‘ధీర సమీరే గంగా తీరే’ తో రవి మంత్రి మరో సంచలనం
'అమ్మ డైరీలో కొన్ని పేజీలు' సూపర్ సక్సెస్ తర్వాత…;
ఒకప్పుడు లైబ్రరీకి వెళ్లి కూర్చుని చదవటం, నవలలు అద్దెకు తెచ్చుకోవటం, వారపత్రికలు తిరగేయటం — ఇవన్నీ జనం నిత్యకృత్యాలు. ఆ రోజుల్లో యద్దనపూడి, యండమూరి, మల్లాది వంటి రచయితలకు సినిమాస్టార్లకు ఉన్నట్లుగానే అభిమానులు ఉండేవారు. పుస్తకం కోసం లైన్లో నిలబడటం, పుస్తక వాసనతో మైమరచిపోవటం — అది ఓ ప్రత్యేక యుగం.
ఇప్పుడా తరం మారిపోయింది. ఇప్పుడు పుస్తకాల కంటే మొబైల్ స్క్రీన్ మెరుపులు ఎక్కువగా ఆకట్టుకుంటున్నాయి. Gen Z జనరేషన్‌కి కాలక్షేపానికి రకరకాల ప్రత్యామ్నాయాలు వచ్చేశాయి. అలాగే ఇప్పటి వారికు తగినట్లు రాసి, వారిని ఆకట్టుకునే రచయితలు కనపడటం లేదు. అయితే ఆ లోటుని తీర్చటానికి అన్నట్లు రవి మంత్రి అనే రచయిత రంగ ప్రవేశం చేసారు.
2023లో అజు పబ్లికేషన్స్ నుంచి వెలువడిన రవి మంత్రి రాసిన “అమ్మ డైరీలో కొన్ని పేజీలు” సంచలనం సృష్టించింది. 2024లో ఇది భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన ఫిక్షన్ పుస్తకాలలో ఒకటిగా నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇప్పుడేమో అదే నవల అన్ని భారతీయ భాషల్లోకి వెళ్తోంది. పెంగ్విన్ ఇండియా వారు ఇంగ్లీషులో ప్రచురిస్తున్నారు.
అలాంటి సెన్సేషన్ సృష్టించిన రచయిత నుంచి వచ్చిన మరో పుస్తకం — ‘ధీర సమీరే గంగా తీరే’!
రవి మంత్రి రచనలో ఎక్కువగా మానవ స్వభావం, సంబంధాలు, లోతైన తాత్వికత ఉంటాయి. ఈ కొత్త నవలలోనూ అలాగే ఆయన ప్రేమ, ప్రవాహం లాంటి జీవితంలో ఎలాంటి పాత్ర పోషిస్తుందనే దిశలోనే పాఠకులను పయనింపజేస్తారనిపిస్తోంది. ఆయన మాటలు విన్నాక ఇది కేవలం కథ కాదు, నది తీరంలో మానవ హృదయాల అన్వేషణ అనిపించింది.
పుస్తకావిష్కరణలో 300 మంది!
ఈ ఆదివారం హైదరాబాద్ T-Hub లో జరిగిన ‘ధీర సమీరే గంగా తీరే’ ఆవిష్కరణకు దాదాపు మూడు వందల మంది సాహితీప్రియులు హాజరయ్యారు. పుస్తకాల కోసం ఇంత పెద్ద సంఖ్యలో జనం చేరడం ఈ డిజిటల్ యుగంలో చిన్న విషయం కాదు.
పుస్తకాల భవిష్యత్తు: మన చేతుల్లోనే
తెలుగు పుస్తకాల మార్కెట్ ప్రస్తుతం కఠిన పరీక్ష ఎదుర్కొంటోంది. కానీ ఇలాంటివి పుస్తకావిష్కరణలు చూస్తే ఓ ధైర్యం వస్తోంది— పుస్తకం పట్ల మనవాళ్ల మనసులో మమకారం ఇంకా మృతి చెందలేదు అని.
తెలుగు పుస్తకాల భవిష్యత్తు... కొత్త తరాన్ని కలుపుకోవడంలోనే ఉంది.
“అమ్మ డైరీలో కొన్ని పేజీలు” కేవలం ఒక నవల కాదు, కొత్త తరానికి ఒక పిలుపుగా మారింది. “ధీర సమీరే గంగా తీరే” కూడా అదే పని చేస్తుందని నమ్ముతున్నాను.
ఎందుకంటే పఠనం అనేది కేవలం హాబీ కాదు, అది ఒక సాంస్కృతిక ఉద్యమం.
పుస్తకాలు ఎక్కడికైనా వెంట తీసుకెళ్లగలిగే అపూర్వమైన మ్యాజిక్ — స్టీఫెన్ కింగ్