శ్రీవారి లడ్డూ గొడవ: భక్తుల దృష్టిలో రాజకీయ రగడే! లడ్ల కొనుగోలు మామూలే!!

తిరుమల శ్రీవారి లడ్డులో కల్తీ నెయ్యి వాడారనే ఆరోపణలను భక్తులు పట్టించుకోవడం లేదు. వాటిని పవిత్రంగా ఇంటికి తీసుకెళ్లడానికి మాత్రమే ఆసక్తి చూపిస్తున్నారు. అంతకుముందు శ్రీవారిని దర్శించుకుంటున్నారు.

Translated by :  SSV Bhaskar Rao
Update: 2024-09-25 10:43 GMT

తిరుమల శ్రీవారికి అశేష భక్తులు ఉన్నారు. దేశం నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా శ్రీవేంకటేశ్వరస్వామి వారి దర్శనానికి వస్తూ ఉంటారు. ఇక్కడ శ్రీవారికి నిత్య కళ్యాణం జరుగుతూ ఉంటుంది. అందువల్ల ఇక్కడ ముహూర్తాలతో సంబంధం లేకుండా స్వామివారి సన్నిధిలో వివాహబంధంతో ఒకటవుతుంటారు. అంతటి ప్రాశస్త్యం కలిగిన తిరుమల శ్రీవారి ఆధ్యాత్మిక క్షేత్రంలో స్వామివారికి నివేదించే లడ్డు ప్రసాదంలో గొడ్డు, పంది కొవ్వుతో పాటు చేపనూనె కూడా కలిసిందనే మాటలతో భక్తులు దిగ్భ్రాంతి చెందారు. కలవరానికి గురయ్యారు. ఇది జరిగి వారం రోజులైంది. ఆంధ్రప్రదేశ్ లోని అధికార టీడీపీ కూటమి కి సారథ్యం వహిస్తున్న సీఎం ఎన్. చంద్రబాబు రేపిన ఈ దుమారంపై ప్రతిపక్ష వైఎస్ఆర్ సీపీ స్పందించింది. ఇది తమ పాలనలో జరగలేదని చెబుతోంది. దీనిపై బీజేపీ నేతలు కూడా మాట్లాడారు. హిందూత్వంపై దాడిని సహించేది లేదని హెచ్చరించారు. ఇదంతా ఒక ఎత్తైతే..


తిరుమల స్వామివారిని అత్యంత భక్తి ప్రపత్తులతో ఆరాధించే భక్తులు ఏమాత్రం ఆందోళన చెందకుండా స్వామి వారి దర్శనానికి పోటేత్తుతున్నారు. దేవుడి దర్శనంతో మానసిక ప్రశాంతత పొందుతున్నారు. దర్శనం బాగా జరిగిందనే ఆనందంతో తిరుమలలో లడ్డూలు బ్యాగుల్లో నింపుకుంటున్నారు. వాటిని తమ ఊర్ల లో ప్రసాదంగా పంపిణీ చేసేందుకు ఇంటికి తిరుగుముఖం పడుతున్నారు తప్ప రాజకీయ నాయకులు రేకెత్తించిన ఈ కలకలాన్ని పట్టించుకోవడం లేదు. దేవుడిదే భారం అంటూ యాత్రికులు అభిప్రాయపడ్డారు.

లడ్డు ప్రసాదంలో కల్తీ వల్ల కలిగిన దుష్పరిణామాలను శ్రీవారి కటాక్షంతో మాలిన్యాన్ని కడిగి వేయడానికి టీటీడీ ఈనెల 23వ తేదీ తిరుమల శ్రీవారి ఆలయంలో శాంతి హోమం నిర్వహించింది. సరిగ్గా అదే రోజు టీటీడీ మాజీ చైర్మన్, వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి కారులో తిరుమలకు చేరుకున్నారు. తిరుమలలోని స్వామివారి పుష్కరిణిలో స్నానం చేసి ఆలయం ఎదురుగా ఉన్న బేడి ఆంజనేయస్వామి సమీపంలోని అఖిలాండం వద్ద ప్రమాణం చేశారు. "శ్రీవారి కి నివేదించే లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడి ఉంటే.. నా కుటుంబం నాశనం అవుతుంది" అని కరుణాకర్ రెడ్డి తనను తాను శపించుకొన్నారు.
మరోవైపు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ వందలాది మంది అనుచరులతో కలిసి "మాజీ సీఎం వైఎస్ జగన్ కు తీవ్ర హెచ్చరిక" చేశారు. "తనను శారీరకంగా గాయపరిచిన పర్వాలేదు. సనాతన ధర్మానికి విఘాతం కలిగిస్తే సహించబోనని" హెచ్చరించారు.

"తిరుమల శ్రీవారి ప్రాశస్త్యాన్ని దెబ్బ తీశారు. కల్తీ నెయ్యికి కారణమైన వారిని ఉరితీయాలి" అని కొందరు స్వామీజీలు డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశంపై దేశంలో అనేక చోట్ల నిరసన ప్రదర్శనలూ జరిపారు.
మొత్తానికి మాజీ సీఎం వైఎస్ జగన్ సారధ్యంలోని వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం లడ్డూ ప్రసాదాన్ని తయారు చేయడంలో గొడ్డు కొవ్వు కలిపిన నెయ్యి వాడిందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించిన వైనంపై వెల్లువెత్తిన ఆగ్రా వేశాల మంటలు ఇంకా ఆరడం లేదు.

యాత్రికుల కరవరపాటు

తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే యాత్రికులతో పాటు స్వామి వారిని దర్శనం చేసుకున్న అనంతరం తిరిగి వెళ్లే వారితో తిరుపతి రైల్వేస్టేషన్ నిత్యం రద్దీగా కనిపిస్తుంది. లడ్డూ ప్రసాదం కల్తీపై వారిపై పెద్దగా ప్రభావం చూపలేదు. అనే అంశం వారి మాటలను బట్టి అర్థమవుతుంది. ఈ యాత్రికులంతా అంతకు ముందు రోజు తిరుమల లో శ్రీ వేంకటేశ్వరుని సంతృప్తికరంగా దర్శనం చేసుకున్నారు. వారంతా ఇంటికి తిరిగి వెళ్లడానికి తిరుపతి ప్లాట్ ఫాంపైకి వచ్చే తమ రైలు కోసం ఆత్రుతగా నిరీక్షిస్తూ కనిపించారు.
వారితో ఫెడరల్ ఆంధ్ర ప్రదేశ్ ప్రతినిధి మాట్లాడినప్పుడు..

"తిరుమల లడ్డు ప్రసాదంలో గొడ్డు కొవ్వు కల్తీ జరిగింది" అనే విషయం, గందరగోళంపై వారిలో చాలామందికి తెలియదనే విషయం స్పష్టమైంది. కొందరు ఈ వార్తలను టీవీలు పత్రికలో చూశామని చెప్పారు. కొందరు సోషల్ మీడియాలో వైరల్ అయిన వివరాలు గమనించాం అని చెప్పారు. ఇవి తమ మనసుకు కష్టం కలిగించాయని చెప్పారు అయితే, "దేవదేవుని సన్నిధిలోకి శరణాగతి కోరుతూ వచ్చిన తమకు అంతా ఆ దైవమే చూసుకుంటుంది" అని వ్యాఖ్యానించారు. ప్రధానంగా ప్రసారమాధ్యమాల్లో వచ్చిన కథనాలను విశ్వసించడం లేదు, ఇది పూర్తిగా రాజకీయంగా జరిగిన వ్యవహారాల్లో భాగమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

మహారాష్ట్రలోని కొల్హాపూర్ ప్రాంతం నుంచి కుటుంబ సమేతంగా వచ్చిన దీపకే ఎన్ పాటిల్ మాట్లాడుతూ, స్వామి వారి అద్భుతమైన దర్శనం లభించింది. కొన్ని లడ్డూలను కొనుగోలు చేశాం అన్నారు. "లడ్డూ వివాదంపై స్పందించాలని కోరగా, ఏపీలోని రాజకీయ నాయకులు చిచ్చు రగిలించారు" అని ఆవేదన వ్యక్తం చేశారు. "మీడియాలో సాగుతున్న రాజకీయ నాయకుల ఆరోపణలు, ప్రత్యారోపణలు తిరుమల ఆలయానికి వచ్చే యాత్రికుల రాకపోకలపై ఎలాంటి ప్రభావం పడలేదు" అని పాటిల్ చెప్పారు.

పూర్తి రాజకీయం

"తిరుమలను రాజకీయ నాయకులు తమ స్వార్థానికి వాడుకుంటున్నారు" అని తిరువనంతపురం ప్రాంతానికి చెందిన జయశ్రీ, సురేష్(60) దంపతులు అభిప్రాయపడ్డారు. లడ్డులో కల్తీ జరిగి ఉంటే శ్రీవారు బాధ్యులను శిక్షించకుండా వదిలిపెట్టడు. ఆ విషయంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇది ఫక్తు రాజకీయం" అని ఆ కేరళ దంపతులు చెప్పారు. నిన్నటి దినం ఉదయం సర్వదర్శనం చేసుకోవడానికి స్వామివారి చెంతకు వెళ్ళాం. మంచి దర్శనం లభించింది. "ఆలయ సన్నిధి నుంచి వెలపలికి రాగానే చిన్న లడ్డు ప్రసాదంగా పంపిణీ చేశారు" అని తన్మయత్వంతో చెప్పారు. ఇది చాలా రుచిగా ఉందని కూడా జయశ్రీ వ్యాఖ్యానించారు.

మహారాష్ట్రలోని నాందేడ్ ప్రాంతానికి చెందిన నారాయణ (45) ఏమంటున్నారంటే..
"లడ్డులో కల్తీ వ్యవహారం పూర్తిగా రాజకీయ ప్రేరేపితమైనది" అని కొట్టి పారేశారు. "మా ఊరిలో ఉండగానే లడ్డూ కల్తీ విషయం విన్నాను. గత సంవత్సరం స్వామివారి దర్శనానికి వచ్చినప్పుడు, నాణ్యతలో కొంత తేడా ఉండడం మేము గమనించాం. ఇప్పుడు అలా లేదు. చక్కగా ఉంది" అని అన్నారు. "కల్తీ నెయ్యి సరఫరా చేయడానికి కారణమైన వ్యక్తులను చట్టపరంగా శిక్షించాలి" అని ఆయన డిమాండ్ చేశారు. "ఇలాంటి వ్యవహారాలు భక్తుల మనోభావాలను దెబ్బతీస్తాయి. అయినా స్వామివారి దయ ఉంది. కాబట్టి ఆయన యాత్రికులను నిలువరింప చేయలేరు" అని అన్నారు.

"లడ్డు కల్తీపై ఆధారాలు ఎక్కడ " అని కేరళ రాష్ట్రం ఎర్నాకులానికి చెందిన స్వాతి (20) సూటిగా ప్రశ్నించారు. "ఈ వ్యవహారంలో తాత్సారం చేయకుండా, టీటీడీ, ప్రభుత్వం వద్ద ఆధారాలు ఉంటే బాధ్యులపై చర్యలు తీసుకోవాలి" అని డిమాండ్ చేశారు. ఈ తరహా రాజకీయ వ్యవహారాలు శ్రీవారి భక్తులకు పై ఉండవు అని కూడా ఆమె స్పష్టం చేశారు.

తగ్గని యాత్రికుల సంఖ్య...

శ్రీవారి దర్శనానికి వస్తున్న యాత్రికుల సంఖ్య ఏమాత్రం తగ్గడం లేదు. సాధారణ రోజుల్లో ఏ తరహాలో భక్తులు పోటెత్తుతారో.. "లడ్డులో వాడిన నెయ్యి కలుషితమైందని ఆరోపణలు వెల్లువెతుకుతున్నప్పటికీ యాత్రికుల సంఖ్య ఏమాత్రం తగ్గకపోవడం" గమనించదగిన విషయం. అదేవిధంగా తిరుమలలో లడ్డు ప్రసాదాలు కొనుగోలు చేస్తున్న వారి సంఖ్య కూడా తగ్గలేదు.

టీటీడీ వెబ్సైట్ ప్రకారం సెప్టెంబర్ 23వ తేదీ 65,604 మంది యాత్రికులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వారి ద్వారా స్వామివారి హుండీకి రూ. 3.85 కోట్ల రూపాయలు కానుకల రూపంలో టీటీడీకి ఆదాయం లభించింది. ఆదివారం 82,646 మంది యాత్రికులు దర్శనం చేసుకుంటే, హుండీ కానుకల రూపంలో రు. 3.6 8 కోట్లు లభించింది.

సెప్టెంబర్ 20వ తేదీ " తిరుమల లడ్డు ప్రసాదంలో గొడ్డు పంది కొవ్వుతో పాటు చేప నూనె కల్తీ అయిన నెయ్యిని వినియోగించారు అని సీఎం ఎన్ చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేసిన రోజే.. యాత్రికుల సంఖ్య కూడా ఏమాత్రం తగ్గలేదు. ఆ మరుసటి రోజే 73 వేల 14 మంది భక్తులు స్వామివారి దర్శనానికి చేసుకున్నారు. వారి నుంచి శ్రీవారికి హుండీ ద్వారా రూ. 3.25 కోట్ల ఆదాయం లభించింది. ఇదిలా ఉంటే..

లక్షల్లో లడ్లు విక్రయం

టీటీడీ కేంద్రంగా రగించిన చిచ్చుతో.. రాష్ట్రంలోనే కాకుండా దేశం మొత్తాన్ని కుదిపివేసిన అంశం ఒకటే. శ్రీవారి లడ్డు ప్రసాదంలో కల్తీ జరిగింది అనే విషయం. ఇది భక్తుల నమ్మకం విశ్వాసం ముందు ఏమాత్రం పనిచేయలేదు అనే విషయం స్పష్టం అవుతుంది. టీటీడీ ఆలయ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..

సెప్టెంబర్ 19 నుంచి 23వ తేదీ వరకు టీటీడీ 16 లక్షలకు (1,696,605) పైగా లడ్డూలను యాత్రికులకు విక్రయించింది. రోజుకు సగటున మూడు లక్షలకు పైగా లడ్డూలు, విక్రయించారు. ఈ విక్రయాలను గత నెల గణాంకాలతో పోలిస్తే.

2024 జూలైలో 1,04,03,719 లడ్డూలు విక్రయించినట్లు టీటీడీ అధికారిక సమాచారం. దీని ద్వారా లడ్డు వివాదం యాత్రికుల రాకపై ఎలాంటి ప్రభావం చూపలేదని, తిరుమల లడ్డు ప్రసాదం పై వచ్చిన విభాగాల వల్ల అత్యధికమైన యాత్రికులకు ఇబ్బంది కలగలేదు అని టీటీడీ అధికారి ఒకరు తెలిపారు.

తిరుమల కేంద్రంగా రాజకీయ నాయకులు వివాదం రేపారు. దీన్నీ ఏమాత్రం పట్టించుకోని యాత్రికులు మామూలుగానే తిరుమల కొండకు వస్తున్నారు. ఆలస్యమైనా, పది నుంచి 24 గంటల వరకు నిరీక్షించి స్వామి వారిని దర్శనం చేసుకుంటున్నారు. అంతే భక్తితో తిరుమల లడ్డూలు కొంటున్నారు. బంధు, మిత్రులకు ప్రసాదంగా పంచడానికి సంతోషంగా తీసుకువెళుతున్నారు మినహా ఆలయం, లడ్డు ప్రసాదాల గొడవ వ్యవహారాలను శ్రీవారి భక్తులు పెద్దగా ఖాతరు చేయడం లేదు. దీనిపై మాట్లాడడానికి కూడా చాలామంది ఆసక్తి చూపడం లేదు అని ఓ అధికారి వ్యాఖ్యానించారు. తిరుపతి రైల్వే స్టేషన్ లో చాలామందిని కదిపినా లడ్డు ప్రసాదం పై మాట్లాడడానికి నిరాకరించారు. అంటే తమ మనసులో పదిలంగా ఉన్న భక్తి భావాన్ని కలుషితం చేసుకోవడం వారికి ఇష్టం లేదనే విషయం ఈ చర్య ద్వారా అర్థం చేసుకోవచ్చు. ఈ వివాదాన్ని త్వరగా ముగిస్తే మంచిదనే అభిప్రాయమే ఎక్కువ మంది వ్యక్తం చేశారు. అది ఎప్పుడు జరుగుతుందనే దాని కోసం వేచి చూడాలి.


Tags:    

Similar News