‘తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే..’
స్పష్టం చేసిన TVK చీఫ్ విజయ్..
2026 తమిళనాడు(Tamil Nadu) అసెంబ్లీ ఎన్నికల(Assembly Polls)లో తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని తమిళగ వెట్రి కజగం (TVK) విజయ్ స్పష్టం చేశారు. ఆయన BJPతో పొత్తుపెట్టుకుంటారని, AIADMK కలిసి పోటీచేస్తారని గతంలో వచ్చిన ఊహాగానాలకు ఆయన ఫుల్‌స్టాప్ పెట్టారు. చెన్నై సమీపంలోని మహాబలిపురంలో జరిగిన తమిళగ వెట్రి కజగం (టీవీకే) ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో ఆయన ప్రసంగించారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(Stalin), ఆయన డీఎంకే ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కరూర్ తొక్కిసలాటకు ప్రభుత్వమే కారణమని, తమ రాజకీయ మొదటి ప్రత్యర్థి కూడా అధికార డీఎంకేనని చెప్పారు.
కరూర్ ర్యాలీలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది ప్రాణాలు కోల్పోయిన 38 రోజుల తర్వాత విజయ్ తొలిసారి బహిరంగంగా కనిపించారు. టీవీకేకు వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేకే.. అధికార పార్టీ "ప్రైవేట్ సైన్యాన్ని" ఏర్పాటు చేసిందని ఆరోపించారు.
టీవీకే తీర్మానాలేంటి?
టీవీకే సర్వసభ్య సమావేశం 12 తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించింది. 2026 అసెంబ్లీ ఎన్నికలతో పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా విజయ్ పేరును ప్రకటించారు.
శ్రీలంక నావికాదళం తమిళనాడు మత్స్యకారులను పదే పదే అరెస్టు చేయడాన్ని నిలిపివేయాలని, కోయంబత్తూరు గ్యాంగ్ రేప్ ఘటన నేపథ్యంలో మహిళల భద్రతకు మెరుగైన చర్యలు, ఓటర్ల జాబితాల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)ని నిలిపివేయాలని, విజయ్, టీవీకే కార్యక్రమాలకు తగిన పోలీసు భద్రత కల్పించాలని తీర్మానించారు.
విజయ్ తన ప్రసంగంలో స్టాలిన్‌ను తీవ్రంగా విమర్శించారు. ఆయన 'రాజకీయ దురుద్దేశం'తో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ర్యాలీ సందర్భంగా ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించారని గుర్తుచేశారు. "భారతదేశంలో, ఏ రాజకీయ నాయకుడికీ ఇంత కఠినమైన నిబంధనలు పెట్టలేదు. ర్యాలీ సమయంలో బస్సులకే పరిమితం కావాలని, జనాలకు చేయి ఊపకూడదని, వాహనాలపైకి ఎక్కకూడదని.. ఇలా ఎన్నో కండీషన్లు పెట్టడం వెనక రాజకీయ దురుద్దేశం ఉంది’’ అని పేర్కొన్నారు.
శివగంగ కస్టడీ మరణం గురించి..
శివగంగ జిల్లాలోని ఆలయ సెక్యూరిటీ గార్డు అజిత్ కుమార్ కస్టోడియల్ డెత్‌పై కూడా విజయ్ మాట్లాడారు. ఈ కేసు విచారణకు ఏక సభ్య కమిషన్‌ను ఏర్పాటు చేసి ప్రభుత్వం చేతులు దులుపుకుందని ఆరోపించారు.
'2026లో టీవీకే, డీఎంకే మధ్య యుద్ధం'
"నేను మళ్ళీ చెబుతున్నాను. 2026లో టీవీకే, డీఎంకే మధ్య ఎన్నికల యుద్ధం ఉంటుంది. 100 శాతం విజయం మనదే.’’ పార్టీ నాయకులను, కార్యకర్తలను ఉత్సాహ పరిచారు.