‘త్వరలో లక్ష మందితో ఖురాన్ పఠణం’
డిసెంబర్ 22న సొంత పార్టీ పేరును ప్రకటిస్తానన్న (TMC) నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్యే హుమాయున్ కబీర్..
వచ్చే ఏడాది ఫిబ్రవరిలో లక్ష మందితో ఖురాన్ పఠణం నిర్వహిస్తానని పశ్చిమ బెంగాల్ అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ (TMC) నుంచి సస్పెండ్ అయిన భరత్‌పూర్ ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ తెలిపారు. ఆదివారం రాష్ట్ర రాజధాని కోల్‌కతా(Kolkata)లో ఐదు లక్షల మందితో భగవద్గీత పారాయణం నిర్వహించిన నేపథ్యంలో ఆయన ఈ ప్రకటన చేశారు. ముర్షిదాబాద్(Murshidabad) జిల్లాలో బాబ్రీ మసీదును పోలిన మసీదు నిర్మాణ పనులు త్వరలో ప్రారంభమవుతాయని చెప్పారు. మతపెద్దల సమక్షంలో నిన్న (డిసెంబర్ 6) ఆయన మసీదు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే.
టీఎంసీని టార్గెట్ చేస్తూ.. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగోసారి అధికారంలోకి రావాలన్న మమతా బెనర్జీ(Mamata Banerjee) కల నెరవేరదన్నారు. డిసెంబర్ 22న సొంత పార్టీ ప్రకటించి రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తానని ప్రకటించారు.
మెగా గీతా పారాయణం..
వివిధ మఠాలు, హిందూ మత సంస్థల నుంచి వచ్చిన సన్యాసులు, ఆధ్యాత్మిక వేత్తలు కోల్‌కతాలోని ఐకానిక్ బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్‌లో మెగా గీతా పారాయణం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పశ్చిమ బెంగాల్‌తో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి సాధువులు భక్తులు భారీగా తరలివచ్చారు. భారతీయ జనతా పార్టీ (BJP) రాష్ట్ర అధ్యక్షుడు షమిక్ భట్టాచార్య, మాజీ చీఫ్ సుకాంత మజుందార్, దిలీప్ ఘోష్, కార్తీక్ మహారాజ్‌గా ప్రసిద్ధి చెందిన స్వామి ప్రదీప్తానంద మహారాజ్, ధీరేంద్ర శాస్త్రి, ఇతర ప్రముఖులు హాజరయ్యారు. రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారి కూడా హాజరైన ఈ కార్యక్రమంలో బెంగాల్ గవర్నర్ ఆనంద్ బోస్ ప్రసంగించారు.
బీజేపీ(BJP) ఎమ్మెల్యే, ఫ్యాషన్ డిజైనర్ అగ్నిమిత్ర పాల్ మాట్లాడుతూ.. “భగవద్గీత ఒక్క హిందువులదే కాదు, భారతదేశంలోని 140 కోట్ల మంది ప్రజలది’’, అని అని పేర్కొన్నారు. గీతా మనీషి మహామండల్‌కు చెందిన స్వామి జ్ఞానానందజీ మహారాజ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి యోగా గురువు బాబా రాందేవ్, ప్రముఖ అధ్యాత్మిక వేత్తలను కూడా ఆహ్వానించారు.
అయితే ఈ కార్యక్రమ నిర్వహణపై టీఎంసీ మండిపడింది. ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణతో హిందువులను ఆకర్షించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించింది.