48 గంటల పాటు పర్యాటక ప్రదేశాల మూసివేత..

నిఘా వర్గాల సమాచారంతో అప్రమత్తమయిన జమ్మూ-కశ్మీర్ ప్రభుత్వం..;

Update: 2025-04-29 08:00 GMT
నిర్మానుష్యంగా కనిపిస్తున్న దోడా జిల్లాలోని భదేర్వాలోని గులాదండ పర్యాటక ప్రదేశం

మరోసారి దాడులు జరిగే అవకాశం ఉందన్న నిఘా వర్గాల సమాచారంతో జమ్మూ-కాశ్మీర్ ప్రభుత్వం అప్రమత్తమైంది. 48 గంటల పాటు పర్యాటక ప్రాంతాలను మూసివేసింది. ఇటు భారత్, పాక్ సరిహద్దుల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

జమ్మూ-కశ్మీర్‌లోని నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ) వద్ద కాల్పుల ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాక్ సైన్యం(Pakistani troops)..గత ఐదు రోజుల నుంచి కుప్వారా, బారాముల్లా జిల్లాల సరిహద్దు ప్రాంతాల్లో, అఖ్నూర్ సెక్టార్ పరిధిలోని నియంత్రణ రేఖ వద్ద కాల్పులకు తెగబడుతోంది. అయితే భారత సైన్యం కూడా వారిని ధీటుగా ఎదుర్కొంటోంది.

సోదాలు..విచారణ..

ఫహల్గామ్‌(Pahalgam)లో 26 మంది ప్రాణాలకు పొట్టనపెట్టుకున్న ఉగ్రమూకల అంతుచూసేందుకు భద్రత బలగాలు రంగంలోకి దిగాయి. వారికోసం తీవ్రంగా గాలిస్తున్నాయి. శ్రీనగర్, డోడా, కిష్త్వార్ ప్రాంతాల్లో జమ్మూ-కాశ్మీర్ పోలీసులు జల్లెడ పడుతున్నారు. శ్రీనగర్‌లో ఉగ్రవాదుల సానుభూతిపరులు ఎక్కువగా ఉంటే 36 ప్రాంతాల్లో సోమవారం (ఏప్రిల్ 29) సోదాలు నిర్వహించారు. యాంటీ-టెర్రర్ ఆపరేషన్‌లో భాగంగా గత 6 రోజుల్లో కశ్మీర్ లోయలో 600కి పైగా ప్రదేశాల్లో దాడులు నిర్వహించారు. వందల సంఖ్యలో అనుమానితులను విచారించారు.

ఏప్రిల్ 22న బైసారన్ పచ్చిక మైదానాల్లో ఉగ్రదాడి తర్వాత, అధికారులు తొమ్మిది మంది అనుమానిత ఉగ్రవాదులు, ఉగ్రవాద మద్దతుదారుల ఇళ్లను కూల్చివేసిన విషయం తెలిసిందే.

మోదీకి నివేదిక సమర్పించిన రాజ్‌నాథ్..

కేంద్ర పాలిత ప్రాంతంలో భద్రతా పరిస్థితిపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సోమవారం ప్రధాని మోదీకి నివేదిక అందజేశారు. ఇటు భారత్ హెచ్చరికల నేపథ్యంలో పాకిస్తాన్ కూడా తన సైన్యాన్ని అలర్ట్‌లో ఉంచింది.

ఒమర్ భావోద్వేగ ప్రసంగం..

‘‘ఫహల్గామ్ ఘటన తర్వాత ప్రజల్లో ఉగ్రవాదుల పట్ల కనిపించిన ఆగ్రహం.. రాష్ట్రంలో ఉగ్రవాద ముగింపునకు సంకేతం’’ అని జమ్మూ-కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా (Chief Minister Omar Abdullah )పేర్కొన్నారు. ఈ దారుణ హత్యాకాండను రాష్ట్ర హోదా పునరుద్ధరణతో ముడిపెట్టనని స్పష్టం చేశారు. జమ్మూ-కశ్మీర్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో ఆయన 27 నిమిషాల పాటు ఉద్వేగంగా ప్రసంగించారు. "ఈ అసెంబ్లీ బాధిత కుటుంబాల బాధను అర్థం చేసుకుంటుంది, "అని చెప్పారు. 

Tags:    

Similar News