వివాదంతో బిగ్ బాస్ మొదలు: తెలుగు హౌస్‌లో కన్నడ నటుల హవా!

కంటెస్టెంట్‌లు 14 మందిలో నలుగురు కన్నడ నటులు ఉండటంతో దీనిపై సోషల్ మీడియాలో తీవ్రంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి… ఇది కన్నడ బిగ్ బాసా, తెలుగు బిగ్ బాసా అంటూ.

Update: 2024-09-02 14:31 GMT

పోయిన ఏడాది జరిగిన బిగ్ బాస్ 7 చివరి రోజు విజేత పల్లవి ప్రశాంత్ అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించి అన్నపూర్ణ స్టూడియో బయట విధ్వంసం చేయటం, అతనిని అరెస్ట్ చేయటం తెలిసిందే. అయితే నిన్న గ్రాండ్‌గా లాంచ్ అయిన బిగ్ బాస్ తెలుగు 8వ సీజన్ ఆదిలోనే వివాదంతో మొదలయింది. కంటెస్టెంట్‌లు 14 మందిలో నలుగురు కన్నడ నటులు ఉండటంతో దీనిపై సోషల్ మీడియాలో తీవ్రంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి… ఇది కన్నడ బిగ్ బాసా, తెలుగు బిగ్ బాసా అంటూ.

నాగార్జునపై ఎన్ కన్వెన్షన్ ఎఫెక్ట్

నిన్న సాయంత్రం మాటీవీలో బిగ్ బాస్ 8వ సీజన్ లాంచ్ కార్యక్రమం గ్రాండ్‌గా జరిగింది. లాంచ్ కార్యక్రమంలో నాగార్జున దేవర సినిమాలోని పాట బ్యాక్‌గ్రౌండ్‌లో 12మంది అమ్మాయిలతో ఎంట్రీ ఇచ్చారు. అయితే నాగార్జున కంపీరింగ్‌లో ఎన్ కన్వెన్షన్ ఎఫెక్ట్ కొద్దిగా కనబడింది. పోయినసారి అంతగా ఆయనలో హుషారు కనబడలేదు. మరోవైపు, ఈ సారి బిగ్ బాస్ హౌస్ జిగేల్ జిగేల్ మనే రంగులతో కొద్దిగా అతిగా అనిపించింది. తూనీగ, పీకాక్, జీబ్రా థీమ్‌లతో, డబుల్ బెడ్‌లతో మూడు బెడ్ రూమ్‌లు ఇచ్చారు. బాత్ రూమ్ అన్ని సీజన్లకంటే మెరుగ్గా, విశాలంగా ఉంది. ఈ సీజన్‌లో అంతా లిమిట్‌లెస్, లిమిట్‌లెస్ అని నాగార్జున అంటున్నారు. ఏమైనా తేడా వస్తే లిమిట్‌లెస్ టార్చర్ అంటారని జోకులు పేలుతున్నాయి.

ముగ్గురే మెయిన్ ఎట్రాక్షన్

మొత్తం 14 మంది కంటెస్టెంట్‌లు ఉన్నారు. వీరిలో సినిమా, సీరియల్ నటీనటులు, యాంకర్‌లు, యూట్యూబర్‌లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌లు, ఆర్‌జెలు ఉన్నారు. వీరిలో ప్రధానంగా ఎక్కువమందికి తెలిసినవారుగా చెప్పాలంటే - రేడియో జాకీ శేఖర్ బాషా, యాంకర్-యూట్యూబర్ బెజవాడ బేబక్క, యాంకర్ విష్ణుప్రియ, లాహిరి లాహిరి లాహిరిలో సినిమా ఫేమ్ నటుడు ఆదిత్యఓమ్ గురించి చెప్పుకోవాలి. శేఖర్ బాషాకు ఆర్‌జేగా మంచి పేరు ఉంది. అయితే ఈ మధ్య మగవారిపై వేధింపులు ఎక్కువైపోతున్నాయంటూ ఏదో ఉద్యమం మొదలుపెట్టాడు. మరోవైపు తన మిత్రుడు రాజ్‌తరుణ్‌కు మద్దతుగా ఏదో టీవీ ఛానెల్ ప్యానెల్ డిస్కషన్‌లో పాల్గొన్నపుడు రాజ్ తరుణ్ ప్రియురాలు లావణ్య ఇతనిపై చెప్పు విసరటంతో వార్తల్లోకి ఎక్కాడు.

ఇక బేబక్క విషయానికొస్తే, ఆమె మంచు లక్ష్మిని మిమిక్రీ చేయటంద్వారా ఫేమస్ అయింది. మంచి సింగర్, యాంకర్, వ్లాగర్. ఈమె ప్రత్యేకత ఏమిటంటే విజయవాడకు చెందిన ఈమె విజయవాడ-హైదరాబాద్ మధ్య తిరిగినట్లు, ఇండియా-అమెరికా మధ్య తిరుగుతూ ఉంటుంది. అమెరికాలో షోలకు ప్రయోక్తగా వ్యవహరిస్తూ ఉంటుంది.

విష్ణుప్రియ భీమినేని చిన్న చిన్న సినిమాలతో కెరీర్ మొదలుపెట్టి, యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్, ఈటీవీ ఎంటర్‌టైన్‌మెంట్ షోలను హోస్ట్ చేయటం ద్వారా ఫేమస్ అయ్యారు. ఆమెకు ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‍‌లో 1.2 మిలియన్ల ఫాలోయర్స్ ఉన్నారు. ఎక్స్‌పోజింగ్ చేస్తూ ఇన్‌స్టాలో ఫోటోలు పెడుతుంటారు. డాన్స్ కూడా బాగా చురుకుగా చేస్తారు.

ఇక మిగిలిన కంటెస్టెంట్‌లలో, నాగమణికంఠ మొదటిరోజుతోనే బాగా చర్చల్లోకి వచ్చాడు. పరిచయంలో అతను సినిమా కష్టాలన్నీ చెప్పి కొంత సానుభూతి కొట్టేశాడు. అయితే హౌస్‌లోకి వెళ్ళిన తర్వాత అతని అతి చూసి కొందరు ఓవర్ యాక్షన్ అంటున్నారు. మొత్తంమీద చూస్తే, పోయిన సీజన్ విజేత పల్లవి ప్రశాంత్‌ స్ట్రాటజీని అనుసరించి సింపతీ ఫ్యాక్టర్‌తో ముందుకు పోవాలని ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇక మిగిలినవారిలో పెళ్ళిచూపులు సినిమాలో విజయ్ దేవరకొండకు ఫ్రెండ్‌గా నటించిన అభయ్‌తోపాటు, కిరాక్ సీత, నిఖిల్ మెచ్యూర్డ్‌గా కనిపిస్తున్నారు, ఎక్కువమందిని ఆకట్టుకుంటున్నారు.

14మందిలో నలుగురు కన్నడ కంటెస్టెంట్‌లు

మొత్తం 14 మంది కంటెస్టెంట్‌లలో నలుగురు కన్నడ నటీనటులు ఉండటం కొత్త వివాదానికి దారితీసింది. ఏ భాష బిగ్ బాస్‌లోనూ లేనట్లుగా ఇంతమంది వేరే భాషవాళ్ళను తెలుగు బిగ్ బాస్‌లో తీసుకున్నారని సోషల్ మీడియాలో మా టీవీపై, బిగ్ బాస్ నిర్వాహకులపై తీవ్రంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కంటెస్టెంట్‌లలోని యష్మి గౌడ(సీరియల్ నటి), నిఖిల్(సీరియల్ నటుడు), ప్రేరణ(సీరియల్ నటి), పృథ్వి(సీరియల్ నటుడు) కర్ణాటకకు చెందినవారు. వీరికి తెలుగు కూడా పూర్తిగా రాదు. గత సీజన్‌లో పూజ షెట్టి ఒక్కరు మాత్రమే కర్ణాటక వ్యక్తిగా ఉన్నారు. ఈ సీరియల్‌లో ఒకేసారి నలుగురును దించారు… తెలుగులో ఎవరూ దొరకనట్లు. ఇప్పటికే తెలుగు టీవీ సీరియల్స్‌లో కన్నడ నటీనటుల డామినేషన్ కొనసాగటంపై అనేక విమర్శలు ఉండగా, బిగ్ బాస్‌లోనూ అదే కొనసాగటం వివాదానికి దారితీసింది.

మామూలుగా బిగ్ బాస్‌లో అభ్యర్థుల ఎంపికలో ఒక ఫార్మాట్ అనుసరిస్తుంటారు. ఒకరిద్దరు ప్రముఖ తెలుగు నటీనటులు ఉంటారు, మిగిలినవారిలో ఎక్కువగా తెలుగు సీరియల్ నటీనటులు, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లో పెద్దసంఖ్యలో ఫాలోయర్స్ ఉన్న ఇన్‌ఫ్లూయెన్సర్‌లు, తెలంగాణలో కనీసం ఇద్దరు ముగ్గురు ఉండేటట్లుగా నిర్వాహకులు చూస్తుంటారు. ఒక ముస్లిమ్ అయినా ఉండేటట్లు చూస్తారు. ఈ సీజన్‌లో నవీల్ అఫ్రిది ఒక్కరే ఉన్నారు. ఒక డాన్స్ మాస్టర్ ఉంటారు. ఈసారి మాత్రం డాన్స్ మాస్టర్ కాకుండా నైనిక అనే డాన్సర్‌ను దించారు. ఒక ట్రాన్స్‌జండర్‌ను కూడా పెడుతుంటారు. ఈ సారి అలాంటివారు ఎవరూ లేరు. కనీసం ఓ మాదిరి పాపులారిటీ ఉన్న తెలుగు నటీనటులలో ఎవరినైనా పెట్టటానికి ప్రయత్నిస్తారు… ఎక్కువమంది జనాన్ని ఆకర్షించటంకోసం. పోయిన సీజన్‌లో అలాగే నటుడు శివాజిని పెట్టటంతో బాగా ఆకట్టుకోగలిగింది. అయితే ఈసారి మాత్రం నటీనటులలో ఆ స్థాయి నటీనటులు ఎవరూ లేరు.

సినిమా ప్రమోషన్‌కోసం వచ్చిన నాని, రాణా

శనివారం నాది సినిమా ప్రమోషన్ కోసం హీరో నాని, హీరోయిన్ ప్రియాంక మోహన్ బిగ్ బాస్‌కు వచ్చారు. వారిద్దరినీ నాగార్జున హౌస్‌లోకి పంపారు. తర్వాత తాను ప్రొడ్యూస్ చేసిన “35” సినిమా ప్రమోషన్ కోసం రాణా, ఆ సినిమాలోని హీరోయిన్ నివేదా థామస్ కూడా వచ్చారు. వారు కూడా కొద్దిసేపు హౌస్‌లోకి వెళ్ళి సందడి చేశారు. దర్శకుడు అనిల్ రావిపూడి కూడా కొద్దిసేపు హౌస్‌లో గడిపారు.

కంటెస్టంట్‌ల ఇన్‌స్టా గ్రామ్ ఫాలోయర్స్

నాగమణికంఠ - లక్షా పన్నెండువేల మంది

సోనియా ఆకుల - లక్షా యాభైనాలుగువేల మంది

బేబక్క - లక్షా అరవైనాలుగుమంది

నవీల్ అఫ్రిది - నాలుగు లక్షల యాభైవేలమంది

శేఖర్ బాషా - యాభైరెండు వేలమంది

కిరాక్ సీత - 90 వేలమంది.

నిఖిల్ - లక్షా ఇరవైనాలుగువేలు.

విష్ణుప్రియ - 1.2 మిలియన్

ఆదిత్య ఓం - 1.7 మిలియన్

యష్మి గౌడ - లక్షా ఇరవై ఐదువేలమంది.

ప్రేరణ - లక్షా ఇరవైఎనిమిది వేలు.

అభయ్ - ఇరవైఒక్కవేలు

నైనిక - 9 లక్షలమంది

Tags:    

Similar News