'ఇల్లొక రాజకీయం....' గీతాంజలి కొత్త కవితా సంకలనం

పైడిమర్రి గిరిజ సమీక్ష

Update: 2025-11-07 03:41 GMT

ఆమె అడవిని జయించింది, హస్బెండ్ స్టిచ్, పహెచాన్, ఆ మోహన్రావు ఉన్నాడు చూడండి మొదలైన ఎన్నో నవలలు, కథలు రాసిన గీతాంజలి రచనలు పలుభాషల్లోకి అనువాదమై జగద్వితమయ్యాయి. ఈ కవితా సంకలనంతో కవయిత్రిగా కూడా ఆధునిక సాహిత్య చరిత్రలో తన పేరును సుస్థిరం చేసుకున్నారు.

సాధారణంగా ఏదో ఒక అంశాన్ని తీసుకొని ఒకటో రెండో కవితలు రాయడం జరుగుతుంది. కానీ ఒకే అంశం మీద వరుసగా కవితలు రాయడం అంత తేలికైన విషయం కాదు. దానికి ఎంతో భావనాశక్తి, భాష మీద పట్టు ఉండాలి. గీతాంజలి ' ఇల్లు ' అంశం మీద రాసిన కవిత్వమే ఇల్లోక రాజకీయం ' అనే పుస్తకం. ఇందులో 41 కవితలున్నాయి. కొన్ని దీర్ఘ కవితలు కూడా ఉన్నాయి. వాటిని పాఠకుల సౌలభ్యం కొరకు రెండు నుంచి ఐదు భాగాలుగా విభజించడం జరిగింది. ఈ పుస్తకంలోని కవితలు చాలావరకు 'ఫెడరల్ తెలంగాణ' వెబ్ పత్రికలో, మరి కొన్ని కవితలు సంచిక, దిశ వెబ్ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. ఒకే అంశం మీద అధిక సంఖ్యలో వరుస కవితలు రాయడమనే ఒక కొత్త ఒరవడికి గీతాంజలి శ్రీకారం చుట్టారు. అందుకు అభినందనీయురాలు. ఇక కవితా విశ్లేషణలోకి వెళతాను. 


House is Political. ఇల్లోక రాజకీయ మనేది ఫైమినిస్టు సిద్ధాంతం. స్త్రీవాదం అనగానే అది కేవలం స్త్రీలకు సంబంధించిందని, పురుష వ్యతిరేకమనే దురభిప్రాయం ఒకటి సాహితీలోకంలో ప్రచారంలో వుంది. కానీ ఈ పుస్తకంలో చాలా వరకు రాజకీయ కవితలున్నా కొన్ని సెంటిమెంట్, మానవ విలువలు, పురుషులు, లౌకిక వాదం, విప్లవం, పాలస్తీనా, రియలెస్టేట్, మార్కెటికరణకు, సంబంధించిన కవితలు కూడా వున్నాయి.

భారతదేశ సంస్కృతిని కుటుంబ పునాది మీద అత్యంత దృఢంగా నిలబెట్టింది పితృస్వామ్య వ్యవస్థ. అలాంటి కుటుంబానికి ఆవాసం ఇల్లు. రాజ్యానికి సంక్షిప్త రూపమే యిల్లు అని స్త్రీవాదం గట్టిగా నమ్ముతుంది. ఈనాటికీ చాలామంది మహిళలు రాజకీయాలు తమకు అవసరం లేని విషయంగానే భావిస్తున్నారు. అందుకే ఇంట్లో జరిగే రాజకీయాలను వాళ్ళు అర్థం చేసుకోలేక పోతున్నారు. ఇళ్ళల్లో తాము అనుభవిస్తున్న బాధలు, కష్టాలను తమ తలరాతగా సరిపెట్టు కుంటున్నారు. పితృస్వామ్య వ్యవస్థ, మను ధర్మశాస్త్రం, కొన్ని వందల యేళ్లుగా సనాతన ధర్మం పేరిట స్త్రీలను అజ్ఞానంలో ఉంచింది.

"గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతీ

నర్మదే సింధు కావేరీ జిలేస్మిన్ సన్నిధం కురు"

అనే మంత్రాన్ని జపిస్తూ స్త్రీలు స్నానం చేయడానికి కారణం. ఇంటితో పాటు స్నానాల గదిని, మరుగుదొడ్లను కడిగి కడిగీ అమ్మ మురికై పోతుంది.

"కావలిస్తే .. శుభ్రపడడానికి, స్నానమంత్రాన్ని,

దేశంలో ఉన్న అన్ని పవిత్ర నదుల పేర్లని

జపించుకోమని అనుమతి ఇస్తాడు

అందుకే యుగాలుగా

స్త్రీలు స్నానాల గదుల్లో స్నాన మంత్రం జపిస్తుంటారు

తరువాతి తరానికి అందిస్తుంటారు." అంటారు.

'స్నానాల గది' అనే దీర్ఘ కవిత రెండు భాగాలుగా వుంది. హృదయ భారం దింపుకోవడానికి ఏడవడానికి కూడా ఇంట్లో ఎక్కడా చోటు లేని స్త్రీలు స్నానాల గదుల్లోనే ఆ పని చేస్తారని సర్వేలు చెపుతున్నాయి. కాసింత సమయం దొరికే చోటు అదే కావడం వల్ల కాబోలు స్త్రీలు అక్కడే తమ మనోవేదనకు మందువేసుకుంటున్నారు.

ఇదే విషయాన్ని ..

"అలవికాని దుఃఖాన్ని పెదవంచన భరించడానికి

స్నానాల గది శరణార్థి శిబిరంగా మారిపోయి,

ఆమెను అక్కున చేర్చుకుంటుంది." అంటారు గీతాంజలి.

స్త్రీలు వంటగదిని తమ సామ్రాజ్యంగా భావిస్తూ తామే ఆ సామ్రాజ్యానికి అధిపతులమనే భావనకు తరతరాలుగా కండిషనింగ్ అయి వున్నారు. రోలు రోకలి, ఇసుర్రాయి, కట్టెల పొయ్యి కాలం నుంచి మార్కెట్ మాయాజాలం వల్ల అవసరమైన ( మిక్సీ, గ్యాస్ స్టవ్ లాంటి) అన్ని వసతులతో కూడిన నేటి మాడ్యూలర్ కిచెన్ కాలం దాకా స్త్రీలు ఆ భావన నుంచి బయటకు రాలేక పోతున్నారు. ఈ పుస్తకంలో వంటిల్లు శీర్షికతో ప్రత్యేకమైన కవిత లేకపోయినా ( 80ల లో మోర్తాల విమల రాసిన వంటిల్లు కవిత చాలా ప్రాచుర్యం పొందడం వల్ల కవయిత్రి ప్రత్యేకంగా ఆ శీర్షికతో కవిత రాయలేదు కాబోలు. ) వంటింట్లో నులక మంచం, వంటింట్లో ఆమె కథల పుస్తకం పేరుతో రెండు కవితలున్నాయి.

"జ్వరం లోనూ ఆమె రెస్ట్ రూం వంటగదే!

ఆమెకు ఎప్పుడో ఒకసారే జ్వరం వస్తుంది!

కానీ ఇంట్లో అందరూ అన్ని ఋతువులలో జ్వరపీడితులే!

103 డిగ్రీల జ్వరం మాత్రమే ఆమెను పడుకోనిస్తుంది."

...

"రోగం లేని రోగ పీడితులకు వంటచేసి పెడుతూ,

చివరికి ఇక పడక గదికి వంట గదికీ మధ్య తిరగలేక,

ఇక ఆమె ఆగ్రహంగా కొత్త రకపు తిరుగుబాటు చేస్తుంది!

ఆమె వంటింట్లోనే నులక మంచం వేసుకుంటుంది." అంటారు వంటింట్లో నులక మంచం అనే కవితలో.

ఇదే కవితలో.. కోడలికి జ్వరము వచ్చినప్పుడు, నెలసరి వచ్చినప్పుడు మాత్రమే అత్తగారి బిపి పెరగడం, బాస్ రాక్షసుడు సెలవు ఇవ్వక సతాయిస్తున్నాడని మొగుడు ( కొడుకు ) విసుక్కోవడం లాంటి కుటుంబంలోని రాజకీయాలను వివరంగా చెప్పుకొచ్చారు గీతాంజలి.

"ఆడదానికి ఆడదే శత్రువు " అనే నానుడిని స్త్రీ వాదం అంగీకరించదు. వంటింట్లో వుండే కంచాలకు కూడా జెండర్ వుంటుందని 'ఆడ కంచం - మగ కంచం' అనే కవితలో చెపుతారు.

ఈ దీర్ఘ కవితను మూడు భాగాలుగా విభజించారు. ఇదే కవితలో.. 'అమ్మచేతి వంట అమృతం ' అనే నానుడి భాషలో ఎంతగా బలపడిందంటే .. ఈనాడు ఎక్కడ చూసినా అమ్మచేతి వంట, ఇంటివంట పేర్లతో హోటళ్లు కనిపిస్తాయి. అమ్మ ఇంటి శ్రమ మార్కెటీకరణ అయిందన్నమాట.

"అమ్మచేతి వంట అమృతం అనడంలో ఎంత విషం ..

ఎంత శ్రమ దోపిడీ ఎన్ని యుగాలుగా వుందో,

ఎవరు లెక్క తేల్చాలి ఇప్పుడు?" అంటారు కవయిత్రి.

మహిళల మనస్సునూ శరీరాన్ని పీల్చి పిప్పి చేసేది ఇంట్లోని పడక గది. ఇది వంటిల్లు కన్నా ప్రమాదకరమైంది. బెడ్ రూం అనే పేరుతో రాసిన దీర్ఘ కవిత నాలుగు భాగాలుగా వుంది. పెళ్ళి కాని కన్నెపిల్లలకు పడక గది .. కలలగది, కమ్మగా నిద్ర పుచ్చే అమ్మ ఒడి, పడకగదిలో వున్న మంచం మత్తుగా నిద్రపుచ్చే మధుపాత్ర. దాని మీద వున్న పరుపు ఆమెనేమాత్రం గాయపరచని మెత్తని పత్తిపూల తోట. ఒక్కమాటలో చెప్పాలంటే.. అది ఆమె స్వేచ్చా పతాక. పెళ్లై బియ్యం చెంబును కాలితో తన్ని అత్తగారింట్లో గృహ ప్రవేశం చేశాక అసలు కథ మొదలవుతుంది.

"ఇక ఆ క్షణం నుంచీ

పడక గది మగాడిగా మార్చబడుతుంది.

పడకగది రోజూ ఆమెకి లిట్మస్ పరీక్ష చేసే లేబొరేటరీ

....

ఆమె పాలిట పడకగదిగా మారిన అతడు,

ఆమె రెక్కల్ని కత్తిరించి గది గోడలకు వేలాడ దీస్తాడు."

పడకగది ఆమె గర్భసంచిని పిల్లల గదిగా మార్చి పడేస్తుంది."

ఆ తరువాత పడకగది ఆమెదైన పూర్వపు సౌగంధాన్ని కోల్పోయి మంచం కూడా నొప్పితో విలవిల్లాడుతుంది. అప్పుడు...

"పరుపు మీదున్న తెల్లని దుప్పటి

ఆమెని మృత వస్త్రమై చుట్టేస్తుంది." అంటారు గీతాంజలి.

పడకగదులలో చాలామంది స్త్రీలు అనుభవిస్తున్న వేదనను ఇంతకంటే ఆర్ద్రంగా ఎవరూ చెప్పలేరు. చివరకు పడకగది పర్యవసానం.. స్త్రీని జీవచ్చవంగా మార్చడమే, ఆత్మ హత్యకు పురికొల్పడమో లేదా హత్యకు ప్రేరేపించడమో.. ఏదైతేనేం .. హింసకు పునాది, ప్రేరణ పితృస్వామ్యమే కదా.. ఇంటిగోడలు పగుళ్ళకు కారణాన్ని ఎంత కవితాత్మకంగా చెప్పారో ఈ కింది కవితా పంక్తులు తెలుపుతాయి.

"యుగాల తరబడి ఇంటిగోడలు,

తన చెవులతో ఇంటి విషాద దుఃఖ కథల్ని వింటూ

ఇంట్లోని రంగస్థల నాటకాల్ని చూస్తూ,

కఠినమై, పిగిలిపోయి, పగుళ్ళువారిపోతాయి!"

ఇంటి గోడలకు రంగులు వేయడాన్ని కూడా భలే కవితాత్మకంగా చెప్పారు గీతాంజలి.

" గోడల మధ్య మనుషులు చేసే కుట్రలు..

గోడలచాటున చేసే హత్యలు వినలేక,

చూడలేక దాచాలని

మరిన్ని కొత్తరంగుల్ని, పొరలు పొరలుగా వేసుకుంటుందేమో గోడ?"

ఇదే గోడను మరొకచోట లౌకికవాదానికి ప్రతీకగా చెపుతారు కవయిత్రి.

"కొన్ని ఇంటిగోడలు ..

రాముడు, కృష్ణుడి బొమ్మల్ని తిరస్కరిస్తాయి

మార్క్స్, అంబేద్కర్, బుద్దుడు, భగత్ సింగ్ బొమ్మల్ని,

అమరులైన అన్నల బొమ్మల్ని,

ఎర్రెర్రని సుత్తి కొడవలిని గర్వంగా మోస్తాయి.

ఆ పటాలను మోస్తూ గోడలు

వినమ్రంగా తల వంచుకుని నిలబెడతాయి.

ఇంటిగోడలు కాస్తా స్తూపాలవుతాయి!"

'గోడలు' దీర్ఘ కవిత మూడు భాగాలలో గోడల గురించి ఇలా పలు కోణాలలో చెప్పడం చాలా బాగుంది. ఇంటికి కిటికీలు ఎంతో ముఖ్యం. వాటి గురించి గీతాంజలి ఏం చెప్పారో చూద్దాం.

"పడకగది కిటికీ, భోజనాల గది కిటికీ, వసారా కిటికీ,

వంటింటి కిటికీ అన్ని కిటికీలు రాత్రి సమావేశమవుతాయి.

కబుర్లతో, కన్నీళ్ళతో, నవ్వులతో, వెక్కిరింతలతో,

వెక్కిళ్లతో గుసగుసలు పోతుంటాయి.

కిటికీల సమావేశంలో అమ్మల బాధలే ఎజెండా!"

ఇంట్లో బందీ అయిన మహిళ మనసు బాగో లేనప్పుడు ప్రేమగా చేరేది కిటికీ చెంతకే .. మరి అప్పుడు కిటికీ ఏం చేస్తుంది? గీతాంజలి మాటల్లో .. తలుపులు మూసుకున్నప్పుడు కిటికీలు తెరుచుకుంటాయి.

"కిటికీ నీకు సూర్యుణ్ని ... చంద్రుణ్ని చూపించి

నీలోంచి చీకటిని తీసుకుని,

వెలుతురుని, వెన్నెలని నింపుతుంది

నీకు ఊపిరిని అందిస్తూ

మొత్తం భూగోళాన్ని చూపిస్తుంది"

'కిటికీ' దీర్ఘ కవితలో గీతాంజలి ప్రయోగించిన ప్రతీకలు పాఠకులను అబ్బుర పరుస్తాయి. చిత్రకారిణి, కెమెరా, జడ్జి, కన్ను, చెవి, పహారాదారు లాంటివి. ఇంటి తలుపుల మీద రెండు భాగాలుగా వున్న దీర్ఘకవితలో.. కుల,మత, ప్రాంత వివక్ష చూపించి ఇంట్లోకి రానివ్వని తలుపుల గురించి ఇలా ...

"కొన్ని తలుపులు దయలేనివి,

ఇసుమంత కఠినమైనవి

బహుశా మనుషులకి మల్లే

ప్రేమ, కరుణ దొరకనివి!

ఎంతకీ తెరుచుకోనే తెరుచుకోవు,

బిగుసుకు పోతాయి

ఇంకొన్ని తలుపులకు కులమూ.. మతమూ..

ప్రాంతమూఉంటాయి

మురికితో జిడ్డు కారే జంధ్యంతో,

అంటరానితనం పాటిస్తాయి"

మానవ స్వభావం లాగానే తలుపుల్లో కూడా పలురకాలని చెపుతూ దర్వాజాను ఇంటి ఊపిరితిత్తులుగా ఉత్సప్రేక్షస్తుంది కవయిత్రి.

"తలుపులు మొత్తానికి మానవ హృదయమంత

విశాలమైనవి, కురచయినవి కూడా.."

....

"ఎంతటి మహారాణివో కదా నువ్వు ఓ నా దర్వాజా

నీ ఇష్టమే కదా ఇంట్లోకి రానివ్వడం .. రానివ్వకపోవడం?

ఇంటి శ్వాసను ఆపేసే ఊపిరితిత్తువు కదా నువ్వు?"

ఇంట్లో మహిళల్ని ఊపిరాడకుండా చేసి బంధించేవి, ఆమె స్వేచ్ఛకు బార్లా తెరుచుకునేవీ తలుపులే. అవి ఎప్పుడూ ఛాయిస్ ఇస్తూనే వుంటాయి. లోపలికి రావడానికైనా .. బయటకు పోవరానికైనా. అంతేకాదు, ఇంట్లోని రహస్యాలు, కన్నీళ్ళు బయటవాళ్ళకు కనబడకుండా అప్పుడప్పుడు దభాలున మూసుకొని కూడా పోతాయి.

కేవలం గోడలు, కిటికీలు, తలుపులే కాదు ఇంట్లోని మంచాలు, కంచాలు, ఇంటి ముందరి వాకిలి, ఇంటి వెనక పెరడు, ఇంటి పైన డాబాను కూడా ఇంట్లోని భాగాలుగానే గీతాంజలి చూసారు. అందుకే ఈ కవితా సంకలనంలో అవికూడా కవితా వస్తువులయ్యాయి. పెరడు దీర్ఘ కవిత మూడు భాగాలు, వాకిలి దీర్ఘ కవిత ఐదు భాగాలుగా ఉన్నాయి.

"నిజాన్ని, నిశ్శబ్దంగా

పెరడు తనలో భూస్థాపితం చేసుకుంటుంది

ఆ రాత్రి ఇల్లు ప్రశాంతంగా నిద్రపోతే..

పెరడు అశాంతితో మెలకువగానే ఉంటుంది

అనాదిగా పెరడుకి

ఇదొక పునరావృతం పురాజ్ఞాపకం"

...

"ఇల్లు తలుపులు, కిటికీలు మూసేసి

కొన్ని దాచిపెడుతుంది

పెరడులో మాత్రం అంతా బహిరంగమే ..!"అంటారు.

అంట్లుతోమే ఈశ్వరమ్మ మడిచీర ముట్టనివ్వని కుల గజ్జి వాసన కూడా పెరట్లో ఉంటుదని చెప్పి కుల వివక్షను ఎత్తి చూపించారు. వాకిలి కవితలో కొంత సెంటిమెంటు, మరికొంత నాస్టాలజీతో పాటు పారిశుధ్య కార్మికుల పట్ల గౌరవం, రియలెస్టేట్ విస్తరణా కనిపిస్తుంది.

"పొద్దున్నే రోడ్లు ఊడిచే మునిసిపాలిటీ యాదమ్మ

వాకిలి ఊడిచే అమ్మ చూపులు

అన్యోన్యంగా కలుసుకుంటాయి

నువ్వూ నేనూ ఒకటే అన్నట్లు

ఒక మార్మికమైన నవ్వుని తర్జుమా చేసుకుంటాయి

యుగాలనుంచి

ఒకరికొకరు గుర్తు పట్టిన పురాజ్ఞాపకాలువాళ్ళు" ఇందులో అనాదిగా స్త్రీల శ్రమ ఒకటే అన్న ధ్వన్యర్థం కూడా ఉంది.

ఈ పుస్తకంలోని కవితలలో చాలా చోట్లా సారమ్మ, పద్మ లాంటి శ్రామిక స్త్రీల పట్ల కవయిత్రి సహానుభూతి ప్రకటిస్తుంది.

"వాకిలి ఎందరికో ఆశ్రయం ఇచ్చే ఒక ఆరు బయటి ఇల్లు."

"వాకిలిని దొంగిలించడానికి వచ్చిన పట్నాన్ని వెళ్ళగొట్టు" అంటూ రియలెస్టేట్ విస్తరణ వల్ల అపార్ట్మెంట్ కల్చర్ వచ్చేసి ఈనాడు నగరాలలో వాకిళ్లు కబళించబడడాన్ని సూచించించారు కవయిత్రి.

ఇంట్లో భాగమైన డాబా దీర్ఘకవిత రెండుభాగాలుగా వుంది. ఇంట్లో ఎవరికి ఏ దుఃఖం వచ్చినా ముందుగా వెళ్ళేది డాబా మీదకే.. రియలెస్టేట్ కారణంగా క్రమంగా డాబా యిళ్లు పోయి అపార్ట్మెంట్లు లేస్తున్నాయి.

"ఇప్పుడు డాబా మాయం అయిపోయింది

డాబా గుండెల మీద మరొక ఇల్లు లేస్తుంది

వెక్కిక్కి ఏడ్చే డాబా దుఃఖం ఎవరికీ వినపడదు

వాళ్ళకి డాబా అంటే డబ్బులు, రియల్ ఎస్టేట్ మాత్రమే!"అంటారు గీతాంజలి.

స్త్రీ వాదం అంటే పురుష ద్వేషం కాదు, స్త్రీ పురుష సమానత్వం. అందుకే ఈ కవితా సంకలనంలో పురుష కోణంలో రాసిన కవితలున్నాయి. పడకగది దీర్ఘకవిత నాలుగో భాగంలో.. దేహాన్ని కాకుండా ఆమెను ప్రేమించే పడకగదులు అంటూ పురుషకోణంలో అద్భుతంగా రాసారు కవయిత్రి.

"అతని ఒక్క చూపుతోటే, ఒక్క ముద్దు తోటే

ఆమె మనోదేహాలు రెండూ పులకరించిపోతాయి

ఆమె అతడికి దేవత!

అతడు ఆమెకి చందమామని తెచ్చి

ఆమె పడకగదిలో వెలిగించే ప్రియుడు!

శృంగార మంటే దేహాల రాపిడి మాత్రమే కాదంటాడు!

శృంగార భాషకి లిపి ప్రేమ అంటాడు!"

'ఆడకంచం- మగకంచం' అనే కవితలో మనువుని తప్పించుకున్న కొంత మంది పురుషుల గురించి చెపుతూ ..

"అమ్మ కంచం నింపే నాన్నలు ఉన్నారు!

మనువుని తప్పించుకుని

మనుషులుగా మిగిలిన నాన్నలున్నారు!

నూతన మానవులు వాళ్ళు!"అంటారు గీతాంజలి.

భార్యాభర్తలలో భార్య చనిపోయి, పూర్తిగా భార్యపై ఆధారపడి ఒంటరిగా మిగిలిపోయిన భర్తల వేదన చెప్పనలవి కానిది.

"ఎవరూ పలకరించనప్పుడు

ఎలా వున్నావని అడగనప్పుడు

గది తలుపులు మూసి,

మాటల తిజోరి తెరిచి

భార్యతో మాట్లాడుతుంటాడు" అలాంటి ఆయనను పలకరించి, ఇంటికి పిలిచి కమ్మటి భోజనం వడ్డించాలని అంటారు.

భార్య ఉన్నప్పుడు ఆమెను పట్టించుకోకుండా ఆమె వెళ్లిపోయాక పశ్చాత్తాపంతో కుమిలిపోయే మగవాళ్ళు సమాజంలో కనిపిస్తారు.

"ఆమెకి జ్వరం వస్తే

నుదుటి మీద చెయ్యి ఐనా వేసి చూడలేదు

డోలో 650ని ఆమె గుటకలు, గుటకలుగా,

కన్నీళ్ళతో సహా మింగడాన్ని,

చూసీ చూడనట్టే ఉండిపోయాను!" అని వాపోతాడు ‘ఆమె వెళ్ళిపోయింది’ అనే కవితలో..

నాన్నలేని ఇల్లు .. పక్షి లేని గూడులా తుఫానుకి ఆరిపోయిన దీపంలా చెలియలి కట్టతెగిన చెరువులా ఉందంటూ చక్కని ఉపమానాలతో వర్ణిస్తారు.

'నాన్నా నువ్వులేని ఇల్లు' అనే కవితలో.. పదవీవిరమణ పొందిన పురుషులు ఆ తర్వాత ఏదో వొక వ్యాపకం పెట్టుకోకపోతే .. ఆ గృహిణుల అవస్థలు మాటల్లో చెప్పలేం. అది భరించలేక ఆ వయసులో కూడా విడిపోయిన జంటలు నాకు తెలుసు. ఇలాంటి విషయాలనే "నువ్వు రిటైర్డ్ అయితే నాకేంటట " అనే కవితలో చెప్పారు.

సామాజిక బాధ్యత కలిగిన ఒక కవయిత్రిగా రిటైర్డ్ అయిన తర్వాత ఏం చేయాలో కూడా చెప్పారు మరోకవితలో.. ఈ కవితా సంకలనంలో మకుటాయమానమైన కవిత 'ఇల్లోక రాజకీయం' అనేది. దాని పైన ఏకంగా ఒక వ్యాసమే రాయొచ్చు. అందుకే పుస్తకానికి కూడా ఆ శీర్షిక పెట్టి వుంటారు. ఈ కవితా సంకలనంలో గీతాంజలి ప్రయోగించిన ప్రతీకలు, గాఢమైన పదబంధాలు .. సాహిత్య లోకంలో కవయిత్రిగా ఆమె పేరును శాశ్వతం చేసాయి. ఒక సాహిత్య విద్యార్థిగా నేను చదివిన కవిత్వంలో ఎక్కడా కామాలు, ఫుల్ స్టాప్ లు కనిపించలేదు. (,.). కవిత్వంలో అవి ఉండవు కూడా.. చివరి కవితలలో అక్షరదోషాలు కూడా ఉన్నాయి.

Tags:    

Similar News