తెలంగాణ 10th ఫలితాలు విడుదల.. మెరిసిన అమ్మాయిలు

తెలంగాణ పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. వీటిలో కూడా అమ్మాయిలే పైచేయి సాధించారు. ఈ సందర్భంగా విద్యాశాఖ అధికారి తల్లిదండ్రులకు కీలక సూచనలిచ్చారు.

Update: 2024-04-30 11:22 GMT

తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను విద్యాశాఖ సెక్రటరీ బుర్రా వెంకటేశం విడుదల చేశారు. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 5,05,813 మంది పదో తరగతి పరీక్షలు రాశారు. వారిలో 4,94,207 మంది రెగ్యులర్ విద్యార్థులు కాగా 11,606 మంది ప్రైవేటు విద్యార్థులు. రెగ్యులర్ విద్యార్థుల్లో ఉత్తీర్ణత 91.31 శాతంగా ఉండగా ప్రైవేట్ విద్యార్థుల్లో మాత్రం 49.73 శాతంగా ఉంది. ఫలితాల కోసం https://results.bsetelangana.org/ చూడండి.

100శాతం ఉత్తీర్ణత

అయితే ఈ ఏడాది పదో తరగతి ఫలితాల్లో జిల్లా పరిషత్ పాఠశాలలు తమ సత్తా చాటాయి. మొత్తం రాష్ట్రంలో3,927 పాఠశాలలు 100 శాతం ఉత్తీర్ణత నమోదైంది. వీటిలో ఎక్కువగా జిల్లా పరిషత్ పాఠశాలలే ఉన్నాయి. జిల్లా పరిషత్ పాఠశాల్లలో ఉత్తీర్ణత శాతం గతేడాదితో పోల్చుకుంటే బాగా పెరిగిందని అధికారులు చెప్పారు. గతేడాది 25 జిల్లా పరిషత్ పాఠశాల్లలో ఉత్తీర్ణత 0శాతంగా ఉంటే ఈ ఏడాది ఆ సంఖ్య ఆరుకు చేరిందని వివరించారు.

నిర్మల్ జిల్లానే టాప్

తెలంగాణ 2023-2024 పదో తరగతి ఫలితాల్లో నిర్మల్ జిల్లా విద్యార్థులు తమ సత్తాచాటారు. రాష్ట్రంలోని జిల్లాలతో పోలిస్తే 99.05 శాతం ఉత్తీర్ణత సాధించి నిర్మల్ జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. అదే విధంగా 65.10 శాతం ఉత్తీర్ణత సాధించి అత్యల్ప ఉత్తీర్ణత శాతం సాధించిన జిల్లాగా వికారాబాద్ నిలిచింది.

మెరిసిన బాలికలు

తెలంగాణ పదో తరగతి ఫలితాల్లో బాలికలు మెరిసారు. అత్యధిక ఉత్తీర్ణత సాధించి మరోసారి టాపర్స్ అనిపించుకున్నారు. ఈ విద్యా సంవత్సరం పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థుల్లో 93.23 శాతం మంది బాలికలు ఉత్తీర్ణులు కాగా 89.42 శాతం మంది బాలురు పరీక్షల్లో పాస్ అయ్యారు. దీంతో పదో తరగతి పరీక్షల్లో కూడా బాలికలే పైచేయి సాధించారు.

సప్లమెంటరీ అప్పుడే

పదో తరగతి పరీక్షల్లో తప్పిన విద్యార్థులు సప్లమెంటరీ పరీక్షలు రాసుకోవాలని అధికారులు తెలిపారు. ఈ సప్లమెంటరీ పరీక్షలు జూన్ 3 నుంచి 14 వరకు జరుగుతాయని వెంకటేశం వెల్లడించారు. అదే విధంగా రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకోవాలనుకుంటే నేటి నుంచి 15 రోజులు గడువు కల్పిస్తున్నామని వివరించారు. మే 16 రోజు విద్యార్థులు తమ రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌కు సంబంధించిన ఫీజును తమ పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి చెల్లించవచ్చని, రీకౌంటింగ్‌కు రూ.500, రీవెరిఫికేషన్‌కు రూ.1000 చెల్లించాలని చెప్పారు.

ఒత్తిడి వద్దు

పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చాయనో, ఫెయిల్ అయ్యామనో విద్యార్థులు ఒత్తడి చెందవద్దని, తల్లిదండ్రులు కూడా దీనిని అమితమైన సీరియస్‌ అంశంగా తీసుకోవద్దని ఆయన తెలిపారు. పరీక్షలు, వాటి ఫలితాలు మన జీవితంలో భాగమే తప్ప అవి మన జీవితం కాదని, పరీక్షల్లో ఫెయిల్ అయి కూడా జీవితంలో అద్భుతాలు సృష్టించిన వారు. జీవితంలో అత్యున్నత శిఖరాలను అందుకున్న వారిని మనం తరచు చూస్తూ ఉంటామని ఆయన తెలిపారు.

Tags:    

Similar News