దారిపొడవునా పద్మవ్యూహాలు, దాటలేని వైతరిణిలు

కుమారధార-శక్తికటారి మధ్య మా సాహస యాత్ర నాలుగు సార్లు (2022 అక్టోబర్ 18న, 2023 జులై 31, నవంబర్ 7, 2024 ఏప్రిల్ 8) ఉత్కంఠభరితంగా సాగింది.

Update: 2024-09-29 10:30 GMT

ఎన్ని నీటి గుండాలు..!ఎన్ని జలపాతాలు..! ఎన్ని సెల ఏటి సొదలు..! ఎన్ని ప్రవాహపు రొదలు..! నీటి ప్రవాహంతో పాచిపట్టిన ఎన్ని జారుడుబండలు..! ఎన్ని పద్మవ్యూహాలను ఛేదించిన సాహసాలు! దాటలేని ఎన్ని వైతరిణీ నదులు! కుమార ధార శక్తి కటారి తీర్థాల మధ్య రెండు ఎత్తైన కొండల నడుమ ఎన్ని వింతలు, ఎన్ని విడ్డూరాలు, ఎన్ని అందాలు!

కుమారధార-శక్తికటారి మధ్య మా సాహస యాత్ర నాలుగు సార్లు (2022 అక్టోబర్ 18న, 2023 జులై 31, నవంబర్ 7, 2024 ఏప్రిల్ 8) ఉత్కంఠభరితంగా సాగింది. ఆదివారం వచ్చిందంటే చాలు అడవి అందాలను మూటగట్టుకుని రావలసిందే. తెల్లవారుజామునే తిరుపతిలో బయలుదేరి తిరుమలకు చేరుకున్నాం. ఆకాశమంతా మబ్బులు కమ్మాయి. సన్నని చినుకు, వర్షం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. తిరుమలలో వేదపాఠశాలకు దారిలో ప్రయాణం మొదలైంది.

తెల్లవారుజామున అడవి జంతువులు కనిపిస్తాయి. ముందు వెళ్ళే వాహనానికి మాత్రమే అవి అగుపడతాయి. తరువాత వచ్చే వాహనాల శబ్దానికి అవి పారిపోతాయి. ముందు వెళ్ళే మధు వాహనం వెనుక కూర్చున్నాను. మా వాహనాల ముందూ అడవి కోళ్ళ గుంపు ఒక్కసారిగా ఎగిరి చెట్ల లోకి వెళ్ళిపోయాయి. ఒక నెమలి కూడా అలాగేపారిపోయింది. తిరిగి వెళ్ళేటప్పుడు రెండు నెమళ్ళు ఇక్కడే మేత మేస్తూ కనిపించాయి. నెమళ్ళు కనిపిస్తే ట్రెక్కర్లు కాకుండా మరొకరు మరొకరు ఒదిలిపెడతారా!?

మా వాహనాలకు ఒక అడవి పంది అడ్డం వచ్చింది. కాస్త అగాం. దాని దారిన అది వెళ్ళిపోయింది. దారి పొడవునా ఏనుగుల విసర్జితాలు. దారంతా మట్టి, ఇసుక, రాళ్ళతో ఎగుడుదిగుడుగా ఉంది. రాళ్ళలో మా ప్రయాణం గుర్రపు స్వారీని తలపిస్తోంది. కొన్ని వాహనాలు ఆగిపోతున్నాయి, కొన్ని అదుపు తప్పుతున్నాయి. అతి కష్టం పైన సాగుతున్నాం. రకరకాల పక్షు పలకరింపులు.

ఎండిపోయిన బోద రోడ్డుకు ఇరువైపులా గాలికి తలలూపుతోంది. ఎండిపోయిన ఓ రెల్లు సుతారంగా నన్ను తాకింది. మా అమ్మ తలనిమిరినట్టే అనిపించింది. ఒక చెట్టు కొమ్మ నా చెంప ఛెళ్ళు మనిపించింది. అగి వెనక్కి చూశాను. అయ్యో తగిలిందా అన్నట్టు జాలిగా చూసింది నా వైపు. తగిలింది నాకా నీకా అన్నాను. ఒక సన్నని వెదురుపుల్ల రోడ్డుపై కొచ్చి స్కూల్లో అయ్యవారి బెత్తంలా ఊగుతూ కనిపించింది.

కుమార ధార లోకి దిగుతున్న ప్రకృతి ప్రియులు.

 

కుమారధార నుంచి లోయలోకి మా నడక. దారంతా బోద పెరిగిపోయింది. లోయలోకి దిగుతుంటే అంతా చెట్లు కమ్మేశాయి. ఈ దారిలో ఈ మధ్య ఎవరూ నడిచిన ఆనవాళ్ళు కనిపించడం లేదు. లోయలోకి దిగాం. రెండు కొండల నడుమ రాళ్ళను ఎక్కుతూ దిగుతూ సాగుతున్నాం. అదిగో కుమారధార లోయ. రాతి బండపై నుంచి ఏటవాలుగా దిగుతున్నాం. ఎడమ వైపున కుమార ధార దుముకుతున్న శబ్దం.

ఒక మనోహర దృశ్యం. దిగుతున్న కొద్దీ పెరిగిన చెట్ల మధ్య జలధార మరింతగా కనిపిస్తోంది. కిందటి ఏడాది వేసిన ఇనుప నిచ్చెన కనిపించడం లేదు. ఇరవై అడుగుల ఒక లావాటి పైపు మాత్రం అక్కడే ఉంది. కిందకు దిగడం ఎలా? ఒక చెట్టు మొదలుకు తాడు కట్టి, దాన్నిపక్కనున్న ఇనుప దూలానికి తగిలించి కిందకు వదిలాం. ఆ తాడు పట్టుకుని నిట్టనిలువునా ఉన్న ముప్పై అడుగుల లోయలోకి ఒకరొకరుగా దిగాం. మా బుజాలకున్న బ్యాగులను ఆ తాడుకు కట్టి జారవిడిచాం. ఉదయం ఎనిమిదవుతోంది. మా సెల్ ఫోన్లు మూగవోయాయి.

కుమార ధారా కింద ప్రకృతి ప్రియులు.

 

కుమార ధార కింద స్నానాలు, సరదాలు, అల్పాహారాలు ముగించాం. మధ్యాహ్న భోజనం, మంచినీళ్ళు తప్ప సామానంతా అక్కడే పెట్టి బయలు దేరాం. కుమార ధార వాయవ్యం నుంచి ఈశాన్య దిశగా పారుతోంది. రెండు కొండల నడుమ ఆ జలధార పారే వేపు సాగుతున్నాం. కొండ ఒక్కో దగ్గర ఒక్కో రూపం. ఒక దగ్గర సన్నని దారి. ఒక దగ్గర వెడల్పైన దారి. నేలపైన రాళ్ళ మధ్యనుంచి పారుతున్న సెల

కొండ అంచున గుహ లో..

 

ఆ సెల ఏరు ఒక్కో దగ్గర ఒక్కో రాగం ఆలపిస్తోంది. నీళ్ళు ఎంత స్వచ్ఛంగా ఉన్నాయో! అందులో లెక్కలేనన్ని చేప పిల్లలు. నీళ్ళలో మా అలికిడికి అవి తత్తరబాటుకు గురవుతూ పారిపోతున్నాయి. సెల ఏటిని దాటుతూ సాగుతున్నాం. ఒక్కొక్క దగ్గర వాటిని గెంతుతున్నాం. ఒక్కో దగ్గర నీటిలోకి దిగక తప్పడం లేదు. లోతు లేని దగ్గర నీటిలో నడుచుకుంటూ, లోతున్న దగ్గర ఈదుకుంటూ వెళు తున్నాం. ఆ సెల ఏరుమమ్మల్నలా తనలోకి లాగేసుకుంటోంది. ఒక దగ్గర కొండకు ఎత్తుగా గుహలు. వాటిని ఎక్కడం సాధ్యం కావడం లేదు. ఒక గుహలోకి మాత్రం వెళ్ళగలిగాం.

రాళ్ళలో మొలిచిన చెట్లు. వాటి నుంచి కిందకు వేలాడుతున్న ఊడలు. రాళ్ళను పెనవేసుకున్న పెద్ద పెద్ద వేర్లు. మరొక దగ్గర చిన్న రాతి గుహ. అది తెల్లగా మెరుస్తూ తెలుపు, నలుపు కలగలిసిన పాలరాయిలా ఉంది. మధ్యలో ఒక మర్రి చెట్టుకు సాధువు జటాజూటాల్లా వేలాడుతున్న దాని ఊడలు. ఆ ఊడలు నేలకు తాకుతున్నాయి.

నీటి గుండం లోకి ఒకరొకరుగా దిగు తూ..

 

పారుతున్న నీళ్ళు స్వచ్ఛంగా ఉన్నాయి. లోతైన నీటిలో కూడా గులకరాళ్ళు, బండరాళ్ళు కనిపిస్తున్నాయి. రాలిన ఎండుటాకులు తేలాడుతున్నాయి. నీళ్ళలో దిగి నిలుచుంటే మరగుజ్జులులా కనిపిస్తున్నాం. పారుతున్న సన్నని దారిలో ఏటిపైన మూతవేసినట్టు, ఒక బరువైన రాతిపలక ఎక్కడి నుంచో కొట్టుకొచ్చి అడ్డంగా పడింది. ఆ బండ దాటితే లోతైన నీటి మడుగు.

ఎలా వెళ్ళాలి! బండ ఎక్కి వెళదామంటే నీళ్ళలో పాకుడుకు కాళ్ళు జారుతున్నాయి. నీళ్ళలో కూర్చుని జారుతూ ముందుకు సాగితే బండ తలకు తగులుతుందేమో! తలెత్తకుండా నీళ్ళలో వెల్లకిలా పడుకుని జారుడు బండలా జారాం. ఆ బండరాయి మమ్మల్ని తన ముందు తల వంచేలా చేసింది! వర్షాకాలంలో ఆ రెండు కొండల నడుమ నీటి ప్రవాహం ఎంత ఉదృతంగా ఉంటుందో ఈ పరిసరాలను చూస్తే అర్థమవుతుంది. ఆ లోయలో ముప్పై నలభై అడుగుల ఎత్తున ఏరు ప్రవహించిన ఆనవాళ్ళు. ఆ ఏరు ఇంకా ఎత్తున ఉదృతంగా ప్రవహించి ఉంటుంది. ఆ నీటి ఉదృతికి రాతి కొండ కూడా నునుపుదేలి వివిధ రూపాలను సతరించుకుంది.

ఎన్ని చెట్లు పడిపోయాయో! ఎన్ని బండ రాళ్ళు కొట్టుకొచ్చాయో! కుమార ధారలో వేసిన లావాటి ఇనుప నిచ్చెనలు కూడా ఏటి ప్రవాహానికి ఆగలేదు. కొన్ని కిలోమీటర్ల దూరం కొట్టుకొచ్చాయి. ఇరవై మంది మోస్తే తప్ప కదలని బరువైన రెండు నిచ్చెనలు కుమార ధారకు రెండు కిలోమీటర్ల దూరంలో కనిపించాయి. కుమారధార తీర్థానికి ప్రతి ఏడాది కొత్త నిచ్చెనలు వేస్తారు.

కుమార ధార- శక్తి కటారి మధ్య లోయలో నీటి ప్రవాహానికి పడిపోయిన మహా వృక్షం పై ప్రకృతి ప్రియులు.

 

నీటి ప్రవాహానికి మహావృక్షాలు కూలిపోతున్నాయి. ఒక మహా వృక్షం కూకటి వేళ్ళతో పెకిలించుకుని ఏటికి అడ్డంగా పడిపోయింది. పడిపోయిన ఆ మహావృక్షాన్ని చూస్తే అంతా పిల్లలైపోయాం. ఒక పక్కనుంచి ఆ మహా వృక్ష కాండంపైకి పాకుతూ వెళ్ళికూర్చున్నాం. దిగాక చేతికి అందనంత ఎత్తులో దారికి అడ్డంగా పడి ఉన్న వృక్ష కాండం కింద నుంచి సాగాం.

గుండాల్లో నీళ్ళు ఎంత స్వచ్ఛంగా ఉన్నాయి! అడుగున ఉన్న గులకరాళ్ళు కూడా కనిపిస్తున్నాయి. కొన్ని నీటి గుండాలు లోతుగా ఉన్నాయి. వాటిని ఈదుకుంటూ దాటిపోక తప్పదు. అర్ధచంద్రాకారంలో ఉన్న రెండు కొండల నడుమ నుంచి లోతైన గుండంలోకి పడుతున్న జలధార. మెలికలు తిరిగిన రాతి అంచుల నుంచి వయ్యారంగా జాలువారుతున్న జలధార. ఆ జలధారతోపాటు జారుడు బండలా గుండంలోకి జారుతున్నాం. గుండంలో ఈత కొట్టుకుంటూ వచ్చినంత సేపూ బాగున్నాం. లేచి నిలబడి గులకరాళ్ళ పై నుంచి ఒడ్డుకు వస్తున్నప్పుడు పడిపోతున్నాం. అలా ఎన్ని నీటి గుండాలో! ఎన్ని నీటి జారుడు బండలో!

నీటి గుండం లోకి దిగడం ఎంత కష్టం,!

 

గుండంలోకి దూకడమే తప్ప మెల్లిగా దిగడం సాధ్యం కాదు. అలా పన్నెండడుగుల గుండంలోకి ఒక సారి డై కొట్టాను. ఈదుకుంటూ అవలికొచ్చిన కాసేపటికి చూసుకుంటే నా కళ్ళ జోడు లేదు. కళ్ళ జోడు పెట్టుకుని ఈదుకుంటూ వచ్చినా ఎప్పుడూ అది జారిపోలేదు. కానీ తలకిందుల దూకేసరికి కళ్ళజోడు కాస్తా నీళ్ళలో పడిపోయింది. ఇరవై అడుగుల లోతున్న నీటి గుండంలో నా కళ్ళ జోడు ఎక్కడ పడిందో తెలియదు. అడుగున గులకరాళ్ళు కనిపిస్తున్నాయి. నేను దూకుతున్నప్పుడు తీసిన వీడియోను నిదానంగా ప్లే చేసి చూశారు. ఎక్కడ పడిందో గమనించారు. నా కళ్ళ జోడు కోసం లోపల చాలా సేపు వెతికారు. నేనైతే కళ్ళ జోడు ఆశ వదులుకున్నాను. ఇంట్లో ఇంకో కళ్ళజోడుంది వదిలేయండన్నాను.

ముందుకు సాగాలంటే ఇలా జారుడు బండలా జారా లిసిందే.

 

కానీ మా ట్రెక్కర్లు వదలలేదు. గులకరాళ్ళపై నా కళ్ళ జోడును కనిపెట్టి పట్టుకొచ్చారు. నేనైతే అంత సాహసం చేయలేకపోయేవాణ్ణి. మా ట్రెక్కింగ్ గ్రూపులో గజ ఈతగాళ్ళున్నారు. మునిగిపోయిన వాళ్ళను పైకి లాక్కొస్తారు. నా ట్రెక్కింగ్ హ్యాండ్ స్టిక్ కింద భాగం ఊడి నీళ్ళలో పడిపోతే దాన్ని కూడా పట్టుకొచ్చారు.

ముందుకు సాగుతుంటే కనుచూపు మేరలో ఒక ఎత్తైన కొండ. అదే శక్తి కటారి తీర్థం కొండ పై భాగం. మళ్ళీ సన్నని దారిలో నీటి జారుడు బండ. దాని కింద లోతైన నీటి గుండం. ఆ నీటి గుండంలోకి దూకుతాం సరే, ఎక్కడం ఎలా!? ఎక్కడానికి తాడు అవసరం. వచ్చేటప్పుడు కుమార ధార వద్ద తాడు వేలాడదీసి వచ్చాం. మరొక తాడు తీసుకొస్తే బాగుండేది. మొదటి సారి వెళ్ళినప్పుడు మాలో ఇద్దరు సాహసికులు గుండంలోకి దూకారు. పైకి రాలేకపోతున్నారు. పైనున్న కొందరు ఒక చెట్టు ఊడలు నరికి వేలాడ దీశారు. ఆ ఊడలు పట్టుకుని ఎక్కడం వీలు కావడం లేదు.

రెండు కొండల నడుమ లోయలో నడక.

 

జైబాలాజికి ఒక అలోచన వచ్చింది. పక్కనే ఉన్న గొంతు లోతునీటి గుండం లోకి దిగి నిలుచున్నాడు. తన పంచె తీసి పైకి విసిరేశాడు. అందరి ముఖాల్లో నవ్వులు. జై బాలాజీ కూడా నవ్వుతున్నాడు. ఆ పంచెను మెలిపెట్టి నీటి గుండంలోకి వదిలారు. మిగతా వారంతా పైన దాన్ని గట్టిగా పట్టుకున్నారు. ఆ పంచెను తాడులా పట్టుకుని ఆ ఇద్దరూ ఎక్కి పైకి వచ్చేశారు.

తరువాత (2023 జులై 31 వ తేదీన) ఇదే దారిలో వెళ్ళినప్పుడు తాళ్ళు తీసుకొచ్చారు. కింద నున్న నీటి గుండంలోకి తాడు వదలడానికి పైన ఎక్కడా అవకాశం దొరకలేదు. పైనున్న నీటి గుండంలో మునిగి లోపల ఉన్న బండరాయికి తాడు కట్టి పైకి తీసుకొచ్చి, కింద నున్న నీటి గుండంలోకి ఆ తాడువదిలారు. ఆ తాడు పట్టుకునే కింద ఉన్న నీటిగుండంలోకి దిగగలిగారు. మళ్ళీ పైకి రాగలిగారు.

ఆ ఎదురుగుండా కనిపిస్తున్నదే శక్తికటారి తీర్థం కొండ. ఆ కొండ పైనుంచే జలపాతం జాలువారుతుంది. తాంత్రికలోయ నుంచి శక్తికటారి వెళ్ళగలిగాం కానీ, ఈ దారిలోంచి శక్తికటారి కొండ ఎక్కాలన్నది మా ట్రెక్కర్ల చిరకాల వాంఛ. ఎదురుగుండా లోతైన గుండం. గండంలోకి దూకగలుగుతాం సరే, పైకి రావడం ఎలా? తాళ్ళు పట్టుకుని ఎక్కుతుంటే కాళ్ళకు పట్టుదొరకడం లేదు. కాళ్ళకు పట్టు ఉండాల్సిన చోట బండ లోనికి చొచ్చుకుని పోయి ఉంది.

“అందరూ దూకకండి. నలుగురం మాత్రమే దూకుతాం" అన్నాడు మధు. మధు, తిరుమల రెడ్డి, కార్తీక్, మరొకరు ఆ గుండంలోకి దూకారు అభిమన్యుడు పద్మవ్యూహంలోకి దూరినట్టు. మేం గట్టున కూర్చుని చూస్తున్నాం. గుండం నుంచి పైకి ఎక్కడం చాలా కష్టంగా ఉంది. తాడు పట్టుకుని ఎక్కుతుంటే కాళ్ళకు పట్టుదొరకడం లేదు. నీటి ప్రవాహం గుండా తాడు వేలాడుతోంది. కేవలం చేతులపైనే శరీర భారమంతా మోపి తాడుపట్టుకుని ఎక్కడం కష్టం. అలా కొంత దూరం ఎక్కాక మేమంతా ఆ తాడుపట్టుకున్న వాళ్ళని పైకి లాగాం. అతికష్టంపైన పైకి వచ్చారు.

మరొకసారి మేమంతా ఏడవ నీటిగుండం దగ్గర ఆగిపోయాం. మాలో కొందరు మాత్రం ఆ గుండంలోకి దిగారు. ముందర మరో మూడు నీటి గుండాలున్నాయి. అయిదుగురు సాహసికులు రెండు నీటి గుండాల వరకు వెళ్ళగలిగారు. మూడవ నీటి గుండం దగ్గర ఆగిపోయి, అక్కడి నుంచి పక్కనున్న కొండ పైకి ఎక్కి, మూడవ నీటిగుండం నుంచి శక్తి కటారి తీర్థం పడే జలపాతాన్ని పైనుంచి చూడగలిగారు.

వైతరిణి నది లాంటి ఇలాంటి నీటి గుండాలు ఎన్ని దా టాలో!

 

శక్తికటారి తీర్థాన్ని ఈ వైపునుంచి చూడాలని నాలుగైదు సార్లు ప్రయత్నాలు జరిగాయి. నా వరకు నేను ఏడవ నీటిగుండం దగ్గర ఆగిపోయాను. మధు, శివారెడ్డి, కార్తీక్, మరో ఇద్దరు మాత్రం తాళ్ళు పట్టుకుని ముందుకు సాగారు. తాళ్ళు పట్టుకునే నీటిగుండాల్లోకి దూకి, కాళ్ళకు చెప్పులు లేకుండానే రాళ్ళలో కొండెక్కి శక్తికటారిని చూసొచ్చారు. ఈ సాహసాల దారిలో శక్తికటారిని చూడాలన్న వారి లక్ష్యం నెరవేరింది.

ట్రెక్కింగ్ సాహసంలో ఎప్పటికప్పుడు అన్నీ అన్వేషణలే. నీటి గుండాల్లో ఈది ఈది బట్టలన్నీ తడిసిముద్దయ్యాయి. ఎండొస్తే ఎంత బాగుంటుంది! రెండు కొండల నడుమ చలిచంపేస్తోంది. దిగడం తేలికే, ఎక్కడం ఎంత కష్టం! జలధారకు ఎదురుగా తాడు పట్టుకుని ఎక్కుతుంటే జారిపోతోంది. పాకుడుతో నిండిన బండ దగ్గర పట్టు దొరకడం లేదు. కింద మోటిస్తే తప్ప పైకి ఎక్కలేని పరిస్థితి. ఎక్కేటప్పుడు మోకాళ్ళు, మోచేతులు బండపైన పెట్టి ఎక్కుతున్నాం. అయినా జారిపోతోంది. మోచేతులు గీక్కుపోయాయి. నీగార్డులుడడంతో మోకాళ్ళు కాస్త భద్రంగా ఉన్నాయి. పై వాళ్ళు చేతులు అందిస్తున్నారు.

వెళ్ళినప్పుడు ఈదిన గుండాలన్నీ మళ్ళీ ఈదుకుంటూ ఎక్కి వస్తున్నాం. చూసిన ప్రకృతి అందాలన్నిటినీ చూసుకుంటూ వచ్చేస్తున్నాం. వచ్చినప్పటికంటే తిరిగి వెళ్ళేటప్పుడే ఎక్కువ కష్టపడాల్సి వస్తోంది.

మా సాహస యాత్రలో ఒక్కో నీటి గుండం ఒక్కో మైలురాయి. ఒక్కో నీటి గుండం దాటుతుంటే ఒక్కో గండం గడిచినట్టుంది. దారి పొడవునా ఎన్ని కబుర్లు!

లోయలో మధ్యాహ్న భోజనం సంచులు పెట్టిన ప్రాంతానికి చేరుకున్నాం. మా తిండిసంచులు చిందరవందరగా పడి ఉన్నాయి. ఇవి కోతుల పనే. అందరి సంచులూ వదిలేసి నా సంచినే చించి చిందర వందర చేశాయి. మిగత వారంతా చపాతీలు, పూరీలు, పెరుగన్నం, ఇతర వంటకాలు తెస్తే, నేను పులిహోర తీసుకొచ్చాను. మిగతా వారి తిళ్ళ జోలికి వెళ్ళ కుండా కోతులు నా పులిహోర పాకెట్ల నే ఖాళీ చేశాయి. కోతులకు పులిహోర అంటే మహా ఇష్టం!

అక్కడి నుంచి మళ్ళీ కుమారధారకు చేరుకున్నాం. మధ్యాహ్నం మూడవుతోంది. ఒక అరగంట కుమార ధారలో వెల్లకిలా పడుకుని సేదదీరాం. మూడున్నరకు మళ్ళీ తాళ్ళు పట్టుకుని కొండెక్కి తిరుగు ప్రయాణమయ్యాం. చీకటి పడక ముందే సాహసాలు, అనుభూతులను దాచుకుని తిరుపతి చేరుకున్నాం.

Tags:    

Similar News