చర్చికి వెళ్తున్న టిటిడి అధికారి సస్పెన్షన్
ఎఇవొ రాజశేఖర్ పుత్తూరులో చర్చికి వెళ్తున్నారని నిర్ధారించిన టీటీడీ విజిలెన్స్.;
By : SSV Bhaskar Rao
Update: 2025-07-08 14:46 GMT
తిరుమలలో హిందూయేతర ఉద్యోగులపై టిటిడి కఠినంగా వ్యవహరిస్తోంది. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (AEO ) ఏ.రాజశేఖర్ బాబు క్రిస్టియన్ మత ఆచారాలు పాటిస్తున్నారనే విషయం నిర్ధారణ కావడంతో ఆయనను విధుల నుంచి సస్పెండ్ చేశారు. ఆ మేరకు టిటిడి శ్యామలరావు ఆదేశాలు జారీ చేశారు. రాజశేఖర్ బాబు ప్రస్తుతం టిటిడి మార్కెటింగ్ విభాగంలో యాత్రికులు సమర్పించే కొన్ని వస్తువులు వేలం వేసే విభాగంలో ఏఈఓ గా విధులు నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉంటే
టీటీడీలో సుమారు 300 మంది వరకు హిందూయేతర ఉద్యోగులు ఉన్నట్లు ప్రాథమిక అంచనా. వారిలో 22 మందిని టీటీడీ గుర్తించింది. అందులో 18 మందిని ఆలయ వ్యవహారాలకు దూరంగా ఉంచుతూ టీటీడీలోని ఇతర విద్యాసంస్థలకు బదిలీ చేసింది.
ఏఈఓ ఏం చేశారు ?
టీటీడీలో ఏఈఓ హోదాలో పనిచేస్తున్న రాజశేఖర్ బాబు
తిరుపతి జిల్లా పుత్తూరుకు చెందిన వ్యక్తి. హిందూ ధార్మిక సంస్థ నిబంధనల ప్రకారం ఆయన వ్యవహరించడం లేదనే ఆరోపణలు వచ్చాయి. దీంతో టిటిడి అధికారులు దీనిపై విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. రంగంలోకి దిగిన టీటీడీ విజిలెన్స్ అధికారులు
పుత్తూరులోని రాజశేఖర్ బాబు స్వగ్రామంలో రహస్యంగా విచారణ చేశారు. ఆధారాలు సేకరించారు.
"ప్రతి ఆదివారం ఆయన చర్చికి వెళుతున్నారు" అని విజిలెన్స్ అధికారులు నిర్ధారించారు. అందుకు సంబంధించిన ఆధారాలతో టీటీడీ ఈవో కు నివేదిక సమర్పించారు. ఈ నివేదిక ఆధారంగా రాజశేఖర్ బాబును విధులనుంచి సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి.
" టీటీడీ ఉద్యోగిగా ఆయన సంస్థ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారు. హిందూ ధార్మిక సంస్థకు ప్రాతినిధ్యం వహించే ఉద్యోగి అయివుండి బాధ్యతారహిత్యంగా వ్యవహరించారు" అని నిర్ధారించి సస్పెండ్ చేసినట్లు టిటిడి అధికారులు తెలిపారు. విజిలెన్స్ నివేదిక ఆధారంగా రాజశేఖర్ బాబు పై నిబంధనల ప్రకారం శాఖాపరమైన ఈ చర్యలు తీసుకున్నట్లు డిటిడి విడుదల చేస్తున్న ప్రకటనలో స్పష్టం చేసింది.
హిందుయేతర ఉద్యోగులపై చర్యలు
టిడిపి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత టీటీడీ చైర్మన్ బాధ్యతలు బిఆర్ నాయుడుకు అప్పగించారు.
ఆయన ప్రమాణ స్వీకారం చేయడానికి ముందే తన ముందస్తు అజెండాను విస్పష్టంగా ప్రకటించారు.
"తిరుమలలో హిందువుల మినహా ఇతర మతస్తులు ఉండడానికి వీలులేదు" అని ముందుగానే ప్రకటించారు.
ఈ వ్యవహారంపై దశాబ్దాల కాలంగా వివాదం నడుస్తోంది. కానీ ఎవరు సాహసించని విధంగా టీటీడీ చైర్మన్ బిఆర్. నాయుడు చర్యలు తీసుకునేందుకు సంసిద్ధమయ్యారు.
దీనిపై టిటిడి పాలకమండలంలో కూడా నిర్ణయం చేయడంతో ఉద్యోగ వర్గాల్లో చర్చకు ఆస్కారం కల్పించింది.
ఎంతమంది ఉన్నారు?
టీటీడీలో అన్యమతస్తుల గుర్తింపు అనేది చాలా కాలంగా చర్చనీయాంశంగా ఉంది. ఇటీవల కాలంలో దీనిపై కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. టీటీడీలో దాదాపు 300 మంది అన్యమతస్తులు వివిధ విభాగాల్లో పనిచేస్తున్నట్లు గుర్తించినట్లు సమాచారం. వారిలో ప్రస్తుతం సర్వీస్ లో ఉన్నవారే కాకుండా ఉద్యోగ విరమణ చేసిన వారు కూడా ఉన్నారు.
18 మందిపై బదిలీ వేటు
తిరుమల తో పాటు తిరుపతిలో కూడా ఆలయ వ్యవహారాల్లో పని చేస్తున్న హిందూతర సిబ్బందిని గుర్తించారు. టీటీడీలో 300 మంది వరకు ఉన్నట్లు ఓ ప్రాథమిక అంచనా. వారిలో కీలక విభాగాల్లో ఉన్న 18 మందిని బదిలీ చేస్తూ గతంలోనే ఆదేశాలు జారీ చేశారు. . బదిలీ అయిన వారిలో టీటీడీ మహిళా పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్, శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపాల్, వివిధ విద్యా సంస్థల్లోని లెక్చరర్లు, వసతి గృహ వార్డెన్లు తదితరులు ఉన్నారు.
ఆ తర్వాత..
" టీటీడీలో పనిచేస్తున్నవారందరూ హిందువులే అయి ఉండాలి " అని పాలకమండలి మరోసారి తీర్మానం చేసింది. అన్యమత ఉద్యోగులకు స్వచ్ఛంద పదవీ విరమణ పథకం (VRS) లేదా ఇతర ప్రభుత్వ శాఖలకు బదిలీ ఆప్షన్లను ఇచ్చే అవకాశం ఉందని కూడా పేర్కొన్నారు.
అన్య మతస్థులుగా గుర్తించిన వారిని ఆలయ నిత్య కకాపాలకు దూరంగా ఉంచారు. వారిని రాష్ట్ర ప్రభుత్వ విభాగోళానికి పంపించాలా? వీఆర్ఎస్ తీసుకునే విధంగా చేయాలా? అనే విషయంలో టిటిడి యంత్రాంగం ఇంకా ఒక నిర్దిష్ట నిర్ణయానికి రాలేదు.
తాజాగా టీటీడీ ఏఈఓ రాజశేఖర్ బాబును సస్పెండ్ చేయడంతో హిందూయేతర ఉద్యోగుల్లో కలవరం బయలుదేరింది. ప్రస్తుతం ఇదే అంశంపై ఉద్యోగ వర్గాల్లో చర్చ జరుగుతోంది.