తేడా ఎక్కడ ఉందో ఎలా తెలుస్తుంది?

"వైసీపీ అనే ఒక యువ రాజకీయపార్టీ తొలి ఐదేళ్ల పరిపాలనలో వేసిన కొత్త ‘రన్ వే’ మీద టిడిపి ‘టేకాఫ్’కు బాబుకు తన నలభై ఏళ్ల అనుభవం చాలడం లేదు."

Update: 2025-12-19 12:00 GMT

పత్రికల ‘మాస్ట్ హెడ్’ క్రింద ఉంచే బ్యానర్ న్యూస్ స్టోరీ ‘హెడ్డింగ్’ ప్రత్యేకత విలువైనది. పత్రికలు దొరికే దుకాణాల్లో- ‘స్టాండ్ సేల్స్’ ను కూడా ఒక్కోసారి ‘బ్యానర్ హెడ్డింగ్స్’ ప్రభావితం చేస్తాయి. వేరే పనిమీద అక్కడికి వచ్చిన కష్టమర్లు కూడా అక్కడ వేలాడుతున్న ఆరోజు పేపర్ మీద హెడ్డింగ్ చూసి దాన్ని కొనడం కూడా చూస్తుంటాం. సర్కులేషన్ తగ్గే పేపర్లు తమ చివరి ప్రయత్నంగా అచ్చంగా ఈ హెడ్డింగ్ లు ద్వారా అవి తమ ‘లూజ్ సేల్స్’ పెంచుకుంటూ ఉంటాయి. ఈ ఏడాది చివరి కలెక్టర్ల సమావేశం మొదలైన తర్వాత దాని గురించి వ్యాసం అంటే, నిన్న జరిగిన ‘మీటింగ్’ గురించి మర్నాడు పేపర్లు ఏమి రాశాయి అనే ఉత్సుకత మనకు ఉండడం ఎంతో సహజమైనది.

అటువంటప్పుడు, ఏపీలో చంద్రబాబుకు ‘గెజిట్ వన్’ అనుకునే డైలీ, ఆ వార్తకు పెట్టే శీర్షిక ఎలా ఉండాలి, అది కూడా బాబు ప్రభుత్వం ఏర్పడిన 18 నెలలు తర్వాత, 2025 ముగింపు ముందు... అని చూసినప్పుడు జరిగింది ఏమిటి?

సరే, ఎప్పటి మాదిరగానే డిసెంబర్ 17న వెలగపూడి తాత్కాలిక సచివాలయ సముదాయంలో మరోసారి కలెక్టర్ల సమావేశం జరిగింది. ముఖ్యమంత్రి అందులో ప్రారంభ ఉపన్యాసం చేశారు. అది ముగిసిన వెంటనే పది నిముషాల పాటు ‘టీ బ్రేక్’ ఇచ్చారు. దానర్ధం- అప్పటివరకు ఆ మీటింగ్ హల్లో ఉన్న ‘మీడియా’ ప్రతినిధులు ఆ బ్రేక్ సమయంలో టీ తాగాక, ఇచ్చిన నోట్స్ తీసుకుని అక్కణ్ణించి వెళ్ళిపోవాలి. ఆ తర్వాత జరిగింది చెప్పడానికి సమాచార శాఖ ఇచ్చే ‘ప్రెస్ నోట్స్’ ఎటూ ఉంటుంది.

ఇక్కడ 2026 ప్రవేశానికి ముందున్న మన ‘సెట్టింగ్’ ఏమిటి అని చూసినప్పుడు, పదేళ్ళ ఓటమి తర్వాత చంద్రబాబు గెలిచినప్పటికీ ఆయనకు వచ్చిన కొత్త సమస్య ఏమంటే, జగన్మోహన్ రెడ్డి రూపంలో తనకు పోటీగా ‘వైసీపీ’ అనే మరో కొత్త ప్రాంతీయ పార్టీ రావడం. అది రాకుండా ఆపడానికి ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అంతకు ముందు తాను ఒడితే గెలవడానికి కాంగ్రెస్ సిద్దంగా ఉండేది, జాతీయ పార్టీగా దానికున్న పరిమితులు వల్ల- ‘ఫోకస్’ ఒక ‘వ్యక్తి’ చుట్టూ తిరిగేది కాదు. కానీ ఇప్పుడు అలా కాదు, తాను గెలిచినా ఓడినా పోలిక అనేది అది ఇద్దరి మధ్య వ్యవహారం అయిపోయింది. దాంతో, జగన్ పేరును బాబు తనతో పాటుగా ‘క్యారీ ఫార్వార్డ్’ చేయడం ఆయనకు అదనపు భారం అయింది. మళ్ళీ ‘ఆయన’ వస్తే, పరిస్థితి ఏమిటి? అనే ‘పోలిక’ ప్రస్తావన స్వయానా బాబే తెచ్చి, వాళ్ళ పని కొంతమేర ఈయనే చేస్తున్నారు. దాంతో రెండేళ్లుగా జగన్ ను ప్రజలు మర్చిపోకుండా చూస్తున్నారు.

ఈ ప్రతిఫలనాలు నిన్నటి కలెక్టర్ల సమావేశంలోనూ కనిపించించాయి. జరుగుతున్నది 4.5 సమావేశం అని హాల్లో వెనుక రాసినా, ‘గెజిట్ పత్రిక’ మాత్రం ఇది ఐదవ సమావేశం అని రాసింది. బహుశా అది రేపు మార్చి వరకు ఉండే ‘క్యారటర్’ కోసం జరుగుతున్నది అనే అర్ధం కావొచ్చు. సరే నెంబర్లు ఏమైతేనేమి గాని, ఈ పద్దెనిమిది నెలల్లో పాత ప్రభుత్వంలో జరిగిన జిల్లాల విభజన తర్వాత, అప్పట్లో ‘ఐఎఎస్’ల ‘ఫెరఫార్మెన్స్’కు గుర్తింపుగా పార్వతీపురం, ఏలూరు జిల్లాల కలెక్టర్లు ‘పిఎం బెస్ట్ ఫెర్ఫార్మెన్స్’ అవార్డులు డిల్లీలో అందుకున్నారు. ఇకముందు కూటమి ప్రభుత్వంలో కూడా అటువంటివి మన రాష్ట్రానికి వస్తాయేమో వేచి చూడాలి. కానీ ఇది జరుతున్న రోజునే, ‘ది ఎకనమిక్స్ టైమ్స్’ పత్రిక చంద్రబాబుకు ‘ది బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు ప్రకటించినట్లుగా వార్త వెలువడింది.

బాబు విషయంలో మొదటి నుంచి మనకు ఈ ‘కన్ఫ్యూజన్’ ఉంది, అది ఇప్పుడు కొత్త కాదు. సిఎం అయిన కొత్తలో పాతికేళ్ళ క్రితం- ‘గుడ్ గవర్నెన్స్’ అన్న బాబుకు మరది- ‘పొలిటికల్ గవర్నెనెస్సా’ లేక ‘ఎగ్జిక్యూటివ్ గవర్నెనెస్సా’ అనే స్పష్టత ఇప్పటికీ లేకపోవడం అంటే, అది ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ రెండింటికీ ఉండే ‘స్పేస్’ ఎంతమేర, ఎవరి పని వాళ్ళు చేయడం అంటే ఏమిటి అనేది, ప్రతిసారీ బాబు ప్రభుత్వంలోకి రాగానే మర్చిపోతారు. నిన్న జరిగిన కలెక్టర్ల సమావేశం ప్రారంభ ఉపన్యాసంలో కూడా ఎక్కడా ఆయన లోతుల్లోకి వెళ్ళి మాట్లాడడం కనిపించదు. ప్రజా సమస్యలు ‘గ్రీవెన్స్’ పరిష్కారం గురించి మాట్లాడుతూ... “అన్నదమ్ముల మధ్య పిర్యాదులు వస్తే...” అనడం చూస్తే, ఆయన సిఎం స్థాయి మనిషి, అటువంటిది ఇలా ప్రాధమిక అంశాలు మాట్లాడం ఏమిటి అనిపించింది! నిజానికి ‘మీడియా’ కూడా మీటింగ్ హాలు లోపల ఉన్నప్పుడు, సిఎం ఆరంభంలోనే గడచిన పద్దెనిమిది నెలల ప్రభుత్వం ‘టేకాఫ్’ ఎలా మొదలయింది, ప్రాధాన్యతా రంగాల్లో ఏ ‘ఏరియాల్లో’ జిల్లా కలెక్టర్లకు సెక్రెటరీల నుంచి పరిష్కారం దొరికింది, అంతిమంగా అది ‘లాస్ట్ మైల్ డెలివరీ’ వద్ద ఉండే ప్రజలకు ఏ రంగంలో ఉపయోగపడింది చెబితే, అది సందర్భానికి తగిన ‘ఫోకస్’ అయ్యేది. కానీ అది జరగలేదు. ఇటువంటి స్పష్టత కొరవడే, ఈ ఏడాది మధ్యలో అచ్చంగా సెక్రటరీలతో కూడా బాబు ఒకరోజు మొత్తం ‘మీటింగ్’ పెట్టారు, అస్సలు తేడా ఎక్కడ ఉంది ‘లొకేట్’ చేయడానికి.

చివరికి ఏమైంది- “మీరే అడ్డంకి కావొద్దు..” అని కలెక్టర్లతో సిఎం అన్నట్టుగా రెండవ రోజు ప్రభుత్వ ‘గెజిట్ పత్రిక’ ఈనాడు బ్యానర్ స్టోరీ రాసింది. దాంతో ఏమైంది? మా ప్రభుత్వం పట్ల ప్రజలకు అసంతృప్తి ఏమాత్రం ఉన్నా, అందుకు కారణం మేము కాదు, అధికారులు అని సాక్షాత్తూ సిఎం బాబు చెప్పినట్టుగా రాయడానికి ఆ పత్రిక చూపిన తెగువతో ఈ 2025 ముగిసింది. ఇది చూడడానికి ప్రస్తుతానికి ‘కవర్’ చేసుకున్నట్టుగా అనిపించినా, మరి రాబోయే మరో మూడేళ్ళ మాట ఏమిటి? అన్నిటినీ మించి, ఈ ఇరువురి మధ్య కొనసాగుతున్న ఈ ‘గ్యాప్’కు కారణం ఏమిటి? ఇలా అనడం అంటే, ‘పోస్టింగ్స్’ లేకుండా కొందరు, ‘సస్పెండ్’ అయి మరి కొందరు ఉన్నవారి గురించి ఇక్కడ మాట్లాడడం లేదు. సర్వీస్ లో ఉన్న వారితో పని చేయించుకుంటూ అటు ‘పొలిటికల్’ ఇటు ‘ఎగ్జిక్యూటివ్’ ఈ రెండు నా ప్రభుత్వంలో ఒకటిగా పనిచేస్తున్నాయి అనే ‘మెస్సేజ్’ ఇవ్వడం బాబు నాయకత్వానికి ఎందుకు అలిమి కావడం లేదు?

“బాగా చేశాను అనుకుంటున్నాను, నేను కూడా... కానీ ప్రజలు మెచ్చడం లేదు” అని ముఖ్యమంత్రి అన్నట్టుగా టీవీల్లో చూసాము. “ఎక్కడో ఏదో తేడా ఉంది... చెక్ చేసుకోండి” అన్నట్టుగా ఆంధ్రజ్యోతి రాసింది.” సమస్య ఏమిటి? రాష్ట్ర విభజన జరిగిన గత పదేళ్ళలో రెండు ప్రధాన పార్టీల చెరొక ఐదేళ్ల పాలన తర్వాత, మళ్ళీ బాబు పాలన అంటే, జగన్ సెట్ చేసి వెళ్ళిన ‘వృత్తం’ పైన బాబు తన ‘చతురస్రం’ అయినా ఉంచాలి, లేదు జగన్ ‘చతురస్రం’ మీద బాబు తన ‘వృత్తం’ అయినా ఉంచాలి అన్నట్టుగా పరిస్థితి తయారైంది. రెండూ కూడా పొసగని వేర్వేరు ‘మోడల్స్’. ఎన్నిసార్లు వాటిని ఎటు తిప్పి చూసినా వాటి అంచులు బయటకు ఉంటున్నాయి. మరో కొత్త ‘మోడల్’కు ఈ వయస్సులో బాబుకు ఇక్కడ అవకాశం లేదు. ఎందుకంటే, ఈ ఇద్దరివీ రెండు వేర్వేరు ‘పబ్లిక్ పాలసీలు’. ఇక పదేళ్లనాడు బాబు పనిమాలా తెచ్చిపెట్టుకున్నసంకటం- అమరావతి దీనికి అదనం.

వైసీపీ అనే ఒక యువ రాజకీయపార్టీ వచ్చి తన తొలి ఐదేళ్ల పరిపాలనలో అది వేసిన కొత్త ‘రన్ వే’ మీద తన టిడిపి ‘టేకాఫ్’కు బాబుకు తన నలభై ఏళ్ల అనుభవం చాలడం లేదు. ప్రాధాన్యతాపరంగా ఇంజనీరింగ్ మారడంతో నిర్మాణం కూడా మారింది. ‘నీతి అయోగ్’ వంటి కేంద్ర ప్రభుత్వ (పాత ప్లానింగ్ కమీషన్) సంస్థ జారీ చేసిన ‘టార్గెట్’లకు ప్రతి మూడు నెలలకు అధికారులు ‘ఎచీవ్మెంట్స్’ పంపితే, వాటిని బట్టి దేశమంతా ఆయా రాష్ట్రాల పనితీరుపై ‘పెర్ఫార్మెన్స్ గ్రేడింగ్’ ఉంటుంది. వీటిని వదిలిపెట్టి, సిఎం కలెక్టర్లతో ‘ఇన్వెస్టర్లు’ పెట్టుబడులు పెడతామని వస్తుంటే, మీరే వారికి ఎదురెళ్ళమని వాళ్ళు వచ్చి మీ ముందు నిలబడాలని చూడొద్దు అని సిఎం చెబుతుంటే, మరి నిబంధనలు అమలు చేయాల్సింది ఎవరు?

విద్యాశాఖ ఇటీవల రాష్ట్రమంతా నిర్వహించిన ‘పేరెంట్స్- టీచర్స్’ మీటింగ్ లో స్థానిక కూటమి రాజకీయ పార్టీలను వాటికి హాజరుకమ్మని ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు అమలు ఆ శాఖపై ఎంతో అదనపు ఒత్తిడి తెచ్చింది. దాని నిర్వహణకు జిల్లాల్లో విద్యాశాఖ అధికార్లు, ప్రభుత్వ విద్యాసంస్థల ప్రిన్సిపాల్స్, హెడ్మాస్టర్లు కలెక్టర్ల వద్ద వెలుబుచ్చిన ‘కష్టం’ ఏమిటో నిన్నటి మీటింగ్ లో ఐఎఎస్ లకు పూర్తిగా తెలుసు. అది వాళ్ళు అక్కడ ఎటూ పైకి ఏమీ మాట్లాడరు కదా అని, “ఎక్కడో ఏదో తేడా ఉంది... చెక్ చేసుకోండి” అని తిరిగి వాళ్ళకు చెబుతుంటే, తేడా ఎక్కడ ఉందో ఎవరికైనా ఎలా తెలుస్తుంది?

Tags:    

Similar News