గంజాయితో భలే గమ్మత్తు, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్స్ రెడీ..
గంజాయి అంటే కేవలం మత్తు మాత్రమే కాదు.. మతిపోగెట్టె మరోన్నో ఉపయోగాలూ ఉన్నాయి.
‘ దమ్ మారో దమ్ ... ’ అంటూ 1971లో బాలీవుడ్ వచ్చిన పాట ఒక తరాన్ని మత్తుతో ఊపేసింది. అలా గంజాయి పాపులర్ అయింది. గంజాయి అంటే మత్తు పదార్ధం అని అందరికీ తెలుసు కానీ, గంజాయి నారతో ఇటుకలు తయారు చేస్తున్నారు. తెలంగాణలో ఒక మోడల్ హౌస్‌ని కూడా నిర్మిస్తున్నారు.ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది . శానిటరీ ప్యాడ్స్ ,టీషర్ట్‌లు తయారు చేస్తున్నారు. ఆ విశేషాలే ఈ కథనం.
ఒకపుడు మన్యం గ్రామాల్లో వందల ఎకరాల్లోనే గంజాయి తోటలు కనిపించేవి. కానీ ఇప్పుడు వేల ఎకరాల్లోకి విస్తరించిందని పార్వతీ పురంలోని పేర్లు వెల్లడించడానికి ఇష్టపడని రైతులు మాతో అన్నారు.
ఒక గంజాయి మొక్క నుంచి పావుకిలో వరకు గంజాయి పొడి, ఒక ఎకరం గంజాయి తోట నుంచి వెయ్యి కిలోల గంజాయి తయారవుతుందని కొందరు వ్యాపారులు అంటారు.
తెలంగాణలో కూడా గంజాయి కేసులు ఎక్కువ అవుతున్నాయి. దీంతో గంజాయి సాగు చేస్తే పథకాలు కట్ చేస్తామని నాలుగేళ్ల క్రితం... తెలంగాణ ప్రభుత్వం హెచ్చరించింది.
చట్టబద్ధం కాని ఈ సాగు మీద ఎందుకింత మోజు అంటే... గంజాయి పంట మీద ఎకరానికి రెండు సీజన్లలో దాదాపు రూ.50 లక్షల వరకు ఆదాయం వస్తుందని అల్లూరిసీతారామ రాజు జిల్లా , మారేడు మిల్లి మన్యంలో ఒక స్వచ్ఛంద సంస్ధ కార్యకర్త మాతో అన్నారు. దట్టమైన తూరుపు కనుమల్లోని అటవీ ప్రాంతాల్లో ఉండే చిన్నచిన్న ఆవాసాల్లో సజ్జలు, పసుపు, అపరాలు వంటి పంటల మధ్య గంజాయి మొక్కలను పెంచుతుంటారు, గుర్తించడం కష్టం.
గంజాయి అంటే మత్తు మాత్రమేనా?
తెలుగు రాష్ట్రాల్లో గంజాయి సాగు చట్ట విరుద్ధం అని అందరికీ తెలిసిందే..
గంజాయి వాడినా, అమ్మినా నేరమే!
గంజాయి అంటే కేవలం మత్తు మందేనా? ఆ మొక్కల వల్ల వేరే ఉపయోగాలు లేవా అనే కోణంలో ఉత్తరా ఖండ్‌కి చెందిన హిమాలయన్ హెంప్ సంస్ధ అధ్యయనం చేసింది. గంజాయి మొక్కల నుండి నారను తీసి అనేక పర్యావరణ హిత వస్తువులను తయారు చేయవచ్చని వారంటున్నారు.
ఈ స్టార్ట్ ఆప్ కంపెనీ తయారు చేసిన ఉత్పత్తుల గురించి వివరిస్తూ
‘‘ గంజాయి అంటే కేవలం మత్తు మందే కాదు. ఆ మొక్కల నుండి విలువైన వస్తువులు అనేకం తయారు చేయవచ్చు !’’ అన్నారు పర్యావరణ ఇంజనీర్ దిలీప్. ఉత్తరా ఖండ్‌కి చెందిన హిమాలయన్ హెంప్ సంస్ధ
గంజాయి నార నుండి, వివిధ రకాల ఎకో ఫ్రెండ్లీ ఉత్పత్తులు తయారు చేస్తున్నారు. ఆ టీమ్‌లో దిలీప్ సభ్యుడు.
దిలీప్ టీమ్, హిమాలయన్ హెంప్
ఆడపిల్లలకు ఆరోగ్య రక్ష !
మార్కెట్‌లో దొరికే శానిటరీ ప్యాడ్స్‌ని అధిక ధర పెట్టి కొనే స్తోమతు లేని బాలికల కోసం గంజాయినారతో ప్యాడ్స్ చేస్తున్నారు. ‘ శానిటరీ ప్యాడ్‌లను సాధారణంగా సింథటిక్, ప్లాస్టిక్‌తో రూపొందిస్తారు. వాటి వల్ల అనేక వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అదే గంజాయి నారతో తయారుచేసే ప్యాడ్‌లు ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడతాయి. అలాగే, మామూలు ప్యాడ్‌లు పర్యావరణానికి నష్టం కలిగిస్తాయి, ఈ ప్యాడ్‌లు మాత్రం భూమిలో తొందరగా కలిసిపోతాయి. ఇవి పర్యావరణ హితం . చాలా చౌక ధరకే ప్యాడ్స్‌తయారు చేసి, అందరికీ అందుబాటులో తెచ్చే ప్రయత్నంలో హిమాచల్ ప్రదేశ్‌లో ఫ్యాక్టరీ నెలకొల్పాం.’’ అని వివరించారు దిలీప్ కంకనాల.
శానిటరీ ప్యాడ్స్
రుతుక్రమం సమయంలో స్త్రీలకు దాదాపు 7 ప్యాడ్‌లు వరకూ అవసరం ఉంటుంది. మార్కెట్లో వాటి ధరలు కూడా ఎక్కువే. అయితే, సామాన్యులు వాటిని కొనే స్తోమత లేక ఇంకా పాత బట్టలను , మోటు పద్దతులను ఉపయోగిస్తూ పలు ఇన్ఫెక్షన్ బారిన పడుతున్నారు.
అలాంటి సమస్యలకు చెక్ పెట్టేలా .. వీరు తయారు చేసిన ఒక ప్యాడ్ 80 సార్లు రీయూజ్ చేయవచ్చు. ఒక ప్యాకెట్ కొంటే ఏడాదంతా వస్తుంది.
గంజాయి తో మాస్క్‌లు, టీ షర్ట్‌లు !
గంజాయి నుండి విలువ ఆధారిత ఉత్పత్తులను తయారు చేయడం పై గత కొంత కాలంగా పరిశోధనలు చేసిన హిమాలయన్ హెంప్ సంస్ద కొన్ని అరుదైన ఉత్పత్తులను తయారు చేశారు.
శానిటరీ ప్యాడ్స్‌తో పాటు, నార వస్తువులు, మాస్క్‌లు, టీషర్ట్‌లు, దారపు ఉండలు , వివిధ మోడల్స్‌లో దుస్తులు కూడా తయారు చేస్తున్నారు.
అవి త్వరలో దేశవ్యాప్తంగా మార్కెట్ లోకి రాబోతున్నాయి.
గంజాయి నారతో చేసిన పలు ఉత్పత్తులు
జనప నార తో కలల సౌదం
తెలంగాణలోని గజ్వేల్‌లో ఇంటి నిర్మాణం మొదలైంది. మరి కొన్ని నెలల్లో పూర్తి అవుతుందని నిర్మాణ పనులు చూస్తున్న శంకర్ మాకు చెప్పారు. జనప నార ఎండబెట్టి, ముక్కలు చేసి, పొట్టుగా చేస్తున్నారు. దానిని మట్టిలో కలిపి ఇటుకలు తయారు చేస్తున్నారు. అటవీ సంపదను కాపాడానికి , మూమూలు కలపకు ప్రత్యామ్నాయంగా జనప నార తో కలపతో ఇండ్లు కడుతున్నారు.
గంజాయి రొట్టను కలపి ఇటుకల కోసం మట్టి తయారీ
జనప నార ఇటుకలు, పలకలను ఇంటి నిర్మాణంలో వాడటం వల్ల దృఢంగా ఉంటాయి. ఇలా నిర్మించిన గృహాలు చలికాలంలో వెచ్చగా, వేసవిలో చల్లగా ఉంటాయని పర్యావరణ నిపుణులు అంటున్నారు.
జనప నార తో నారతో ఇంటి నిర్మాణం
విదేశాల్లో గంజాయి...
గంజాయిని అనేక దేశాలలో నిషేధించారు. కానీ,
అమెరికాలోని కొన్ని రాష్ట్రాలలో దీనిని వైద్యపరమైన అవసరాల కోసం ఉపయోగిస్తున్నారు.
గంజాయిని సాగు చేయడంతో పాటు ఆహారంగా వినియోగించడాన్ని థాయిలాండ్ చట్టబద్ధం చేసింది.అక్కడి దుకాణాల్లో చాలా రకాల గంజాయి ఉత్పత్తులు అమ్ముతున్నారు.