ప్రజలు తృప్తి చెందితేనే నాకు సంతృప్తి : చంద్రబాబు

ప్రతి మూడు నెలలకోసారి సామూహిక గృహప్రవేశాల కార్యక్రమం చేపట్టాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.

Update: 2025-11-21 14:43 GMT

ప్రజలు తృప్తి చెందితేనే నాకు సంతృప్తి అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. రానున్న మూడేళ్ల కాలంలో 17 లక్షలకుపైగా ఇళ్లను నిర్మించేలా కార్యాచరణ చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు టిడ్కో, గృహ నిర్మాణ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇకపై ప్రతి మూడు నెలలకోసారి లక్ష్యానికి అనుగుణంగా సామూహిక గృహప్రవేశాలు చేపట్టాలని స్పష్టం చేశారు. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో టిడ్కో, గృహ నిర్మాణ శాఖపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ సమీక్ష సందర్బంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ...”హౌసింగ్ ఫర్ ఆల్ అని ఎన్నికల్లో హామీ ఇచ్చాం. ఈ హామీని నెరవేర్చే ప్రక్రియలో భాగంగా ఇప్పటికే 3 లక్షలకుపైగా ఇళ్లల్లో సామూహిక గృహ ప్రవేశాలు నిర్వహించాం. ఇది ఇక్కడితో ఆగకూడదు... మరింత వేగంగా వెళ్లాలి. ఇప్పటి నుంచే లక్ష్యాలు పెట్టుకుని హౌసింగ్ ఫర్ ఆల్ కార్యక్రమాన్ని 2029 జనవరి నాటికి పూర్తి చేయాలి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సుమారుగా 20 లక్షల ఇళ్లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అందులో ఇప్పటికే 3 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణాలు పూర్తై గృహప్రవేశాలు చేసుకున్నాం. ఇక మిగిలిన 17 లక్షల ఇళ్లు వచ్చే మూడేళ్లల్లో పూర్తి అవ్వాలి. ప్రతి మూడు నెలలకోసారి సామూహిక గృహప్రవేశాల కార్యక్రమం చేపట్టాలి. వచ్చే ఉగాది నాటికి 5 లక్షల ఇళ్ల సామూహిక గృహ ప్రవేశాలు జరగాలి. హౌసింగ్ ఫర్ ఆల్ అనే కార్యక్రమాన్ని ఉన్నతాధికారుల నుంచి క్షేత్రస్థాయి ఉద్యోగులు అందరూ బాధ్యతగా తీసుకోవాలి. త్వరలో టిడ్కో, హౌసింగ్ శాఖకు చెందిన ఉన్నతాధికారులు, ఉద్యోగులందరితోనూ సమీక్ష చేస్తాను” అని  తెలిపారు.

జాబితాను సిద్ధం చేయాలి
“ప్రభుత్వం నెరవేర్చాల్సిన హామీ హౌసింగ్ ఫర్ ఆల్. ఈ కార్యక్రమం అమలులో ఎలాంటి పొరపాట్లు జరగకూడదు... జాప్యం చేయకూడదు. ప్రస్తుతం గుర్తించిన లబ్దిదారులే కాకుండా...ఇంకా అర్హులైన వారిని గుర్తించి లబ్దిదారుల జాబితాలో చేర్చేందుకు సర్వే చేస్తున్నాం. ఈ సర్వేను త్వరగా పూర్తి చేయాలి. అర్హులైన లబ్దిదారుల జాబితా సిద్దం చేయాలి.. ఇలా రూపొందించిన జాబితాను గ్రామాల వారీగా ప్రదర్శించాలి. ప్రజలు తృప్తి చెందితేనే నాకు సంతృప్తి. గృహ నిర్మాణాల్లో భాగంగా ఎవరైనా స్థలం కావాలని అడిగితే స్థలం ఇవ్వండి. అలాగే తమకు స్థలాలు ఉన్నాయని లబ్దిదారులు చెబితే... వాళ్లకు పొజిషన్ సర్టిఫికెట్లు ఇవ్వండి. ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి ప్రతి అప్డేట్ ఆన్ లైన్లో ఉండేలా చూడాలి. ఇక ఉమ్మడి కుటుంబాలను ప్రొత్సహించే విధంగా ఇళ్ల నిర్మాణాలను చేపట్టేలా చూడాలి. పీఎంఏవై 1.0 హౌసింగ్ స్కీములోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీవీటీజీ వంటి సామాజిక వర్గాలకు అదనంగా చెల్లిపులు జరుపుతున్నాం. ఇప్పుడు ముస్లిం మైనార్టీలకూ అదనంగా రూ. 50 వేలు చెల్లిస్తాం. దీని కోసం 18 వేల ముస్లిం మైనార్టీల లబ్దిదారులకు రూ.90 కోట్లు అవసరమవుతాయి. మనం ఆయా వర్గాలకు చేకూరుస్తోన్న అదనపు సాయాన్ని వారికి వివరించాలి” అని సీఎం చంద్రబాబు వెల్లడించారు.
నరేగా తరహాలో
“గత ప్రభుత్వ కక్ష సాధింపులో భాగంగా 2014-2019 మధ్య చేపట్టిన ఎన్టీఆర్ రూరల్ హౌసింగ్ స్కీంకు సంబంధించిన కొందరు లబ్దిదారులకు బిల్లులు రాకుండా చేసింది. దీని వల్ల రూ.920 కోట్ల మేర బిల్లులు పెండింగులో పడ్డాయి. ఈ బిల్లులను మళ్లీ రప్పించేలా కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరపండి. ఆ బిల్లుల్ని గత ప్రభుత్వం ఏ విధంగా అడ్డుకుందో వివరించండి. 2014-19 మధ్య కాలంలో జరిగిన నరేగా పనులకు సంబంధించిన బిల్లులను గత ప్రభుత్వం ఇదే తరహాలో ఆపేసింది. అయితే ఆ బిల్లులను మళ్లీ స్ట్రీమ్ లైనులో పెట్టి బిల్లుల వచ్చేలా చేశాం. అదే తరహాలో ఎన్టీఆర్ రూరల్ హౌసింగ్ స్కీంకు సంబంధించి పెండింగు బిల్లులను రప్పించేలా కృషి చేయండి” అని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో 2014-19 మధ్య 8 లక్షల గృహాలు, 2019-24 మధ్య 5.80 లక్షల ఇళ్లను నాటి ప్రభుత్వం నిర్మించినట్టు అధికారులు వివరించారు. ఈ సమీక్ష సమావేశంలో మంత్రి కొలుసు పార్ధసారధి, టిడ్కో, హౌసింగ్ శాఖకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Tags:    

Similar News