మెట్రో రైళ్లు తయారవుతున్నది రాయలసీమలోనే...(Special Story)

డ్రైవర్‌ లేకుండా దూసుకుపోయో మెట్రో రైళ్లు ప్రత్యేక ఆకర్షణ

By :  Admin
Update: 2024-10-22 04:45 GMT

-శ్యాంమోహన్

తిరుపతి జిల్లా , తడ సమీపంలోని తమిళనాడు సరిహద్దుల్లో 7,500ఎకరాల్లో విస్తరించిన శ్రీసిటీ (Sri City) పారిశ్రామిక పార్క్‌లోని ఆల్‌స్టామ్‌ (Alstom) ఇండియా లిమిటెడ్‌ కంపెనీలోకి అడుగు పెడితే రైలు పెట్టెల తయారీలో బిజీగా ఉన్న యువతీయువకులు కనిపిస్తారు. అధునాతన టెక్నాలజీ ఇంటిగ్రేషన్‌ తో డిజైన్‌ తయారీలో కొందరు, తయారైన రైలుపెట్టెలను ఫైనల్‌ టెస్టింగ్‌ చేస్తూ మరి కొందరు , మరో వైపు కొత్తగా జాబ్‌లోకి వచ్చిన వారికి స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ ట్రైనింగ్‌ ఇస్తున్న సీనియర్‌ టెక్నీషియన్స్‌తో సైట్‌ అంతా బిజీగా ఉంటుంది.

‘కొంతకాలం క్రితం మెట్రోట్రైన్‌లో ప్రయాణం చేసినపుడు లోపల ఇంటీరియర్‌ డిజైన్‌ చూసి ఆశ్చర్యపోయాను. ఆటోమెటిక్‌గా డోర్లు తెరుచుకునే టెక్నాలజీ చూసి వీటిని ఎలా తయారు చేస్తారా అని ఆలోచనలోపడ్డాను. ఇపుడు అనుకోకుండా ఆ మెట్రో రైలును తయారు చేసే ఆల్‌స్టామ్‌ కంపెనీలోనే ఉద్యోగం చేయడం ఆనందంగా ఉంది. ఇక్కడ పని చేయడం వల్ల కొత్త టెక్నాలజీ, నైపుణ్యంపై అవగాహన కలిగింది .’ అన్నాడు పల్నాడు జిల్లా కు చెందిన హర్షవర్ధన్‌.

‘మాది చాలా పేద కుటుంబం, విజయవాడ దగ్గర హనుమాన్‌ జంక్షన్‌. నాన్న పక్షవాతంతో బాధపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉపాధి వెతుక్కోవలసి వచ్చింది. బిటెక్‌ అర్హతతో ఆల్‌స్టామ్‌లో అవకాశాలున్నాయని తెలిసి ఇక్కడికి వచ్చాను. సాఫ్ట్‌ స్కిల్స్‌, కమ్యునికేషన్‌ స్కిల్‌ నేర్పారు. తోటి ఉద్యోగుల మధ్య ఎలా మెలగాలో నేర్పారు. ఫుడ్‌, ట్రాన్స్‌పోర్ట్‌ సౌకర్యం కల్పించారు. కంపెనీలో పనిచేసే వాతావరణం బాగుంది. వచ్చిన జీతంతో మా నాన్నకు మెరుగైన వైద్యం చేపించాను’ అంటారు శిరీష. దేశ విదేశాల్లో ఎక్కడ మెట్రో రైలు ప్రాజెక్టు వచ్చినా, రైలు పెట్టెలు తయారీకోసం ‘ఆల్‌స్టామ్‌’ ని సంప్రదిస్తారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ఇక్కడ మెట్రో రైళ్ళు తయారుచేస్తారు. మారుమూల గ్రామీణ ప్రాంతాలకు చెందిన యువతకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి ఇక్కడ ఉద్యోగాలు కల్పించారు.



గ్రామీణ ప్రతిభను వెలికి తీస్తున్నాం.

‘ఈ కంపెనీలో అంతర్జాతీయ ప్రమాణాలతో మెట్రో రైల్‌ బోగీలు తయారవుతాయి. గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చిన అమ్మాయిలు ఇక్కడ సరిగా పనిచేయగలరా అని మొదట్లో మేం సందేహించాం. కానీ వారు మా అంచనాలకు మించిన చురుకుదనంతో ఉత్సాహంగా పనిచేస్తూ, మా ప్రాజెక్టులు సకాలంలో పూర్తి చేయడానికి సహకరిస్తూ పరిశ్రమ పురోభివృద్ధికి తోడ్పాటు నందిస్తున్నారు. మాకు నిపుణుల కొరత ఉన్న సమయంలో ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ద్వారా మా ప్రాజెక్టుల డిమాండ్‌కి తగిన ఉద్యోగులను తీసుకుంటాం. 45 రోజులు ఆధునిక శిక్షణ ఇచ్చి నైపుణ్యవంతులుగా తీర్చిదిద్దుతాం. ఉద్యోగులకు రవాణా సౌకర్యంతో పాటు క్యాంటీన్‌ ,హెల్త్‌ ఇన్సూరెన్స్‌ కూడా ఉంటుంది.’ అన్నారు అప్పుడే ప్లాంట్‌ నుండి ఆఫీసులోకి వచ్చిన వెల్ఫేర్‌ ఆఫీసర్‌ సోఫియా.  



అసలు ఈ కంపెనీ కథ ఏంటీ?


భారతదేశ పట్టణ రవాణా, తయారీ నైపుణ్యానికి అరుదైన మైలురాయి తిరుపతి జిల్లా, శ్రీసిటీలో ని ఆల్‌స్టామ్‌ ట్రాన్స్పోర్ట్‌ ఇండియా లిమిటెడ్‌ . ఇపుడు ఇక్కడ నుండి ఢల్లీ, చెన్నై మెట్రోలకు అత్యాధునిక డ్రైవర్‌ రహిత మెట్రో రైళ్ల (Metro Rail) ను సరఫరా చేస్తోంది. ఇవి వంద శాతం స్వదేశీ పరికరాలు, పరిజ్ఞానంతో ఉత్పత్తి అవుతున్నాయి. 2.8 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించిన అల్స్టోమ్‌ శ్రీసిటీ పరిశ్రమ, ‘మేక్‌ ఇన్‌ ఇండియా’ (Make In India), ఆత్మనిర్భర్‌ భారత్‌ కార్యక్రమాలకు కట్టుబడి 100% స్వదేశీ మెట్రో రైలు-సెట్ల ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తోంది. ఈ ప్లాంట్‌లో 500 మంది ఉద్యోగులు ఉండగా, వీరిలో 25శాతం మహిళా ఉద్యోగులు ఉన్నారు. స్థానికులకు ఉపాధిని ప్రోత్సహిస్తున్నారు.

భారతదేశంతో పాటు ,అంతర్జాతీయంగా అనేక ప్రధాన మెట్రో ప్రాజెక్టులకు శ్రీసిటీ-అల్స్టోమ్‌ పరిశ్రమ మెట్రో రైళ్లను అందిస్తోంది. గతంలో చెన్నై మెట్రో ఫేజ్‌ 1 కోసం 42 రైలు సెట్‌లను (ఒక్కొక్కటి 4 కోచెస్‌ తో), కొచ్చి మెట్రో కోసం 25 మూడు కోచెస్‌ రైలు-సెట్‌లను సరఫరా చేసింది. లక్నో మెట్రోకు 20 నాలుగు కోచెస్‌ రైలు-సెట్‌లను, ముంబై మెట్రో లైన్‌ 3 ప్రాజెక్ట్‌ లో భాగంగా భారతదేశం యొక్క పొడవైన భూగర్భ మెట్రో లైన్‌ కోసం 31 ఎనిమిది కోచెస్‌ రైలు-సెట్లను సరఫరా చేసింది. అంతర్జాతీయంగా, ఆస్ట్రేలియాలోని సిడ్నీ మెట్రోకు 22 డ్రైవర్‌లెస్‌ 6 కోచెస్‌ రైళ్లను, కెనడాలోని మాంట్రియల్‌ మెట్రో కోసం 106 రైళ్లను అందించడం ద్వారా ప్రపంచ స్థాయి నైపుణ్యతను చాటుకుంది. 




 డ్రైవర్‌ రహిత మెట్రో రైళ్లు రెడీ!

ఢిల్లీ మెట్రో 4వ దశ విస్తరణ ప్రాజెక్ట్‌ కోసం సుమారు 2,800 కోట్లు ఒప్పందంలో భాగంగా మొదటి విడతగా 52 డ్రైవర్‌ రహిత మెట్రో రైలు (driverless metro) సెట్లను ఈ ఏడాది సెప్టెంబర్‌ 23న ఢల్లీ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ కి ఆల్ఫోమ్‌ ప్రతినిధులు అందజేశారు. ఒక్కో రైలు సెట్‌ లో ఆరు రైల్‌ పెట్టెలు ఉంటాయి. ఇందులో 13 రైలు సెట్లను ఏరోసిటీ నుండి తుగ్లకాబాద్‌ వరకు కొత్తగా నిర్మించిన 25.8 కి.మీ పొడవైన గోల్డ్‌ లైన్‌-10 కోసం రూపొందించారు. ఇది భారత్ లో మొట్టమొదటి డ్రైవర్ లెస్ మెట్రో రైలు సర్వీస్ అవుతుంది. అలాగే చెన్నై మెట్రో రైల్‌ లిమిటెడ్‌ రెండవ దశ విస్తరణ ప్రాజెక్ట్‌ కోసం, 36 డ్రైవర్‌లెస్‌ రైలు సెట్‌లను సరఫరా చేస్తున్నారు. దీని కాంట్రాక్ట్‌ విలువ 1,215.92 కోట్లు. ఒక్కో రైల్‌ సెట్‌ లో 3 కోచెస్‌ వంతున మొత్తం 108 కార్లు ఉంటాయి. 


డ్రైవర్ లెస్ మెట్రో రైలు చెన్నై మెట్రో అధికారులకు అందచేస్తున్న అల్ స్టామ్ అధికారులు

అధునాతన అన్‌టెండెడ్‌ ట్రైన్‌ ఆపరేషన్స్‌ టెక్నాలజీ ఇంటిగ్రేషన్‌ తో డిజైన్‌, తయారీ, టెస్టింగ్‌, కమీషనింగ్‌, పర్సనల్‌ ట్రైనింగ్‌ తదితర తుది పరీక్షలు పూర్తి చేసి అక్టోబర్‌ 17 న వీటిని చెన్నై (Chennai) లోని పూనమల్లి డిపోకు సరఫరా చేశారు. ఈ రైళ్లు పూనమల్లి-పోరూర్‌ మధ్యలో పనిచేస్తాయి. ‘ఆధునిక శిక్షణ పొందిన గ్రామీణ ఉద్యోగులతో, స్థానికంగా తయారు చేసిన ఈ మెట్రోపాలిస్‌ మెట్రో రైళ్లు జన జీవన శైలిని మెరుగుపరచడంలో, పట్టణాభివృద్ధి లో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ ప్రాజెక్టులు కేవలం సాంకేతిక పురోగతిని మాత్రమే కాకుండా అధునాతన రవాణా వ్యవస్థల రూపకల్పనలో భారతదేశం సామర్థ్యాలను సూచిస్తాయి ఇది పర్యావరణ అనుకూల పట్టణ రవాణాలో కొత్త శకానికి నాంది అని, సంస్ధ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ వికాస్‌ కుమార్‌ అంటారు.

అవసరాలకు తగిన ఉద్యోగులు!  



‘రెండేళ్ల క్రితం నిపుణులైన ఉద్యోగులు దొరక్క మేం చాలా ఇబ్బందులు పడ్డాం. శ్రీసిటీలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు చేయడం వల్ల మాకు నైపుణ్యం ఉన్న అభ్యర్థులు దొరికారు. గత రెండేళ్లలో 300 మంది నిరుద్యోగులను ఉద్యోగంలోకి తీసుకున్నాం. శిక్షణ పొందుతున్న అభ్యర్థులకు సకల సౌకర్యాలు సమకూర్చడంలో శ్రీసిటీ చాలా జాగ్రత్తలు తీసుకుంది. మా పరిశ్రమల అవసరాలకు తగిన ఉద్యోగులను సమకూర్చడంలో ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌, శ్రీసిటీ మాకెంతో తోడ్పాటును అందించారు.’ అన్నారు సైట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌, విజయ్‌ సుబ్రమణియన్‌.


నైపుణ్య శిక్షణతో ఉద్యోగం!  



‘మాది వ్యవసాయ కుటుంబమే కాని తక్కువ వర్షపాతం వల్ల సాగుబడి తగ్గింది. బీటెక్‌ చేసి నిరుద్యోగిగా ఉన్న సమయంలో స్నేహితుల సలహాతో శ్రీసిటీలోని ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌లో 45 రోజులు శిక్షణ తీసుకున్నాను.ఇక్కడి ఆధునిక పరిశ్రమల అవసరాలకు తగిన విధంగా ట్రైనింగ్‌ ఇవ్వడంతో పాటు, మాకు వసతి, ఇతర సౌకర్యాలు కల్పించారు. అనంతరం ఆల్‌స్టామ్‌ కంపెనీలో ఉద్యోగం ఇచ్చారు. అంతర్జాతీయ ప్రమాణాలతో మేం రూపొందిస్తున్న మెట్రో కోచ్‌లు విదేశాల్లో తిరుగుతున్నాయనే ఫీలింగ్‌ మాకు చాలా సంతోషం కలిగిస్తుంది ’ అంటారు ప్రకాశం జిల్లా నుండి వచ్చి ఇక్కడ టెక్నిషియన్‌గా పనిచేస్తున్న అఖిల. 



ఆధునిక రవాణా రంగంలో వైవిధ్య సేవలను అభివృద్ధి పరుస్తూ, ఇంటెగ్రేటెడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ సిస్టమ్స్‌లో ప్రపంచ అగ్రగామి ఫ్రెంచ్‌ బహుళజాతి సంస్థ ‘ఆల్‌స్టామ్‌’. రవాణా రంగంలో భారతదేశం ఉత్పాదక సామర్థ్యాలకు మూలస్తంభంగా ఈ కంపెనీ నిలిచింది. పూర్తి స్వదేశీ డిజైన్‌ తయారీ సామర్థ్యాలు, అంతర్జాతీయ ప్రమాణాలతో అధునాతన ఉత్పత్తి పద్ధతులు, ఖచ్చితమైన నాణ్యతా విధానాలు, స్థానిక ఉపాధి మరియు నైపుణ్యాభివృద్ధికి గణనీయమైన సహకారం ఈ ప్లాంట్‌ ప్రత్యేకతలు. ఈ సంస్ధలో క్వాలిటీ, సప్లై చైన్‌, టెస్టింగ్‌ అండ్‌ కమిషనింగ్‌, ప్రొడక్షన్‌ అండ్‌ అసెంబ్లింగ్‌ తదితర రంగాల్లో సూపర్‌వైజర్‌, ప్లానర్‌, ఇన్‌కమింగ్‌ ఇన్‌ఫెక్షన్‌, క్యూఎంఎస్‌ ఇంజనీర్స్‌, ఫిటింగ్‌ ఇంజనీర్లు ఇలా అనే క్యాడర్లుగా పనిచేస్తున్నారు. శ్రామిక శక్తిలో కనీసం 25 శాతం దాకా మహిళలుండాలని ఆల్‌స్టామ్‌ ఇండియా లక్ష్యంగా నిర్ణయించుకుంది.

(ఫొటోలు. సంతోష్‌ ఇస్రం)

Tags:    

Similar News