మిత్రధర్మం పాటించని మోదీ: అడ్వాంటేజ్‌ను వాడుకోలేకపోయిన బాబు!
చంద్రబాబు ఇంత గౌరవం ఇచ్చినా, ఏపీ ప్రజలు ఎన్‌డీఏకు బ్రహ్మరథం పట్టినా మోది కృతజ్ఞతను చూపకుండా ఏపీకి అన్యాయం చేయటం మిత్రధర్మాన్ని పాటించకపోవటం స్పష్టంగా కనబడుతోంది
చంద్రబాబునాయుడు సాధించారని, కేంద్రం ఏపీపై వరాలజల్లు కురిపించిందని, టీడీపీ అనుకూల మీడియా కోడై కూస్తోంది. కేంద్రంలో ఎన్‌డీఏ ప్రభుత్వం ఏర్పడటానికి మూల స్తంభాలుగా ఉన్న బీహార్, ఆంధ్రప్రదేశ్ లకు మోదీ ప్రభుత్వం పెద్ద పీట వేసిందని, ఆ రాష్ట్రాల ప్రజల రుణం తీర్చుకుందని చిలవలు పలవలుగా రాసింది. చంద్రబాబేమో, వెంటిలేటర్‌పై ఉన్న ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు కేంద్ర బడ్జెట్ ద్వారా ఆక్సిజన్ అందించారని అన్నారు. అయితే అసలు వాస్తవం చూస్తే పూర్తిగా ఈ రాతలకు, చంద్రబాబు మాటలకు విరుద్ధంగా ఉంది.
నిర్మలా సీతారామన్ బడ్జెట్‌లో ఏపీకి ప్రధానంగా ప్రకటించింది ఏమిటయ్యా అంటే - అమరావతికి రు.15,000 కోట్లను వరల్డ్ బ్యాంక్, ఏషియన్ డెవలెప్‌మెంట్ బ్యాంక్ వంటి సంస్థల ద్వారా రుణంగా ఇప్పిస్తాము అని. ఈ ప్రకటన తప్పితే బడ్జెట్‌లో ఏపీకి ఇతమిత్ధంగా కేటయిస్తున్నట్లు నిర్మల చెప్పిందేమీ లేదు. పోలవరం నిర్మాణం పూర్తి చేయటానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారుగానీ ఎంత నిధులు, ఎప్పటిలోపు ఇస్తామని చెప్పలేదు. విభజన చట్టానికి కట్టుబడి ఉన్నామని చెబుతూ, ఏపీలో పారిశ్రామికాభివృద్ధిని ప్రోత్సహించటానికి విశాఖపట్నం-చెన్నై పారిశ్రామిక కారిడార్‌లోని కొప్పర్తి నోడ్, హైదరాబాద్-బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌లోని ఓర్వకల్లు నోడ్‌లకు మౌలిక వసతుల కల్పనకు నిధులు సమకూరుస్తామని చెప్పారు. మొత్తంమీద చూస్తే ఆ రు.15,000 కోట్ల రుణం తప్పితే, ఇంత మొత్తాన్ని, ఇప్పటిలోపు అని స్పష్టంగా చెప్పింది లేదు.
ఇక, కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వానికి రెండో అతి పెద్ద మద్దతుదారు అయిన జేడీయూ అధికారంలో ఉన్న బీహార్‌కు బడ్జెట్‌లో కేంద్రం ప్రకటించినది చూస్తే, ఆ రాష్ట్రానికి మొత్తం రు.59 వేల కోట్ల ప్రాజెక్టులు దక్కాయి. అది కూడా అప్పులాగా కాదు సాయంగా.
పాట్నా-పూర్ణియా ఎక్స్‌ప్రెస్‌వే, బక్సర్-భాగల్పూర్ ఎక్స్‌ప్రెస్‌వే, బక్సర్‌లో గంగానదిపై రెండు లైన్ల వంతెన వంటి రహదారి ప్రాజెక్టులకు రు.26,000 కోట్లు కేటాయించారు. రు.21,400 కోట్లతో భాగల్పూర్ జిల్లాలో పిర్‌పైంటిలో 2400 మెగావాట్ల విద్యుత్ కేంద్రం స్థాపిస్తామని చెప్పారు. మరోవైపు బీహార్‌లో వరదల నియంత్రణకోసం రు.11,500 కోట్ల సాయాన్ని అందించనున్నారు. ఇవి కాకుండా, అమృత్‌సర్-కొల్‌కతా పారిశ్రామిక కారిడార్‌లో గయ వద్ద పారిశ్రామిక నోడ్ అభివృద్ధికి సాయం అందిస్తామని, విష్ణుపద్‌లో టెంపుల్ కారిడార్, మహోబోధిలో టెంపుల్ కారిడార్ అభివృద్ధి చేసేందుకు, నలందను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు తోడ్పాటు అందిస్తామని నిర్మల ప్రకటించారు.
ఏపీకి, బీహార్‌కు ప్రకటించినదానిలో తేడా ఏమిటంటే, ఏపీకి పదిహేను వేలకోట్లను రుణంగా ఇప్పిస్తామని చెప్పారు, అదే సమయంలో బీహార్‌కు రు.59 వేల కోట్లను, అది కూడా సాయంగా తామే ఇస్తామని ప్రకటించారు. మొత్తం మీద బీహార్‌కు ప్రత్యేక హోదా రాకపోయినా బాగానే గిట్టుబాటు అయినట్లుగా ఉంది. దీనిపై బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా సంతృప్తి ప్రకటించారు. ప్రత్యేకహోదాగానీ, ప్రత్యేక ప్యాకేజ్ గానీ ఇవ్వమని తాము అడుగుతూ వచ్చామని, ప్రత్యేక సాయం ఇవ్వటం ఇప్పుడు మొదలయిందని, చాలా విషయాల్లో సాయం ప్రకటించారని నితీష్ అన్నారు.
మొత్తం మీద చూస్తే ఏపీకి ఈ పరిస్థితి రావటానికి కారణం - అటు ప్రధానమంత్రి నరేంద్రమోదీ మిత్రధర్మం సరిగ్గా పాటించకపోవటం, ఇటు, ఎన్‌డీఏ ప్రభుత్వానికి అతి పెద్ద మద్దతుదారుగా ఉండి కూడా తనకున్న అడ్వాంటేజ్‌ను చంద్రబాబునాయడు సరిగ్గా వాడుకోలేకపోవటం అనేది స్పష్టంగా కనబడుతోంది. వాస్తవానికి గతనెల 4వ తేదీన ఫలితాలు వచ్చిన తర్వాత కేంద్రంలో ఒంటరిగా ప్రభుత్వాన్ని ఏర్పరుచుకునేటంత మెజారిటీ సాధించలేకపోయిన బీజేపీ, తెలుగుదేశం, జేడీయూ వంటి మిత్రపక్షాలపై ప్రధానంగా ఆధారపడాల్సి వచ్చింది. ముఖ్యంగా 18(టీడీపీ 16+జనసేన 2) సీట్లతో ప్రభుత్వాన్ని ప్రధానంగా నిలబెడుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే. చంద్రబాబునాయుడు కేంద్ర మంత్రివర్గ కూర్పు సమయంలో ఏపీకి మంత్రుల సంఖ్య గురించిగానీ, కీలక పోర్ట్‌ఫోలియోల గురించిగానీ మోదిపై ఒత్తిడి తీసుకురాలేదు. పైగా, ఫలితాలు వెలువడగానే ప్రధాని పదవితోసహా దేనికైనా టీడీపీకి అవకాశమిస్తామని కాంగ్రెస్ పార్టీ ఓపెన్ ఆఫర్ ఇచ్చినా, బాబు నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. మోదీకి చంద్రబాబు ఇంత గౌరవం ఇచ్చినా, ఏపీ ప్రజలు ఎన్‌డీఏకు బ్రహ్మరథం పట్టినా కూడా ప్రధాని ఆ కృతజ్ఞతను చూపించకుండా ఏపీకి అన్యాయం చేయటం దురదృష్టకరం. మోదీ మిత్రధర్మాన్ని పాటించలేదు అనేది సుస్పష్టం.
మరోవైపు తనకున్న అడ్వాంటేజ్‌ను, bargaining power ను వాడుకోలేకపోవటం చంద్రబాబునాయుడు లోపం అని కూడా స్పష్టంగా అర్థమవుతోంది. దీనికి కారణాలు చూస్తే ఒకటే అయిఉండొచ్చని అంటున్నారు. గత ఐదేళ్ళుగా బీజేపీ జగన్‌తో అంటకాగుతోంది. జగన్ తాన అంటే తందాన అంటోంది. పైగా స్కిల్ డెవలెప్‌మెంట్ కేసులో తనను రాజమండ్రి జైలులో పెట్టినప్పుడు కూడా కిమ్మనలేదు. కాబట్టి ఇప్పుడు బీజేపీతో మంచిగా లేకపోతే జగన్‌తో చేతులు కలుపుతుందేమో అనే భయం లోలోపల బలంగా ఉండటంవల్లే చంద్రబాబు తనకున్న అడ్వాంటేజ్‌ను గుర్తించలేకపోతున్నారని, దబాయించి నిధులను అడగలేకపోతున్నారని ఒక వాదన బలంగా వినబడుతోంది. ఏది ఏమైనా, ఈ రాజకీయాలు ఎలా ఉన్నా, చివరకు అన్యాయం జరిగింది మాత్రం ఏపీ ప్రజలకే.