తుక్కుగూడ లో హిస్టరీ రిపిట్ అవుతుందా?

అసెంబ్లీ ఎన్నికల సమరాన్ని ఏ వేదిక నుంచి ప్రారంభించిందో అదే వేదిక నుంచి పార్లమెంటు ఎన్నికల సమరశంఖారావాన్ని పూరించేందుకు తెలంగాణ కాంగ్రెస్ సిద్ధమైంది.

By :  Admin
Update: 2024-04-11 03:50 GMT

అసెంబ్లీ ఎన్నికల సమరాన్ని ఏ వేదిక నుంచి ప్రారంభించిందో అదే వేదిక నుంచి పార్లమెంటు ఎన్నికల సమరశంఖారావాన్ని పూరించేందుకు తెలంగాణ కాంగ్రెస్ సిద్ధమైంది. ఈ నెల 6 న తుక్కుగూడలో జనజాతర పేరిట భారీ సభ నిర్వహించేందుకు కాంగ్రెస్ ఏర్పాట్లు చేస్తోంది. రేవంత్ అధ్యక్షతన జరగనున్న ఈ సభకి ఏఐసిసి అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఇతర ముఖ్య నేతలు హాజరుకానున్నారు. ఈ మీటింగ్ కి 10 లక్షలమంది జనాన్ని పోగు చేసేలా ప్రణాళికలు రచిస్తున్నారు.


నరేంద్రమోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వానికి గుడ్ బై చెప్పి రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలని కాంగ్రెస్ శ్రేణులు కంకణం కట్టుకున్నారు. దీనికోసం సౌత్ లో మెజారిటీ స్థానాలను కైవసం చేసుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో 6 గ్యారెంటీలతో ప్రజల్లోకి వెళ్లిన హస్తం పార్టీ.. లోక్ సభ ఎన్నికలకు పాంచ్ న్యాయ్ గ్యారెంటీలను సిద్ధం చేసింది.


ఈ నెల 5 న విడుదల చేయనున్న మేనిఫెస్టోను ప్రాంతీయ భాషల్లో విడుదల చేసేందుకు నార్త్ లో రెండు, సౌత్ లో రెండు భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ హై కమాండ్ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే పాంచ్ న్యాయ్ గ్యారెంటీలు, ఎన్నికల మేనిఫెస్టో తెలుగు పోస్టర్లను విడుదల చేసేందుకు ఈ నెల 6 న జనజాతర పేరిట తెలంగాణాలో భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. తుక్కుగూడలోని రాజీవ్ గాంధీ సభా ప్రాంగణంలో జనజాతర నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు.


కాంగ్రెస్ కి కలిసొచ్చిన తుక్కుగూడ!


గతేడాది సెప్టెంబర్ 17 న తెలంగాణ విలీన దినోత్సవాన్ని పురస్కరించుకుని తుక్కుగూడలో కాంగ్రెస్ విజయభేరి సభని నిర్వహించింది. అక్కడినుంచే అసెంబ్లీ ఎన్నికల శంఖారావాన్ని పూరించింది. విజయభేరి వేదికనుంచే సోనియాగాంధీ ఆరు గ్యారెంటీలను ప్రకటించారు. ఈ సభకి విశేష స్పందన లభించడంతో పాటు, కాంగ్రెస్ 6 గ్యారెంటీలు ప్రజలను ఆకర్షించాయి. ఫలితంగా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 'విజయభేరి' మోగించింది.


నాటి విజయభేరి సభలో రెవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, డిసెంబర్ 9 న ఎల్బీ స్టేడియం లో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరనుందని తేల్చి చెప్పారు. ఆయన అన్నట్టే ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది, చెప్పిన డేట్ కంటే రెండురోజుల ముందే కాంగ్రెస్ సీఎం గా రెవంత్ ప్రమాణస్వీకారం చేశారు. అదే సెంటిమెంట్ తో తుక్కుగూడ నుంచే పార్లమెంటు ఎన్నికల సమర శంఖారావాన్ని ప్రారంభించాలని తెలంగాణ కాంగ్రెస్ భావిస్తోంది.


రాష్ట్రంలో 14 సీట్లు టార్గెట్ పెట్టుకున్న హస్తం నేతలు జనజాతర సభని సక్సెస్ చేసేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. సభకి అన్ని జిల్లాల నుంచి జనాన్ని తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 6 గ్యారెంటీల హామీలు ప్రజల్లోకి దూసుకెళ్ళినట్టే పాంచ్ న్యాయ్ గ్యారెంటీలు మ్యాజిక్ చేస్తాయని భావిస్తున్నారు.


తుక్కుగూడలో రేవంత్ చెప్పినట్టే...


రెండు రోజుల క్రితం తుక్కుగూడలో పర్యటించిన రేవంత్ రెడ్డి జనజాతర ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 6 న తెలంగాణ గడ్డపై జనజాతర సభలో జాతీయ స్థాయి కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల కానుంది. ఈ సభకి మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంకగాంధీ ముఖ్య అతిధులుగా వస్తున్నారు. విజయభేరి సభకి లక్షలాదిగా తరలివచ్చినట్టే జనజాతర సభకి ప్రజలంతా హాజరై, దేశంలోనే కాంగ్రెస్ కి తెలంగాణ కంచుకోట అని నిరూపించాలని ప్రజలకి పిలుపునిచ్చారు.


అంతేకాదు, తుక్కుగూడ వేదికగానే కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటవుతుందని, జూన్ 9 న ఎర్రకోటపై జెండా ఎగురవేస్తామని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. దీంతో తుక్కుగూడ సభ కలిసొచ్చి రేవంత్ చెప్పినట్టే రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచినట్టే, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరుతుందా అనే ఆసక్తికర చర్చ మొదలైంది.


Tags:    

Similar News