్యవ‘సాయం’ చేస్తే అగౌరవం! వ్యవసాయం అని చెప్పుకోవడానికి కూడా సిగ్గు పడతారు. అంత దారుణంగా ఉంది మన రైతుల పరిస్థితి. తల పాగా చుట్టుకుని ‘మా నాన్న రైతు’ అని ఆ అమ్మాయి గర్వంగా చెప్పింది చూశారూ, అదీ ఆత్మాభిమానం అంటే. ఆ అమ్మాయిది హర్యానా. రేపు పొద్దున వారంతా మాతో పాటే ఆగ్రాలో దిగేస్తారు.

నవోదయ పిల్లలు మొత్తం 23 మంది. వారిలో అమ్మాయిలు ఎనిమిది మంది, అబ్బాయిలు పదిహేను మంది. వారికి ఎస్కార్ట్ గా ఇద్దరు టీచర్లు వచ్చారు. నేను, వాకా ప్రసాద్ మా సీట్లలోకి వచ్చేశాం. మాతో పాటు పరమేశ్వరరావు, హరీష్ మళ్ళీ మా సీట్ల దగ్గరకు వచ్చి కూర్చున్నారు. పొద్దున తెచ్చిన పులిహోరే రాత్రికి కూడా తినేశాం. యువ రాజు కత్తి దూసినట్టు, మాట్లాడితే పరమేశ్వరరావు తన బ్యాగ్ లోంచి చిరుతిళ్ళు బైటికి లాగుతారు. వద్దంటే మళ్ళీ లోపల దోపేస్తారు.

భోజనం చేసి పరమేశ్వరరావు, హరీష్ తమతమ సీట్లలోకి వెళ్ళిపోయారు. పడుకోబోయే ముందు మళ్ళీ మా దగ్గరకొచ్చారు. ‘‘మీరు వెళ్ళిపోయాక ఏం జరిగిందంటే !’’ అంటూ పరమేశ్వరరావు చెప్పడం మొదలు పెట్టారు. ‘‘వాళ్ళలో ఒక అబ్బాయి మొదటి నుంచి ఒక అమ్మాయి వెంటపడుతున్నాడట. ఏదో కామెంట్ చేశాట్ట. అంతే.. అమ్మాయిలంతా కలిసి ఆ అబ్బాయి పైకి దూసుకుపోయారు. కొట్టటం ఒక్కటే తక్కువ. ‘జాగ్రత్త’ అంటూ హెచ్చరించారు.’’

అమ్మాయిల్లో ఎంత ఐక్యత! ఒకరికి సమస్య వస్తే అంతా ఏకమయ్యారు. అమ్మాయిలే కాదు, అబ్బాయిలు కూడా టీనేజర్లే. ఆ వయసులో పరస్పర ఆకర్షణ సహజం. కానీ, హద్దులు మీరితేనే సమస్య. సమస్య వచ్చినప్పుడు ఆడ పిల్లలంతా ఏకమయ్యారు చూశారు, అదీ చైతన్యం అంటే. వాళ్ళలో నల్లగా, కాస్త పొట్టిగా ఉన్న అమ్మాయి చాలా చురుగ్గా ఉంటుంది. ఆ అమ్మాయే దీన్ని లీడ్ చేసింది. ఎక్కువ మంది ఉన్నా మగపిల్లలు కిమ్మనలేదు, ఆ అబ్బాయిలో తప్పుంది కనుక.

ఆ చీకట్లో మా రైలు దూసుకుపోతోంది. మహారాష్ట్రలోకి ప్రవేశించాం. ఇంకా ఎవరెరితో మాటా మంతీ జరిపా మో, ఏమ్ చూశా మో !?

(ఇంకా ఉంది)

Tags:    

Similar News