శ్రీవారిసేవ హృదయానికి హత్తుకుంది...
అన్నప్రసాదాలు వడ్డించిన నిర్మలమ్మ.;
Byline : SSV Bhaskar Rao
Update: 2025-09-12 11:06 GMT
అన్నప్రసాదాలు తీసుకున్న తరువాత "యాత్రికులతో కలిసి అన్నప్రసాదాలు స్వీకరించడం హృదయానికి హత్తుకుంది" అని తన అభిప్రాయం రాశారు. అంతకుముందు ఆమె తరిగొండ వెంగమాంబ నిత్యాన్నదాన సత్రంలో ఆమె ఓ సేవకురాలిగా మారారు. యాత్రికులకు అన్నప్రసాదాలు వడ్డించారు. శ్రీవారి సేవకులతో కలిసి మాట్లాడారు.
తిరుమలలో శ్రీవారి సేవకులు యాత్రికులకు అందిస్తున్న సేవలు ఆదర్శవంతంగా, ఉన్నాయని కొనియాడారు. అంతకుముందు వీఐపీ విరామసమయంలో ఉదయం ఆమె కుటుంబసభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. టీటీడీ బోర్డు సభ్యులతో పాటు అదనపు ఈఓ సీహెచ్. వెంకయ్య చౌదరి ఆమె వెంట ఉన్నారు. శ్రీవారి దర్శనం తరువాత తిరుమలలోనే అతిథిగృహానికి చేరుకున్నారు.
తిరుపతిలో 14వ తేదీ నుంచి రెండు రోజుల పాటు మహిళా సాధికారతపై మహిళా పార్లమెంటీరియన్లు, ఎమ్మెల్యేలు, ఎంఎల్సీల సదస్సు జరగనుంది. దీంతో ఆమె మూడు రోజుల పర్యటన కోసం కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం రాత్రి తిరుమలకు చేరుకున్నారు. ఆమెకు టీటీడీ అధికారులతో పాటు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ స్వాగతం పలికారు.
మీ సేవలు అమోఘం
తిరుమలలో శుక్రవారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్న తరువాత మధ్యాహ్నం కేంద్ర ఆర్థికశాఖా మంత్రి నిర్మలా సీతారామన్ తరిగొండ వెంగమాంబ నిత్యాన్నదాన సత్రానికి చేరుకున్నారు. ఆమె వెంట టీటీడీ పాలక మండలి సభ్యులు సుచిత్రా ఎల్లా, జీ. భానుప్రకాషరెడ్డి, అదనపు ఈఓ వెంకయ్య చౌదరి ఉన్నారు.
అన్నదానసత్రంలో మొదట కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ శ్రీవారి సేవకులతో మాట్లాడారు.
"తిరుమలకు వచ్చే యాత్రికులకు మీరు (శ్రీవారి సేవకులు) అందిస్తున్న సేవలు అద్భుతంగా ఉన్నాయి. మీ స్వచ్ఛంద సేవలు ఆదర్శవంతమైనవి" అని సేవకులను ఉద్దేశించి కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ వ్యాఖ్యానించారు. అనంతరం వారితో కలిసి ఫొటోలు దిగారు.
హృదయానికి హత్తకుంది..
తరిగొండ వెంగమాంబ అన్నదానసత్రంలో యాత్రికులకు ఆమె అన్నప్రసాదాలు వడ్డించారు. సామాన్య యాత్రికులతో కలిసి ఆమె అన్నప్రసాదాలు తీసుకున్నారు. ఈ సందర్భాన్ని ప్రస్తావిస్తూ, టీటీడీ ఫీడ్ బ్యాక్ పుస్తకంలో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
"సామాన్య యాత్రికులతో కలిసి అన్నప్రసాదం స్వీకరించడం నా హృదయానికి హత్తుకుంది" అని రాశారు. ఈ కార్యక్రమంల డిప్యూటీ ఈఓలు రాజేంద్ర, భాస్కర్ తోపాటు వీజీఓ సురేంద్ర, అధికారులు ఉన్నారు.