అధికారుల చెలగాటం.. వడోదర వాసులకు ప్రాణ సంకటం

నర్మదా నదీలో ఉండాల్సిన మొసళ్లను టూరిజం, బోటింగ్ పేరుతో తీసుకొచ్చి వడోదర, గాంధీనగర్ లో ప్రవహిస్తున్న లోతు తక్కువ నదులైన విశ్వామిత్రా, సబర్మతిలో విడిచిపెట్టారు.

By :  491
Update: 2024-09-01 07:21 GMT

(దమయంతి ధర్)

కొన్ని సంవత్సరాల క్రితం గుజరాత్ అధికారులు మానవ నివాసాల దగ్గర కొన్ని మొసళ్లను వదిలారు. ఈ చర్యను పర్యావరణవేత్తలు ఖండించారు. ఇప్పుడు వడోదరలో భారీ వరదల తరువాత సరీసృపాలు చుట్టుపక్కల పరిసరాలను ఆక్రమించాయి. అక్కడ యధేచ్చగా సంచరిస్తూ భయాందోళలకు కారణం అవుతున్నాయి.

దాదాపు వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా గుజరాత్ అతలాకుతలమైంది. పలు నదులు పొంగిపొర్లుతున్నాయి. కానీ వడోదరలోని ప్రజలకు, వరదల కంటే సరీసృపాలతో పెద్ద సమస్య వచ్చిపడింది. నగరంలో 17 కిలోమీటర్ల మేర ప్రవహించే విశ్వామిత్ర నది నుంచి వందలాది మొసళ్లు బయటకు వచ్చాయి.
ఎక్కడ చూసిన సరీసృపాలే..
2019 నుంచి సుమారు 300 మొసళ్లకు నిలయంగా ఉన్న ఈ నది ఆగస్టు 27 నుంచి ప్రమాద స్థాయికి మించి ప్రవహిస్తోంది, దీనివల్ల సరీసృపాలు గత రెండు రోజులుగా నగరాన్ని చుట్టుముట్టాయి.
నివాస ప్రాంతాలతో పాటు ఎంఎస్ యూనివర్శిటీ, రెండు ప్రైవేట్ ఆసుపత్రుల ప్రాంగణాల్లో మొసళ్లు కనిపించడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. నగరంలో వరద నీరు తగ్గుముఖం పట్టడంతో, అటవీ శాఖ అధికారులు, వాలంటీర్లు వివిధ ప్రదేశాలలో కనిపించే మొసళ్లను రక్షించడానికి వచ్చే ఫోన్ కాల్‌లకు హాజరవుతున్నారు.
మొసళ్లను రక్షించడం
“నది నుంచి ఎన్ని మొసళ్లు బయటకు వచ్చాయో మాకు తెలియదు. వివిధ ప్రాంతాల నుంచి 8 నుంచి 14 అడుగుల ఎత్తులో ఉన్న 25 మొసళ్లను వాలంటీర్లు రక్షించారు. మా రెస్క్యూ సెంటర్‌లో మాకు స్థలం లేకపోవడంతో చాలా వాటిని తిరిగి విశ్వామిత్ర నదీలో విడిచిపెట్టాం ” అని వడోదర రేంజ్ ఫారెస్ట్ ఆఫీసర్ (RFO) కరణ్‌సిన్హ్ రాజ్‌పుత్ ది ఫెడరల్‌తో చెప్పారు.
ప్రస్తుతం రెస్క్యూ సెంటర్‌లో ఎనిమిది మొసళ్లు ఉన్నాయని తెలిపారు." అవి పరిమాణంలో పెద్దవి కాబట్టి వాటిని తిరిగి నదిలో వేయడానికి నీరు తగ్గే వరకు మేము ఎదురు చూస్తున్నాము" అని రాజ్‌పుత్ చెప్పారు.
"ఈరోజు, మేము కామ్‌నాథ్ మహాదేవ్ దేవాలయం సమీపంలోని నివాసం నుంచి 14 అడుగుల పొడుగున్న మొసలిని, 11 అడుగుల మొసలిని MS విశ్వవిద్యాలయంలోని జంతుశాస్త్ర విభాగం నుంచి రక్షించాము" అని ఆయన తెలిపారు.
నర్మదా జిల్లాలోని కేవడియాలోని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ చుట్టూ ఉన్న ఎగువ నర్మదా నది నుంచి 2019 నుంచి 2021 మధ్య మొసళ్లను విశ్వామిత్ర నదికి తీసుకువచ్చారు.కెవాడియాకు పర్యాటకులను ఆకర్షించేందుకు బోటింగ్, సీ ప్లేన్ సౌకర్యాలను ప్రారంభించాలని గుజరాత్ ప్రభుత్వం నిర్ణయించిన తర్వాత, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ చుట్టూ ఉన్న రెండు చెరువుల్లోకి దాదాపు 500 మొసళ్లను మార్చాలని నిర్ణయించారు.
పడవ ప్రయాణాలు, సముద్ర విమానం
“ప్రారంభంలో, పడవ లో బోటింగ్ వెళ్లే పర్యాటకుల భద్రత కోసం 194 మొసళ్లను నర్మదా నుంచి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ సమీపంలోకి మార్చారు. అహ్మదాబాద్‌లోని సబర్మతి నది, కేవడియాలోని నర్మదా నది మధ్య ప్రయాణించాల్సిన సీ ప్లేన్‌ను సురక్షితంగా ల్యాండింగ్ చేయడానికి తర్వాత మరిన్ని మొసళ్లను తరలించారు. సీ ప్లేన్ సేవలు ఇప్పుడూ ప్రారంభం కాలేదు కానీ మొసళ్లను ఇక్కడ వాటి సహజ ఆవాసాలకు తిరిగి తీసుకెళ్లలేదు, ”అని సర్దార్ సరోవర్ నర్మదా నిగమ్ లిమిటెడ్ (SSNNL) అధికారి తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని అనుసరించి, 2019- 2020 మధ్య విశ్వామిత్రలో 73 రక్షించబడిన మొసళ్లను విడిచిపెట్టారు. కొన్నింటిని గోద్రా - గాంధీనగర్‌లోని రెస్క్యూ కేంద్రాలకు తరలించారు. తరువాత, సుమారు 200 సరీసృపాలు విమాన, రోడ్డు మార్గంలో వడోదరలోని విశ్వామిత్ర, గాంధీనగర్‌లోని సబర్మతి నదికి తరలించారు.
ప్రభుత్వ చర్యలపై వ్యతిరేకత
“మొసళ్లను అన్నింటిని విశ్వామిత్ర నదీకి విడుదల చేయడం సాధ్యం కాదు, కాబట్టి వాటిని ఇతర ప్రదేశాలలో కూడా విడిచిపెట్టారు. ఈ మొసళ్ళు ఒకప్పుడు రక్షించబడిన, సంవత్సరాల క్రితం నర్మదాకు తీసుకురాబడిన మానవ ఆవాసాలకు దగ్గరగా ఉన్నాయి,” అని ఒక SSNNL అధికారి తెలిపారు.
సరీసృపాలు వాటి సహజ ఆవాసాల నుంచి దూరంగా తరలించబడడమే కాకుండా మానవ నివాస ప్రాంతాలకు దగ్గర ఉన్న పాంతాల్లో విడిచిపెడుతూ ప్రమాదకరంగా ప్రవర్తిస్తున్నారంటూ గుజరాత్‌లోని పర్యావరణవేత్తలు ప్రభుత్వ చర్యను వ్యతిరేకించారు.
"బోటింగ్- సీప్లేన్ సేవలను సులభతరం చేయడానికి మొసళ్ళను పెద్ద సంఖ్యలో తరలించడం వన్యప్రాణి సంరక్షణ చట్టానికి విరుద్ధం" అని వడోదరకు చెందిన పర్యావరణవేత్త రోహిత్ ప్రజాపతి అన్నారు.
అంతరించిపోతున్న జాతులు

"మగ్గర్ లేదా మార్ష్ మొసళ్ళు అని పిలువబడే ఈ సరీసృపాలు అంతరించిపోతున్న జాతులు, వన్యప్రాణుల రక్షణ చట్టంలోని షెడ్యూల్ 1 క్రింద వర్గీకరించబడ్డాయి," అని ప్రజాపతి చెప్పాడు.
“మొసళ్ళు నిస్సార నదులలో గూడు కట్టుకోలేవు, పెరగవు లేదా నివాసం ఏర్పరచుకోలేవు. సబర్మతి, విశ్వామిత్ర రెండూ నిస్సార నదులు. అంతేకాకుండా, రెండు నదులు మానవ నివాసాలకు దగ్గరగా ఉన్నాయి. జనాభా ఉన్న నగరాల గుండా ప్రవహిస్తాయి,” అని వడోదరలోని కమ్యూనిటీ సైన్స్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ జితేంద్ర గావ్లీ అన్నారు.
“మొసళ్ళు శీతాకాలంలో గూడు కట్టుకోవడానికి బయటకు వస్తాయి. కాబట్టి, వాటిని మానవ నివాసాలకు దగ్గరగా విడుదల చేసి ఉండకూడదు. వర్షాకాలంలో మానవ నివాస ప్రాంతాల నుంచి మొసళ్లను పట్టుకుని వాటిని లోతైన నీటిలో వదలడం ఒక పద్ధతి, దీనికి విరుద్ధంగా కాదు, ” అని గావ్లీ చెప్పారు.
Tags:    

Similar News