ఆ సర్కస్(ర్) బడికి నేను పోను అమ్మా..

అమ్మా రెడ్లంటే ఏందే.. కులం అంటే ఏందే.. మనకి ఏమి లేవు అయిన మన ఇంటికి పోషిత్తులు తాత వస్తే కింద కూసుంటడు. మనం పైన కూసుంటాం.. ఎందుకట్లా..

Update: 2024-08-25 13:55 GMT

బడి నుంచి ఇంటికి రయ్యిన ఉరికివచ్చిండు ఎంకన్న.. మొస ఆపుకుంటూ.. ‘‘ అమ్మా మా సారు బడి ఫీజు ఇయ్యమన్నడే, లేకపోతే రేపటిసంది బడికి రాకన్నడే’’ అని చెప్పాడు.

ఎంకన్న వాళ్ల ఇంటికి కాస్త దూరంలో ఉన్న ఓ ప్రయివేట్ స్కూల్లో నాలుగో తరగతి చదువుతున్నాడు. తమ్ముడు రెండో తరగతి. ఇద్దరికి కలిసి ఆ గుర్తింపు లేని పాఠశాలలో నెలకి రూ. 55 కట్టాలి. ఎప్పుడూ పిల్లల స్కూలు ఫీజు విషయంలో ముందుండే రామమ్మ ఆ నెలలోనే ఎందుకో మరిచిపోయింది.
‘‘ రేపిత్త అని.. సారూకు చెప్పు పోరా ’’ అంటూ ఎంకన్నకి చెప్పింది. ‘‘ ఓకే అమ్మా.. నేను బడికి పోయి సారూకు చెప్తా’’ అంటూ వచ్చిన దారి పట్టాడు ఎంకన్న.. ఈ ఒక్క ముక్క ఇంగ్లీష్ కే రామమ్మ మురిసిపోయింది. కానీ ఇంకో రెండు నెలల్లో ఈ బడిలో నాలుగో తరగతి అయిపోతుంది.ఇప్పుడే ఆమె దిగులు ప్రారంభమయింది. ఇక బడిలో ఐదు నుంచి లేదు. రోజు ఊరికి వచ్చే వ్యానులో ముల్కనూర్ వెళ్లి చదువుకోవాలి. లేదా ఊళ్లోనే ఉన్న సర్కార్ బడికి పోవాలి.
రామమ్మ ఆలోచనలు ఎడతెగకుండా సాగుతూనే ఉన్నాయి. ‘‘ నెలకు రెండు మూడు వందలు ఫీజుకే గుంజుతరు. వ్యాను కిరాయికి ఇంకో వందయిన అడుగుతారు. ఎడ నుంచి తేవాలి పైసలు..’’ పాపం ఎంత ఆలోచించిన ఆమె ఆలోచనలకీ అంతుదరి అందడం లేదు.
‘‘ ఈ సంవత్సరమే ఇళ్లు జాగా కొని, రేకుల షెడ్డు ఏత్తిని. వాటికి తలుపులు లేవాయే.. నెలకు ముప్పై రూపాయలు ఈ ఇల్లు కిరాయి కట్టాలే, చంద్రయ్య సిన్నాయన ఓ నెల కిరాయి ఇవ్వకపోయిన ఏం అంటలేడు. ఇప్పుడు మల్ల వేరే ఊరికీ పెద్దోడిని బడికి పంపాలే.. పెద్దోడు పోతే ఇంకో ఏడో.. ఆ పై వచ్చే ఏడో సిన్నోడిని పంపాలే ’’ ఎలా చేయాలో రామమ్మకి అర్థం కావటం లేదు.
భర్త పద్మారెడ్డి లారీ డ్రైవర్. రోజుకి వంద వస్తాయి. పదిరోజులు లారీ నడిపి.. పది రోజులు ఇంటి దగ్గర ఉంటాడు. కానీ ఎప్పుడు ఇంట్లో జీతం పైసలు మాత్రం ఇవ్వడు. పిల్లలను చూసుకోవాల్సింది రామమ్మే. వాళ్లుండేది ఓ చిన్న రూమ్. రెండు మంచాలు కూడా అందులో సరిగా పట్టవు. పిల్లలు పుట్టినప్పుడు వాళ్ల మంచాలపైనే ఉయ్యాలా కట్టి ఊపేవారు. గట్టిగా ఊపితే ముందు.. వెనక గోడకో ఉయ్యాల తగులుతుంది.
‘‘ బుక్కెడు బువ్వ తిని బాయి కాడికిపోదాం.. అప్పటికే బత్తాయి తోట ఎండిపోయింది. వాటిని నరికి కట్టెల మోపులు కడదాం’’ అంటూ నడుచుకుంటూ పొలానికి బయల్దేరింది.
ఎండిపోయిన తోట ఎదురుగానే కనిపించింది. రామమ్మ కళ్లలో నీళ్లు తిరిగాయి. బావిలో నీళ్లు లేక ఎకరం బత్తాయి తోట ఎండిపోయింది. ప్రతి పసలుకు(సీజన్ కు) కనీసం ఓ ఐదువేలు వచ్చేవి. కొన్ని రోజులు నీళ్లు పెట్టినందుకు పక్క బావి అయినకు సగం పైసలు ఇచ్చేవాళ్లు. ఇప్పుడు ఏదీ లేదు. ఏం తినాలి.. పోరగాళ్లని ఎట్లసాదాలి. 
కాలం వేగంగా నడుస్తోంది. ఎంకన్న నాలుగో తరగతి అయిపోయింది. స్కూల్ లో కొంతమంది దోస్తులు ముల్కనూర్ పోవడానికి రెడీగా ఉంటే ఇంకొంత మంది సర్కార్ బడికి పోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఏదైన వాళ్ల నాన్నల నిర్ణయమే ఫైనల్ వాళ్లకి. అంతకుముందు ఉన్న వాళ్లకి ఐదో తరగతి కూడా వీళ్ల బడిలోనే ఉండేది. కానీ ఇప్పుడు తీసేశారు. కచ్చితంగా వేరే బడికి పోవాల్సిందే.
వరుసగా నాలుగో తరగతిలోనూ అనిల్ గాడే క్లాస్ ఫస్టు వచ్చాడు. వాడేంటో రెండో తరగతి నుంచి ఏ పరీక్ష పెట్టిన ఫస్టే. నువ్వేందుకు ఫస్ట్ వస్తావంటే.. మా నాన్న ఇంట్లో మూలకు చింతబరిగె పెట్టాడు. మార్కులు రాకపోతే తంతాడని చెబుతాడు. ఈ విషయంలో ఎంకన్న సేఫ్.. తన మార్కుల గురించి అడిగేవారు ఎవరూ లేరు. ఒక్కోసారి తన ప్రొగ్రెస్ కార్డు మీద సంతకం పెట్టడానికి వాళ్ల నాన్న కూడా ఉండడు. రెండో తరగతిలో రెండో ర్యాంకు వచ్చిన.. నాలుగో తరగతిలో నాలుగో ర్యాంకు వచ్చిన వాళ్ల నాన్న ముఖంలో సంతోషం కనిపించడం లేదు. ప్రొగ్రెస్ కార్డులో నాన్న కంటే.. అమ్మ వేలిముద్రలే ఎక్కువ.
స్కూల్లో టీసీ ఇచ్చారు. రామమ్మ బడికి వచ్చి పెద్దోడు ఎంకన్న ను సర్కార్ బడిలో జాయిన్ చేయడానికి అవసరమైన కాగితాలను తీసుకుంది. దానికి వంద రూపాయలు కట్టింది. ‘‘ సారూ అక్కడ మంచిగా సదువు సెప్తారా’’ ఆదుర్తా కొద్ది అడిగింది.
‘‘ నీకు తెల్వదా అక్క, సర్కార్ బడి ఎట్లుంటదని’’ చిన్నగా సమాధానమిచ్చాడు రాజయ్య సారూ.. ‘‘ పైసలు పోయిన మంచిదే అక్క, ఎంకన్నని ముల్కనూర్ కు పంపియ్యి’’ అని చెప్తున్నాడు.
‘‘ అమ్మ.. నేను ఆ సర్కస్ బడికి పోనే..నేను వ్యానులో ముల్కనూర్ కు పోత’’ అని ఎంకన్న వాళ్ల అమ్మ దగ్గర గావురం చేస్తున్నాడు. వాడికి సర్కార్ బడి అనడం రాక.. సర్కస్ బడి అంటున్నాడు. 
‘‘ సారూ మా పెద్దోడును ఇక్కడ జాయిన్ చెయ్యుర్రి. రాజయ్య బళ్లే మొన్నటి దాక సదివిండు’’ అంటూ గవర్నమెంట్ బడికి ఐదో తరగతిలో చేర్పించడానికి రామమ్మ వెళ్లింది. వంద రూపాయలు కట్టి స్కూల్లో జాయిన్ చేయించుకున్నారు ప్రైమరీ స్కూల్ స్కూల్ హెడ్ మాస్టారు.
ఎంకన్నకి సంతోషంగా ఉంది. దాదాపు అందరూ పాత బడి దోస్తులే ఇక్కడ. సంతోషంగా ఉంది. గవర్నమెంట్ బడిలో తొలిసారిగా బెంచీల మీద కూర్చున్నారు. రేపు ఫ్రీగా పుస్తకాలు ఇస్తారంట. చిన్న బడి( ప్రైమరీ స్కూల్ బాగుంది) చాలా పెద్దగా ఉంది. పక్కనే పెద్ద బడి( 1-5 చిన్న బడి, 6-10 పెద్దబడి అని తెలంగాణలో పిలుస్తారు). రూములో ఫ్యాన్లు ఉన్నాయి.
పిల్లలంతా సంతోషంగా ఉన్నారు. చిన్న ఆటోలో మండలాఫీసు నుంచి కొత్త పుస్తకాలు వచ్చాయి. కొద్దిగా పెద్దగా ఉన్న పిల్లలు పుస్తకాలను తీసుకెళ్లి రూములో ఓ మూల సదురుతున్నారు. ముందు ఐదో తరగతి వాళ్లకే ఇస్తామని, అందరూ లైన్ లో నిల్చోమని అప్పటికే క్లాసులో చెప్పారు.
హెచ్ ఎం పుస్తకాలు ఇస్తాం.. లైన్లో రండి అనగానే అందరూ ఉరికారు. ముందుగా ఆడ పిల్లలకు ఇచ్చారు. తరువాత మగపిల్లలకి ఇస్తున్నారు. తన వంతు రాగానే ఎంకన్న కూడా కిటీకిలోంచి చేతులు జాపాడు.
‘‘ నువ్వు పక్కకు జరగు ఎంకన్న..’’ అని సదాశివం సార్ చెబుతున్నాడు. ‘‘ సార్ నేను లైన్ లోనే వచ్చాను..’’ చెబుతున్నాడు ఎంకన్న. దొంగతనంగా పక్కలో నుంచి దూరాడనుకొని, సార్ పక్కకు జరగమని అంటున్నాడా..  
‘‘ చెప్తే అర్థంకాదా.. పక్కకు జరుగు’’ అంటూ సదాశివం కసురుకున్నాడు.
ఎంకన్న కళ్లలో నీళ్లు తిరిగాయి. తన వెనక ఉన్న అందరికి పుస్తకాలు ఇస్తున్నారు. అంతా అయిపోయారు. తరువాత నాలుగో తరగతి.. మూడో.. ఇలా పంచేశారు. అంతా అయిపోయారు.
‘‘ సార్ నాకు కొత్త బుక్కులు( పుస్తకాలు) ఇవ్వలేదు..’’ మళ్లీ అడిగాడు ఎంకన్న..
సదాశివం చెబుతూ.. ‘‘ నీ పేరు ఇక్కడ లేదు.. మీరు రెడ్డిలు.. పుస్తకాలు ఇవ్వరు.. బయట షాపులో అమ్ముతారు.. పోయి తెచ్చుకో’’ అంటూ సార్ సమాధానం ఇచ్చారు.
తలదించుకుని ఎంకన్న ఒక్కడే వెళ్లిపోయాడు. క్లాసులో అందరికి కొత్త పుస్తకాలు ఉన్నాయి. ఒక్క ఎంకన్న కి తప్ప. వాడికి తీవ్ర అవమానంగా ఉంది. ఎవరైన మందలిస్తే మాట బదులు కళ్లలో నుంచి నీళ్లు వచ్చేలా ఉన్నాయి.
సాయంత్రం ఆవేశంగా ఇంటికి వచ్చిన ఎంకన్న.. పుస్తకాల బ్యాగు పక్కన పడేశాడు. ‘‘ నేను ఆ సర్కస్ బడికి పోను’’ అంటూ ఏడ్వడం మొదలు పెట్టాడు.
అప్పుడెప్పుడో ఎంకన్న జాజిరి ఆట ఆడతానని అంటే.. వాళ్ల నాన్న మనం రెడ్లం.. ఆ ఆట ఆడొద్దు అని చెప్పినట్లు గుర్తు. దొంగతనంగా ఓ సారీ దోస్తులతో ఆడుకోవడానికి వెళ్తే నాన్న చూసి.. ఇంటికి గుంజుకుపోయిండు. అది మాదిగ, మన్నెపోళ్లు, కులం తక్కువోళ్లు ఆడుతరు. నువ్వు ఇంకోసారి కనిపిస్తే కారం పెడతా అని ఎంకన్నను గద్దరించాడు. ఆ తరువాత రెడ్లం అనే మాట ఇప్పుడు పుస్తకాలు ఇస్తున్నప్పుడు విన్నాడు.
మొత్తానికి ఎంకన్నకి రెండు పుస్తకాలతోనే ఐదో తరగతి గడిచింది. ఓ రోజు బత్తాయి కాయలు తెంపడానికి(కోయడానికి పోతే) 20 వచ్చాయి. ఐదో తరగతి తెలుగు పుస్తకం ఖరీదు కూడా 20 రూపాయలే అని వాడికి బాగా గుర్తు. తనకు అమ్మ ఆ పుస్తకం కొనిచ్చింది. అదొక్కటే రంగులతో ఉంది. మిగిలినవి ఏదో పాతకాలం పుస్తకాలు. అన్నీ దోస్తుల దగ్గర చూసినవే.
పద్మారెడ్డి వచ్చి ఆరో తరగతిలో జాయిన్ చేశాడు. ఈసారి కూడా అందరికి కొత్త పుస్తకాలు ఇస్తున్నారు. ఎంకన్నకి గత సంవత్సరం జరిగింది గుర్తుంది. ఈ సారి తెలివిగా అందరి కంటే వెనకాల నిల్చున్నాడు. కానీ ఈసారి ఫలితం మారలేదు.
‘‘ సారీ ఎంకన్న.. నీకు పుస్తకాలు లేవు. అందరికి ఇయ్యంగ మిగిలితే నీకు ఇస్తా’’ అంటూ కొమురయ్య సార్ తియ్యగా చెప్పాడు. ఎంకన్న ఏం మాట్లాడకుండా వెనక్కి వెళ్లి పోయాడు. వారం గడిచిపోయింది. ఈ సారి కూడా అందరికి కొత్త పుస్తకాలు వచ్చాయి. తనకి తప్ప..
‘‘ ఎంకన్న నిన్ను కొమురయ్య సార్ పిలుస్తున్నాడు’’ అంటూ కోట నరేష్ వచ్చి చెప్పాడు.. ఎంకడి ప్రాణం లేచి నిల్చుంది.
‘‘ రారా ఎంకి.. నీకు రెండు కొత్త పుస్తకాలు మిగిలినయి తీసుకో... ఇక్కడ పుస్తకాలు తీసుకుంటున్నట్లు సంతకం పెట్టు’’ అని సౌమ్యంగా చెబుతున్నాడు.
కొత్త పుస్తకాలు చూడగానే వాడికి సంతోషం ఉరకలు వేసింది. కానీ రెండేనా అనే నైరాశ్యం.. సంతకం పెట్టి అవి తీసుకున్నాడు. ఆరో తరగతి గడిచిపోయింది..
ఈ సారి ఏడో తరగతి బోర్డు ఎగ్జామ్.. అందరూ బాగా చదవాలి అని హెడ్ మాస్టర్ చెబుతున్నాడు. మీకు రేపు పుస్తకాలు ఇస్తాం.. అని హెచ్ఎం చెప్పగానే అంతా చప్పట్లు కొట్టారు. ఈ సారి లైన్ లో ఎంకన్న నిల్చోలేదు. వాడికి తెల్సు ఎం చెప్తారో.. మళ్లీ వారం తరువాత పిలిచారు. ఎప్పటి లాగే రెండు కొత్తవి.. ఈ సారి అదనంగా నాలుగు పాత పుస్తకాలు. అంతకుముందు సంవత్సరం వాళ్లు వాడినవి తిరిగి కొత్త పుస్తకాలు ఇచ్చేముందు తీసుకుని కుప్పగా పోస్తుంటారు. అందులో మంచివి ఎంకన్న నే వెతుక్కోమన్నారు.
పుస్తకాలు అన్నీ చిరిగి ఉన్నాయి. కొన్ని పుస్తకాల్లో కొన్ని ముఖ్యమైన పేజీలు లేవు. ఎలాగో అలా కొన్ని మంచివి దొరికాయి. అట్టలు లేవు అంతే..
ఎనిమిది.. తొమ్మిదిలో కూడా ఎంకన్న పుస్తకాలు ఇచ్చే లైన్ లో నిల్చోలేదు..
ఈ సారి పదో తరగతి.. మళ్లీ పుస్తకాలు ఇస్తున్నారు. ఈ సారి రవీందర్ రెడ్డి, రాజి రెడ్డి సార్లూ పుస్తకాల ఇంచార్జ్ లు.
మళ్లీ ఎంకన్న లైన్ లో నిల్చోలేదు. కానీ... ‘‘ ఎంకన్న అంటూ రవీందర్ రెడ్డి సార్ క్లాసుకి వచ్చారు’’ భయంగానే లేచి నిల్చున్నాడు వాడు.. పుస్తకాలు ఇచ్చే రూమ్ దగ్గరికి రారా అంటూ వెళ్లిపోయాడు..
పుస్తకాలు ఇచ్చే వాళ్లలో తన దోస్తులే ఉన్నారు. కొత్త పుస్తకాలు అన్ని తీసి తనకు ఇస్తున్నారు.
‘‘ సార్ మేము రెడ్లం.. మీరు పుస్తకాలు’’ అంటూ నసిగాడు. వాడి భయం వాడిది.. ఇచ్చి మళ్లీ తీసుకుంటారో అని..
‘‘ ఈ సారి డీఈఓ చెప్పారు. స్కూల్ లో పదో తరగతి వందశాతం పాస్ పర్సెంటేజీ ఉండాలని ఆర్డర్ ఇచ్చారు’’
‘‘ ఇదిగో కొత్త పుస్తకాలకు అట్టలు వేసుకో’’ అని రవీందర్ రెడ్డి పాత న్యూస్ పేపర్ ఇస్తున్నాడు... అందులో ఓ న్యూస్ కనిపిస్తోంది.. ‘‘ అప్పుల బాధతో పద్మారెడ్డి అనే రైతు పత్తి చేనులో ఆత్మహత్య చేసుకున్నాడని .. గతంలో లారీ డ్రైవర్ గా పనిచేసేవాడని...’’
( ఇది 20 ఏళ్ల కింద సంగతి ) 
Tags:    

Similar News