175 నియోజకవర్గాల్లో ’ఫుడ్ ప్రాసెసింగ్‘ యూనిట్లు

’ రైతన్నా - మీ కోసం‘ కార్యక్రమంలో తానూ పాల్గొంటానని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.

Update: 2025-11-21 14:55 GMT

రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ఏర్పాటు చేస్తున్న ఎంస్ఎంఈ పార్కుల్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. వ్యవసాయ ఉత్పత్తులకు విలువ జోడింపు ద్వారా రైతులకు అత్యధిక ప్రయోజనం కల్పించే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు. శుక్రవారం సచివాలయంలో వ్యవసాయ శాఖపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు ఆ శాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడు,  వ్యవసాయం, ఉద్యాన, మార్కెటింగ్ శాఖ అధికారులు హాజరయ్యారు. ఈ నెల 24 నుంచి 29 తేదీ వరకూ అలాగే డిసెంబరు 3 తేదీన నిర్వహించనున్న రైతన్నా - మీ కోసం కార్యక్రమంలో తానూ పాల్గొంటానని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరు కావాలని సీఎం స్పష్టం చేశారు. ఆర్ ఎస్ కే పరిధిలోని ప్రతీ రైతు ఇంటికీ ముఖ్యమంత్రి లేఖను అందించటంతో పాటు నిర్దేశించిన పంచ సూత్రాలను కూడా వివరించి చెప్పాలని సీఎం పేర్కొన్నారు. వ్యవసాయం, ఉద్యాన, ఆక్వా కల్చర్ లో అత్యుత్తమ సాగు విధానాలు పాటించేలా చైతన్యం కలిగించాలని నిర్దేశించారు. నీటి భద్రత లో భాగంగా భూగర్భజలాలు, రిజర్వాయర్లు, చెరువుల్లోని నీటి నిల్వల వివరాలతో పాటు సమర్థ నీటి నిర్వహణ వల్ల కలిగే లాభాలను రైతులకు వివరించాలన్నారు.

డిమాండ్ డ్రివెన్ అగ్రికల్చర్ లో భాగంగా వాణిజ్య, అంతర ప్రత్యామ్నాయ పంటలు, ప్రకృతి సేద్యం గురించి చెప్పాలన్నారు. అగ్రిటెక్ లో భాగంగా వ్యవసాయ యాంత్రీకరణ, డ్రోన్ వినియోగం, శాటిలైట్ టెక్నాలజీ లాంటి అంశాలు ఉండాలని సూచించారు. ఫుడ్ ప్రాసెసింగ్ లో భాగంగా వాల్యూ అడిషన్, ఎఫ్ పీఓలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, ప్రాడెక్టు పర్ఫెక్షన్, ప్యాకింగ్ లాంటి అంశాలపై అవగాహన కల్పించాలన్నారు. మద్ధతు ధరలు, పీఎం కిసాన్, ఇన్ పుట్ సబ్సీడీ, రైతు బజార్లు మార్కెటింగ్ వివరాలు ఇవ్వాలన్నారు. వ్యవసాయ శాఖ తయారు చేసిన ఫార్మర్ యాప్ ను ప్రతీ రైతుకూ చేరువ చేయాలని సీఎం సూచించారు. యాప్ ద్వారా వ్యవసాయ భూమి, పంట సాగు వివరాలు, వాతావరణ సలహాలు, తెగుళ్లకు సంబంధించిన హెచ్చరికలు, మార్కెట్ ధరలు, భూసార పరీక్షలు, మార్కెట్ ఇంటెలిజెన్స్ లాంటి వివరాలను అందించాలన్నారు. రియల్ టైమ్ లో సమాచారం అందితేనే రైతులకు ప్రయోజనం ఉంటుందని సీఎం అన్నారు. క్షేత్రస్థాయిలో అగ్రికల్చర్, హార్టికల్చర్, సెరికల్చర్, అక్వా కల్చర్ అసిస్టెంట్లు క్షేత్రస్థాయిలో మంచి సేవలు అందిస్తున్నారని సీఎం కొనియాడారు. రైతన్నా- మీకోసం కార్యక్రమాన్ని రైతుల వద్దకు తీసుకెళ్లటంలో వారంతా ముఖ్యపాత్ర పోషించాలని అన్నారు.

అరటికి మార్కెటింగ్ కల్పించండి
అరటి ధర పడిపోకుండా తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఉద్యాన శాఖ అధికారులను ఆదేశించారు. అనంతపురం, కడప, నంద్యాల జిల్లాల్లో 40 వేల హెక్టార్లలో అరటి సాగు అయ్యిందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒడిశా లాంటి రాష్ట్రాల్లో ఉత్పత్తి గణనీయంగా పెరగటం, వర్షాల కారణంగా ఎగుమతి వెరైటీ దెబ్బతినటంతో ధరలు పడిపోయాయని తెలిపారు. దీనిపై స్పందించిన అరటి రైతులకు మద్దతు ధర లభించేలా చూడాలని ఆదేశించారు. అలాగే మార్కెటింగ్ కల్పించాలని సూచించారు. పొరుగు రాష్ట్రాలకు ఎగుమతి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఉద్యాన ఉత్పత్తులను జల రవాణా, రైలు రవాణాతో పాటు అవసరమైతే ఎయిర్ కార్గో ద్వారా రవాణా చేసేందుకు చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో పత్తి కొనుగోళ్ల పై కాటన్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై ముఖ్యమంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీసీఐ యాప్ ద్వారా స్లాట్ బుకింగ్ చేసినా రైతులు ఇబ్బందులు ఎదుర్కోవటంపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పత్తి రైతులు నష్టపోవడానికి వీల్లేదని తేల్చి చెప్పారు. దీనిపై కేంద్రానికి లేఖ రాయాలని సీఎం అధికారులను ఆదేశించారు.
Tags:    

Similar News