ఆ ‘ఇద్దరు మిత్రులు’ బీజేపీకి తలనొప్పి తెప్పిస్తున్నారా?

దేశంలో రెండో అతిపెద్ద రాష్ట్రమైన మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు మరోవారంలో జరగబోతున్నాయి. అయితే ప్రస్తుతం అధికారంలో ఉన్న మహాయుతి కూటమి..

By :  491
Update: 2024-11-13 09:19 GMT

(జ్ఞాన్ వర్మ)

మహారాష్ట్రలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలపై దేశవ్యాప్తంగా ఆసక్తి ఉందనడంతో సందేహం లేదు. పోలింగ్ జరగడానికి మరో వారం రోజులు మాత్రమే సమయం ఉంది. అయితే అధికారంలో ఉన్న మహయుతి కూటమి రెండు సవాళ్లను ఎదుర్కొంటోంది. అందులో మొదటిది తిరుగుబాటుదారుల నుంచి ఎదురయింది.

తమకు పార్టీ నుంచి టికెట్ రాని ఆశావాహ అభ్యర్థులందరూ ఆయా స్థానాల్లో నామినేషన్ వేశారు. తిరుగుబాటు చేసిన అభ్యర్థులందరూ దాదాపుగా బీజేపీకి చెందిన వారే మెజారిటి. కమల దళంలో వీరి సంఖ్య దాదాపు 40 గా ఉంది. అయితే వీరి వల్ల ఎలాంటి నష్టం జరగదని బీజేపీ నమ్మకంగా ఉంది.
ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే నేతృత్వంలోని శివసేన, ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ నేతృత్వంలోని నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్‌సిపి)లో కూడా పరిస్థితి భిన్నంగా లేదు. శివసేన, ఎన్‌సిపికి చెందిన డజనుకు పైగా తిరుగుబాటు అభ్యర్థులు అధికారిక ఎన్‌డిఎ అభ్యర్థులపై పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు.
టిక్కెట్ల కోసం యుద్ధం..
ఎన్డీయేలో సమస్య తీవ్రంగా మారడంతో షిండే వ్యక్తిగతంగా బీజేపీ నాయకత్వంతో మాట్లాడి తిరుగుబాటు అభ్యర్థులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.హోరాహోరీ పోటీలో తిరుగుబాటు అభ్యర్థుల ఓట్ల విభజన కీలకంగా మారవచ్చని ఆయన వాదన. లోక్ సభ ఎన్నికల్లో చాలా చోట్ల పార్టీ స్వల్ప తేడాతో ఓటమి పాలైంది.
లోక్‌సభ ఎన్నికలను ఎన్‌డిఎ, ఇండి కూటమి మధ్య ఎన్నికల పోరుకు ప్రారంభ బిందువుగా తీసుకుంటే, ఎన్‌డిఎ 137 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆధిక్యంలో ఉండగా, ఇండి కూటమి 151 సెగ్మెంట్లలో ఆధిక్యంలో ఉంది. ఇదే అధికార పార్టీలో గుబులు పుట్టిస్తోంది.
'మహారాష్ట్ర ఎన్నికల్లో ఆరు రాజకీయ పార్టీలు పోటీ చేయడం ఇదే తొలిసారి. రాష్ట్రంలో బీజేపీ అతి పెద్ద పార్టీ కావడంతో పాటు అత్యధిక స్థానాల్లో పోటీ చేస్తుండడంతో ఆశావహులు కూడా ఎక్కువగానే ఉన్నారు. బీజేపీకి మాత్రమే ప్రతి సీటులో కనీసం ముగ్గురు నుంచి నలుగురు అభ్యర్థులు ఉన్నారు.
కానీ అందరికి టికెట్లు ఇవ్వలేం కదా. అందుకే మిగిలిన వాళ్లు ఆగ్రహంతో బరిలోకి దిగారు. అవసరమైన చోట చర్యలు తీసుకుంటున్నారు. చాలా చోట్ల ఎన్డీఏ అభ్యర్థులను బుజ్జగిస్తున్నారు. ” అని ముంబైలో ఉన్న ఒక సీనియర్ బిజెపి నాయకుడు ఫెడరల్‌తో అన్నారు.
అజిత్ పవార్ వైఖరి..
బీజేపీ తన పార్టీని చక్కబెట్టుకోవాలని ప్రయత్నిస్తున్నప్పటికీ, దాని ప్రచార విషయాల నేపథ్యంలో మాత్రం సొంత కూటమి నుంచే విమర్శలు ఎదుర్కొంటోంది. ఇది మహాయుతి కూటమి ఎదుర్కొంటున్న రెండో సమస్య.
బాటేంగే టు కటేంగే (విడిపోతే మనం పడిపోతాం) ఏక్ రహేంగే, సేఫ్ రహెంగే (కలిసికట్టుగా ఉండండి, సురక్షితంగా ఉండండి) అనే ప్రచార నినాదంపై మహవికాస్ అఘాడీ ఇప్పటికే విమర్శలు కురిపిస్తోంది. అయితే ఆశ్చర్యకరంగా ఈ నినాదాలపై అజిత్ పవార్ సైతం అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఈ నినాదాలు మహారాష్ట్ర కోసం ఉద్దేశించినవి కావని, బయటి వ్యక్తులు తీసుకొచ్చారని అభిప్రాయపడ్డారు. ఇది బీజేపీని ఇరుకున పెట్టింది.
“పార్టీ నాయకత్వం ఈ సమస్యలపై తన వైఖరి తెలపడంతో పూర్తి స్పష్టతతో ఉంది. మా నాయకుడు అజిత్ పవార్ ఇప్పటికే దీని గురించి మాట్లాడినందున నేను వ్యాఖ్యానించడం సరైంది కాదు. పార్టీ, ఎన్‌డిఎలో కూడా ఆయన ఈ సమస్యలను అత్యున్నత స్థాయిలో లేవనెత్తారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను" అని ఎన్‌సిపి సీనియర్ నాయకుడు, ఎంపి నితిన్ జాదవ్ పాటిల్ ది ఫెడరల్‌తో అన్నారు.
షిండే నిధుల కేటాయింపు..
బీజేపీ ప్రభుత్వంపై, అలాగే ప్రచార వ్యూహాలపై అజిత్ పవార్ విమర్శలు వ్యక్తం చేయడం తొలిసారి కాదు. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ కూటమి చెత్త ప్రదర్శన తరువాత ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడుతూ.. ‘‘ తమ కూటమి ఓటమికి కారణం ఓట్ జిహాద్ ’’ అని ఆరోపించారు. 2024 ఎన్నికల్లో ఇండి కూటమి 30 సీట్లు గెలుచుకుని సత్తా చాటింది. మహాయుతి కూటమి కేవలం 17 సీట్లను మాత్రమే సాధించింది.
అయితే బీజేపీ అభిప్రాయాలను అజిత్ పవార్ పట్టించుకోలేదు. తమ పార్టీ ముస్లింలకు కనీసం 10 శాతం సీట్లను కేటాయిస్తుందని ప్రకటించారు. సీట్ల పంపిణీ పూర్తయ్యాక తనకు లభించిన 53 సీట్లలో 5 సీట్లను ముస్లింలకు కేటాయించారు. పవార్ కూడా ముస్లింలకు విద్యాసంస్థలు, ఉద్యోగాలలో రిజర్వేషన్లు కల్పించడానికి అనుకూలంగా ఉన్నారు. అయితే బిజెపి ఈ అభిప్రాయాలు పూర్తిగా వ్యతిరేకం.
మహారాష్ట్రలో బీజేపీతో భిన్నాభిప్రాయాలు ఉన్న ఎన్డీయే నాయకుడు పవార్ మాత్రమే కాదు. డాక్టర్ జాకీర్ హుస్సేన్ మదర్సా ఆధునీకరణ కార్యక్రమం కింద రాష్ట్రంలోని ఒక్కో మదర్సాకు ముఖ్యమంత్రి షిండే రూ.10 లక్షలు కేటాయించారు. ఈ నిర్ణయం కూడా బీజేపీ కి విరుద్దమైనదే.
సమన్వయం లోపమా?
రెండు సవాళ్లు ఎన్డీయేలో సమన్వయ లోపాన్ని సూచిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. “మహారాష్ట్రలో రాజకీయాల గందరగోళం ఉంది. అది ఎన్డీయేలో కూడా కనిపిస్తుంది. తిరుగుబాటుదారులు బీజేపీని ఆందోళనకు గురిచేస్తున్నారు. కానీ ఈ నిజాన్ని ఓప్పుకోవడం లేదు. అజిత్ పవార్ కూడా నాయకుడిగా తన వ్యక్తిత్వాన్ని చాటుకున్నారు. బీజేపీతో ఆయనకున్న విభేదాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి” అని బరోడా మహారాజా సాయాజీరావు యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ అమిత్ ధోలాకియా ది ఫెడరల్‌తో అన్నారు.
‘‘ఎన్నికల్లో గెలిస్తే తదుపరి ముఖ్యమంత్రి ఎవరు అనే విషయంలో ఎన్డీయేలో కూడా గందరగోళం నెలకొంది. ఈ కారకాలన్నీ క్షేత్రస్థాయిలో మరిన్ని సమస్యలను సృష్టిస్తాయనడంలో సందేహం లేదు. మూడు రాజకీయ పార్టీల కార్యకర్తల మధ్య సమన్వయ లోపం పార్టీని ఏ స్థితికి చేరుస్తాయో’’ అని అనుమానం వ్యక్తం చేశారు.


Tags:    

Similar News