నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు...ఇదీ ఎంపీ అసదుద్దీన్ తీరు

మిలాద్ ఉన్ నబీ లో పాలస్తీనా జిందాబాద్;

Update: 2025-09-14 10:33 GMT
పాలస్తీనా స్కార్ప్ తో ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ

ముహ్మద్ ప్రవక్త జయంతి వేళ మిలాద్ ఉన్ నబీ పండుగ సందర్భంగా హైదరాబాద్ నగరంలోని దారుస్సలాంలో జరిగిన బహిరంగ సభలో ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తేహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ (Hyderabad MP Asduddin Owaisi ) నోట మరోసారి పాలస్తీనా జిందాబాద్ నినాదాలు వినిపించాయి. మిలాద్ ఉన్ నబీ పండుగ సందర్భంగా పాత నగర ఊరేగింపులో పాలస్తీనా జెండాలు కనిపించాయి.‘‘గాజా కీ ఆవామ్ జిందాబాద్... పాలస్తీనా జిందాబాద్....నెతన్యాహు ముర్దాబాద్... హిందుస్థాన్ జిందాబాద్’’ అంటూ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీతోపాటు మజ్లిస్ కార్యకర్తలు నినాదాలు చేశారు.దారుస్సలాం మిలాద్ ఉన్ నబీ వేడుకల్లో ‘నారా-ఎ-తక్బీర్: అల్లాహు అక్బర్’ అంటూ నినాదాలు మిన్నంటాయి. బారిస్టర్ అయిన అసదుద్దీన్ ఒవైసీ మిలాద్ ఉన్ నబీ పబ్లిక్ మీటింగ్‌లో ఐకానిక్ పాలస్తీనియన్ కెఫియేను(అరాఫత్ స్కార్ఫ్) ధరించి పాలస్తీనాకు సంఘీభావాన్ని ప్రకటించారు.


మూడు దశాబ్దాలుగా ప్రజాప్రతినిధిగా...

మూడు దశాబ్దాలకు పైగా అసదుద్దీన్ ఒవైసీ ప్రజాప్రతినిధిగా ఉన్నారు. మజ్లిస్ పార్టీ అధినేతగా వ్యవహరిస్తున్నారు. 1994,1999 సంవత్సరాల్లో రెండుసార్లు ఎమ్మెల్యేగా ఈయన ఎన్నికయ్యారు. అనంతరం 2004వ సంవత్సరంలో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో మొదటి సారి అసద్ ఎంపీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత వరుసగా 2009, ,2014, 2019, 2024 సంవత్సరాల్లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ఎంపీగా ఘన విజయం సాధించారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా, అయిదు సార్లు ఎంపీగా విజయం సాధించి అసదుద్దీన్ రికార్డు నెలకొల్పారు.

నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు...

హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేయడమే కాకుండా పలు పోలీసు కేసులను ఎదుర్కొంటున్నారు. పార్లమెంటులో ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈయన ‘జై పాలస్తీన్’ అంటూ నినాదాలు చేసి కలకలం రేపారు. హైదరాబాద్ నగరంలో ఉగ్రవాద కార్యకలాపాల విస్తరణకు ఎంపీ అసదుద్దీన్ కారణమని కేంద్రమంత్రి జి కిషన్ రెడ్డి గతంలో తీవ్ర ఆరోపణలు చేశారు. 2016వ సంవత్సరంలో ఉగ్రవాదులకు న్యాయ సహాయం అందించారనే ఆరోపణలపై పోలీసులు దేశ ద్రోహ నేరం మోపారు. అయితే ఇటీవల జరిగిన ఆపరేషన్ సింధూర్ సందర్భంగా పాక్ పై చేసిన యుద్దాన్ని ఎంపీ అసద్ సమర్ధించారు.



 ఎన్నెన్నో దాడులు

ఢిల్లీలోని అశోక్ రోడ్డులోని ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఇంటిపై రెండు సార్లు గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. భారత్ మాతాకీ జై, జై శ్రీరాం అంటూ నినాదాలు రాసిన పోస్టర్లను ఎంపీ ఇంటి గోడలపై అతికించారు. ఆయన ఇంటి నేమ్ ప్లేట్, గేటుపై నల్ల సిరాను చల్లారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం చేసి ఢిల్లీ వస్తుండగా ఆయన కాన్వాయ్ పై కాల్పులు జరిపారు. ముహమ్మద్ ప్రవక్తపై సయ్యద్ వసీం రిజ్వీ రాసిన పుస్తకంలో ముస్లింల మతపరమైన మనోభావాలను కించపర్చారని ఒవైసీ ఫిర్యాదు చేశారు. 2016వ సంవత్సరంలో మహారాష్ట్రలో జరిగిన ర్యాలీలో తాను భారత్ మాతాకీ జై అని ఎప్పటికీ చెప్పనని ప్రకటించి వివాదం రేపారు. రాజ్యంగంలో భారత్ మాతాకీ జై అని చెప్పాలని ఎక్కడా లేదని బారిష్టరు అయిన అసద్ వ్యాఖ్యానించారు.

పలు పోలీసు కేసులు

2005వ సంవత్సరంలో మెదక్ జిల్లా కలెక్టరుపై అసభ్యంగా ప్రవర్తించినందుకు ఎంపీ అసద్ ను 2023 జనవరి 20వతేదీన అరెస్టు చేశారు. మెదక్ జిల్లాల్లో రహదారి విస్తరణ కోసం మసీదు కూల్చిన వ్యవహారంలో నిరసన తెలిపిన ఎంపీపై పోలీసులు కేసు పెట్టారు. 2009వ సంవత్సరంలో టీడీపీ పోలింగ్ ఏజెంటు సయ్యద్ సలీముద్దీన్ ను వెంటాడి కొట్టినందుకు కేసు నమోదైంది. 2013వ సంవత్సరంలో బీదర్ లో అనుమతి లేకుండా ర్యాలీ తీశారని పోలీసులు కేసు నమోదు చేశారు. లైసెన్సు లేకుండా తుపాకీని తీసుకువచ్చారని బీదర్ పోలీసులు అతన్ని అదుపులోకి కూడా తీసుకున్నారు. 2014లో మోదీకి వ్యతిరేకంగా ఒవైసీ విద్వేష ప్రసంగం చేశారు.



 నాడు పార్లమెంటులో పాలస్తీనా నినాదం

హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రమాణ స్వీకారం పూర్తి చేసిన తర్వాత జై పాలస్తీనా అని నినదించడంతో లోక్‌సభలో కలకలం రేగింది. దీనిపై ఇద్దరు న్యాయవాదులు రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. ఆర్టికల్ 103 ప్రకారం ఒవైసీపై అనర్హత వేటు వేయాలని రాష్ట్రపతిని కోరినట్టు న్యాయవాది వినీత్ జిందాల్ ఎక్స్ లో వెల్లడించారు. పార్లమెంటులో మరో దేశాన్ని కీర్తిస్తూ జై కొట్టినందుకు చర్యలు తీసుకోవాలని కోరినట్టు ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.పాలస్తీనా పట్ల విధేయత చూపినందుకు ఆర్టికల్ 102 (4) ప్రకారం అసదుద్దీన్ ఒవైసీని అనర్హులుగా ప్రకటించాలని సుప్రీంకోర్టు న్యాయవాది హరిశంకర్ జైన్ కూడా రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు.రాజ్యాంగంలోని ఆర్టికల్ 102 ప్రకారం ఒవైసీ లోక్‌సభకు అనర్హుడిగా ప్రకటించాలని బీజేపీ డిమాండ్ చేసింది. దీని తర్వాత స్పీకర్ అతని నినాదాన్ని రికార్డు నుంచి తొలగించారు. మరోవైపు తన వ్యాఖ్యలను అసదుద్దీన్ ఒవైసీ సమర్థించుకున్నారు. జై పాలస్తీనా అంటే తప్పేంటని ప్రశ్నించారు. ‘‘ప్రమాణస్వీకారం సందర్భంగా నేను కేవలం జై భీమ్, జై తెలంగాణ, జై పాలస్తీనా అన్నాను. ఇది ఎలా రాజ్యాంగ వ్యతిరేకం అవుతుంది? అలాంటి నింబంధన ఏదైనా ఉంటే చూపాలి’’అని అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు.


Tags:    

Similar News