గోవా: శ్రీ దేవి లైరాయ్ ఆలయంలో తొక్కిసలాట, ఆరుగురు భక్తుల మృతి
పదుల సంఖ్యలో గాయపడిన భక్తులు, బాధితులను పరామర్శించిన సీఎం ప్రమోద్ సావంత్;
Translated by : Praveen Chepyala
Update: 2025-05-03 05:11 GMT
గోవాలోని శ్రీగావ్ గ్రామంలోని శ్రీ లైరాయ్ దేవి ఆలయం వద్ద తొక్కిసలాట జరిగి ఆరుగురు భక్తులు మృతి చెందారు. ఈ రోజు తెల్లవారుజామున ఈ తొక్కిసలాట జరిగినట్లు అధికారులు తెలిపారు.
ఈ దుర్ఘటనలో అనేక మంది గాయపడటంతో వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. కొంతమంది పరిస్థితి విషయంగా ఉండటంతో గోవా మెడికల్ కాలేజ్ తో పాటు ముసాలోని ఉత్తర గోవా జిల్లా ఆస్పత్రికి తరలించారు.
గోవా, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు ఒక్కరోజే ఇక్కడ నిర్వహించే ఉత్సవాన్ని తిలకించడాని రావడంతో తొక్కిసలాట జరిగిందని, అయితే కచ్చితమైన కారణం మాత్రం దర్యాప్తు తరువాతనే తేలుతుందని సీనియర్ పోలీస్ అధికారి ఒకరు తెలిపారు.
నిన్న(శుక్రవారం) ప్రారంభమైన శ్రీ దేవి లైరాయ్ జాతరలో ఈ తొక్కిసలాట జరిగింది. ఈ జాతరకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు. దాదాపు వేయిమంది పోలీసు అధికారులు విధుల్లో ఉన్నారు. ఈ జనసమూహాన్ని నియంత్రించడానికి డ్రోన్ లను సైతం ఉపయోగించారు.
ఆలయంలో శతాబ్దాల నాటి ఆచారాన్ని వీక్షించడానికి, పాల్గొనడానికి భారీ సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చారు. అక్కడ చెప్పులు లేకుండా నిప్పులమీద నడిచే ఆచారం ఉంది. దీనిని స్థానికంగా ‘ధోండ్లు’ అని పిలుస్తారు. ఈ కార్యక్రమాన్ని చూడటానికే ప్రజలు భారీగా తరలిరావడంతో తొక్కిసలాట జరిగిందని భావిస్తున్నారు.
ఎనిమిది మంది పరిస్థితి విషమం..
రాష్ట్ర ఆరోగ్య మంత్రి విశ్వజిత్ రాణే మాట్లాడుతూ.. కనీసం 30 మంది గాయపడ్డారని, వారిలో ఎనిమిది మంది పరిస్థితి విషయంగా ఉందని చెప్పారు. ఇందులో ఇద్దరిని తక్షణమే బాంబోలిమ్ లోని గోవా మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించామని చెప్పారు.
మపుసాలోని నార్తో గోవా జిల్లా ఆస్పత్రికి ఇద్దరు మహిళలు సహా నలుగురు వ్యక్తుల దేహాలను తరలించామని చెప్పారు. గాయపడిన ఎనిమిది మందిని జిల్లా ఆస్పత్రిలో చేర్పించగా, పదిమంది స్పల్ప గాయాలకు చికిత్స పొందుతున్నారని ఆయన తెలిపారు.
అయితే తొక్కిసలాటలో కనీసం ఆరుగురు మరణించారని ముఖ్యమంత్రి కార్యాలయం తరవాత ధృవీకరించింది. పరిస్థితిని అదుపులోకి తేవడానికి ఆరోగ్య శాఖ తక్షణ, సమగ్ర చర్యలు తీసుకుందని రాణే అన్నారు.
క్షతగాత్రులను పరామర్శించిన సీఎం..
‘‘మేము 108 అంబులెన్స్ సర్వీస్ తో సమన్వయం చేసుకున్నాము. సంఘటన జరిగిన వెంటనే ఐదు అంబులెన్స్ లను సంఘటనా స్థలానికి పంపిచామని, మరో మూడు ఉత్తర గోవా జిల్లా ఆసుపత్రిలో నిలిపి ఉంచాము’’ అని ఆయన తెలిపారు.
అదనపు వైద్యులను నియమించామని, ఏకీకృత సంరక్షణ అందించడానికి వెంటిలేటర్లతో కూడిన ప్రత్యేక ఐసీయూను ఏర్పాటు చేసినట్లు రాణే చెప్పారు. ‘‘అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశాము. మేము ప్రతి రోగిని నిశితంగా పరిశీలిస్తున్నాము’’ అని ఆయన చెప్పారు.
ఈ సంఘటన తరువాత గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ఉత్తర గోవా జిల్లా ఆస్పత్రిని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. ఉత్తర, దక్షిణ భారత నిర్మాణ శైలుల సమ్మేళానికి ప్రసిద్ది చెందిన ఆలయంలో ప్రతి సంవత్సరం మే నెలలో శిర్గావ్ జాతర జరుగుతుంది. మౌలింగేమ్ సహా సమీప ప్రాంతాల గ్రామస్తులు రోజంతా లైరాయ్ దేవతకు ప్రత్యేక మతపరమైన ఆచారాలు, నైవేద్యాలలో ఆరాధిస్తారు.