‘బీహార్‌లో విజయం.. చొరబాటుదారులకు మద్దతిచ్చే పార్టీలకు హెచ్చరిక’

బీఎస్‌ఎఫ్ వజ్రోత్సవ వేడుకల్లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా..

Update: 2025-11-21 12:32 GMT
Click the Play button to listen to article

బీహార్(Bihar) ఎన్నికల్లో బీజేపీ(BJP) నేతృత్వంలోని ఎన్డీఏ(NDA) విజయం అక్రమ వలసదారులకు అండగా నిలిచే పార్టీలకు ఒక గుణపాఠమని అన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. గుజరాత్‌ రాష్ట్రం కచ్ జిల్లా భుజ్‌లో జరిగిన బీఎస్‌ఎఫ్(BSF) వజ్రోత్సవ వేడుకల్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కొన్ని పార్టీలు ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయని, చొరబాటుదారుల ఓట్లతో పాలన సాగించాలని చూస్తున్నాయని విమర్శించారు.


‘ఏ ఒక్క చొరబాటుదారుడు దేశంలో ఉండేందుకు వీల్లేదు..’

"వారు (ప్రతిపక్ష పార్టీలు) ఎన్నికల కమిషన్ చేపట్టిన S.I.R ప్రక్రియను వ్యతిరేకిస్తున్నారు. అయితే ఈ దేశం నుంచి చొరబాటుదారులందరిని బహిష్కరిస్తామని నేను మరోసారి స్పష్టం చేస్తున్నా. ఇది మా సంకల్పం" అని షా నొక్కి చెప్పారు.

"దేశంలోని ఏ రాష్ట్రానికైనా ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? ఎవరు ప్రధానమంత్రి అవుతారు? అనేది భారత పౌరులు మాత్రమే తీసుకునే నిర్ణయం. చొరబాటుదారులకు మన ప్రజాస్వామ్య వ్యవస్థను ప్రభావితం చేసే హక్కు లేదు" అని హోం మంత్రి అన్నారు. భారత ప్రజాస్వామ్యాన్ని కాపాడే S.I.Rకు ప్రతి భారత పౌరుడు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని కోరారు.


బీఎస్ఎఫ్‌ సేవలను ప్రశంసించిన షా..

దేశంలో అతి త్వరలో నక్సలిజం పూర్తిగా తుడికి పెట్టుకుపోతుందన్నారు షా. నక్సల్సిజాన్ని అంతమొందించే విధుల్లో ఉన్న బీఎస్‌ఎఫ్‌ను ఆయన ప్రశంసించారు. మార్చి 31, 2026 నాటికి నక్సల్ రహిత దేశమే తమ లక్ష్యమన్నారు. తిరుపతి నుంచి పశుపతి వరకు సురక్షిత కారిడార్ తయారవుతుందన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో BSF 73 మందిని మావోయిస్టులను అరెస్టు చేసిందని, 127 మంది మావోయిస్టులను లొంగిపోయేలా చేసిందని గుర్తుచేశారు. బీఎస్ఎఫ్ జవాన్ల ధైర్యసాహసాలకు ప్రధాని మోదీ మాత్రమే కాదు, యావత్ దేశం సెల్యూట్ చేస్తుందన్నారు. దేశ సరిహద్దులను కాపాడటంలో ఇప్పటివరకు 2,013 మంది బీఎస్ఎఫ్ జవాన్లు తమ ప్రాణాలను త్యాగం చేశారని పేర్కొన్నారు.


నిరంతరం పహారా..

బీఎస్‌ఎఫ్‌లో ఇప్పుడు 193 బెటాలియన్లు ఉన్నాయని, 2.76 లక్షలకు పైగా జవాన్లు ఉన్నారని చెప్పారు. ఈ దళాలు ప్రస్తుతం పాకిస్తాన్ సరిహద్దులో 2,289 కి.మీ. బంగ్లాదేశ్ సరిహద్దులో 4,095 కి.మీ.కు దూరం కాపలాగా ఉన్నాయని వివరించారు.

ఆపరేషన్ సిందూర్‌లో BSF పాత్ర గురించి మాట్లాడుతూ.. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకోవడానికి భారత సాయుధ దళాలు ప్రారంభించిన ఆపరేషన్ సిందూర్ సమయంలో బీఎస్ఎఫ్ పాత్రను షా ప్రశంసించారు. పాకిస్తాన్‌కు బుద్ధి చెప్పేందుకు BSF సైనికులు ఏ ఒక్క అవకాశాన్ని వదల్లేదని చెప్పారు.

ఇటీవల ముగిసిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ), కాంగ్రెస్, ఆర్జేడీ, ఇతర పార్టీల కూటమి అయిన మహాఘట్బంధన్‌ను ఓడించింది. 243 సభ్యుల సభలో 200‌కి పైగా సీట్లను గెలుచుకున్న విషయం తెలిసిందే.

Tags:    

Similar News