ప్రధాని మోదీ తల్లి గురించి మరోసారి దుర్భాషలాడిన పార్టీ ఏది?
వీడియోను మార్చి RJ(D) ఇమేజ్‌ను దెబ్బతీయాలని చూస్తోందన్న ఎమ్మెల్యే ముఖేష్ రౌషన్..
బీహార్(Bihar)లో ఎన్నికల సమీపిస్తున్న వేళ.. రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఆరోపణలు, ప్రత్యారోపణలు పెరిగిపోయాయి. తాజాగా ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్ ఇటీవల నిర్వహించిన 'బీహార్ అధికార్ యాత్ర'(Bihar Adhikar Yatra)లో ప్రధాని మోదీ(PM Modi) దివంగత తల్లిని ఆర్జేడీ కార్యకర్తలు దుర్భాషలాడాలంటూ బీజేపీ(BJP) నేతలు ఫైరవుతున్నారు.
తాజా ఘటనకు సంబంధించిన వీడియోను సామాజిక మాధ్యమం ఎక్స్‌లో షేర్ చేసిన ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి.. ‘‘ఇది చాలా దురదృష్టకరం. ప్రజాస్వామ్యానికి తీవ్ర అవమానం. ర్యాలీలో RJD కార్యకర్తలు దుర్భాషలాడుతుంటే.. తేజస్వి యాదవ్ మౌనం వహించారు. తల్లులు, సోదరీమణులు, ప్రజలు ఈ మురికి రాజకీయాలను బాగా అర్థం చేసుకుంటారు. సరైన సమయంలో ప్రజాస్వామ్యబద్ధంగా స్పందిస్తారు" అని రాసుకొచ్చారు.
దాదాపుగా ఇదే అభిప్రాయాన్ని మరో ఉప ముఖ్యమంత్రి విజయ్ కుమార్ సిన్హా వ్యక్తం చేశారు. "తేజస్వి యాదవ్ యాత్రలో ప్రధాని మోదీ తల్లిపై కార్యకర్తలు అనుచిత వ్యాఖ్యలు చేయడం..RJD పార్టీ వైఖరికి అద్దం పడుతుంది. పార్టీ నేతల మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తుంది.’’ అని పేర్కొన్నారు.
ఆరోపణలను ఖండించిన ఆర్జేడీ ఎమ్మెల్యే..
బీహార్‌లోని ప్రధాన ప్రతిపక్షం ఆర్జేడీ ఈ ఆరోపణలను తోసిపుచ్చింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆర్జేడీని అప్రతిష్ట పాలు చేయాలని బీజేపీ పనిగా పెట్టుకుందని ఆరోపించింది. బీహార్‌లోని మహువాకు చెందిన ఆర్జేడీ ఎమ్మెల్యే ముఖేష్ రౌషన్ ఆరోపణపై స్పందించారు. తన నియోజకవర్గంలో తేజస్వి యాదవ్ ప్రసంగాన్ని పూర్తిగా విన్న తర్వాత బీజేపీ నేతలు మాట్లాడాలని కౌంటర్ ఇచ్చారు.
"ప్రధానినుద్దేశించి ఆర్జేడీ కార్యకర్త లేదా మరెవరూ దుర్భాషలాడలేదు. బీజేపీ షేర్ చేసిన వీడియోలో తేజస్వి యాదవ్ మాట్లాడటం వినిపించడం లేదు. కుట్రలో భాగంగా వారు (ఆర్జేడీ) పరువు తీయడానికి వీడియో మార్చారు" అని సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొన్నారు.
ముగిసిన తేజస్వి యాత్ర..
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో భారత కూటమికి నాయకత్వం వహిస్తున్న తేజస్వి యాదవ్ సెప్టెంబర్ 16న జెహానాబాద్ నుంచి 'బీహార్ అధికార్ యాత్ర'ను ప్రారంభించిన విషయం తెలిసిందే. జేడీ(యూ) అధినేత, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ స్వస్థలం నలంద, బీజేపీ ఫైర్ బ్రాండ్, కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ నియోజకవర్గం బెగుసరాయ్‌ని కవర్ చేస్తూ ఈ నెల 20వ తేదీన యాత్ర ముగించారు.
గతంలో రాహుల్ యాత్రలో అనుచిత వ్యాఖ్యలు..
గత నెలలో దర్భంగా జిల్లాలో రాహుల్ గాంధీ 'ఓటరు అధికార్ యాత్ర'లో ఒక వ్యక్తి ప్రధాని తల్లిని దుర్భాషలాడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యాఖ్యలపై మోదీ స్పందించారు. "నా తల్లిని తిట్టిన వారికి నేను క్షమించవచ్చు, కానీ బీహార్ కోట్లాది మంది తల్లులు సోదరీమణులు ఎప్పుడూ సహించరు" అని ప్రధానమంత్రి అన్నారు.