ఆ రెండు పోస్టుల కోసం జేడీ(యూ) ఎందుకు పట్టుబడుతుంది?

రేపు బీహార్ సీఎంగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం..

Update: 2025-11-19 10:57 GMT
Click the Play button to listen to article

బీహార్‌(Bihar) అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly polls) ఎన్డీఏ(NDA) కూటమి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇక ముఖ్యమంత్రిగా JD(U) చీఫ్ నితీష్ కుమార్(Nitish Kumar) ప్రమాణ స్వీకారోత్సవానికి పాట్నాలోని గాంధీ మైదానంలో ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. కాగా బీజేపీ(BJP), జేడీ(యూ) రెండు కీలక పదవుల కోసం పోటీ పడుతున్నాయి - అసెంబ్లీ స్పీకర్, హోంమంత్రి. ఇటు చిరాగ్ పాస్వాన్ లోక్ జనశక్తి పార్టీ (రామ్విలాస్) ఉప ముఖ్యమంత్రి పదవిని నిరాకరించింది.


స్పీకర్, హోంశాఖ జేడీ(యూ) వద్దే..

‘‘గత ప్రభుత్వంలో స్వీకర్ పదవిని బీజేపీకి ఇచ్చారు. హోం శాఖను ముఖ్యమంత్రి తన వద్దే ఉంచుకున్నారు. ఇప్పుడు కూడా అలాగే చేయాలని నితీష్ కుమార్ భావిస్తున్నారు,’’ అని జేడీ(యూ) సీనియర్ నాయకుడొకరు చెప్పారు.

గత అసెంబ్లీలో నంద్ కిషోర్ యాదవ్ (బీజేపీ) స్పీకర్‌గా ఉన్నారు. కాని ఈ సారి అది కూడా తమకే ఉండాలని నితీష్ పట్టుబడుతున్నట్లు సమాచారం. ఒకవేళ ఎవరైనా పార్టీ ఫిరాయింపులకు పాల్పడితే వెంటనే చర్య తీసుకునేందుకు వీలుగా ఉంటుందని ఆయన భావిస్తున్నారట.

భవిష్యత్తులో రెండు మిత్రపార్టీల మధ్య సంబంధాలు చెడిపోతే, నితీష్ ఎమ్మెల్యేలపై పోలీసులు, కొన్ని దర్యాప్తు సంస్థలు చర్య తీసుకోకుండా ఉండేందుకు హోం మంత్రిత్వ శాఖ కూడా తన వద్దే ఉంచుకోవాలన్న ఆలోచనలో నితీష్ ఉన్నట్లు సమాచారం.


స్పీకర్ పదవికి ఎందుకంత ప్రాధాన్యం?

ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడం స్పీకర్ చేతుల్లో ఉంటుంది. మహారాష్ట్రలో థాకరే శిబిరం దాఖలు చేసిన పిటిషన్లపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు పదేపదే ఆదేశాలిచ్చినా.. బీజేపీకి చెందిన స్పీకర్ రాహుల్ నార్వేకర్ 17 నెలలయినా పట్టించుకోలేదు. చివరికి పిటిషన్లను కొట్టేశారు. ఈ పరిస్థితి బీహార్‌లో రిపీట్ కాకూడదన్న ముందు చూపుతో నితీష్ కుమార్ ఉన్నట్లుంది.

గత రెండు దశాబ్దాలలో స్పీకర్ పదవిని 15 సంవత్సరాలు JD-U వద్దే ఉంది. 2020లో మాత్రమే ఆ పదవిని BJP నాయకుడికి ఇచ్చింది.

ఈ ఎన్నికల్లో బీజేపీ 89, జేడీ (యు)కు 85 సీట్లు సాధించాయి. పోల్ ఫలితాలు వచ్చినప్పటి నుంచి పాట్నాలో ఉత్కంఠభరితంగా వాతావరణం నెలకొంది. స్పీకర్ పదవి కోసం పోటీ మొదలైంది. ప్రస్తుత సంఖ్యా బలం చూస్తే నితీష్ మళ్ళీ ఎన్డీఏ నుంచి మహా కూటమికి మారడానికి అవకాశం లేదని చాలామంది భావిస్తున్నారు. మహాఘట్ బంధన్ కూటమిలో కేవలం 35 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. ఈ నేపథ్యంలో నితీష్‌ను సీఎంగా కొనసాగించడానికి బీజేపీ అంగీకరించింది.

మంత్రివర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఒక రోజు ముందు బుధవారం (నవంబర్ 19) కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాట్నాకు చేరుకున్నారు. రెండు పదవుల కోసం జరుగుతున్న పోరు పరిష్కారమవుతుందని జేడీ(యూ) వర్గాలంటున్నాయి.

ఈ సమస్య పరిష్కారం కాకపోతే ప్రస్తుతానికి ప్రో-టెం స్పీకర్ అధ్యక్షత వహిస్తారని, కొత్త స్పీకర్‌పై నిదానంగా నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు. నితీష్ కుమార్ మంత్రివర్గంలోని సభ్యులందరూ గురువారం (నవంబర్ 20) ప్రమాణ స్వీకారం చేసినా.. కీలక పదవులయిన గృహ, ఆర్థిక, హోం మంత్రిత్వ శాఖలు ఎవరికి అప్పగిస్తారన్న దానిపై సందిగ్ధం నెలకొంది. 

Tags:    

Similar News