ఎందరో గిరిజనుల ప్రాణాలు కాపాడిన ఇద్దరు కమ్యూనిటీ హెల్త్ వర్కర్ల చొరవ..

ఈ హెల్త్‌ కిట్‌తో సుగర్‌,హెమో గ్లోబిన్‌, యూరీన్‌ తదితర ఏడు రకాల పరీక్షలు ఇంటివద్దనే చేయవచ్చు .;

Update: 2025-09-11 07:21 GMT

చీకటి తన రెక్కల మధ్య పొదువుకున్న ఆ ఆడవి మీద ప్రకృతి ఆకుపచ్చని వస్త్రాన్ని కప్పినట్టుంది ఆ ప్రాంతం.

రెండు వాగులు దాటాక ‘బుస్సురాయి’ ఆవాసం . ఎప్పుడు పడిపోతాయో అన్నట్టుగా నాచు పేరుకున్న ఎర్రపెంకుల ఇళ్లల్లో 40 గిరిజన కుటుంబాలు.

రోగాలు వస్తే లక్ష్మీ దేవిపల్లిలో రోగులను డోలీలో ఇలా తీసుకెళ్లేవారు

చీకటి ముసిరిన మట్టి గోడల ఇంటిలో కుక్కిమంచం మీద పడుకున్న మృత్యుముఖంలో ఉన్న రోగి గాలికి కొడిగట్టడానికి సిద్ధంగాఉన్న ఇప్ప చమురు దీపాన్ని చూస్తున్నాడు. అతని కళ్లల్లో ఆశ, నిరాశతో నిర్వేదమైన చూపులు!

అపుడక్కడ ఎవరూ ఊహించనిది జరిగింది.

కాలిబాటలో ఇద్దరు హెల్త్‌ వాలంటీర్లు అక్కడకు చేరుకున్నారు. చేతిలోని హెల్త్‌ కిట్‌ని తెరిచి, తీవ్రజ్వరంతో ఉన్న ఆ రోగికి బ్లడ్‌ టెస్ట్‌ చేశారు. మలేరియా ప్రమాదకరమైన స్టేజ్‌లో ఉందని తేలడంతో, తక్షణం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి మెరుగైన చికిత్స చేయించి అతడి ప్రాణాలు కాపాడారు. అదేవిధంగా మరో నలుగురు రోగులను గుర్తించి, సకాలంలో వైద్యం అందించారు.

కమ్యూనిటీ హెల్త్‌ వర్కర్స్‌ స్వప్న, గంగ చొరవతో ఈ మారుమూల ప్రాంతంలో కొందరి ప్రాణాలు నిలబడ్డాయి.

బీపీ చెక్‌ చేస్తున్న యువకులు

తెలంగాణలోని కొత్తగూడెం, భధ్రాచలం మధ్య దట్టమైన అడవీ మార్గంలో, లక్ష్మీ దేవిపల్లి, పాల్వంచ, చుంచుపల్లి, చంద్రగుండా , అల్లపల్లి మండలాల్లో విసిరేసినట్టుగా ఉంటాయి గిరిజన ఆవాసాలు .

ఇక్కడ విద్యుత్‌ ఉండదు, వైద్య సౌకర్యాలు అసలే లేవు. ఇక్కడి ప్రజల్లో పౌష్టికాహార లోపం తీవ్రంగా ఉంది. మహిళల్లో రక్తహీనత ఎక్కువ.

ప్రతి పది ప్రసవాల్లో పుట్టిన బిడ్డలు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారు.

కొందరు శిశువులు తమ తొలి పుట్టిన రోజును కూడా చూడటం లేదు. రోగాలు వస్తే ఆకు పసర్లే దిక్కు. మరీ ఎక్కువైతే నాటు వైద్యం మీద ఆధార పడతారు. జబ్బు ముదిరితే డోలీ లో మోసుకుంటూ మైళ్ల కొద్దీ నడిచి సర్కారు దవఖానకు చేరాలి.

వైద్యపరీక్షలు చేస్తున్న స్థానిక ఆదివాసీ యువకులు

‘‘ మనం ఇంకా ఎక్కడున్నాం? రోగాలు వస్తే డోలీలో మోసుకుంటూ, మైళ్ల కొద్దీ నడవడం ఏంటీ నాన్సెన్స్‌..!’’ కష్టమొచ్చిన అడవితల్లి వైపు ఆందోళనగా చూస్తూ ఆలోచనలో పడ్డారు కొందరు యువకులు.

తమ తండాల మధ్య ఎలాగైనా హెల్త్‌క్లినిక్‌ ఉండాలనుకున్నారు. వారికేమీ పెద్ద చదువులు లేవు. అడవుల్లో పుట్టతేనె, తునికి పండ్లు ఏరుకోవడం, వీలైతే పోడువ్యవసాయం చేస్తారు.

ఇలాంటి పరిస్ధితుల్లో ఆ ప్రజల మధ్యకు ‘ఇండిజీనస్‌ డెవలప్‌ మెంట్‌ ఆర్గనైజేషన్‌ ’ అడుగు పెట్టింది. ఆ యువకులతో మాట్లాడి , వారితోనే అక్కడి సమస్యల పై అధ్యయనం చేయించింది. ముందుగా 5 ఆవాసాలను గుర్తించి, వైద్య పరీక్షలు చేయడానికి అనువైన ఒక హెల్త్‌ కిట్‌ని ఆ యువకుల చేతిలో పెట్టి, వాటిని ఎలా వాడాలో, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సహకారంతో చిన్నపాటి శిక్షణ కూడా ఇచ్చారు.

పేద ప్రజలకు దూరా భారాలు లేకుండా, వైద్య పరీక్షలు చేస్తూ, సకాలంలో సరైన వైద్యం అందేలా ఇక్కడి యువకులు చేస్తున్న కృషిని గుర్తించిన అమెరికాలోని ‘రూరల్‌ హోప్‌ ఫౌండేషన్‌, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాలనా యంత్రాంగం 51 కిట్‌లను అందచేశారు.

గర్భిణులకు అన్నిరకాల పరీక్షలు 

‘ ఈ హెల్త్‌ కిట్‌తో సుగర్‌,హెమో గ్లోబిన్‌, యూరీన్‌ తదితర ఏడు రకాల పరీక్షలు ఇంటివద్దనే చేయవచ్చు .

అల్లపల్లి మండలంలో వైద్యపరీక్షల కోసం వచ్చిన గిరిజనం

పరికరాలను ఎలా వాడాలో మాకు శిక్షణలో నేర్పారు. హైరిస్క్‌ ప్రెగ్నిన్సీ ఉంటే ముందుగా గుర్తించి, సకాలంలో ఆసుపత్రికి చేర్చి వారిని కాపాతున్నాం, ’’ అంటారు, కమ్యూనిటీ హెల్త్‌ వర్కర్‌లు నాంగమ్మ, సోడి గంగ. సారెకల్లు, క్రాంతినగర్‌ గుంపుల్లో వీరు పనిచేస్తున్నారు.

25 పరికరాల అరుదైన కిట్‌

‘‘ అడవిలో నివసించే వారికి సరైన దుస్తులుండవు. ఇండ్లు కూడా సరిగా ఉండవు. ఆరుబయటే పడుకుంటారు కాబట్టి ఉష్ణోగ్రత పడిపోయి పసిబిడ్డలు చనిపోతుంటారు. అలాంటి ప్రమాదం నుండి కాపాడడానికి ఈ కిట్‌లో వార్మ్‌బ్యాగ్‌ ఉంది. కొందరు పుట్టిన వెంటనే శ్వాస పీల్చుకోలేక ఇబ్బంది పడతారు. ఆంబుబ్యాగ్‌ ద్వారా ఆక్జిజన్‌ అందించి సకాలంలో ఊపిరి పీల్చుకునేలా చేసి బతికించవచ్చు.

అన్ని రకాల వైద్యపరీక్షలకు తగిన పరికరాలు ఉన్న కిట్‌

పుట్టిన శిశువు తగిన బరువు ఉన్నదా లేదా తెలిపే సాల్టర్‌ స్కేల్‌ కూడా ఉంది.

ఈ కిట్‌ వల్ల అత్యవసర ప్రసవాలు కూడా చేయవచ్చు. వైద్య సదుపాయాలు లేని మారు మూల ఆదివాసీలకు ఈ కిట్‌ సంజీవని. దీనిలో 25 పరికరాలు ఉంటాయి.

వీటిని ఉపయోగించడంలో గిరిజన యువతీ యువకులకు అవగాహన కల్సించి వారి ఆరోగ్య సమస్యలు వారే గుర్తించేలా శిక్షణ ఇచ్చాం.‘‘ అని వివరించారు ఈ కిట్‌ని డిజైన్‌ చేసిన, ‘ఇండిజీనస్‌ డెవలప్‌ మెంట్‌ ఆర్గనైజేషన్‌ ’ వైద్యులు నరేందర్‌, కపిల్‌శర్మ. దేశవ్యాప్తంగా 30 శాతం ఆదివాసీలు మలేరియా కు బలి అవుతున్నారు. అందులో 11 శాతం మందికి మాత్రమే టీట్‌ మెంట్‌ అందుతోంది అన్నారీ వైద్యులు.

హెల్త్‌వర్కర్‌లకు ప్రజల ఆరోగ్య సమస్యల పై మరింత అవగాహనకు ఇండీజినియస్‌ సంస్ధ ప్రతీ నెల 3 రోజులు శిక్షణ ఇస్తున్నారు. ఇలా 50 మందిని తీర్చిదిద్దారు.

మెరుగైన జీవితం వైపు అడుగులు

1, గర్భిణీలు పలురకాల పరీక్షల కోసం తరచూ, ఆసుపత్రికి వెళ్లాలంటే,

దాదాపు 20 కిలో మీటర్లు నడిచి ఏరియా ఆసుపత్రికి చేరుకోవాలి. ఇపుడా శ్రమ తగ్గింది. కమ్యూనిటీ హెల్త్‌ వర్కర్లు తల్లీబిడ్డల సంరక్షణ, సురక్షిత ప్రసవం జరిగేలా చూస్తున్నారు.

2, ఆరోగ్య పరీక్షలన్నీ అందుబాటులో ఉండటం వల్ల గిరిజనులు కూలీపనులు కోల్పోవడం లేదు.

3, అటవీ ప్రాంతంలో 18 గుంపుల్లో సకాలంలో వైద్యం అందుతోంది. ఇప్పటి వరకు 2500 పైగా ఆదివాసీలకు ఈ వైద్య సేవలు పొందారు.

4, హెల్త్‌ వర్కర్లు అవగాహన కల్గించడం వల్ల 25 శాతం డెలివరీలు ఇపుడు ఆసుపత్రిల్లో జరగుతుతున్నాయి. 30 శాతం రక్తహీనత తగ్గింది. మలేరియా తగ్గింది.

5, నిరుద్యోగ యువతకు హెల్త్‌ వర్కర్లుగా తీర్చిదిద్దడం వల్ల వారిలో ఆత్మవిశ్వాసం, సేవాభావం పెరిగింది. కనీసం టెన్త్‌ కూడా చదవని వీరంతా వైద్యులుగా మారి తమ కొండ ప్రజల ప్రాణాలు కాపాడుతున్నారు.


పీపుల్స్‌ హెల్త్‌ ఇన్‌ పీపుల్స్‌ హ్యాండ్స్‌ అనే లక్ష్యంతో ఆదివాసీ యువత ఆరోగ్య కార్యకర్తలుగా మారారు. రూరల్‌ హోప్‌ ఫౌండేషన్‌, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాలనాధి కారులు, ఇండిజీనస్‌ డెవలప్‌ మెంట్‌ ఆర్గనైజేషన్‌ సహకారంతో ఆదివాసీ పల్లెలను అనారోగ్య సమస్యల నుండి కాపాడుతున్నారు.అందరి కృషి ఫలితంగా అడవి బిడ్డలు ఆరోగ్యస్వరాజ్యం సాధించే దిశగా అడుగులు వేస్తున్నారు !!

Tags:    

Similar News