తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 4 నుండి 12 వరకు జరగనున్నాయి . బ్రహ్మోత్సవాలలో భాగంగా ధ్వజారోహణంకు ఊపయోగించే దర్భ చాప, తాడును వరాహస్వామి అథితి గృహాల వద్ద ఉన్న టిటిడి అటవీ విభాగం కార్యాలయం నుండి డిఎఫ్‌వో శ్రీ నివాసులు , సిబ్బంది ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి తీసుకొచ్చారు.
అనంతరం శ్రీవారి ఆలయం రంగనాయకుల మండపంలోని శేషవాహనంపై దర్భతో తయారుచేసిన చాప, తాడును ఉంచారు. అక్టోబర్ 4 తేదీ జరిగే ధ్వజారోహణంలో వీటిని ఉపయోగిస్తారు. ధ్వజారోహణంకు దర్భ చాప, తాడు కీలకం.
బ్రహ్మోత్సవాల ఆరంభానికి సూచికగా ధ్వజారోహణం నిర్వహిస్తారు. ఈ సందర్బంగా ధ్వజస్తంభం మీదకు గరుడ పతాకం ఎగురవేసి ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తారు. రుత్వికులు వేద మంత్రాలతో దర్భ చాపను ధ్వజస్తంభం చుట్టూ చుడతారు.
దర్బతో పేనిన తాడును ధ్వజస్తంభంపై వరకు చుడతారు. వీటి తయారీ కోసం టిటిడి అటవీ శాఖ 10 రోజుల ముందునుంచే కసరత్తు చేస్తుంది. దర్బలో శివ దర్భ, విష్ణు దర్భ అనే రెండు రకాలు ఉండగా, తిరుమలలో విష్ణు దర్బ ఉపయోగిస్తారు.