సుప్రీమ్ కోర్ట్ చరిత్రాత్మక తీర్పు: రోడ్లపై గుడులు తొలగించాల్సిందే!

కూల్చివేతకు ఇచ్చే నోటీసుకు, దాని అమలుకు మధ్య కొంత వ్యవధి ఉండాలని, తద్వారా సంబంధిత వ్యక్తులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోగలుగుతారని పేర్కొంది.

Update: 2024-10-01 11:06 GMT

దేశ అత్యున్నత న్యాయస్థానం ఇవాళ చరిత్రాత్మక తీర్పును ఇచ్చింది. రోడ్డు మధ్యలో ఉండే గుడి, గురుద్వారా, దర్గా వంటి ఏ మతానికి చెందిన ప్రార్థనా మందిరమైనా కూడా ప్రజలకు ఆటంకంగా ఉండగూడదని పేర్కొంది. రోడ్లు, ప్రభుత్వ భూములు, చెరువులు, రైల్వే స్థలాలను ఆక్రమించి నిర్మించబడిన ప్రార్థనా మందిరాలకంటే ప్రజల భద్రతే చాలా ముఖ్యమని వ్యాఖ్యానించింది.

యూపీ, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో రేప్, దారుణ హత్యలు వంటి ఘోరమైన నేరాలకు పాల్పడిన వ్యక్తుల ఇళ్ళను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే బుల్‌డోజర్‌లతో కూల్చివేస్తూ “తక్షణ న్యాయం” అమలుచేయటాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌లపై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం ఈ విధంగా స్పందించింది. భారతదేశం లౌకిక రాజ్యం అన్న విషయాన్ని గుర్తు చేస్తూ, బుల్‌డోజర్ యాక్షన్‌లు, యాంటీ ఎన్‌క్రోచ్‌మెంట్ కార్యక్రమాలపై తమ ఆదేశాలు మతాలకు అతీతంగా పౌరులు అందరికీ వర్తిస్తాయని పేర్కొంది. ఈ మూడు రాష్ట్ర ప్రభుత్వాల తరపున సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదించారు. క్రిమినల్ కేసు ఆధారంగా బుల్‌డోజర్ కూల్చివేతలు చేస్తున్నారా అని న్యాయమూర్తులు తుషార్ మెహతాను అడిగారు. అలాంటిదేమీ లేదని, రేప్, టెర్రరిజమ్ వంటి అత్యంత ఘోరమైన నేరాలకు పాల్పడినవారిపై కూడా అలాంటి చర్యలు తీసుకోవటంలేదని చెప్పుకొచ్చారు. ఒక నిర్దిష్ట మతంవారిని లక్ష్యంగా కూల్చివేతలు జరుగుతున్నాయంటూ, అతి కొద్ది ఘటనల ఆధారంగా కోర్ట్ ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా ఉందని మెహతా అన్నారు. ఇళ్ళ కూల్చివేతలకు సంబంధించి ముందుగా నోటీసులు జారీ చేస్తున్నట్లు తెలిపారు. అక్రమ కట్టడాలని తేలాకే నోటీసులు ఇచ్చి కూలుస్తున్నట్లు చెప్పారు.

అక్రమ కట్టడాల యజమానులకు ఇచ్చే నోటీసులను కేవలం ఆ ఇళ్ళపై అతికించటం కాకుండా, ఒక ఆన్ లైన్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలని, ఇచ్చిన నోటీసులతోపాటు, అంతిమంగా కూల్చటానికి ఇచ్చే ఆదేశాలను డిజిటలైజ్ చేస్తే పారదర్శకంగా ఉంటుందని ధర్మాసనం సూచించింది. కేసుపై తీర్పును రిజర్వ్ చేస్తూ, అంతిమంగా కూల్చివేతకు ఇచ్చే నోటీసుకు, దాని అమలుకు మధ్య కొంత వ్యవధి ఉండాలని, తద్వారా సంబంధిత వ్యక్తులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోగలుగుతారని పేర్కొంది.

Tags:    

Similar News