NCRB నివేదికలో హైదరాబాద్ స్థానమెంత?

దేశంలో సురక్షిత నగరాల జాబితాలో కోల్‌కతాది అగ్రస్థానం..

Update: 2025-10-04 12:26 GMT
Click the Play button to listen to article

దేశంలో సురక్షిత నగరాల జాబితాలో కోల్‌కతా అగ్రస్థానంలో ఉందని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) తాజా నివేదిక (2023) వెల్లడించింది. కోల్‌కతా(Kolkata)లో ప్రతి లక్ష మంది జనాభాలో 83 నేరాలు మాత్రమే నమోదు అవుతున్నాయి. ఇలా తక్కువ సంఖ్యలో నమోదు కావడం ఇది నాల్గోసారి. గత రెండేళ్లతో పోలిస్తే ఇది చాలా తక్కువ. 2022లో 86 నేరాలు, 2021లో 103 నేరాలు నమోదయ్యాయి. కోల్‌కతాలో నమోదైన కేసుల సంఖ్య కూడా వరుసగా రెండో సంవత్సరం తగ్గింది. 2022లో 12,213, 2021లో 14,591 నుంచి 11,843కి తగ్గింది.


రెండో స్థానంలో హైదరాబాద్..

కోల్‌కతా తరువాత లక్షకు 332 నేరాలతో హైదరాబాద్ (Hyderabad) రెండో స్థానంలో నిలిచింది. మూడో స్థానంలో పూణే (337 నేరాలు), నాలుగో స్థానంలో ముంబై (355 నేరాలు) ఉంది. ఆ తర్వాత స్థానాల్లో ఢిల్లీ (2,105 నేరాలు), సూరత్ (1,377 నేరాలు) ఉన్నాయి. కొచ్చిలో అత్యధికంగా (3,192 నేరాలు) నమోదయినట్లు నివేదికలో పేర్కొన్నారు.

NCRB డేటా ప్రకారం..కోల్‌కతాలో 2023లో మహిళలపై నేరాలకు సంబంధించి 1,746 కేసులు నమోదయ్యాయి, 2022లో 1,890, 2021లో 1,783 నమోదయ్యాయి. కాగా 2023లో కోల్‌కతాలో వయోజనులపై లైంగిక వేధింపుల (అత్యాచారం) కేసులు పది నమోదయ్యాయి. 2022, 2021లో 11 నమోదయ్యాయి. 2023లో 172 మైనర్లపై అత్యాచార కేసులు నమోదయ్యాయి.

మౌలిక సదుపాయాల కల్పన, సాంకేతికతను అప్‌గ్రేడ్ చేయడం, నైట్ పోలీసింగ్ వ్యవస్థను పటిష్టం పర్చడం ద్వారా నేరాల సంఖ్య తగ్గుముఖం పట్టిందని కోల్‌కతా అదనపు CP (II) శుభంకర్ సిన్హా రాయ్‌ తెలిపారు.

నేరాల సంఖ్య తగ్గడానికి రాష్ట్ర యంత్రాంగమే కారణమని పశ్చిమ బెంగాల్ పరిశ్రమలు, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి శశి పంజా పేర్కొన్నారు. "కోల్‌కతా సురక్షితమైన నగరమనే మా వాదనను ఎన్‌సీఆర్‌బీ డేటా రుజువు చేస్తోంది. ప్రత్యర్థుల రాజకీయ వాదనలను తోసిపుచ్చుతోంది." అని ఆమె చెప్పారు. 

Tags:    

Similar News