తెలంగాణ కమిటీ తాత్సారమే హిడ్మా చావుకు కారణమైందా?
హిడ్మా రాసిన చివరి లేఖలో ఏముందీ? ఆంధ్ర పోలీసులు ఎందుకు నిఘాను పెంచారు? ఇప్పుడివన్నీ ప్రశ్నలే, సందేహాలే..
By : The Federal
Update: 2025-11-19 13:06 GMT
మావోయిస్టు పార్టీ అగ్రనేత మద్వీ హిడ్మా ఎన్ కౌంటర్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఎక్కడో పట్టుకుని మారేడుమిల్లి తీసుకువచ్చి కాల్చి చంపారనే వారు కొందరైతే మావోయిస్టు పార్టీలోని అంతర్గత కలహాలు, ముఠా కుమ్ములాటలే కారణమనే వారు మరికొందరు.
ఇవన్నీ ఎలా ఉన్నా ఉన్నా ఆయన రాసినట్టుగా చెబుతున్న లేఖలు, మాజీ మావోయిస్టులు మాట్లాడుతున్న మాటలు కలకలం సృష్టిస్తున్నాయి. లొంగుబాటుకు సిద్ధమైన దశలో హిడ్మా ఎన్ కౌంటర్ అయ్యారు. చివరి దశలో రూట్ మార్చడం, తెలంగాణలో సరెండర్‌పై అనిశ్చితి, ఛత్తీస్‌గఢ్ భద్రతా దళాల ఒత్తిడి, సురక్షిత ఆశ్రయం కోసం హిడ్మా చేసిన తీవ్ర ప్రయత్నాల వంటివన్నీ కలిసి కలిసి ఆయన మరణానికి దారి తీశాయి. మద్వీ హిడ్మా మారెడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన కాల్పుల్లో చనిపోయారు.
ఆయన రాసిన చివరి లేఖ ఇదేనా...
హిడ్మా తన క్యాంప్ ను ఆంధ్రప్రదేశ్ కి మార్చడానికి ముందు అసలేం జరిగిందనే ప్రస్తుతం మీడియాలో రకరకాల ప్రచారం జరుగుతోంది. ఛత్తీస్‌ఘడ్ బస్తర్ లోని ఓ లోకల్ పత్రికకు ఆయన రాసిన లేఖ ఒకటి ఇప్పుడు మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ లేఖను మొదట 'టైమ్స్ ఆఫ్ ఇండియా' పత్రిక ప్రచురించింది.
అందులో ఏముందంటే...
గత వారం ఛత్తీస్‌గఢ్ బస్తర్ లోని ఒక స్థానిక పత్రికా విలేఖరికి హిడ్మా లేఖ రాశారు. అది నవంబర్ 10న రాసినట్టు భావిస్తున్నారు. తాను, తన సహచరులు -అడవిలోంచి బయటకు రావాలనుకుంటున్నామని, ఆయుధాలు వదిలేయాలనే నిర్ణయం తీసుకునే ముందు కొన్ని విషయాలు చర్చించాల్సి ఉందని రాసినట్టు తెలుస్తోంది.
ఆ పత్రికా విలేఖరి చెప్పిన వివరాల ప్రకారం-- హిడ్మా తనను (విలేఖరి) ఒంటరిగా వచ్చి కలవమని కోరాడు. ఆ భేటీ కోసం ఆ పత్రికా ప్రతినిధిని ఆంధ్రప్రదేశ్‌కు రావాలని అడిగారు. తాను అక్కడే దాగి ఉన్నానని కూడా హిడ్మా చెప్పినట్టు ఆ విలేఖరి టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రతినిధికి వివరించాడు.
“జోహార్!” అనే పదంతో ఆ లేఖ మొదలు...
"జోహార్! మొత్తం పార్టీ సభ్యులు సరెండర్‌కి సిద్ధంగా లేరు. లొంగుబాటు వెనుక అనేక సమస్యలు, సెక్యూరిటీ ముప్పు పొంచి ఉంది. అందువల్ల మేము నిర్ణయించిన చోట మీ సహకారంతో ప్రభుత్వానికి సరెండర్ అవుతాం. అయితే ముందుగా సరెండర్ అయ్యే ప్రదేశం నిర్ణయించాలి. మా భద్రతకు హామీ ఇస్తే, మేము మీతో సహా ఎవర్నైనా కలుసుకోవచ్చు" అని లేఖలో ఉంది.
ఆ లేఖలో ఇంకా ఏముందంటే.. మావోయిస్టులు చాలా దూర ప్రాంతాల్లో ఉండటం, భద్రతా దళాల నిఘా వల్ల తక్షణమే వారి నుంచి స్పందన ఆశించలేం” అని హిడ్మా రాసినట్టు తెలుస్తోంది.
లొంగుబాటుకు సంబంధించి నాలుగైదు రోజుల్లో హిందీ, తెలుగులో ఒక ఆడియో ప్రకటన విడుదల చేస్తామని ఆ లేఖలో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఆ లేఖ ఆ విలేఖరికి ఆలస్యంగా అందిందని, అది సకాలంలో అంది ఉంటే ఇంత ఘోరం జరక్కపోయి ఉండేదని జగదల్పూరుకు చెందిన మరో విలేఖరి చెబుతున్నారు.
జగదల్పూర్ జర్నలిస్టు చెప్పిన వివరాలు...
జగదల్పూర్‌లో ఇటీవల 210మంది మావోయిస్టుల లొంగుబాటులో బస్తర్ కి చెందిన ఆ పత్రికా విలేఖరి కీలకపాత్ర పోషించారని జగదల్పూర్ కి చెందిన ఓ జర్నలిస్టు చెప్పినట్టు టైమ్స్ ఇండియా కథనం. ప్రత్యేకించి కేంద్ర కమిటీ సభ్యుడు రూపేష్ వంటి వారి లొంగుబాటు వెనుక ఆ బస్తర్ జర్నలిస్టే కీలకంగా వ్యవహరించారని, అందుకే ఆ బస్తర్ జర్నలిస్టును ఎంచుకుని హిడ్మా లేఖ పంపించి ఉంటారని జగదల్బూర్ జర్నలిస్టు చెబుతున్నారు.
బస్తర్ జర్నలిస్టు ఏమన్నారంటే..
"గత వారమే హిడ్మా నుంచి నాకు లేఖ వచ్చింది. ఆయుధాలను వదిలి అడవిలోంచి బయటకు రావాలని నిర్ణయించుకునే ముందు, తనకున్న భయాందోళనల గురించి మాట్లాడాలని హిడ్మా అనుకున్నారు. ఇప్పుడు జరిగినదాన్నిబట్టి చూస్తుంటే ఆలస్యమైంది అనిపిస్తోంది. మున్ముందు ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయాలన్న ఆలోచన ఉన్నప్పటికీ ఇప్పుడు జరుగుతున్న సైనిక ఆపరేషన్లు, హత్యలు, సరెండర్లు చూసి హిడ్మా అనుచరుల్లో ఆత్మ విశ్వాసం సన్నగిల్లింది. దీంతో మరోగత్యంతరం లేక లొంగిపోవాలని హిడ్మా భావించి ఉంటాడు” అని ఆ జర్నలిస్టు చెప్పినట్టు టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం.
హిడ్మా చివరి క్షణాల్లో రూట్ ఎందుకు మారినట్టు?
హిడ్మా లొంగిపోవాలని అనుకున్నప్పటికీ అదంత సులువు కాదని అర్థమైంది. హిడ్మా మావోయిస్టు పార్టీకి ఉన్న PLGA-1 బెటాలియన్ దళ నేత.
దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ (DKSZC) కార్యదర్శిగా పనిచేసిన హిడ్మా తెలంగాణ లేదా ఆంధ్ర పోలీసులకు లొంగిపోవాలని భావించారు. కొన్ని రోజులుగా ఈ తరహా వార్తలు మీడియాలో కూడా వచ్చాయి.
మావోయిస్టు పార్టీ సీనియర్ నేత మల్లోజుల వేణుగోపాల్ లొంగుబాటు తర్వాత హిడ్మాకి ముప్పు ఉందని భావించారు. ఈ నేపథ్యంలో భద్రతా దళాల నిఘా కూడా పెరిగింది. దీంతో హిడ్మా షెల్టర్ కోసం తెలంగాణ వైపు వస్తున్నాడని తెలిసింది. అయితే అప్పటికే తెలంగాణ పోలీసులు నిఘా పెంచారు. ఆయన్ను పట్టుకునేందుకు ప్రత్యేక ఆపరేషన్లు చేపట్టారు.
ఇది జరుగుతున్నప్పుడే ఛత్తీస్‌గఢ్ ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ హిడ్మా తల్లిని కలిసి, ఆమె ద్వారా అతడిని లొంగిపొమ్మని చెప్పించారు. ఆయన తల్లి కూడా హిడ్మాను ఆయుధాలు వదలమని పదేపదే విజ్ఞప్తి చేసింది.
సరిగ్గా ఈ నేపథ్యంలో నవంబర్ 16న జరిగిన ఎదురు కాల్పుల సంఘటన హిడ్మా ప్లాన్లు మార్చేలా చేసింది.
ఛత్తీస్‌గఢ్ CRPF–DRG బలగాలు నిర్వహించిన ఆపరేషన్‌లో నవంబర్ 16న సుక్మా జిల్లాలో ముగ్గురు మావోయిస్టులు హతమయ్యారు.
ఈ ఘటనతో సుక్మాలో హై అలర్ట్ నెలకొంది. తన కదలికలు బయటపడకుండా హిడ్మా తెలంగాణకు వెళ్లే ప్లాన్ మార్చి ఆంధ్రప్రదేశ్ దిశగా మళ్లాడు.
తెలంగాణ కమిటీ ఎందుకు వ్యతిరేకించినట్టు?
ఆయన కర్రెగుట్టలు, పామేడ్, కుంట ప్రాంతాల్లో ఉంటూ కుంట నుంచి తెలంగాణలోకి ప్రవేశించడానికి ప్రయత్నించినట్టు తెలంగాణ నిఘా వర్గాలు చెబుతుండగా హిడ్మా రాకను తెలంగాణ రాష్ట్ర కమిటీ (CPI–Maoist) కూడా వ్యతిరేకించాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. హిడ్మా తెలంగాణలోకి ప్రవేశిస్తే భద్రతా దళాల దృష్టి తమపైన పడుతుందనే భయం ఈ ప్రాంత నాయకుల్ని వెంటాడినట్టు చెబుతున్నారు.
తెలంగాణ నుంచి స్పష్టమైన "క్లియరెన్స్" రాకపోవడం, సుక్మా ఘటన తర్వాత హిడ్మా సంకటస్థితిలో పడ్డారు. ముప్పు పెరిగిందని భావించి, హిడ్మా ఆంధ్రప్రదేశ్ వైపు కదిలాడని నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి.
విజయవాడలో హిడ్మా బాడీగార్డులు..
దళనేత హిడ్మాకు సుమారు 20 మంది వరకు బాడీగార్డులు ఉంటారు. పార్టీ నేతలు లొంగిపోవాలనుకున్నప్పుడు ముందుగా వారి వద్ద పని చేసే బాడీగార్డులను తప్పిస్తారు. హిడ్మా కూడా తన దగ్గరున్న వారిలో ఆరేడుగుర్ని ఉంచి మిగతా వాళ్లను సురక్షిత ప్రాంతాలకు తరలిపొమ్మని చెప్పారు. ఆ విధంగా ఓ 8,9 మంది విజయవాడ చేరారు. అలా చేరిన వారు విజయవాడలో ఆశ్రయం కోసం ప్రయత్నిస్తుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. మావోయిస్టుల మరో నాయకుడు తిప్పిరి తిరుపతి అలియాస్ దేవీజీ బృందంలోని సాయుధులు కూడా ఆశ్రయం కోసం వెతుకులాడుతున్నప్పుడే అరెస్ట్ కావడం గమనార్హం.
హిడ్మా ఎక్కడికైనా కదులుతున్నప్పుడు ముందుగా 19–20 మంది మావోయిస్టులు అతనితో పాటే కదిలేవారు. కానీ చివరి దశలో అతడు తన బృందాన్నిఆరేడుకు తగ్గించుకున్నాడు. PLGA బెటాలియన్ కంటే ముందు DKSZC కార్యదర్శిగా పని చేసిన అనుభవం ఉండడం వల్ల తన తోటి ప్రాణాలను కాపాడడంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకునే వారని మాజీ మావోయిస్టు ఒకరు చెప్పారు.
కర్ణుడి చావుకు వంద కారణాలన్నట్టుగా హిడ్మా మృతికి తెలంగాణ కమిటీ తాత్సారం, పార్టీలో అంతర్గత కలహాలు, కుమ్ములాటలు, లొంగుబాట్లు, భద్రతా దళాల నిఘా వంటి అనేక కారణాలతో ఆయన చివరకు ఆయన మారేడుమిల్లి ప్రాంతం సురక్షితమని అక్కడకు చేరారు. కాని వాస్తవానికి అది సురక్షిత ప్రాంతం కాదు. గతంలో టాప్ మోస్ట్ నక్సలైట్లను అదే ప్రాంతంలో ఎన్ కౌంటర్ చేసిన సంఘటనలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ భద్రతా బలగాలు అతడిని ఎదురుకాల్పుల్లో హతమార్చినట్టు ప్రకటించాయి.
పోలీసుల్ని హడలెత్తించిన హిడ్మా..
రెండు దశాబ్దాలుగా దేశంలో జరిగిన దాదాపు ప్రతి ప్రధాన మావోయిస్టు దాడి వెనుక ఈ నక్సల్ నాయకుడు హిడ్మా ఉన్నట్టు తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌ఘడ్ , ఆంధ్ర పోలీసు వర్గాల అంచనా. భద్రతా వ్యవస్థలను వణికించిన హిడ్మా తలపై రూ. 1 కోటి రివార్డు ఉంది. అటువంటి హిడ్మా ఇంత సునాయాసంగా ఎదురుకాల్పుల్లో చిక్కుతాడని ఏపీ పోలీసులు అసలు భావించలేదు.
హిడ్మా పేరు చెబితే గుర్తుకువచ్చే దాడుల్లో 2010 దంతేవాడా మారణకాండ, 2013 దర్భా వ్యాలీ దాడి, 2017 సుక్మా అటాక్ వంటి సంఘటనలు ముఖ్యమైనవి.
దంతేవాడా ఘటనలో CRPFకు చెందిన 76 మంది జవాన్లు హతమయ్యారు.
దర్భా వ్యాలీ దాడిలో మాజీ మంత్రి వీ.సీ. శుక్లా, కాంగ్రెస్ నాయకుడు మహేంద్ర కర్మ సహా పలువురు మరణించారు.
2017 సుక్మా మందుపాతర పేలుడులో 31 మంది భద్రతా సిబ్బంది మృతి చెందారు.
ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరిష్ కుమార్ గుప్తా మీడియాకు చెప్పిన దాని ప్రకారం హిడ్మా సహా 30 మంది మావోయిస్టులు ఛత్తీస్‌గఢ్ నుంచి ఆంధ్ర సమీప సరిహద్దుల్లో తలదాచుకునేందుకు వచ్చారు. వీరు అక్కడి నుంచే వారి కార్యకలాపాలు ప్రారంభించాలని కూడా అనుకున్నట్టు సమాచారం ఉందని ఆ పోలీసు అధికారి భావన.
హిడ్మా తల్లి
ఈనేపథ్యంలో రాత్రి 12 నుంచి ఉదయం 7 గంటల మధ్య ఈ బృందం అల్లూరి సీతారామ రాజు జిల్లా మారేడుమిల్లి అటవీ మార్గం మీదుగా ఒడిశా వైపు కదిలేందుకు ప్రయత్నించిందని పోలీసులు వెల్లడించారు.
మావోయిస్టుల కదలికలను ముందుగానే గుర్తించిన భద్రతా దళాలు ఆ ప్రాంతంలో కూంబింగ్‌ను మరింత కట్టుదిట్టం చేశాయి. దాంతో ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో హిడ్మా, ఆయన సహచరి రాజే ఎలియాస్ రాఖీతో పాటు మరో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.
సంఘటనా స్థలంలో పోలీసులు 2 AK-47 రైఫిళ్లు, ఒక రివాల్వర్, ఒక సింగిల్ బోర్ రైఫిల్, 28 AK-47 రౌండ్లు, పేలుడు పదార్థాలు, బ్లూ వైర్లు, బాంబుల తయారీకి ఉపయోగించే కొన్నిపరికరాలు స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు చెప్పారు.
చనిపోయిన ఇతర మావోయిస్టుల్లో లక్కామల్ చాటూ, మాల్లా లాలూ, కమ్ములు అయితా ఉన్నారని, వీరంతా ఆర్గనైజేషన్‌లో చాలా కీలకమైన వారని పోలీసులు తెలిపారు.