వార్డు వలంటీర్ల సమరశంఖం

సింహపురి వార్డు సచివాలయ వలంటీర్లు వైఎస్ఆర్ సీపీ నేతలపై సమరశంఖం పూరించారు. మభ్యపెట్టి, ఒత్తిడి తెచ్చి ఉద్యోగాలకు రాజీనామాలు చేయించిన నేతలపై ఫిర్యాదు చేశారు.

Update: 2024-06-16 14:06 GMT

ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ సీపీ నేతల మాటలు విని కొందరు, ఒత్తిళ్లు భరించలేక రాజీనామాలు చేసి, త్రిశంకుస్వర్గంలో కొట్టుమిట్టాడుతున్న పంచాయతీ వార్డు, డివిజన్ వలంటీర్లు తిరగబడ్డారు. తమను నమ్మించి, ఒత్తిడి చేసి, రాజీనామాలు చేయించారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంకొన్ని చోట్ల తమను మళ్లీ ఉద్యోగాల్లోకి తీసుకోవాలని వినతులు సమర్పిస్తున్నారు. ఎవరి మాటలు వినకుండా, స్వతంత్రంగా వ్యవహరించిన వలంటీర్లు ప్రతినెలా వేతనాలు తీసుకుంటున్నారు.

సింహపురి యువతుల ఫిర్యాదు
"ఎన్నికలకు ముందు మీటింట్ ఉందని మమ్మలిని రమ్మన్నారు. అక్కడికి వెళ్లిన తరువాత వలంటీర్ పదవికి రాజీనామా చేయమని ఒత్తిడి తెచ్చారు" అని నెల్లూరు నగరం వేదాయపాళెం ప్రాంత వలంటీర్లు కే. రాధా, అంబవరపు రాజశ్రీ,, పి. వరలక్ష్మి, ఎం. చెన్నయ్య, షేక్ షర్మిళ, సుప్రియ తెలిపారు. నాయకుల ఒత్తిడి భరించలేక రాజీనామా చేశాం. అని నెల్లూరు నగరం 21 డివిజన్ వలంటీర్లు ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. "కార్పొరేటర్ గౌరి, వైఎస్ఆర్ సీపీ నాయకుడు మొయిళ్ల సురేష్ రెడ్డి తమను ఒత్తిడి చేశారని" ఆరోపిస్తూ రాజీనామా చేసిన కే. రాధ నెల్లూరు ఐదో టౌన్ సీఐ వెంకటనారాయణకు ఫిర్యాదు చేశారు. తమను మళ్లీ వలంటీర్ సేవల్లోకి తీసుకోవాలని వారంతా మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వాన్ని కోరారు. ఈ ఫిర్యాదుల పరంపర ఇంకా కొనసాగే అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తున్నాయి.
ఈ వ్యవహారంపై నెల్లూరు-5 ఐదో పట్టణ సీఐ (వేదాయపాళెం) వెంకటనారాయణ ఫెడరల్ ప్రతినిధితో మాట్లాడారు. "దీనిపై ఖచ్చితంగా కేసు నమోదు చేస్తాం" అన్నారు. " ఇది నాన్ కాగ్నజబుల్ కేసు. కోర్టు అనుమతి తీసుకుని ఖచ్చితంగా ఫిర్యాదుపై చర్యలు తీసుకుంటాం" అని స్పష్టం చేశారు. కే. రాధాతో పాటు 12 మంది సంతకాలు చేసి, ఫిర్యాదు ఇచ్చారని సీఐ వెంకటనారాయణ వివరించారు. ఇదిలా వుండగా..
సచివాలయ వ్యవస్థలో సంస్కరణలు
కూటిమి ప్రభుత్వం ఏర్పడగానే... శాఖలు కేటాయించకముందు నిమ్మల రామానాయుడు "రాష్ట్రంలో వలంటీర్ల వ్యవస్థ రద్దు చేయలేదు.  వలంటీర్లు ప్రభుత్వం నుంచి  గౌరవ వేతనం తీసుకుంటున్నారు. త్వరలోనే ఈ వ్యవస్థపై సమీక్షించి, వారిని ప్రజాసేవ కోసం వినియోగించుకుంటాం" అని చెప్పిన మాట వారికి వెయ్యేనుగుల బలం ఇచ్చింది. దీంతో పట్టణ ప్రాంతాల్లో గత నెలలో రాజీనామాలు చేసిన వలంటీర్లలో ఆశలు చిగురించాయి. విధివిధానాలు ఖరారు చేయాల్సి ఉందని కూడా ఆయన వ్యాఖ్యానించారు. కాగా, రాష్ట్రంలో కొలువైన టీడీపీ ప్రభుత్వం గ్రామ, పట్టణ వార్డు సచివాలయ వ్యవస్థలో మార్పులు తీసుకురానున్నట్లు తెలుస్తోంది. గ్రామ స్థాయి సచివాలయంలో ఐదుగురు వలంటీర్లను మాత్రమే నియమించడానికి ప్రభుత్వం సమాలోచనలు సాగిస్తున్నట్లు ఓ అధికారి ద్వారా తెలిసింది. వారందరినీ ఎంపీడీవో కార్యాలయంతో అనుసంధానం చేయడానికి కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడంలో కీలకంగా వ్యవహరించే వలంటీర్ల విద్యార్హత డిగ్రీగా నిర్ణయించనున్నట్లు తెలిసింది.
వైఎస్. జగన్ మానసపుత్రిక
వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్. జగన్ మోహన్ రెడ్డి తన మానసపుత్రికగా రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను 2019 ఆగష్టు రెండున 15 వేల గ్రామ వార్డు, పట్టణ డివిజన్ సచివాలయాల వ్యవస్థను అమలులోకి తెచ్చింది. గాంధీజయంతి నాడు కాకనాడ జిల్లా కురుపాంలో లాంఛనంగా ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ సచివాలయాల్లో పట్టణ ప్రాంతాల్లో 70,888 మంది, గ్రామీణ ప్రాంతాల్లో 51,718 మంది వలంటీర్లను నియమించారు. గత రెండు నెలల కిందటి నాటి వరకు 19,170 ఖాళీలు ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి. అంతే మొత్తంమీద 2,62,483 సచివాలయ సిబ్బంది, వలంటీర్ల నియాకం జరిగింది. కానీ కాలక్రమంలో ఒత్తిళ్లు భరించలేకపోవడం, ఇతరత్రా కారణాలతో దాదాపు మూడు వేల మంది వరకు ఉద్యోగులు మధ్యలోనే రాజీనామాలు కూడా చేశారు.
ముసిరిన వివాదం.. రాజీనామాలు
2024 ఎన్నికల నోటిఫికేషన్ రాకముందు వలంటీర్ల వ్యవస్థపై అనేక వివాదాలు ముసురుకున్నాయి. వారంతా అప్పటి అధికార వైఎస్ఆర్ సీపీకి అనుకూలంగా వ్యవహరించే అవకాశం ఉందంటూ, ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉంచాలనే డిమాండ్ కూటమి నేతలు ప్రధానంగా టీడీపీ అధినేత ఎన్. చంద్రబాబునాయుడు సహా కిందిస్ధాయి నాయకులు కూడా ప్రచారం చేశారు. వలంటీర్ల వ్యవహారంపై విశ్రాంత ఐఏఎస్ అధికారి, ఎలక్షన్ వాచ్ ప్రతినిధి నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో వివాదం రేకెత్తిన విషయం తెలిసిందే. దీనిపై భారత చైతన్య పార్టీ (బీసీవై) అధ్యక్షుడు బోడె రామచంద్రయాదవ్ కూడా వలంటీర్ల రాజీనామాలు అడ్డుకోవాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో స్పందించిన హైకోర్టు అసలు ఇప్పటి వరకు ఎంతమంది రాజీనామాలు చేశారనే స్పష్టం చేయాలని రాష్ర్ట ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది.
ఈసీ దాఖలు చేసిన అఫిడవిట్ మేరకు రాష్ర్టంలో 62 వేల మంది రాజీనామాలు చేశారనే విషయం స్పష్టమైంది. రాజీనామాల పర్వం చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం వి.కోట మండలంలో తెరతీశారు. చిత్తూరు జిల్లాలో 1500 మంది, అనంతపురంలో 500, విశాఖలో సుమారు 150 మంది, క్రిష్ణా జిల్లాలో 650 మంది రాజీనామాలు చేసిన వారిలో ఉన్నారు. ఈ సంఖ్య ఇంకా అంతకుమించే ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇదిలావుండగా,
తాము అధికారంలోకి వచ్చిన తరువాత కూడా వలంటీర్ల వ్యవస్థ కొనసాగించడమే కాదు. వారికి నెలకు రూ. పది వేలకు గౌరవ వేతనం పెంచుతాం’ అని టీడీపీ చీఫ్ ఎన్. చంద్రబాబు నాయుడు హామీ ఇవ్వడం గమనార్హం. ఆ మేరకు కొత్త ప్రభుత్వంలో అమలు చేయడానికి కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. దీంతో రాజీనామాలు చేసిన వలంటీర్లు అకారణంగా ఉద్యోగాలు వదిలేశామే అని కలత చెందుతున్నారు. వారికి టీడీపీ కూటమి ప్రభుత్వం ఎలాంటి మేలు చేస్తుందనేది, అమలు చేసే సంస్కరణలు ఎలా ఉంటాయనేది వేచి చూడాలి.
Tags:    

Similar News