కరెంట్ పోయిందా? 1912కు ఫోన్ చేయండి!

గ్రేటర్ హైదరాబాద్‌లో విద్యుత్ సరఫరాకు ఎక్కడైనా అంతరాయం ఏర్పడితే తక్షణమే విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు స్పెషల్ ఎమర్జెన్సీ వాహనాలను ప్రారంభించారు.

Update: 2024-10-21 11:29 GMT

హైదరాబాద్ నగరవాసులకు ఇది శుభవార్తే! నగరంలో తరచూ ఎక్కడో అక్కడ విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడటం మనకు అందరికీ ఎదురయ్యే అనుభవమే. వర్షాకాలమైతే తరచూ ఈ సమస్య ఎదురవుతుంటుంది. ఈ సమస్యల పరిష్కారంకోసం తెలంగాణ ప్రభుత్వం ఒక మంచి చర్య తీసుకుంది. గ్రేటర్ హైదరాబాద్ నగరంలో విద్యుత్ సరఫరాకు ఎక్కడైనా అంతరాయం ఏర్పడితే, వెంటనే పునరుద్ధరించేందుకు సీబీడీ(సెంట్రల్ బ్రేక్‌ డౌన్) విభాగాన్ని పటిష్ఠం చేశారు. మెడికల్ ఎమర్జెన్సీ ఆంబులెన్స్ తరహాలో తక్షణమే విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు స్పెషల్ వాహనాలను అందుబాటులోకి తెచ్చారు. ఇవి 24 గంటలూ అందుబాటులో ఉంటాయి.

దేశంలో ఎక్కడాలేని విధంగా ప్రజలకు మెరుగైన విద్యుత్ సేవలు అందించేందుకు ఆంబులెన్స్ తరహాలో స్పెషల్ వాహనాలను తీసుకొచ్చామని తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. ఆయన ఇవాళ హైదరాబాద్‌లో ట్యాంక్‌బండ్ ప్రాంతంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద విద్యుత్ సరఫరా ఎమర్జెన్సీ వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. ఈ ఎమర్జెన్సీ వాహనాలు 24 గంటలూ అందుబాటులో ఉంటాయని చెప్పారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడితే 1912 నంబర్‌కు ఫోన్ చేయాలని, వెంటనే అత్యవసర సిబ్బంది అందుబాటులోకి వస్తారని తెలిపారు. హైదరాబాద్ నగరంలో 57 డివిజన్‌లు ఉంటే ప్రతి డివిజన్‌కూ ఒక వాహనాన్ని కేటాయించామని చెప్పారు. రోజు రోజుకూ పెరుగుతున్న విద్యుత్ డిమాండ్, వినియోగదారుల సంఖ్యకు అనుగుణంగా సేవలను విస్తరిస్తున్నామని తెలిపారు.

ఎక్కడైనా అంతరాయం ఏర్పడితే తక్షణమే సిబ్బంది అవసరమైన యంత్రపరికరాలతో అక్కడకు చేరుకుని స్వల్పవ్యవధిలోనే పునరుద్ధరణ చేపడతారని భట్టి చెప్పారు. ప్రతి వాహనంలో ఒక అసిస్టెంట్ ఇంజనీర్, ముగ్గురు లైన్ మ్యాన్‌లు, అవసరమైన మెటీరియల్, ధర్మో విజన్ కెమేరాలు, కరెంట్ రంపము, నిచ్చెనలు, ఇన్సులేటర్లు, కండక్టర్ల, కేబుల్ తీగలు, ఎర్త్ రాడ్లు, హెల్పెట్ వంటి భద్రతా సామాగ్రి ఉంటాయని తెలిపారు. ఈ వాహనాలకు ట్రాన్స్‌ఫార్మర్‌లను లాగగలిగే సామర్థ్యం ఉంటుందని భట్టి చెప్పారు.

Tags:    

Similar News