ఎన్నికలముందు ఓటర్లకు కొత్త తాయిలం ప్రకటించిన మహారాష్ట్ర ప్రభుత్వం!

ఓటర్లకు గాలం వేయటానికి ఏక్‌నాథ్ షిండే కొత్త తాయిలం ప్రకటించారు. ముంబాయి నగరంచుట్టూ ఐదు టోల్ గేట్లవద్ద లైట్ వాహనాలకు టోల్ ఫీజు రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు.

Update: 2024-10-14 09:00 GMT

మహారాష్ట్రలో ఎన్నికలు సమీపిస్తుండటంతో అక్కడ బీజేపీ మద్దతుతో అధికారంలో ఉన్న సంకీర్ణ ప్రభుత్వానికి ప్రజలపై ప్రేమ పెరిగిపోతోంది. ఓటర్లకు గాలం వేయటానికి ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే మహారాష్ట్ర ప్రజలకు ఇవాళ కొత్త తాయిలాన్ని ప్రకటించారు. ముంబాయి నగరంలోకి ప్రవేశించటానికి చుట్టూ ఉన్న ఐదు టోల్ గేట్లవద్ద లైట్ వాహనాలకు టోల్ ఫీజును రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇవాళ రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఇది రేపు మధ్యాహ్నం 12 గం. నుంచి అమలులోకి వస్తుందని తెలిపారు.

ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ముంబాయి నగరానికి సమీపంలో ఉండే థానే నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. థానే నియోజకవర్గవాసులు ప్రతిపనికీ ముంబాయి నగరానికి వస్తుంటారని, వారికి ముంబాయి టోల్ ఫీజు కట్టటం భారంగా ఉంటోందని షిండే ఎప్పటినుంచో వాదిస్తున్నారు. గతంలో ఈ విషయం గురించి ఎన్నో ఉద్యమాలు కూడా చేశారు.

ముంబాయి శివార్లలోని టోల్ ప్లాజాలగుండా ప్రతిరోజూ 3.5 లక్షల వాహనాలు ప్రయాణిస్తాయని, వీటిలో 2.8 లక్షల వాహనాలు లైట్ వాహనాలని, మిగతావి హెవీ వాహనాలని మహారాష్ట్ర మంత్రి దాదాజీ భూసే చెప్పారు. లైట్ వాహనాలకు టోల్ ఫీజు తీసేయాలని ఎన్నో నెలలుగా ప్రభుత్వం ఆలోచిస్తోందని, ఇప్పుడు ఇక అక్కడ పొడవైన క్యూలు ఉండబోవని అన్నారు.

ముంబాయి శివార్లలోని వాషి, ఐరోలి, ములంద్(ఎల్‌బీఎస్ రోడ్), ములంద్(ఈస్టర్న్ ఎక్స్‌ప్రెస్ హైవే), దహిసార్ ప్రాంతాలలో ఈ టోల్ ప్లాజాలు ఉన్నాయి. ఈ ప్లాజాలవద్ద టోల్ ఫీజును ఈ ఏడాది మొదట్లోనే రు.45 కు పెంచారు. మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన నాయకుడు రాజ్ థాకరే, బీజేపీ మాజీ ఎంపీ కిరిట్ సోమయ్య ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించారు.

మహారాష్ట్రలో ప్రస్తుతం శివసేన(ఏక్‌నాథ్ షిండే చీలిక వర్గం), ఎన్‌సీపీ(అజిత్ పవార్ చీలిక వర్గం), బీజేపీలతో కూడిన కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. కాంగ్రెస్, ఎన్‌సీపీ(శరద్ పవార్ వర్గం), శివసేన(ఉద్ధవ్ థాకరే)ల కూటమి ప్రతిపక్షంగా ఉంది. వచ్చే నెలలో ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. మూడు నెలల క్రితం జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మొత్తం 48 సీట్లలో అధికార కూటమికి 17 సీట్లు, ప్రతిపక్ష కాంగ్రెస్ కూటమికి 30 సీట్లు లభించగా ఒకచోట ఇండిపెండెంట్ అభ్యర్థి గెలిచారు.

Tags:    

Similar News