మీ స్కూలు మాకొద్దు.. టీసీల కోసం 160 మంది పేరెంట్స్ దరఖాస్తు..
అహ్మదాబాద్‌లో ఓ స్కూల్ జరిగిన ఘటనతో హడలెత్తిపోతున్న విద్యార్థుల తల్లిదండ్రులు..;
అహ్మదాబాద్(Ahmedabad)లోని ఖోఖ్రా ప్రాంతంలోని సెవెంత్ డే అడ్వెంటిస్ట్ స్కూల్‌లో 8వ తరగతి విద్యార్థి అదే స్కూల్‌కు చెందిన పదో తరగతి విద్యార్థిని కత్తితో పొడిచాడు. ఆగస్టు 20న స్కూల్ మెయిన్ గేట్ వద్ద ఈ ఘటన జరిగింది. కత్తిపోటుకు గురైన విద్యార్థి కుప్పకూలి ప్రాణాలొదిలాడు. ఈ ఘటన విద్యార్థుల తల్లిదండ్రులను ఎంత భయపెట్టిందంటే..సుమారు 160 మంది పేరెంట్స్ ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు.
వాటర్ ట్యాంకర్ కోసం ఫోన్ చేసిన యజమాన్యం..
పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఘటనానంతరం స్కూల్ మేనేజ్‌మెంట్ అంబులెన్స్‌కు ఫోన్ చేయకపోగా నేలపైని రక్తం మరకలను శుభ్రం చేయడానికి వాటర్ ట్యాంకర్‌కు ఫోన్ చేశారని తెలిసింది. ఈ విషయం తెలిసి నివ్వెరపోయిన పేరెంట్స్ డీఈవో రోహిత్ చౌదరికి దృష్టికి తీసుకెళ్లారు. అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (AMC) కమిషనర్, మేయర్‌ను కూడా కలసి స్కూల్ ల్యాండ్ లీజును రద్దు చేయాలని కోరారు.
నలుగురి తొలగింపు..
ఇటు DEO ఆదేశాల మేరకు స్కూల్ ప్రిన్సిపాల్ జి ఇమ్మాన్యుయేల్, అడ్మినిస్ట్రేటర్ మయూరికా పటేల్, మరో నలుగురుని మేనేజ్‌మెంట్ తొలగించింది. ప్రస్తుతానికి 6 నుంచి 12 తరగతుల విద్యార్థులకు ఆన్‌లైన్ క్లాసులు నడుస్తున్నాయి.
ఎఫ్ఐఆర్ నమోదు..
ఈ కేసు దర్యాప్తును అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ చేపట్టింది. ఇమ్మాన్యుయేల్, పటేల్, మరో నలుగురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. "పాఠశాల సీసీటీవీ ఫుటేజీని పరిశీలించాం. మధ్యాహ్నం 12.03 గంటలకు ఘటన జరిగింది. కత్తిపోట్లకు గురైన విద్యార్థి తీవ్ర రక్తస్రావంతో పాఠశాల వైపు పరిగెత్తాడు. గేటు వద్ద ఉన్న సెక్యూరిటీ గార్డులు బాధితుడికి సాయం చేయకపోగా.. విషయం మేనేజ్‌మెంట్‌కు చెప్పారు. వారు కూడా బాధితుడి గురించి పట్టించుకోలేదు. నేలపైని రక్తాన్ని శుభ్రం చేయడానికి 12.15 గంటలకు వచ్చిన నీళ్ల ట్యాంకర్‌కు పిలిపించారు. విద్యార్థి తల్లిదండ్రులు మధ్యాహ్నం 12.45 గంటలకు అంబులెన్స్‌కు ఫోన్ చేశారు.’’ అని క్రైమ్ బ్రాంచ్ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ (ACP) భరత్ పటేల్ చెప్పారు.
"ఈ ఘటనకు సంబంధించి ప్రత్యక్ష సాక్షులైన తల్లిదండ్రులు, విద్యార్థుల నుంచి వాంగ్మూలం తీసుకున్నాం. భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 211, 239 కింద స్కూల్ మేనేజ్‌మెంట్‌పై FIR నమోదు చేశాం’’ అని భరత్ పటేల్ పేర్కొన్నారు.