శ్రీవారి ఆలయంలో వైభవంగా ఉగాది ఆస్థానం.!
తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది ఆస్థానం వైభవంగా జరిగింది.;
By : Dinesh Gunakala
Update: 2025-03-30 12:28 GMT
ఉదయం సుప్రభాతం అనంతరం శుద్థి నిర్వహించారు. ఆ తరువాత శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి, విష్వక్సేనుల వారికి విశేష సమర్పణ చేశారు. విమాన ప్రాకారం, ధ్వజస్తంభం చుట్టూ ఊరేగింపుగా ఆలయంలోనికి ప్రవేశించారు. ఆ తరువాత శ్రీవారి మూలవిరాట్టుకు మరియు ఉత్సవమూర్తులకు నూతన వస్త్రాలను ధరింపజేశారు. అనంతరం పంచాంగ శ్రవణం జరిగింది. బంగారు వాకిలి వద్ద ఆగమ పండితులు, అర్చకులు శాస్త్రోక్తంగా ఉగాది ఆస్థానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పులువురు బోర్డు సభ్యులు పాల్గొన్నారు.
అనంతరం టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి మీడియాతో మాట్లాడుతూ దేశ, విదేశాలలో ఉండే తెలుగు ప్రజలకు నూతన శ్రీ విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఆలయ ప్రాకారం అంతటా పచ్చటి తోరణాలతో శోభాయమానంగా తీర్చిదిద్దినట్లు తెలియజేశారు. వేదమంత్రోచ్ఛారణ నడుమ కన్నుల పండుగగా ఉగాది ఆస్థానం నిర్వహించామన్నారు.