హాస్టళ్లలో ఏమి జరుగుతోంది?
సంక్షేమ, గురుకుల హాస్టళ్లలో విద్యార్థులకు సరైన వైద్య సేవలు అందటం లేదు. పిల్లలు నిరాధరణకు గురవుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Byline : G.P Venkateswarlu
Update: 2024-08-28 10:56 GMT
గత వారం కైలాసపట్నం అనాథ శరణాలయంలో ముగ్గురు విద్యార్థులు మృతి
అనంతపురం బీసీ బాలుర వసతీ గృహంలో విద్యార్థి ఆత్మహత్య
రాష్ట్ర వ్యాప్తంగా పలు హాస్టళ్లలో వేల మంది విద్యార్థులకు అనారోగ్యం
ఆందోళన చెందుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు
సంక్షేమ హాస్టళ్లు, గురుకుల స్కూళ్లు, నవోదయ వంటి రెసిడెన్సియల్ స్కూళ్లలో ఏమి జరుగుతోంది? వేల మంది విద్యార్థులు అనారోగ్యం పాలై ఆస్పత్రుల్లో ఉన్నారు. ఒక అనాథ శరణాలయంలో ముగ్గురు కలుషిత ఆహారం తిని మరణించారు. ఒక విద్యార్థి బీసీ గురుకుల స్కూల్లో ఆత్మహత్య చేసుకున్నారు. వీటన్నింటిపై ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, సమాచార శాఖ మంత్రి ఆరాతీశారు. విచారణకు ఆదేశించారు. అయినా ఫలితాలు మాత్రం సూన్యం. గతం గురించి మాట్లాడే కంటే ప్రస్తుతం విద్యార్థులు ఆరోగ్యంగా ఉంటూ చదువుకునేందుకు మంచి వాతావరణం కల్పించాలని విద్యార్థుల తల్లదండ్రులు కోరుకుంటున్నారు.
మూడు రోజులుగా ఏ హాస్టల్‌ను కదిలించినా కన్నీటి కథలు వినిపిస్తున్నాయి, కనిపిస్తున్నాయి. గత బుధవారం అనకాపల్లి జిల్లా కోటఉరాట్ల మండలం కైలాసపురంలోని అనాథ శరణాలయంలో ఫుడ్ పాయిజన్ జరిగి ముగ్గురు పిల్లలు మృత్యువాత పడ్డారు. మరో 15 మంది విశాఖపట్నంలోని వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. విశాఖపట్నంలోని ఫార్మాకంపెనీలో జరిగిన పేలుడులో మృతి చెందిన కుటుంబాలను పరామార్శించేందుకు అక్కడికి వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆస్పత్రికి వెళ్లి బాధిత విద్యార్థులను పరామర్శించారు. ఈ శరణాలయంపై విచారణ జరపాల్సిందిగా ఉన్నతాధికారులను ఆదేశించారు. శరణాలయం యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం చెప్పారు.
తిరుపతి జిల్లా నాయుడుపేటలోని సాంఘిక సంక్షేమ హాస్టల్‌లో మంగళవారం రాత్రి ఫుడ్ పాయిజన్ జరిగింది. పిల్లలను వైద్యశాలకు తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. ప్రస్తుతం 15 మంది ఆస్పత్రిలో ఉన్నారు. రెండు నెలల క్రితం కూడా ఇదే హాస్టల్‌లో ఫుడ్‌పాయిజన్ జరిగి 135 మంది విద్యార్థులు ఆస్పత్రి పాలయ్యారు. అయినా హాస్టల్ సిబ్బందిలో ఎటువంటి మార్పు రాలేదు.
కాకినాడ జిల్లా ఏలేశ్వరంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల విద్యాలయంలో ఫుడ్‌పాయిజన్ జరిగి 30 మంది విద్యార్థినులు ఆస్పత్రి పాలయ్యారు. వీరి పరిస్థితి ఎలా ఉందనే విషయాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్వయంగా అధికారులతో మాట్లాడి తెలుసుకున్నారు. కలెక్టర్, ఇతర అధికారులన అప్రమత్తం చేసి వారికి సకాలంలో మంచి వైద్యం అందించే విధంగా చర్యలు తీసుకున్నారు. కడుపు నొప్పి, విరోచనాలతో వీరు బాధపడుతున్నారు. ఈ గురుకులంలో చోటు చేసుకున్న పరిణామాలపై సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి అధికారులను అడిగి సమాచారం తెలసుకున్నారు. పిల్లలకు ఎటువంటి హాని లేదని, వైద్య సేవలు అందుతున్నాయని ప్రకటించారు.
శ్రీకాకులం జిల్లా నర్సన్నపేట నియోజకవర్గంలోని తామరపల్లి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల కళాశాలలో ఐదుగురు విద్యార్థినులను మంగళవారం రాత్రి నిద్రిస్తుండగా ఎలుకలు కాళ్లు కొరికాయి. దీంతో వారికి కాళ్లకు గాయాలయ్యాయి. గాఢ నిద్రలో ఉండగా ఎక్కువ ఎలుకలు వచ్చి కొరికినట్లు విద్యార్థినులు తెలిపారు. ప్రస్తుతం వీరు నర్సన్నపేటలోని ఆస్పత్రిలో వైద్య చికిత్సలు పొందుతున్నారు.
అనంతపురంలోని బీసీ గురుకుల విద్యాలయంలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నారు. ఇందుకు కారణాలు తెలియలేదు. అనారోగ్యమని కొందరు విద్యార్థులు చెబుతుంటే, విద్యార్థులు గొడవపడి ఆత్మహత్యకు పాల్పడ్డారని కొందరు చెబుతున్నారు. దీనిపై బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత విచారణకు ఆదేశించారు. మంగళవారం రాత్రి పది గంటల తరువాత ఆస్పత్రిలో మృతదేహాన్ని పరిశీలించారు. తల్లదండ్రులకు ధైర్యం చెప్పారు. సంఘటనకు కారణాలు తెలియాల్సి ఉందన్నారు. హిందూపురంలోని బీసీ బాలుర గురుకుల స్కూలును ఆమె మంగళవారం సందర్శించారు. స్కూలు వాతావరణం బాగులేకపోవడంపై ఉద్యోగులను నిలదీశారు. వెంటనే బాగు చేయాలని, బాత్ రూమ్‌లను సుభ్రం చేయాలని, మంచి వాతావరణం ఉండేలా చూడాలని, బియ్యంలో పురుగులు ఉన్నందున బియ్యాన్ని బాగు చేసి వండాలని వార్డెన్, ఇతర సిబ్బందిని ఆదేశించారు. గోడౌన్ నుంచి బియ్యం తెచ్చుకునే సమయంలో శాంపిల్స్ పరిశీలించి తెచ్చుకోవాలన్నారు. రూముల్లో ఫ్యాన్‌లు కూడా లేకపోవడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఫ్యాన్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
బాపట్ల జిల్లా కేంద్రంలో ఉన్న కేంద్రీయ విద్యాలయంలో ల్యాబ్‌లో ప్రాక్టికల్స్ నిర్వహణ సందర్బంగా కెమికల్స్ మిక్సింగ్ చేస్తుండగా వచ్చిన వాయువులు పీల్చుకున్న విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఉపాధ్యాయుడు, ఇతర సిబ్బంది విద్యార్థులను వైద్యశాలకు తరలించి వైద్య చికిత్స చేయించారు. ఈ విషయమై ఉన్నతాధికారులో ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడు మాట్లాడారు. విద్యార్థులకు ఎటువంటి ప్రమాదం లేదని తెలియగానే మరిన్ని జాగ్రత్తలు తీసుకుని ల్యాబ్స్‌లో మరోసారి ఇటువంటి ఇన్సిడెంట్స్ ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
ఏలూరు జిల్లా నూజివీడులోని ట్రిపుల్ ఐటీలో వారం రోజులుగా విషజ్వరాలతో సుమారు 800 మంది విద్యార్థులు ఆస్పత్రి పాలయ్యారు. ట్రిపుల్ ఐటీలో 8,800 మంది విద్యార్థినీ విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. కాలేజీ ఆవరణలోనే వైద్య శాల కూడా ఉంది. అయినా జ్వరాలు అదుపులోకి రావడం లేదు. బుధవారం ఒక్కరోజే సుమారు 350 మంది విద్యార్థులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే, సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారధి అధికారులతో మాట్లాడారు. ట్రిపుల్ ఐటీ రిజిస్ట్రార్‌తో మాట్లాడి హాస్టల్స్‌లో ఏమి జరుగుతుందనే విషయం కనుక్కున్నారు. నాలుగు రోజులుగా విద్యార్థులు జ్వరాల భారిన పడుతుంటే ప్రభుత్వం దృష్టికి ఎందుకు తీసుకు రాలేదన్నారు. వెంటనే మెరుగైన వైద్యం విద్యార్థులకు అందించాలని ఆదేశించారు.
ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, సాంఘిక సంక్షేమ మంత్రి, బీసీ సంక్షేమ మంత్రి, సమాచార శాఖ మంత్రిలు హాస్టళ్లలో జరుగుతున్న పరిణామాలను పర్యవేక్షిస్తున్నా పిల్లలు ఇంకా వ్యాధుల భారితన పడుతున్నారు. హాస్టళ్లలో ప్రతి వారం విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులపై తగిన చెకప్‌లు చేసి చర్యలు తీసుకోవాల్సిన వైద్యులు ఎందుకు వెళ్లడం లేదనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ప్రతి వారం హాస్టళ్లు తనిఖీ చేసి వైద్య సేవలు అందిస్తున్నట్లు మాత్రం రికార్డులో ఉంటున్నాయి. మంత్రులే స్వయంగా పరిశీలించినప్పుడు హాస్టళ్లలో ఉద్యోగుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపించడంపై ఇంతవరకు ఎటువంటి చర్యలు లేవు.