‘‘తాలిబన్ కు గౌరవం ఇచ్చి తలదించుకునేలా చేశారు’’

బాలీవుడ్ రచయిత జావేద్ అక్తర్ విమర్శలు

Update: 2025-10-14 11:48 GMT
బాలీవుడ్ రచయిత జావేద్ అక్తర్

భారత పర్యటనలో ఉన్న తాలిబన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీ కి లభించిన స్వాగత సత్కారాలపై బాలీవుడ్ రచయిత జావేద్ అక్తర్ తీవ్రంగా విమర్శలు గుప్పించారు. ఆయన లభించిన స్వాగత సత్కారాలతో సిగ్గుతో తలదించుకుంటున్నానని ఎక్స్ లో పోస్ట్ చేశారు.

అదొక చెత్త ఉగ్రవాద సంస్థ..
తాలిబన్ ను ప్రపంచంలోనే చెత్త ఉగ్రవాద సంస్థగా జావేద్ అక్తర్ విమర్శలు గుప్పించారు. భారత్ లో దాని ప్రతినిధిపై చూపిన స్నేహపూర్వకమైన ప్రవర్తన పట్ల అక్తర్ నిరాశ వ్యక్తం చేశారు.
‘‘ప్రపంచంలోని అత్యంత దారుణమైన ఉగ్రవాద సంస్థ తాలిబన్. ఆ తాలిబన్ ప్రతినిధికి అన్ని రకాల ఉగ్రవాదులపైనా పోరాటం చేసిన వారు ఇచ్చిన గౌరవం, స్వాగతాన్ని చూసినప్పుడూ నేను సిగ్గుతో తలదించుకుంటున్నాను’’ అని బాలీవుడ్ బాలీవుడ్ రచయిత పేర్కొన్నారు.
ఉత్తర ప్రదేశ్ లోని సహరన్పూర్ జిల్లాలోని ప్రముఖ ఇస్లామిక్ సెమినరీ అయిన దారుల్ ఉలూమ్ దేవ్ బంద్ ను సందర్శించిన సమయంలో కూడా ముత్తాఖీ కి లభించిన స్వాగత సత్కారాలపై కూడా అక్తర్ విమర్శలు గుప్పించారు.
‘‘బాలికల విద్యను పూర్తిగా నిషేధించిన వారిలో ఒకరైన వారి ఇస్లామిక్ హీరోకి ఇంత గొప్ప గౌరవ స్వాగతం పలికినందుకు దేవ్ బంద్ కు కూడా సిగ్గు చేటు. నా భారతీయ సోదర, సోదరీమణులరా.. మనకు ఏం జరగుతోంది’’ అని ఆయన విచారం వ్యక్తం చేశారు.
దేవ్ బంద్ లో ఘన స్వాగతం..
దారుల్ ఉలూమ్ దేవ్ బంద్ లో ముత్తాఖీ రాకకోసం విస్తృత ఏర్పాట్లు జరిగాయి. అక్కడకు రాగానే తాలిబన్ విదేశాంగమంత్రికి ఘన స్వాగతం లభించింది. తాలిబన్ నాయకుడిని స్వాగతించడానికి 15 మంది ప్రముఖ ఉలేమాల జాబితాను సిద్ధం చేశారు.
ఆ ప్రాంతమంతా భారీ భద్రతను మోహరించారు. సెమీనరి రెక్టర్ మౌలానా ముఫ్తీ అబుల్ ఖాసీం నోమానీ ఈ వేడుకను స్వయంగా పర్యవేక్షించారు. సీనియన్ ఉలేమాలు ఆయన ను ఆప్యాయంగా పలకరించారు.
ముత్తాఖీ లోపలకు ప్రవేశించగానే అతనిపై పూలరేకులు కురిపించారు. అతని పరివారంతోనే సెల్పీలు దిగడానికి చాలామంది విద్యార్థులు గుమిగూడారు.
దౌత్యం..
2021 లో ఆఫ్ఘనిస్తాన్ ను తాలిబన్లు స్వాధీనం చేసుకున్న తరువాత భారత్, తాలిబన్ల మధ్య జరిగిన మొదటి ఉన్నత స్థాయి దౌత్యపరమైన సంబంధం ఇదే. న్యూఢిల్లీలో ముత్తాఖీ భారత విదేశాంగమంత్రి ఎస్. జైశంకర్ తో చర్చల తరువాత ఆయన దేవ్ బంద్ ను సందర్శించారు.
తాలిబన్ల ప్రయాణాలపై ఐరాస నిషేధాజ్ఞలు ఉన్నాయి. ఆయితే భద్రతా మండలి తాత్కాలికంగా వీటిపై నిషేధం తొలగించింది. ఆయన ఆరు రోజుల పాటు భారత్ లో పర్యటించబోతున్నారు.
భారత్- ఆప్ఘన్ సంబంధాలు..
ఆప్ఘన్ లో ఈ మధ్య సంభవించిన భూకంపం తరువాత భారత్ మొదటిసారిగా సాయం చేసిందని ఆయన గుర్తు చేశారు. న్యూఢిల్లీ చేసిన సాయానికి కాబూల్ తరఫున కృతజ్ఞతలు తెలిపారు. భారత్ ను సన్నిహిత మిత్రుడని కొనియాడారు.
‘‘పరస్పర గౌరవం, వాణిజ్యం, ప్రజల మధ్య సంబంధాల ఆధారంగా సంబంధాలను మేము కోరుకుంటున్నాము. మా సంబంధాలను బలోపేతం చేయడానికి ఒక సంప్రదింపుల యంత్రాంగాన్ని రూపొందించడానికి మేము సిద్ధంగా ఉన్నాము’’ అని ముత్తాఖీ అన్నారు.
భారత్ ఇంకా అధికారికంగా తాలిబన్లను గుర్తించకపోయినప్పటికీ కాబూల్ లో మాత్రం నిజమైన ప్రభుత్వం కోసం ఒత్తిడి చేస్తునే ఉంది.
మహిళా జర్నలిస్టుల మినహయింపు వివాదం..
భారత్ లో ముత్తాఖీ నిర్వహించిన విలేకరుల సమావేశంలో మహిళా జర్నలిస్టులను ఆహ్వానించకపోవడంపై వివాదం చెలరేగింది. ప్రతిపక్ష నాయకులు దీనిని ఆమోదయోగ్యం కానీ చర్యగా పేర్కొన్నారు.
ఇది మహిళలను అవమానించడం లాంటిదని విమర్శించారు. అయితే భారత విదేశాంగ శాఖ దీనిపై వివరణ ఇచ్చింది. ఈ కార్యక్రమం ఆప్ఘన్ విదేశాంగ కార్యక్రమంలో జరిగిందని, సాంకేతికంగా ఆ భూభాగం ఆ దేశానికి చెందినట్లే అని, అది పూర్తిగా వారి సొంత కార్యక్రమం అని వెల్లడించింది. ఈ విమర్శల తరువాత జరిగిన రెండో ప్రెస్ మీట్ లో మహిళలను ఆహ్వానించారు.
ఈసారి ముత్తాఖీ మాట్లాడుతూ.. మహిళా జర్నలిస్టులను ఉద్దేశపూర్వకంగా మినహయించలేదని చెప్పారు. ‘‘విలేకరుల సమావేశానికి సంబంధించి, ఇది తక్కువ సమయంలోనే నిర్వహించాము. జర్నలిస్టుల చిన్న జాబితాను తయారు చేసి, వారినే ఆహ్వానించాం’’ అని ఆయన అన్నారు. ఎవరి హక్కులను ఉల్లంఘించడం మా లక్ష్యం కాదని కూడా ఆయన వివరణ ఇచ్చారు.


Tags:    

Similar News