జగన్ తో బాలినేని ఎందుకు డిఫర్ అయ్యారు?

మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కొన్ని సందర్భాల్లో ముక్కుసూటిగా వెళతారు. అయితే అందరూ తనవాళ్లేననే భావన ఆయనలో ఎక్కువ. ప్రతిపక్షంలోని వారు వచ్చినా చిరునవ్వుతో పలకరిస్తారు.

Update: 2024-09-18 23:46 GMT

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు బాగా వేడెక్కాయి. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వైఎస్సార్సీపీకీ గుడ్ బై చెప్పారు. ఇది ముందు నుంచీ ఊహించిందే. అయితే వైఎస్సార్ సీపీ నుంచి బాలినేని బయటకు రావడంపై పలువురిలో పలు అనుమానాలు ఉన్నాయి. వైఎస్ జగన్ కు బాలినేని బంధువు. చిన్నాన్న వైవీ సుబ్బారెడ్డికి బావ అవుతాడు. అంటే తనకు కూడా బావ అవుతాడు. ఎంతో కాలంగా వైఎస్ కుటుంబ సభ్యుల్లో ఒకడుగా బాలినేని మెలిగాడు. వాసూ అక్కడ చూసుకో (బాలినేని శ్రీనివాసరెడ్డి) అని నాడు వైఎస్సార్ చెప్పారంటే వాసుకు అక్కడ తిరుగులేదని అధికారులే కాకుండా వాసు బంధువులు అందరూ భావించే వారు. ప్రకాశం జిల్లాకు ఎప్పుడు వచ్చినా ప్రత్యేకంగా బాలినేని శ్రీనివాసరెడ్డిని వైఎస్సార్ పిలిచి మాట్లాడే వారు. రాజకీయ పరిస్థితులు ఏమిటి? ఎలా ఉంటాయనేది తెలుసుకునే వారు.

వైఎస్సార్ సీపీలో చేరిన తరువాత వాసు పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా తయారైంది. జగన్ కు ఏమి చెప్పినా పట్టించుకునే వారు కాదు. ఎన్నికలకు ఏడాది ముందే పార్టీ రాష్ట్రంలో ఓటమి పాలవుతుందని, ప్రకాశం జిల్లాలో ఒక్క సీటు కూడా వచ్చే అవకాశం లేదని జగన్ కు బాలినేని చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. తనతో పాటు ఇతర అభ్యర్థులు కూడా ఓడిపోయే అవకాశం ఉన్నందున అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆచి తూచి నిర్ణయం తీసుకోవాలని జగన్ కు సూచించినట్లు ఆయన సన్నిహితులు చెప్పారు. ఎప్పుడు జగన్ ను బాలినేని కలిసినా జిల్లా రాజకీయాల గురించి చెప్పాలని ప్రయత్నించే వారు. అన్నీ తనకు తెలుసునని, నీవు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని వాసుతో జగన్ అనేవాడని వాసు బంధువులు చెబుతున్నారు.

పథకాలపై చర్చ వచ్చినప్పుడు మద్యం విధానాన్ని బాలినేని పూర్తిగా వ్యతిరేకించారు. బయట పడకపోయినా మద్యం బ్రాండ్స్ విషయం ఆలోచించాలని, తన కళ్ల ముందే ఎంతో మంది మద్యం విధానంపై తిడుతున్నారని చెప్పినా జగన్ చిరునవ్వే సమాధానమైనట్లు సమాచారం. ఎంతో మంది తాతలు, తండ్రుల నుంచి వచ్చిన వారసత్వ ఆస్తుల పట్టా కాగితాలకు ఏడాదికోసారి పూజలు చేసి ఖజానా బీరువాల్లో దాచుకుంటుంటారు. ఆ కాగితాల్లో తమ పెద్దలు ఉన్నారని భావిస్తుంటారు. ఆస్తుల పేపర్లు డబ్బుకంటే విలువైనవిగా చూసుకుంటారు. అలాంటి పేపర్లపై నీ బొమ్మ వేసి ఇవ్వడం మంచిది కాదని, ఈ పద్దతి మారాలని బాలినేని జగన్ కు సూచించినట్లు బాలినేనికి అత్యంత సన్నిహితులుగా ఉండేవారు చెబుతున్నారు. ఏంటి బావా ప్రతి దానినీ నెగటివ్ గా తీసుకుంటున్నావు. ఎందుకు ఇలా ఆలోచిస్తున్నావు. మనపైపు జనం ఉన్నారు. మనం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఇంతకు ముందు రాష్రంలో ఎవరన్నా చేశారా? అలాంటప్పుడు జనం మనతో ఎందుకు ఉండరనుకుంటున్నావని జగన్ బాలినేనిని ఎన్నోసార్లు ఎదురు ప్రశ్నించినట్లు సమాచారం.

ఇవన్నీ ఆలోచించిన తరువాత ఎట్టి పరిస్థితుల్లోనూ వైఎస్సార్ సీపీలో ఉండకూడదనే నిర్ణయానికి వచ్చారు. ఆల్టర్నేట్ ఏమిటనే విషయంపై చాలా రోజులు బాలినేని శ్రీనివాసరెడ్డి తర్జన భర్జన పడినట్లు తెలిసింది. రాష్ట్రం సంగతి అలా వదిలేసి ప్రకాశం జిల్లాలో తాను చెప్పిన వారికి టికెట్లు ఇస్తే గెలిపించుకునే బాధ్యత కూడా తాను తీసుకుంటానని, ఒంగోలు ఎంపీ సీటు తిరిగి ఎంపీ మాగుంటకు ఇవ్వాలని జగన్ ను బాలినేని కోరారు. మాగుంటకు సీటు లేదు. నీ విషయం చెప్పు. అభ్యర్థుల విషయం నేను చూసుకుంటాను. మనం పోటీలో పెట్టిన వాళ్లు గెలుస్తారు? ఎక్కువగా ఆలోచించి బుర్ర పాడు చేసుకోకు అని జగన్ చెప్పారనేది సమాచారం. ఒక దశలో మాజీ మంత్రి శిద్దా రాఘవరావును ఎంపీగా పోటీ చేయించాలని జగన్ ప్రయత్నించి విఫలమయ్యారు. తనకు ఇస్తే దర్శి అసెంబ్లీ ఇవ్వాలని లేకుంటే పోటీలోనే ఉండేది లేదని చెప్పారు. వాసు నుంచి నాకు నస ఎక్కువైందని, ఒంగోలు అసెంబ్లీకి పోటీ చేస్తే సీటు నీదేనని జగన్ శిద్దాతో చెప్పారు. ఇదేతో తేడాగా ఉందని భావించిన శిద్దా రాఘవరావు ఎన్నికల తరువాత నుంచి పార్టీకి దూరంగా ఉన్నారు. ఇటీవల ఆయన వైఎస్సార్ సీపీకి రాజీనామా చేశారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబును కలిసి వరద బాధితుల కోసం రూ. 50 లక్షలు విరాళంగా ఇచ్చారు.

పవన్ కళ్యణ్ తో బాలినేని శ్రీనివాసరెడ్డికి చాలా కాలం నుంచి మంచి స్నేహం ఉంది. తెలుగుదేశం పార్టీలో చేరాలని భావించినా దామచర్ల జనార్థన్ ను కాదని తనకు చంద్రబాబు నాయుడు ప్రయార్టీ ఇచ్చే అవకాశం లేదని తేలిపోయింది. దీంతో జనసేన పార్టీనే తనకు సేఫ్ గా ఉంటుందనే నిర్ణయానికి వచ్చిన బాలినేని జనసేనలో చేరేందుకు నిర్ణయించుకున్నారు. ఇప్పటికే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తో మాట్లాడినట్లు సమాచారం. హైదరాబాద్ లో బాలినేనికి చాలా మంది వ్యాపర వేత్తలతో మంచి స్నేహం ఉంది. తన స్నేహితుల్లో కొందరి ద్వారా పవన్ కళ్యాణ్ తో స్నేహం పెరిగింది. వ్యక్తిత్వం విషయంలో పవన్ కళ్యాణ్ జగన్ కంటే వెయ్యి రెట్లు బెటరనే ఆలోచనకు వచ్చిన బాలినేని జనసేనను ఎంచుకున్నారు. తనవరకు తాను తప్పకుండా గెలుస్తానని, తాను అనుకున్న వారిని గెలిపించుకునేందుకు కూడా జనసేనలో అవకాశం ఉంటుందనే నిర్ణయానికొచ్చిన బాలినేని జనసేనలో చేరుతున్నారు. గురువారం ఉదయం 8 గంటలకు విజయవాడలోని తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో పవన్ కళ్యాణ్ తో బాలినేని శ్రీనివాసరెడ్డి భేటీ అవుతున్నారు. బుధవారం రాత్రి బాలినేని విజయవాడకు చేరుకున్నారు. పార్టీలో ఎప్పుడు చేరాలనే విషయంపై క్లారిటీ తీసుకుని తిరిగి హైదరాబాద్ వెళతారు.


Tags:    

Similar News