Pawan Kalyan | పవన్ ప్రకంపనల వెనుక బీజేపీ పెద్దల పాత్ర ఎంత?
x

Pawan Kalyan | పవన్ ప్రకంపనల వెనుక బీజేపీ పెద్దల పాత్ర ఎంత?

టీడీపీ కూటమిలో అంతర్గతంగా పదవుల మంటలు ఆరడం లేదు. స్వరం మారిన పవన్ ప్రణాళిక ఏమిటి?


టిడిపి కూటమిలో జనసేన తరచూ కల్లోలం తప్పడంలేదు. రోజుల వ్యవధిలోనే టీకప్పులో తుఫానులా చల్లబడుతోంది. మూడు పార్టీల భాగస్వామ్యపక్షాల్లో ఈ వ్యవహారం అంతర్గతంగా మండుతూనే ఉంది. ఈ పరిణామాలకు రాయలసీమ నుంచి పునాది పడిందనే విషయం గతాన్ని స్పర్శిస్తే అర్థమవుతుంది.

ఈ పరిణామాలపై బిజెపి మౌనం వెనుక అర్థం ఏమిటి?
ఈ విషయాలను విశ్లేషిస్తే, ఓ వ్యూహం ప్రకారమే జనసేన చీఫ్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అడుగులు పడుతున్నాయి. అనడం కంటే, తెరవెనక బీజేపీ మంత్రాంగం లేకపోలేదనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో బలపడానికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను బీజేపీ ఓ అస్త్రంగా ప్రయోగిస్తున్నట్లే కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ భుజంపై తుపాకీ పెట్టి టిడిపి పైకి బీజేపీ సంధిస్తున్నట్లుగా భావిస్తున్నారు. రాష్ట్రంలో పార్టీని మరింతగా విస్తృతం చేయడంతో పాటు, బలాన్ని పెంచుకోవాలని దిశగానే బిజెపి కూడా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు రాజకీయ పరిశీలకుల అంచనా. ఈ పరిస్థితుల్లో..
మంటలు పుట్టించిన డీసీఎం
రాష్ట్రంలో టిడిపి కూటమి ఏర్పడి ఏడు నెలల కావస్తోంది. పరిపాలన వ్యవహారాలు గాడిలో పడలేదనే విషయం తరచూ ఐఏఎస్, ఐపిఎస్ అధికారుల బదలీల తీరు చెప్పకనే చెబుతోంది. ఈ పరిస్థితుల్లో వారం కిందట సీఎం చంద్రబాబు కడప జిల్లా పర్యటనకు వచ్చారు. ఈ సభలోనే, టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు ఆర్. శ్రీనివాసులురెడ్డి "మంత్రి నారా లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయండి" అని బాహాటంగా ప్రకటించడం ద్వారా రాజకీయ సునామీకి కారణమయ్యారు. అదే సభలో ఉన్న సీఎం చంద్రబాబు ఏమాత్రం అభ్యంతరం చెప్పకపోవడం కూడా జనశ్రేణులను రెచ్చగొట్టినట్లుగా భావిస్తున్నారు. దీంతో
"మంత్రి నారా లోకేష్ లో డిప్యూటీ సీఎం చేస్తే, పవన్ కళ్యాణ్ ను సీఎం చేయండి"అని జనసేన నేతలు స్వరాలు పెంచడం కూటమిలో కలకలం రేపింది. కడప వేదికగా రాజుకున్న మంత్రి నారా లోకేష్ డిప్యూటీ సీఎం అనే వ్యవహారం మరింత మండింది. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, పిఠాపురం నేత శర్మ, చివరికి సీనియర్ మంత్రి కింజరాపు అచ్చంనాయుడు కూడా గొంతు కలపడం గమనార్హం. ఈ ఎపిసోడ్ ను బీజేపీ రాష్ట్ర నేతలు, అటు కేంద్ర పెద్దలు కూడా చోద్యం చూస్తున్నట్లే కనిపించింది.
ఈ వ్యవహారం సాగే సమయంలో సీఎం చంద్రబాబు, ఆయన కొడుకు మంత్రి నారా లోకేష్ పర్యటనలో ఉన్నారు.
టిడిపి కూటమిలో కల్లోలం చెలరేగిన ఐదు రోజుల తర్వాత టిడిపి నుంచి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే అల్లా శ్రీనివాసరావు, జనసేన ప్రతినిధులు స్పందించారు. " డిప్యూటీ సీఎం వ్యవహారంపై పార్టీ శ్రేణులు మాట్లాడవద్దు.. ఇది మూడు పార్టీల నాయకులు చర్చించాల్సిన అంశం" అని ఆలస్యంగానైనా హుకుం జారీ చేశారు. అయినా,
తగ్గేదే లేదు..
టీడీపీ కూటమి ఏర్పడిన నాలుగో నెలలోనే శాంతిభద్రతల సమస్యపై కడప పర్యటనలోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూటమిని ఇరుకున పెట్టే వ్యాఖ్యలతో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. చివరికి సీఎం చంద్రబాబు చొరవతో తాత్కాలికంగా తాత్కాలికంగా సమసింది. నారా లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలనే టిడిపి నేతల అత్యుత్సాహం మళ్లీ కూటమిలో వివాదాలకు ఆజ్యం పోశాయి.
అంతకు ముందు కూడా
తిరుపతిలో వైకుంఠ ఏకాదశి దర్శనం టోకెన్ల జారీలో జరిగిన తొక్కిసలాట నేపథ్యంలో ఈ నెల 9వ తేదీ బాధితులను పరామర్శించడానికి వచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీరు విభిన్నంగా సాగింది. ఘటనకు బాధ్యులను చేస్తూ ముగ్గురు అధికారులు బదిలీ చేయడం ఇద్దరిని సస్పెండ్ చేయడానికి సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయంలో సీఎం చంద్రబాబు ఆదేశాల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విభేదించిన విషయం చాలా స్పష్టంగా కనిపించింది.
"టీటీడీ ఈఓ శ్యామలరావు, అదన ఈఓ సిహెచ్. వెంకయ్య చౌదరి కూడా ఈ ఘటనకు బాధ్యులే. వారిపై చర్య తీసుకోండి" అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించడం ద్వారా ప్రభుత్వాన్ని ఇరుకున పడేశారు. అంటే, పరిపాలన వ్యవహారాలలో తీసుకుంటున్న నిర్ణయాలల్లో తన వ్యక్తిత్వాన్ని కాపాడుకునే దిశగానే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విభేదిస్తున్నారని విషయం ఈ రెండు సంఘటనలు చాలా స్పష్టంగా కనిపిస్తాయి.
"జనసేన ప్రశ్నించడానికి పుట్టింది" అనే మాటలు మొదటి నుంచి పవన్ కళ్యాణ్ చెబుతూ వస్తున్నారు. 2014లో టిడిపి అధికారంలోకి వచ్చినప్పుడు ఈ విధానం కనిపించకపోవడంపై వైసీపీ విమర్శనాస్త్రాలు సంధించింది. మళ్లీ వారికి ఆ అవకాశం ఇవ్వకుండా తన పార్టీ విధానానికి అనుగుణంగా అడుగులు వేస్తూ, కొన్ని నిర్ణయాలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యతిరేకిస్తున్నారా? అనే విషయం కూడా ఇక్కడ స్పష్టమవుతుంది. దీనికి తోడు
"మాస్ గ్లామర్ ఉన్న సినిమా హీరోగా పవన్ కళ్యాణ్ మరింత అభిమానం పెంచుకోవడం. తద్వారా సింగిల్ గా నిలబడాలని ప్రయత్నాలలో భాగంగా అడుగులు వేస్తున్నారా అనేది కూడా చర్చకు వచ్చింది.
మలుపు తిప్పిన ఘటన
2023లో టిడిపి చీఫ్ ఎన్. చంద్రబాబును స్కిల్ డెవలప్మెంట్ కేసులో వైసిపి అరెస్టు చేయించిన వ్యవహారం రాజకీయంగా రాష్ట్రంలో కీలక మలుపు తిప్పింది.
2024 ఎన్నికల్లో జనసేన నేత పవన్ కళ్యాణ్ టిడిపికి మద్దతు ప్రకటించడమే కాదు. సీఎం చంద్రబాబును మళ్లీ బీజేపీ గూటికి చేర్చడంలో కూడా కీలకంగా వ్యవహరించారు. వైసీపీకి అధికారం దక్కకూడదని స్పష్టమైన విధానంతో అనుకున్న సీట్ల కంటే తక్కువ తీసుకున్న పవన్ కళ్యాణ్, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మంత్రివర్గంలో స్థానం కోసం పట్టుబట్టలేదు. అన్నిటికి రాజీ ధోరణిలో వ్యవహరించడం కూడా జనసేన సర్వసభ సమావేశంలో వివరణ ఇచ్చుకున్నారు. "దీని వెనుక దీర్ఘకాలిక ప్రణాళిక ఉంది" అనే విషయం జరుగుతున్న సంఘటనలు స్పష్టం చేస్తున్నారు. "జనసేన నాయకులు, శ్రేణులకు కూడా పదవుల కోసం పోటీ పడవద్దు" అని పవన్ కళ్యాణ్ హితవు పలికారు.
అధికారంలోకి వచ్చాక..
2009 ఎన్నికల నుంచి బిజెపికి అత్యంత సానిహిత్యంగా ఉన్న పవన్ కళ్యాణ్ ఆ సత్సంబంధాలను కొనసాగిస్తూనే ఉన్నారు. గత ఎన్నికల్లో టిడిపి కూటమి రాష్ట్రంలో అధికారులకు వచ్చిన తర్వాత కాకినాడ వద్ద రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారని ఒక ఓడను సీజ్ చేయించడం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయాల్లో ఇది అత్యంత సంచలనమైనది. దీనిపై సీఎం చంద్రబాబు కూడా నోరు మెదపలేని పరిస్థితి.
అభ్యుదయ భావాలతో జనసేన పార్టీకి శ్రీకారం చుట్టిన పవన్ కళ్యాణ్ బిజెపికి చేరువయ్యారు. మిత్ర ధర్మాన్ని అనే విషయాన్ని పక్కకు ఉంచి,
"విమర్శ కాదు. ఆత్మ విమర్శ కూడా ఉండాలి. ఈ విధానం వామపక్షాల్లో కనిపిస్తుంది" ఆ విధానాన్ని పాటిస్తున్నట్లుగా...
1. ప్రభుత్వ పాలన వ్యవహారాల్లో శాంతిభద్రతల సమస్యపై ఒకసారి.
2. తిరుపతి తొక్కిసలాటపై మరోసారి
3. కాకినాడ వద్ద బియ్యం లోడుతో ఉన్న ఓడను సీజ్ చేయించడంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చాలా దూకుడుగా వ్యవహరించారు. ఇది కూటమి ప్రభుత్వాన్ని ప్రధానంగా సీఎం చంద్రబాబును ఇరకాటంలో పడేసినట్లే కనిపిస్తుంది.
స్వరం మార్చిన కల్యాణ్
అభ్యుదయం, ఆదర్శాల పునాదులపై ఏర్పడిన జనసేన పార్టీని బిజెపికి దగ్గరగా నడుపుతున్నట్లే రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. అందుకు నిదర్శనం కూడా హిందూత్వాన్ని అజెండాగా తీసుకోడాన్ని ప్రస్తావించవచ్చు. "తిరుపతి వేదికగా వారాహి డిక్లరేషన్" ప్రకటించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మతం వైపు అడుగులు వేయించడంలో బిజెపి పెద్దల పాత్ర కీలకం అనేది రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ.
బిజెపికి అస్త్రంగా...
అభ్యుదయ సాహిత్యం, సమాజంపై స్పష్టమైన అవగాహన ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను బిజెపి అస్త్రంగా చేసుకున్నట్లే భావిస్తున్నారు. "వారాహి డిక్లరేషన్" ద్వారా హిందూత్వ నినాదాన్ని పవన్ కళ్యాణ్ అజెండాగా స్వీకరించారు. సాధారణంగా ఆర్ఎస్ఎస్ (RSS), సంఘ్ పరివార్ (Sangh Parivar) వంటి హిందుత్వ సంస్థల ప్రజల నోటి నుంచి వినపడాల్సిన మాటలన్నీ పవన్ కళ్యాణ్ నుంచి ప్రతిధ్వనిస్తున్నాయి. కేంద్రంలోని బిజెపి పెద్దలు ఆయనను అంతగా ప్రభావితం చేశారా అనేది కూడా కనిపిస్తోంది.
రాష్ట్రంలో బిజెపి ఓటు బ్యాంకు నామమాత్రం. కేడర్ కంటే నాయకులే ఎక్కువ ఉంటారు. ఈ పరిస్థితుల్లో తమ అమ్ములపొదిలో అస్త్రంగా మారిన పవన్ కళ్యాణ్ ను ఆసరాగా చేసుకుని రాష్ట్రంలో బిజెపి బలపడాలనే విషయం ప్రధానంగా చర్చ జరిగింది. అందులో భాగంగానే..
టిడిపి కూటమిలో పవన్ కళ్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలు. అనుసరిస్తున్న విధానాలు తరచూ కల్లోలం సృష్టిస్తున్నాయి. ఈ పరిణామాలను బిజెపి రాష్ట్ర, కేంద్ర పెద్దలు దగ్గర గమనిస్తూనే ఉన్నారు. మిత్ర ధర్మం, పొత్తు ధర్మాన్ని కూడా పాటించే విధంగా సమన్వయం చేయడంలో మాత్రం జోక్యం చేసుకోవడం లేదు. పవన్ కళ్యాణ్ అనుసరిస్తున్న విధానాలకు, మాట తీరుకు బిజెపి పెద్దల అభయం ఉందనే విషయం ఫైనే చర్చ జరుగుతోంది. డిప్యూటీ సీఎం పదవిపై రగిలిన మంటలు కాస్త చల్లబడినప్పటికీ, అంతర్గతంగా ఈ వ్యవహారం మండుతూనే ఉందని జనసేన నాయకుడు ఒకరు 'ఫెడరల్ ఆంధ్ర ప్రదేశ్' ప్రతినిధి వద్ద ప్రస్తావించారు.
ఈ ఎపిసోడ్ లో కాస్త చల్లబడే సరికి సీఎం చంద్రబాబు, ఆయన కొడుకు మంత్రి నారా లోకేష్ దావోస్ పర్యటన నుంచి తిరిగి ఢిల్లీకి చేరుకున్నారు. సీఎం చంద్రబాబు కేంద్ర పెద్దలు, మంత్రులతో వరుస భేటీలు సాగించడం వెనుక ఆంతర్యం కూడా చర్చకు వచ్చింది.
తిరుమల వ్యవహారాలపై మొదటిసారి కేంద్ర హోం శాఖ ప్రమేయాన్ని చివరి నిమిషంలో అడ్డుకట్ట వేయడంలో సీఎం చంద్రబాబు చాతుర్యాన్ని ప్రదర్శించారు. "కూటమిలో అంతర్గతంగా రగులుతున్న డిప్యూటీ సీఎం మంటలు చల్లార్చడంలో బీజేపీ పెద్దలతో చర్చించారా?" అనేది కూడా తెరపైకి వచ్చింది. దీనిపై చంద్రబాబు ఎలాంటి చక్రం అడ్డం వేస్తారనేది వేచిచూడాలి.
Read More
Next Story