Crisis in YSRCP | వైసీపీలో ముసలం... తెరవెనుక కథేమిటి?
x

Crisis in YSRCP | వైసీపీలో ముసలం... తెరవెనుక కథేమిటి?

రాజ్యసభ పదవి, పార్టీకి విజయసాయిరెడ్డి రాజీనామా చేశారు. ఇంతకీ జగన్ తాడేపల్లి నివాసంలో ఏం జరిగింది.


రాష్ట్రంలో రాజకీయాలు ప్రధానంగా వైసీపీ (YSRCP) వ్యవహారాలు ఆసక్తికరంగా మారాయి. ఆ పార్టీలో నంబర్-2గా ఉన్న విజయసాయిరెడ్డి నిష్క్రమణ అంతర్గత వ్యవహారం చర్చకు తెర తీసింది. పార్టీలో ముసలం వెనుక మాజీ సీఎం వైఎస్ జగన్ ఒంటెత్తు పోకడలే కారణంగా చెబుతున్నారు. లండన్ వెళ్లడానికి ముందు తాడేపల్లి నివాసంలో విజయసాయిరెడ్డిని వైఎస్. జగన్ తీవ్రంగా హెచ్చరికలు కూడా జారీ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి..

"ఉన్న కేసులకు తోడు అంతర్గతంగా ఎదురవుతున్న సవాళ్ల కారణంగానే" విజయసాయిరెడ్డి రాజకీయాల నుంచి తప్పుకోవడంతో వైసీపీలో ముసలం తెరమీదకు వచ్చింది.

వైఎస్ కుటుంబంతో అనుబంధం ఎలా..
నెల్లూరుకు చెందిన చార్టెడ్ అకౌంటెంట్ విజయసాయిరెడ్డికి వైఎస్సార్ కుటుంబంతో ఉన్న అనుబంధం ఏమిటి? ఆయనకు అంత ప్రాధాన్యత ఇవ్వడానికి కారణం ఏమిటి? ఆయన రాజకీయాల్లోకి రావడానికి ప్రధాన కారకుడైన దివంగత సీఎం వైఎస్ఆర్ తరహా ఆదరణ వైఎస్ జగన్ నుంచి ఉందా? ఒకవేళ ఉంటే ఈ ఉత్పాతం ఎందుకు ఏర్పడింది? అనే విషయాలను ఒకసారి పరిశీలిస్తే.
పులివెందుల వైఎస్సార్ కుటుంబానికి అత్యంత ఆప్తుడు వేనంబాకం విజయసాయిరెడ్డి. దశాబ్దాల కాలంగా ఆ కుటుంబానికి నమ్మినబంటు. దివంగత సీఎం వైఎస్ఆర్ కాలంలో ఆయన టీటీడీ పాలకమండలి సభ్యుడిగా నియమితులు కావడం ద్వారా రాజకీయాల్లోకి అడుగుపెట్టినట్లు చెప్పవచ్చు. అంతకుముందు వైఎస్సార్ తండ్రి వైఎస్ రాజారెడ్డి కాలం నుంచి వారి కుటుంబానికి విజయసాయిరెడ్డికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.
కడప జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం ఓబులవారిపల్లె మండలం మంగంపేట బరైటీస్ ( ముగ్గురాళ్ళ గనులు)లో రాజారెడ్డికి భాగస్వామ్యం ఉండేది. చెన్నైలో ఉంటూ ఈ వ్యాపార లావాదేవీల విజయసాయిరెడ్డి ఆడిటింగ్ వ్యవహారాలు చూసేవారు. ఆ తర్వాత వైఎస్ఆర్ తో కూడా ఆయనకు సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. మారారు. ఇలా ఉంటే,
2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం వైఎస్ఆర్ సీఎం అయ్యాక విజయసాయిరెడ్డికి టీటీడీలో బోర్డు సభ్యుడిగా అవకాశం ఇవ్వడం ద్వారా రాజకీయాలలోకి రావడానికి దారితీసిందని చెప్పవచ్చు.
2009 ఎన్నికల తర్వాత కొన్నాళ్లకే వైఎఆర్ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. అప్పటికే రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తున్న విజయసాయిరెడ్డి కూడా రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీలో ప్రధాన వ్యక్తిగా నిలిచారు. వైఎస్ఆర్ వారసుడిగా వైయస్ జగన్ సీఎం చేయాలనే నినాదం ఊపందుకుంది. దీనికి ఏఐసిసి అధినేత్రి సోనియా గాంధీ అంగీకరించకుండా, సీనియర్ నేత అయిన కొణిజేటి రోశయ్యకు అవకాశం కల్పించారు. కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ పెద్దలు జగన్ ముందు ఓ ప్రతిపాదన ఉంచారు.
"కేంద్ర మంత్రి పదవి ఇవ్వడం. అనుభవం సాధించాక సీఎం పదవి ఇచ్చే అవకాశం పరిశీలిస్తాం" అనేది వారి ప్రతిపాదన. దీనికి వైఎస్. జగన్ అంగీకరించకుండా, మొండిగానే తన తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేక ప్రాణాలు వదిలిన వారి కుటుంబాల కోసం నిర్వహించిన ఓదార్పు యాత్ర కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపింది. దీనిపై కూడా ఏఐసిసి ఢిల్లీ పెద్దలు అభ్యంతరాలు చెప్పిన నేపథ్యంలో కడప ఎంపీగా జగన్ ఆ పదవితో పాటు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. అప్పటివరకు వెంట ఉన్న వైఎస్సార్ ఆత్మగా చెప్పే కెవిపి రామచంద్రరావు పక్కకు తప్పుకున్నారు. విజయసాయిరెడ్డి మాత్రం జగన్ వెంటే నిలిచారు. ఈ పరిస్థితుల్లో కడప నుంచి వైయస్ జగన్, పులివెందులలో ఖాళీ అయిన వైయస్సార్ స్థానం నుంచి ఆయన భార్య వైఎస్ విజయమ్మ ఉప ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి సవాల్ విసిరారు.
ధీమా పెంచిన విజయం
రోజురోజుకు పెరుగుతున్న ఆదరణ నేపథ్యంలో 18 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు పదవులకు రాజీనామా చేసి జగన్ శిబిరంలో చేరారు. ఉప ఎన్నికల్లో15 మంది విజయం సాధించడంతో వైఎస్. జగన్ కు మరింత ప్రాధాన్యం పెరిగింది. రాష్ట్ర విభజన తర్వాత
2014 ఎన్నికల్లో వైసిపి 64 స్థానాలతో ప్రధాన ప్రతిపక్షంగా నిలిస్తే, అటు తెలంగాణ, ఏపీలో కాంగ్రెస్ పార్టీ అడ్రస్ గల్లంతయింది. ఈ ఎపిసోడ్లో వైఎస్సార్ అభిమానులు, రాజకీయంగా లబ్ధి పొందిన నాయకులతో పాటు విజయసాయిరెడ్డి పాత్ర కూడా కీలకంగా పనిచేసిందని చెప్పవచ్చు.
రాజ్యసభతో ప్రాధాన్యం
అందుకు ప్రతిఫలంగా విజయసాయిరెడ్డికి రాజ్యసభ పదవి ఇవ్వడం ద్వారా వైయస్ జగన్ తన తండ్రి మాదిరే ప్రాధాన్యత ఇచ్చారు. విభజనకు ముందే క్విడ్ ప్రో కో ద్వారా తండ్రి వైయస్సార్ పదవిని అడ్డుపెట్టుకొని జగన్ అక్రమాస్తులు సంపాదించారనే కేసులో ఆయనతో పాటు A-2 గా విజయసాయిరెడ్డిని కూడా అరెస్టు చేశారు. దీంతో జగన్ కుమరింత సానుభూతి లభించింది. ఇదే వ్యవహారం..
ఢిల్లీలో ట్రబుల్ షూటర్
2019 ఎన్నికల్లో అద్వితీయమైన మెజారిటీ వైసీపీకి దక్కింది. అప్పటికే వెంటాడుతున్న అక్రమాస్తుల కేసులతో పాటు ఇంకొన్ని సమస్యల నేపథ్యంలోకేంద్రంలో బిజెపితో వైసిపి సన్నిహితంగా మెలగడానికి అడుగులు వేయించాయి. అప్పటికే రాజ్యసభ సభ్యుడుగా ఉన్న విజయసాయిరెడ్డి పార్టీ వ్యవహారాలను ఢిల్లీ స్థాయిలో చక్కదిద్దడం తోపాటు ట్రబుల్ షూటర్ గా కూడా కీలకంగా వ్యవహరించారనే విషయం బహిరంగ రహస్యం.
సజ్జలతో మారిన సీన్
కొన్ని నెలల పాటు వ్యవహారాలు చక్కగా సాగినప్పటికీ, సాక్షి ఫైనాన్షియల్ డైరెక్టర్ గా ఉన్న సభ్యుల రామకృష్ణారెడ్డి వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులైన తర్వాత పరిణామాలు వివిధ రూపాల సంతరించుకున్నట్లు చెబుతారు. జగన్ స్థానంలోనే ఉన్నట్టు సజ్జల సకల శాఖల మంత్రిగా వ్యవహరించారనేది సర్వత్రా వినిపించిన మాట. ఈ పరిస్థితుల్లోనే విజయసాయిరెడ్డికి ఉత్తరాంధ్ర పార్టీ బాధ్యతలు అప్పగించినా, మొదట ఉన్న ప్రాధాన్యత కొరవడినట్లు వినిపించింది.
2024 ఎన్నికల్లో వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత వలస వచ్చిన నాయకులందరూ ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. చివరికి జగన్ ఇచ్చిన రాజ్యసభ, శాసనమండలి సభ్యత్వాలు కూడా వదులుకున్నారు. మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు కూడా దారి మార్చుకున్నారు. దీనికి వారు చెప్పిన కారణం ఒకటే.
"జగన్ ది నియంతృత్వ ధోరణి. ఎవరు చెప్పినా వినడు. తాను అనుకున్నది చేయాలంటారు" అనేవి ప్రధాన ఆరోపణలు.
వైసీపీ ప్రతిపక్షంలో ఉండగా ప్రధాన గొంతుకలుగా నిలిచిన సీనియర్ నేతలు కూడా పక్కకు తప్పుకున్నారు. ఆ కోవలోనే పార్టీని వీడిన మహిళా కమిషన్ మాజీ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ఘాటైన వ్యాఖ్యలు చేశారు.
"ఎన్నికలకు ముందు బుద్ధి ఉన్న వారెవరైనా ప్రతిపక్ష నేత చంద్రబాబును అరెస్టు చేస్తారా? " అని జగన్ అనుసరించిన తీరును తప్పుపట్టారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు తమ మాటలకు విలువే లేదని కూడా ఆమె చెప్పుకొచ్చారు.
ఎన్నికల ఫలితాల అనంతరం పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి మొదట స్పందించారు.
"జగన్ దగ్గరికి మమ్మల్ని కోటరీ రానివ్వలేదు. విలువ లేకుండా చేశారు. నా మాట వినే వారు కూడా లేరు" అని చెప్పడం ద్వారా జగన్ నియంతృత్వ ధోరణిని వెల్లడించిన విషయం తెలిసిందే. కాగా, వైసీపీలో నంబర్ టూ గా ఉన్న విజయసాయిరెడ్డి రాత్రికిరాత్రి తీసుకున్న నిర్ణయం కాదనేది పరిశీలకుల అంచనా.
కేసులు.. అంతర్గత పోరు
వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత టిడిపి కూటమి వెంటపడుతోంది. వైసిపి ఐదేళ్ల పాలనలో వేధింపులకు ప్రతీకారం తీర్చుకుంటున్నట్లే వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాకినాడ పోర్టు నుంచి చౌక బియ్యం అక్రమ రవాణా చేస్తున్నారంటూ కూటమి ప్రభుత్వం ఉక్కు పాదం మోపింది. ఈ ఎపిసోడ్లో విజయసాయిరెడ్డి అల్లుడికి పోర్టు వద్ద ఉన్న భాగస్వామ్యం ప్రధాన అంశంగా మారింది. కేసులు కూడా నమోదయ్యాయి.
"ఇప్పటికే పాత కేసులు వెంటాడుతున్నాయి..మళ్లీ కొత్త సమస్యలు మొదలయ్యాయి" పని విజయసాయిరెడ్డి ఒత్తిడికి లోనైనట్లు చెబుతున్నారు. ఈ పరిణామాలకు తోడు వైసీపీలో కొరవడిన ప్రాధాన్యత కూడా ఆయనను రాజకీయాల నుంచి తప్పుకునేలా చేసినట్లు పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే..
తాడేపల్లి నివాసంలో ఘర్షణ
మాజీ సీఎం వైయస్ జగన్ లండన్ కు వెళ్లడానికి ముందు విజయసాయిరెడ్డి తో తాడేపల్లి నివాసంలో ఘర్షణ జరిగినట్లు చెబుతున్నారు. ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఆయనను జగన్ తీవ్రంగా హెచ్చరించినట్లు వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. దీంతో రాజకీయాల నుంచి తప్పుకోవాలనే ఆలోచనతో ఉన్న విజయసాయిరెడ్డి తుది నిర్ణయం తీసుకోవడానికి దారి తీసినట్లు భావిస్తున్నారు.
తాడేపల్లి ఘటనపై ఓ చర్చ కార్యక్రమంలో చిత్తూరు జిల్లాకు చెందిన టిడిపి అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ ఏమన్నారంటే..
"వైసీపీలోని మా ఇన్ఫార్మర్లు అందించిన సమాచారం మేరకు జగన్ తాడేపల్లి నివాసంలోనే విజయసాయిరెడ్డి మధ్య ఘర్షణ జరిగింది. ఆ సమయంలో చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా అక్కడే ఉన్నట్లు చెప్పారు. సాయిరెడ్డి స్థానిన్ని చెవిరెడ్డి ఆక్రమించారు. చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్థానం మాజీ ఎమ్మెల్యే భూమున కరుణాకర్ రెడ్డికి దక్కింది" అని సప్తగిరి ప్రసాద్ వ్యాఖ్యానించారు.
ఆర్థిక లావాదేవీలపై జగన్ తో విజయసాయిరెడ్డికి వాగ్వాదం జరిగింది.. " నేను లండన్ నుంచి తిరిగి వచ్చే లోపల ఆ డబ్బు లేకుంటే, నీకు (సాయిరెడ్డి) వైఎస్ వివేకానంద రెడ్డి గతే పడుతుందని కూడా జగన్ హెచ్చరించారు" అని సప్తగిరి ప్రసాద్ తమ పార్టీకి ఉన్న సమాచారాన్ని బహిర్గతం చేశారు. ఈ పరిణామంతో వ్యాకులతో చెందిన విజయసాయిరెడ్డి రాజకీయాలకు గుడ్ బై చెప్పే వరకు దారితీసింది అని ఆయన అంటున్నారు.
ఆయన ధీమా ఒకటే
అధికారం కోల్పోయిన తర్వాత కూడా వైయస్ జగన్ తాడేపల్లి నివాసం. బెంగళూరుకు వెళ్లడం. సందర్భానుసారంగా పులివెందులలో పర్యటనతో కాలక్షేపం చేస్తున్నారు. టిడిపి కూటమిపై పోరుబాటకు తెరతీసిన వైఎస్ జగన్ జిల్లాల వారీగా నిర్వహించిన సమీక్షల్లో కూడా " ముందస్తుగా సిద్ధం చేసుకున్న కార్యాచరణను అమలు చేయండి" అని పార్టీ నేతలకు నిర్దేశం చేశారు" సూచనలు, సలహాలకు ఆస్కారం కూడా ఇవ్వలేదనేది పార్టీ వర్గాల సమాచారం.
"ఈ సమావేశాల్లో వైయస్ జగన్ చెప్పిన మాటలు ఒకటే. ఆరు నెలల కాలంలోనే టిడిపి కూటమి అసంతృప్తి మూటగట్టుకుంది. సూపర్ సిక్స్ అమలు చేయలేరు. ఈ రెండు కలిసి మనకు వస్తాయి" అనేది ఆయన ధీమా. ఈ పరిస్థితుల్లో..
2029 ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి వస్తాం" అని జగన్ పార్టీ నాయకుల సమావేశంలో ధీమా వ్యక్తం చేయడంతో పాటు వారిలో ధైర్యం కూడా నింపినట్లు సమాచారం.
వైయస్ జగన్ రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి, ఆ తర్వాత అధికారం కోల్పోయిన తర్వాత కూడా "తాను చెప్పిందే వేదం. అదే అమలు చేయాలి" అనే ధోరణి తోనే ఇంకా సాగుతున్నారు అనే విషయం స్పష్టంగా కనిపిస్తుంది. అధికారం కోల్పోయిన 40 శాతం ఓటు బ్యాంకు ఇంకా పటిష్టంగానే ఉంది. పోతున్నది నాయకులు అని చెప్పుకున్న వారే. క్యాడర్ స్థిరంగా ఉందనే మాటలను ఆయన పదేపదే చెబుతున్నారు.
ఇదే విషయంపై ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి కూడా స్పందించారు.
"పోతున్నది నాయకులే కదా. కార్యకర్తలు ఉన్నారు. వారిని పదిలంగా చూసుకుంటే చాలు" అని వ్యాఖ్యానించడం ద్వారా కేతిరెడ్డి విజయసాయిరెడ్డి నిష్క్రమణను చాలా తేలిగ్గా తీసుకున్నట్లే స్పష్టం అవుతోంది.
అక్రమాస్తుల కేసులతో పాటు వైఎస్. వివేకానందరెడ్డి హత్య కేసు కూడా జగన్ ఆయన పరివారాన్ని వెంటాడుతోంది.
2019లో అధికారం కోల్పోయిన తరువాత టీడీపీ రాజ్యసభ సభ్యులు బీజేపీలోకి వెళ్లడం వెనుక సీఎం చంద్రబాబు పరోక్ష ప్రేరణ ఉందనే విషయం తెలిసిందే. అదే తరహాలో తాజాగా విజయసాయిరెడ్డి ద్వారా ఆ వ్యూహం అమలు చేశారనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి.
ఈ పరిణామాల నేపథ్యంలో వైసీపీలో పీక్ స్టేజికి చేరిన ముసలం రానున్న కాలంలో ఇలాంటి ఉపద్రవాలను ఎదుర్కోబోతున్నదనేది వేచి చూడాలి.


Read More
Next Story