తెలంగాణలో టీడీపీ రీఎంట్రీతో ఏ పార్టీకి లాభం, ఏ పార్టీకి నష్టం?

తెలంగాణలో తమకు ఎంతో కొంత నిర్మాణం, ఓట్ బ్యాంక్ ఉంది కనుక కనీసం 5-6 సీట్లు గెలుచుకుంటే ఇక్కడకూడా పార్టీ ఉనికిని చాటుకోవచ్చని చంద్రబాబు ఆశిస్తున్నారు.

Update: 2024-07-11 14:02 GMT

తెలంగాణలో తెలుగుదేశం పార్టీని పునర్నిర్మాణం చేస్తామంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాలలో పలు చర్చలకు తెర లేపాయి. టీడీపీ పునరుజ్జీవం జరిగితే ఏ పార్టీకి లాభం ఏ పార్టీకి నష్టం అనే లెక్కలు వేయటం మొదలయింది.

తెలంగాణలో తమకు ఎంతో కొంత నిర్మాణం, ఓట్ బ్యాంక్ ఉంది కాబట్టి ఒంటరిగా పోటీ చేసినా కనీసం పది పదిహేను స్థానాలకు పోటీ చేసి 5-6 సీట్లు గెలుచుకుని తమ పార్టీ ఉనికిని పదిలపరుచుకోవాలని చంద్రబాబు ఆశిస్తున్నారు. మరి మూడు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్‌లపై టీడీపీ ప్రభావం ఎలా ఉంటుందో చూద్దాం.

బీజేపీ

ఏపీలో బీజేపీ ఇప్పటికే తెలుగుదేశం, జనసేనలతో కూటమిగా ఏర్పడి ఘనవిజయం సాధించి ఊపుమీద ఉంది. తెలంగాణలో ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికలతో రెండో అతి పెద్ద పార్టీగా మారిన బీజేపీ, 2028 అసెంబ్లీ ఎన్నికలలో అధికారం చేజిక్కించుకోవాలని కలలు కంటోంది. ఈ పరిస్థితిలో తెలుగుదేశం, జనసేనలు తెలంగాణలో కూడా చేతులు కలిపితే బీజేపీ బలం ద్విగుణీకృతం అవుతుంది. తెలుగుదేశానికి ప్రధాన ఓట్ బ్యాంక్ అయిన కమ్మ సామాజికవర్గం ఖమ్మం, నిజామాబాద్, హైదరాబాద్ వంటి చోట్ల గణనీయమైన సంఖ్యలో ఉంది. మరోవైపు, జనసేనకు పవన్ అభిమానులతో పాటు, అతని సామాజికవర్గమైన కాపు సెటిలర్‌లు, మున్నూరు కాపులు కూడ పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. నిజానికి పవన్‌కు ఆంధ్రాలో కంటే తెలంగాణలోనే అభిమానుల సంఖ్య ఎక్కువ. కాకపోతే, అతను ఇక్కడ ఇంతవరకు బలమైన పోటీదారుగా అనిపించకపోవటంతో 2019లో ఏపీలో వేయనట్లే ఇక్కడ కూడా అభిమానులు కూడా ఓటు వేయలేదు. ఇప్పుడు కూటమిలో భాగస్వామిగా వస్తే మాత్రం అతనికి కూడా అభిమానులు ఎంతో కొంత తప్పకుండా వేసే అవకాశం ఉంది. మొత్తంమీద తెలంగాణలోకి తెలుగుదేశం రీఎంట్రీ బీజేపీకి కలిసొచ్చే అంశమే.

కాంగ్రెస్

తెలుగుదేశం రీఎంట్రీ వలన కూటమి ఏర్పడితే బీజేపీ బలపడుతుంది కాబట్టి కాంగ్రెస్‌కు ఇది మింగుడుపడని విషయమే. మరోవైపు బీఆర్ఎస్‌ను మరీ ఎక్కువగా బలహీనం చేయటంతో అది బూమరాంగ్ అయ్యి తమకే వ్యతిరేక ఫలితాలు వస్తాయేమో అని కాంగ్రెస్ పునరాలోచనలో పడినట్లు చెబుతున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత కేసీఆర్ ఇలా కాంగ్రెస్‌ను బలహీనపరచబట్టే బీజేపీ పుంజుకున్న విషయాన్ని హస్తం పార్టీలోని కొందరు సీనియర్ నేతలు రేవంత్‌కు గుర్తు చేశారని అంటున్నారు.

బీఆర్ఎస్

టీడీపీ ఎంట్రీని బీఆర్ఎస్ సానుకూల పరిణామంగా భావించే అవకాశం ఉంది. ఎందుకంటే మళ్ళీ సెంటిమెంట్ అస్త్రం తీయటానికి ఆ పార్టీకి అవకాశం లభిస్తుంది. కేవలం ఈ సెంటిమెంట్ ఆధారంగానే 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సారి, తెలంగాణ మళ్ళీ ఆంధ్రా పాలకుల చేతుల్లోకి వెళ్ళిపోతుందంటూ ఆయన వాదన ఎత్తుకునే అవకాశం ఉంది. అయితే, దీనికి ఇంకో కోణం కూడా ఉంది. తెలంగాణ ఏర్పడి పది ఏళ్ళు గడిచిపోవటంతో, ఇక సెంటిమెంట్ అస్త్రం పనిచేయకపోవచ్చు.

ఏది ఏమైనా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు వచ్చే ఏడాది మొదట్లో జరుగుతాయి కాబట్టి తెలుగుదేశం ఒంటరిగా పోటీకి దిగుతుందా, బీజేపీతో పొత్తు పెట్టుకుంటుందా అనేది తెలియటానికి ఎక్కువ సమయం పట్టదు.

Tags:    

Similar News